Wednesday 22 August 2012

తీరని కోరిక .


                                        తీరని కోరిక .
    " అమ్మా! ఎక్కడున్నావ్?" కొడుకు కుమార్,
               " అత్తయ్యగారూ!ఓమారిలావస్తారా?" కోడలు లావణ్య,
" బామ్మా! బామ్మా! ఐ నీడ్ యువర్ హెల్ప్.." మనవడు మనోజ్,
             " బామ్మా ! బామ్మోయ్ !నారూం కోమారు రావూ ప్లీజ్ !"మనవరాలు మనోరమ,
" అమ్మొగోరండీ అమ్మొగోరండీ! పెద్దమ్మగోరండీ!" పనమ్మాయ్ పార్వతీ,
                       "ఏమోయ్!ప్రియా!ఎక్కడున్నావ్?రిటైరయ్యాకగూడాబిజీయేనా?నాక్కాస్తమంచికాఫీతెచ్చిపెట్టకూడదుటోయ్?"  లాన్స్ లోంచీ భర్త భరద్వాజ్ పిలుపు.
ఎంతోకాలంగా  తనకున్న తీవ్రమైన తీరనికోరికను  రిటైరయ్యాక తీర్చుకోవాలనే ప్రయత్నంలో ఉన్న ప్రియ ...అదే ప్రియ మణి ,తనప్రయత్నాన్ని పక్కనపెట్టి , గదిలోంచిబయటికి వచ్చింది. 
" అమ్మా! నీవిప్పుడు రిటైరై ఖాళీగా ఉన్నావుగనుక ఇంటిమైన్ టనెన్స్ బధ్యత తీసుకోమ్మా! నాకు తీరికలేక ఇబ్బందిపడుతున్నాను.పిల్లలచదువులూ ,ఫీజులూ ,బ్యాక్ అకౌంట్స్ ఇంటిఅవసరాలన్నీ ప్లీజ్ !" అంటూ ఇంటిపెత్తనం కట్టబెట్టాడు కుమార్ చాలా తేలికగా. అన్ని బాధ్యతలూ తగ్గించుకుని రిలాక్స్ అవాల్సిన సమయంలో అరవైఏళ్ళప్రియమణికిపూర్తిఇంటిబాధ్యతతలకెత్తాడుముద్దులకొడుకు .   
     "అత్తయ్యగారూ! మీ అబ్బాయి చెప్తుంటే నోరూరు తుండేది! మా అమ్మ ములక్కాడ సాంబారు పెడితే ఊరు ఊరంతా వాసనకేనోరు  చప్పరించేవారని,మామయ్యగారు ఎప్పుడూ అంటుంటారు మీ అత్తయ్యచేసినట్లుమామిడికాయపప్పుమరెవ్వరూచేయలేరని!మీవంటనేనెన్నడూరుచిచూడనేలేదాయె!!వంటావిడఎంతబాగాచేసినామీచేతిరుచేరాలేదనినిత్యంవీళ్ళిద్దరూపోరటమే!అందుకేమీచేతివంటనేనూరుచిచూద్దామనివంటావిడ్నిమాన్పించేశాను.ఈరోజునుండీఅందరికీకడుపారాభోజనమేఅత్తయ్యాగారూ!" అంటూ మురిపించింది కోడలు లావణ్య.
" బామ్మా! ప్లీజ్ !నాకీ మాధ్ త్స్ అర్ధంకాక అల్లాడిపోతున్నాను. నాన్నెప్పుడూ మాఅమ్మమాధ్స్ లో ఫస్ట్ '  మాకూ చిన్నప్పుడు చెప్పేవారు ' అంటుంటాడు.నీవురిటైరయ్యావుటగా!నేనికటూషన్కెళ్ళను  . నీవేచెప్పాలి నాకు. " అంటూ వచ్చి చేతులుపట్టుకుని గారంపోయాడు మనవడు మనోజ్.
