ఇంగువ కట్టిన గుడ్డ.
"బామ్మా! ఈ రోజు చింతకాయ పచ్చడి అదిరింది. ఎలా చేశావేంటి?" హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉగాదికి ఇంటికి వచ్చింది ఉదయిని.
బామ్మ నవ్వుతూ "పిచ్చీ! ఎప్పుడూ చేసినట్లే చేశానే. నీకుహాస్ట ల్లో తిండి తిని తినీ ప్రతిదీ అమిత రుచిగా అనిపిస్తున్నదంతే."
"కాదు బామ్మా! ఈ వాసనేంటి చేయి కడుక్కున్నా పోలేదు. ఎంత కమ్మటి వాసన! ఆహా హా!" అంటూ చేయి వాసన చూసు కుంటున్న ఉదయినిని ముద్దుగా తలమీద మొట్టి "అదేనే ఇంగువ వాసన. ఆ! దీనికో సామెత ఉంది తెల్సా?" అంటూ పెర ట్లో ని బాదం చెట్టు క్రింద వెన్నెల్లో కూర్చుంది బామ్మ.
ఉదయిని గబగాబా వచ్చి బామ్మ ఒళ్ళోతలపెట్టుకుని పడుకు ని "బామ్మా ! అదేంటో చెప్పవూ! ప్లీజ్. నీ కధలు విని చాలాకాల మైంది." అంటూ గారాం పోయింది.
"అలాగే లేవే చిన్నీ! పూర్వం పార్వతీపురంలో పేరుమోసిన రైతు రామయ్య.అతడికి ఎంత డబ్బున్నా రైతు కూలీలాగే అంద రి తో కలసిపోయి తన పొలంలో కూలీలతో పాటుగా తానూ పని చేసేవాడు. దానివల్ల పొలంలో పనిచేసే కూలీలు ఏమారకుండా పనిచేసేవారు. తమ వెంటే యజమానీ ఉండి పనిచేస్తూ గమని స్తున్నందువల్ల పని ఎగవేత ఉండేదే కాదు.
అలా అతని పొలాలన్నీ సకాలానికి నాట్లూ, కలుపులూ, ఎరువే తలు, నీళ్ళుకట్టడాలూ, కోతలు, నూర్పులూ, కళ్ళాలూ ఆన్నీ పనులు పూర్తి అయ్యేవి. ఊర్లో రైతులంతా ఆశ్చర్యపోయేవారు.
"రామయ్యా ! నీ దగ్గరేదో మంత్రం ఉందయ్యా! నీ పొలంలో చేసే కూలీలే మా పొలాల్లో పనిచేస్తే రోజుకు అర్ధభాగమైనా కాదు. ఏదో మహత్తు ఉందయ్యా. అదేదో మాకు చెప్పొచ్చు కదా!" అంటూ అడిగేవారు.
దానికి రామయ్య నవ్వి ఊరుకునేవాడు. ఎందుకంటే చెప్పి నా వారు రైతు కూలీలతో కలసిపోయి పని చేసుకోరు.
యజమానులమనే గర్వం వారికి . డబ్బిచ్చి పని చేయించు కుంటూ తామూ పనిచేయడమేంటీ! అని అజమాయిషీ మాత్రం చేసే వారు. వారికి రామయ్యలా పనిలో మెలకువలు తెలీవు.
ఊరికే పని కానివ్వమని కూలీలను పోరు పెట్టడం, తిట్టడం చేసేవారు. కూలీలు వారు తిడుతుంటే పట్టించుకోకుండా తమ పని తాము మెల్లిగా చేసుకు పోయేవారు.
రామయ్య తనతోపాటుగా కూలీలందరికీ మజ్జిగో, కొబ్బరిబోండా లో, తాటిముంజెలో ఆయాకాలానికి తన తోటల్లో లభించేవి డబ్బు కు చూసుకోక ఇప్పించేవాడు. దాంతో కూలీలంతా చక్కగా పని చేసేవారు.
ఒకమారు రామయ్య అదనంగా పని చేయించుకుని పంట ఇంటికి తోలుకున్నాడు. ఆ అదనంగా పండిన పంటలో కొంత భాగం కూలీలకూ ఉచితంగా పంచాడు.
"కూలీ ఇచ్చారు గదయ్యా! మళ్ళా మీ ధాన్యం ఇస్తున్నారు" అని ఒక వయసు మళ్ళిన కూలీ అనగా "బాబయ్యా! మీరంతా నా చేలో పని సక్రమంగా చేయడం వల్లేగా నాకీ అధిక దిగుబడి వచ్చింది. లేకపోతే నా గాదేలెలా నిండు తాయి? మీరంతా సుఖ సంతోషాలతో ఉండి నా పని సక్రమంగా చేస్తేనేగా పంట నా ఇల్లు చేరింది." అంటూ అందరికీ ఆధాన్యం పంచాడు.
ఆసాయంకాలం ఆ ఊరిలో ఉండే మరో పెద్ద రైతు తన తండ్రితో కలసి రామయ్య ఇంటికి వచ్చాడు. రామయ్య ఇరువురి నీ సాదరంగా ఆహ్వానించి చల్ల ఇచ్చి కూర్చోబెట్టాడు.
ఆ రైతు "రామయ్యా ! ఎలా ఇంత తక్కువ కాలంలో పొలం కోయించి, కుప్పలేసి, నూర్పిల్లు చేయింది, కళ్ళం చేసి ధాన్యం ఇంటికి తోలించుకున్నావు?" అన్నాడు ఆశ్చర్యంగా.
దానికి రామయ్య "దాందేముంది పెద్దన్నా! నేనూ వారితో పాటూ పనిలోకీ దిగుతానని నీకు తెల్సుకదా! అందువల్లే పనిలో ని అరమరికలూ మన మనస్సుకు వచ్చి ఏపని ఎప్పుడు సకాలా నికి చేయాలో తెలుస్తుంది.
అంతేకాక ఒక కధ ఉంది, మిస్టర్ సెల్ఫ్ హెల్ప్ అండ్ మిస్టర్ హ్యావ్ ఇట్ డన్ అని, మన పని మనం చేసుకుంటే సకాలానికి అవుతుంది, మరొకరు వచ్చిచేసేవరకూ బధ్ధకంగా ఉంటే, అను కున్న పని సకాలానికి కాదు పెద్దన్నా!" అన్నాడు తన రహస్యం చెప్తూ.
ఆ పెద్దన్న తండ్రి "ఒరే పెద్దన్నా! నీకు తెలీదురా రామయ్య ఇంగువకట్టిన గుడ్ద రా. వాళ్ళ నాయన గారిట్టాగే చేసేవోరు. రామ న్నా! తండ్రితో కలిసి పనిచేసి ఎవరినెలా ఒంగదీసి పని చేయిం చుకోవచ్చో నేర్చుకున్నాడు. మనూర్లో ఇలాంటి రైతే లేడు." అంటూ బోసినోటితో పకపకా నవ్వాడు.
"అదన్నమాట ఇంగువకట్టిన గుడ్ద అంటే -- ఇంగువను ఒక గుడ్డ లో కట్టి ఉంచితే దాన్ని తీసేసినా వాసన మాత్రం పోదన్న మాట. రామయ్య తండ్రి తో కలిసి పని నేర్చుకుని, తండ్రి తదనంతరం కూడా అతడిలాగే పని చేయించుకోడం కొనసాగించి మంచి రైతుగా పేరుగాంచాడు.”
***
No comments:
Post a Comment