దృష్టి -సృష్టి రచన–ఆదూరి.హైమవతి.
ఒక రోజున సాయం సమయంలో తులసీదాసు తాను వ్రాసిన ‘ తులసీ రామాయణం’ చదివి అర్ధం చెప్తుండగా , ఆయన చుట్టూ జనం కూర్చుని ఆరామాయణగాధను ఆలకిస్తున్నారు. ఆసమయంలో తులసీదాసు ” లంకా పట్టణం లోని అశోక వనంలో సీతమ్మ తల్లి విచారంగా అశోకవృక్షం క్రింద కూర్చుని దూరంగాఉన్నతటాకంలోని తెల్ల కలువలను చూస్తూ ., శ్రీరాముని స్మరించుకుంటూ , తన అవస్తకు చింతిస్తూ ఉంది ” అని పరవశంతో చెప్తుండగా పెద్దగాలి రివ్వున వీయసాగింది, అక్కడకూర్చున్న జనమంతా అది ఏదో భీకర గాలీ వానా వచ్చేసూచనేమో అని భయపడసాగారు. ఇంతలో వాయుపుత్ర హనుమంతుడు అక్కడ దిగాడు.
” అయ్యా! తులసీదాసు గారూ!వందనం !మీ రామాయణ ప్రవచనం మధురంగాఉంది,నేను ఆకాశ మార్గాన వెళ్తూ వింటున్నాను,ఐతే తమరు ఒక్క చిన్న పొరపాటు చెప్తున్నారు,అందుకే నేను దిగివచ్చాను. ఆనాడు లంకా నగరంలోని అశోకవనంలో ఉన్నవి తెల్ల కలువలు కావు, ఎఱ్ఱ కలువలు ! తమరు అది సవరించి ప్రవచించండి ! తమ గ్రంధంలోనూ సవరించండి !” అని వినయంగా కోరాడు.
అక్కడి శ్రోతలంతా హనుమంతుని దర్శన భాగ్యం కలిగినందుకు మహదానంద పడసాగారు. తులసీదాసు ” రామ భక్త హనుమాన్ కు జయమగుగాక! హనుమత్ ప్రభూ! నేను నిరంతరం రామ నామం జపిస్తూ నాదైవం నా మనస్సులో స్పురింపజేసే ఆలోచనలనే ఈ రామాయణకావ్యంలో రచించాను. నాదేవుడు నాచే ఏతప్పూరాయించడు !” అని స్థిర చిత్తంతో , చిరునవ్వుతో చెప్పాడు .
దానికి హనుమ ” అయ్యా! తూలసీదాసుగారూ ! తమరు ఊహించి వ్రాస్తున్నారు,నేను స్వయంగా లంకా నగరాన్నీ, అశోక వనాన్నీ , తటాకంలోని కలువలను దర్శించినవాడను, నేను ప్రత్యక్ష సాక్షిని . కనుక మీరు మరోలా భావించక మీ గ్రంధాన్ని సవరించాల్సిఉంది ” అని చెప్పాడు గంభీరకంఠంతో.
తులసీదాసు చిరునవ్వుతో ” హనుమా న్ జీ! స్వామీ ! నా ప్రభువు నాచే ఎన్నడూఒక్కతప్పైనా వ్రాయించడు, ఆనమ్మకం నాకుంది,అందువల్ల ఆచెఱువులోవి తెల్లకలువలేకానీ, ఎఱ్ఱకలువలు కానేకావు“ అని స్థిరంగా అన్నాడు .
ఇద్దరిమధ్యా వాగ్వివాదం పెరగసాగింది. అప్పుడు హనుమ “ఈ వాదన మనకెందుకు ? మనం వెళ్ళి సీతారాములను దర్శించి , ఆ సమయంలో ఆ కలువలను చూసిన ఆ తల్లినీ , అన్నివిషయాలూ ఆమె ద్వారా అలకించిన ఆ ప్రభువునూ అడిగి వాస్తవం తేల్చు కుందాం రండి ” అని కోరగా తులసీదాసు అంగీకరించాడు.ఇద్దరూబయల్దేరి వెళ్ళిశ్రీరాముని,సీతమ్మ తల్లిని కల్సి నమస్కరించి నిలిచారు.
వారు ఏమీచెప్పకుండానే శ్రీరాములవారు ” హనుమా! తులసీదాసు వ్రాసినది సత్యం !లంకానగరం లోని అశోకవనంలోని సరస్సులో ఉన్నవి తెల్లకలువలే! ” అన్నారు చిరునవ్వుతో.
” ప్రభూ ! నేను స్వయంగా చూశానుకదా! నాకళ్ళే నన్ను మోసంచేస్తాయా! అమ్మా!సీతమ్మతల్లీ! తమరు చెప్పండి కలువల రంగు ఎరుపా! తెలుపా!” అన్నాడు హనుమ చేతులు జోడించి.సీతమ్మవారు చిరునవ్వుతో శ్రీరాముని వంక చూసింది.’తమరేచెప్పమన్నట్లుగా .
శ్రీరాములవారు ” హనుమా! నీవు రావణుని పట్ల క్రోధంతో ఉండటాన , నీకళ్ళు సైతం ఎఱ్ఱబారి చూసినవన్నీ నీకు ఎఱ్ఱగానే కనిపించాయి, నిజానికి అవన్నీ తెల్లనివే! మన దృష్టి ఎట్టిదో సృష్టీ అట్టిదిగా ఉంటున్నది ” అని చెప్పారు.హనుమ తన సందేహం తీరటంతో , తులసీదాసుతో కలసి, తిరుగు ప్రయాణ మయ్యాడు.
చూశారా! మన దృష్టిని బట్టే మన కళ్ళు లోకాన్నిచూస్తాయి కనుక మనం నిరంతరం మన మనస్సునూ మంచిగా ఉంచుకుని చూస్తే లోకమంతా మంచిగానే కనిపిస్తుంటుంది.అలా చేయను ప్రయత్నిద్దామా!