             " బామ్మా! బోమ్మోయ్ ! నీకు ఇంగ్లీష్ బాగా వచ్చుటగా అందుకే స్టేట్ బ్యాక్ లో మొదటిసారే మొదటి ర్యాక్ లో సెలక్ట్ అయ్యావుట. ఇంగ్లీష్ బాగారావటంవల్ల ప్రెమోషన్స్ వచ్చిసెంట్రల్ బ్రాoచ్ లోనే జనరల్మేనేజర్గా రిటైరయ్యావుట!నాకు ఇంగ్లీష్ చెప్పవా బామ్మా!  క్లాస్లోవెనకబడిపోతున్నాను.అమ్మా నాన్నా ఎప్పుడూ దొరకరు ,ఏడౌట్ అడుగుదామన్నా ,తాత ఇంట్లో ఉన్నా చెప్పరు.నావల్లకాదుతల్లీ ! బామ్మను రిటైర్ అవనీ అన్నీ చక్కబడతాయి ' అనేవారు బామ్మా ప్లీజ్ !" అంటూ గడ్డంపట్టుకుంది ఎనిమిదోతరగతి చదివే మనవరాలు మనోరమ.
               "పెద్దమ్మగోరండీ!మీరింటికాడుంటేఅన్నిపనులూనిమ్మళంగాసేసుకుపోదును,కోడలమ్మొగోరు సరసరా సేయమంటారాయె ,ఆఫీసేలైందనిగొడవాయె !మీరింటికాడుంటారనినాకుమాసంబరంరం గుండాది పెద్దమ్మొగోరూ!  ఈ పూలమొక్కలన్నెత్తుకెల్లి  బైట లానస్ కాడ నాటేయమంట్రేండమ్మొగోరoడా!!" అంటూ పనమ్మాయ్ పార్వతి  గబగబా చెప్పుకొచ్చింది. 
     " ఏమోయ్ ప్రియా! నీవెప్పుడెప్పుడు రిటైరై నాకు కమ్మని వేడివేడి కాఫీఅందిస్తావోని ఎదురు చూస్తున్నానోయ్! ఏదీ ఓకప్పు ప్రసాదిస్తావా?ప్లీజ్ " అంటూ మరోమారు కేకేశాడు భర్త భరద్వాజ్.  ఇంత మంది ఇన్నికోరికలూ తన రిటైర్మెంట్ తో ముడిపడి ఉండటాన్ని చూసి ఉస్సురంది ప్రియమణి ప్రాణం.'తాను ఎంతోకాలంగా తన కున్న తీవ్రమైన కోరిక తీర్చుకునేందుకై  ఈ రిటైర్మెంట్ కోసంఎదురు చూసింది,కానీఇప్పుడుమళ్ళీతనోవంటమనిషీ , ట్యూషన్ టీచర్,గృహిణిగాపాత్రలుపోషించాల్సిఉందన్న
మాట!తిరిగితనవైవాహికజీవితపుతొలిరోజుల్లోనిబరువుబాధ్యతలనుమరోమారునిర్వహించాల్సివస్తుందా!'  ఆఆలోచనతో నీరసం ఆవహించగా  అలాగే కూర్చుండిపోయింది ప్రియమణి. 

     ఆరోజునుంచీ ఇంటిల్లిపాదీ మహా లొట్టలేసుకుంటూ  భోజనాలు చేస్తున్నారు తృప్తిగా . పిల్లలకు ఇంట్లోనే తమ కిష్టమైనరీతిలో , ఇష్టమైన సమయంలో బామ్మ ట్యూషన్ చెప్పడంతో అటు ఇంగ్లీష్ లోనూ , మాథ్స్ లోనేకాక ఇటు అన్ని సబ్జెక్ట్స్ లోనూ క్లాస్  లో ఏ+ ర్యాంక్ సాధించి మహా ధీమాగా ఉంటున్నారు.  ఇంటిముందులాన్స్ చుట్టూతా కమ్మని పరిమళాల పూలతోట, వెనుక ఇంటివంటకోసం ఫ్రష్ గా లేలేత కూరగాయలకిచెన్ గార్డెన్,పనమ్మాయ్ పార్వతి కుటుంబసమేతంగా ఔట్ హౌస్ లోకి మారి రోజంతా పెద్దమ్మగోర్ని అంటుకు తిరుగుతూ కమ్మగా తింటూఒళ్ళొంచిపనిచేస్తూ,తనమనవడూ మనవరాళ్ళతోపాటుగాప్రియమణమ్మతనపిల్లలకూచక్కగాచదువుఉచితంగాచెప్తుండగామురిసిపోతూ ,ఆమురిపాన్ని ,కృతఙ్ఞతనూ పనులద్వారా చూపసాగింది పార్వతి.   
                       ప్రియమణిమాత్రంతనతీరనికోరికఎప్పుడెప్పుడుతీరుతుందానిఎదురుచూస్తూబాధ్యలబరువులు
మోస్తూ రోజులుగడపసాగింది. మొదట్నుండీ ఏపని తీసుకున్నా దాన్ని ధృఢనిశ్చయంతో కృషిచేసిచేసి చక్కనిఫలితాలు చూపటం , తనకు అప్పగించిన పనిని ఏపొరపాటూ లేకుండా రాకుండాచూడటం ప్రియమణికి అలవాటు దాంతో ,  కుమార్  ఇంటిబాధ్యతలు తల్లికి అప్పగించి  హాయిగా రిలాక్సవుతూ ఉద్యోగబాధ్యతలు మాత్రంచూసుకోసాగాడు. ఇలాఉండగామెరుపులూఉరుములూలేని పిడుగులా అమెరికాలో ఉంటున్నప్రియమణమ్మకూతురు కౌముది ఓ ఫైన్ మార్నింగ్ ఫోన్ చేసి " ఏమ్మా! నీకోకూతురుందనీమరచావా?రిటైరయ్యాకనాకూకాస్తచేదోడువాదోడుగాఉండవచ్చుగా !నీకొడుక్కేనా
నీసహాయమoతా ?!ఈసమ్మర్కైనావస్తావాలేదా?సమ్మర్సెలవుల్లోనూమాపిల్లలుడేకేర్కెళ్ళాలా?ఆమాత్రంనాకుసాయంచేయకూడదా? నేన్నీకు అసలు కన్నకూతుర్నేనా ? లేక అన్నొక్కడేనా నీబిడ్డ ? నీవీ సమ్మర్ కురాకపోతే ఇహ ఇదే నా ఆఖరి ఫోన్ " అంటూ బెదిరించింది.  చేసేదిలేక ప్రియమణమ్మ అమెరికా పయనమైంది. నేనువచ్చిఅక్కడహౌస్అరెస్ట్ఐకూర్చోలేను. నేనురానుగాక రాను. ఐనా అది నిన్నుపిలిచిందికానీ నన్నుకాదుగా! " అంటూతప్పుకున్నాడు భర్త భరద్వాజ్. 
ప్రియమణి ఒహోయో ఎయిర్పోర్ట్ లో దిగి అర్ధగంట వెయిట్ చేశాక వచ్చింది కూతురు కౌముది." సారీ మమ్మీ!సమ్మర్ కదా! రోడ్సంతా రిపేర్ , ట్రాఫిక్ జాం ఈ చికాగో జీవితం  చికాకులమయం " అంటూ తానుకోరిన ఆవకాయ , బెల్లపావకాయ , అల్లం పచ్చడి, మెంతావకాయ,వడియాలు, అప్పడాలు, ఉప్పు మిరపకాయలూ, మిరప్పళ్లకారం అన్నీ తెచ్చినట్లు నిర్ధారణైనాక తల్లి సరంజామాకారెక్కించింది.
     ఇల్లు చేరేవరకూ తనపిల్లలు ఏవేవి ఇష్టపడతారో , ఏఏస్వీట్స్ కోసం ఎదురుచూస్తున్నారో,అన్నీ వప్పగించసాగింది కౌముది తల్లికి .ప్రియమణి ' పెళ్ళికాగానే పిల్లలింత స్వార్ధపరులెందుకౌతారో !' అని ఆశ్చర్యపోయింది.  
           ఇల్లు చేరగానే " అమ్మమ్మా! " అంటూపిల్లలు చుట్టేశారు. వారిప్రేమకు ప్రియమణికి కంటనీరు తిరిగాయ్.కనీసం వీళ్ళైనా స్వార్ధ రహితంగా ప్రేమచూపుతున్నందుకు.ప్రతిరోజూ వాళ్ళుకోరినవి వండి పెడుతూ , వారిని దగ్గరే ఉన్న పార్కుకూ , వాల్ మార్ట్ కూ తీసుకెళుతూ, తాను వచ్చేప్పుడు ఫారిన్ ఎక్ఛేంజ్ లోతెచ్చిన డాలర్స్ ఖర్చుపెట్టి వారికి కావలసినవి కొనిస్తూ ఉండగానే రోజులు క్షణాల్లా గడచి ఆరునెల్లూఅర్ధక్షణంలోగడచినట్లుదొర్లిపోయాయి.పిల్లలస్కూళ్ళుతెరిచారు..చలితోపాటుగా ,ఇండియానుండీ ఫోన్స్ మొదలయ్యాయి. " చెల్లాయ్! అమ్మను పంపవే!చలిముదిరితే అమ్మ ఉండలేదు , పైగా నాన్నగారికీ ఇబ్బందిగా ఉంటున్నది , వేళకు అన్నీ అమర్చేవారు ఎవరున్నారు చెప్పు.మా ఆఫీసు గొడవల్లో మేమున్నామాయె!" అంటున్న అన్నతో " ఇవన్నీ చెప్పకురా!నీ విషయం నాకు తెలీదాఏం? పరమ స్వార్ధపరుడివి!నీకు వంటమనిషీ , తోటమాలీ, ఆయా, టూషన్ మాస్టర్జీతాలుమిగులుతాయని చెప్పరా! నమ్ముతాను." అంది కౌముది అన్నతో నిర్మొహమాటంగా.
    " ఏమే!నీవుమాత్రమేం తక్కువా? నీపిల్లలకు వేసవిలో డేకేర్కెళ్ళకుండా  , నానీ, కుక్ ఖర్చులు మిగల్లా! నీవేదో పెద్ద నిస్వార్ధ పరురాలిలా అమ్మమీద ప్రేమ మమకారం నయాగరాజలపాతంలా ప్రవహిస్తున్నట్లు నన్నేఅంటున్నావ్ ? అమెరికాలో ఉంటూ ఇద్దరూ డాలర్స్ సంపాదిస్తున్న నీకే ఖర్చులగురించీ అంత ఇదిగాఉంటే రూపాయ్ విలువపడిపోయిన మాకెంత ఇదిగా ఉంటుందో ఆలో చించు, అమ్మను వెంటనే పంపు లేకపోతే వచ్చేసమ్మర్ కు పంపనే పంపనుజాగ్రత్త!" అనిఫోన్ కట్ చేసేశాడు కుమార్.
 " ఈవెధవ అన్నమాటనిజంచేసినా చేస్తాడు అమ్మా! నీఫ్లయిట్  టికెట్ శుక్రవారానికి కన్ ఫాం చేసేస్తాను. ఆరోజైతేనేను వర్క్ ఫ్రం హోం నిన్ను దిగబెట్టను వీలవుతుంది సరా! వచ్చేసమ్మర్ కు తప్పకరావాలిమరి." అని గరేజ్లోకి వెళ్ళిపోయింది కౌముది కార్ తాళాలు తీసుకుని.                                    
            ఇండియాచేరిన ప్రియమణికి వాతావరణ మార్పిడి ,శ్రమ, ప్రయాణబడలికా అన్నీచేరి ఇల్లు చేరగానే రొంపపట్టుకుంది. దాన్నుంచీ కాస్త తట్టుకునేసరికి తన ఆఫీస్ నుండీవర్తమానం ….
" మీఅంత అనుభవఙ్ఞుల సేవలు మాకు మరికొంతకాలం కావాలి ,కన్సాలిడేటెడ్ శాలరీ ఇస్తాం ,వచ్చి చేరం" డంటూ. " రిటైరయ్యాక సంవత్సరానికి మళ్ళా ఈపిలుపేంటీ!? రావాల్సిన పి.యఫ్., LIC,అన్నీ వచ్చేశాయిగా!పెన్షనూఫిక్సైంది ,ఐనానీవిప్పుడువెళ్ళితిరిగిఉద్యోగంలోచేరిసంపాదించిఎవర్నుధ్ధరించా
లిట!చేయలేనని చెప్పమ్మా!ఈ ఆరునెలలూ ఇల్లు చక్కబెట్టే సరికి నా తలప్రాణం తోక్కొచ్చింది. ఇహ నావల్లకాదు " అన్నాడు కొడుకుకుమార్.  
" ఐనా నీవిప్పుడు ఆబరువుబాధ్యతలు తలకెత్తుకుని సంబాళించగలవాప్రియా!  బ్యాంక్  సెంట్రల్ ఆఫీసంటే మాటలా? అవన్నీ ఎక్కడపడతావ్ గానీ హాయిగా ఇంట్లో విశ్రాతిగా ఉండు. ఎందుకొచ్చిన న్యూసెన్స్?  " అన్నాడు భర్తభరద్వాజ్.    
            లోలోపల నవ్వుకుంది ప్రియమణి.' అందరికీ తనపై ఎంత ప్రేమ! రిటైరై తనెంత విశ్రాంతి పొందు తున్నదోఅందరికీ తెలీదా!ఇక్కడకొడుకు ,అక్కడకూతురుఅంతాతనపైఎంతప్రేమచూపుతున్నారో, తమ అవసరాల్నిఎలా బదలాయిస్తున్నారో ! చివరకుపెళ్ళిచేసుకుని ఇన్నేళ్ళూకాపురంచేసినభర్తసైతంతన విశ్రాంతిగురించీఎంతపట్టించుకుంటున్నాడో!అసలుపెళ్ళయ్యాకతనుఉద్యోగంమానేయాలనుకుంది.ఇల్లు చక్క దిద్దుకుంటూ ఇంటిని స్వర్గంలా ఉంచాలనుకుంది.ఉమ్మడికుటుంబం , మరుదులచదువులూ, మరదళ్ళ పెళ్ళిళ్ళూ అన్నీచేరి ' నీవిప్పుడు ఇంత మంచి ఉద్యోగం మానేస్తే ఈబరువుబాధ్యతలన్నీ ఒంటిచేత్తో ఎలా నిర్వహించగలను చెప్పు ప్రియా! నిజానికిఅసలునిన్నునీఉద్యోగంచూసేచేసుకున్నాను సుమా! ' అంటూ ఉన్ననిజాన్ని చెప్పి బలవంతంగా ఉద్యోగంలో కొనసాగించిన భర్తే ఇప్పుడు విశ్రాంతి పొందమంటున్నాడు ! మనుషుల్లో ఇంత స్వార్ధం ఉంటుందని ఊహించలేకపోయింది ప్రియమణి స్వార్ధానికి స్వపర బేధం లేదేమో! వింత ! ' అని నవ్వుకుంది.         
 ప్రియమణికి ఈ ఆలోచనలతో గుండెబరువెక్కి సన్నగా నొప్పిప్రారంభమైంది.రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందని  వెళ్ళి పడుకుంది. మధ్యాహ్నానికి నొప్పి ఎక్కు వైంది." పెద్దమ్మొగోరండా!మీరులేక  పెరటితోటపూలమొక్కలన్నీ పోయాయండా! మల్లా ఏద్దారండా!" అంటూ గదిలోకివచ్చి గుండెపట్టుకుని మెలికలు తిరుగుతున్న ప్రియమణీనిచూసి "ఏంటైందండమ్మొగోరండా ! " అంటూ ఇంట్లో ఎవ్వరూ లేకపోడం గమనించి " ఒరేయ్ నర్శిగా !రిచ్చాకట్టరా!పెద్దమ్మొగోర్ని ఆస్పెటాల్ కి తీసుకెల్లాల" అంటూ మొగుడ్ని కేకేసి ఇల్లు తాళమేసి వచ్చి రిక్షాలో  దగ్గరే ఉన్న అలవాటుగా ఆఇంటివారెళ్ళే హాస్పెటల్కు ప్రియమణినితీసుకెళ్ళింది పార్వతి. వెంట వేంటనే పరీక్షలుచేసి , మందులూ వాడటాన ప్రమాదం తప్పిందని డాక్టర్స్ చెప్పాక ,మొగుడ్నితాళాలిచ్చిపంపితానుపెద్దమ్మదగ్గరుండిపోయిందిపార్వతి ."ఏమే పార్వతీ!నీవు పార్వతివికాదు నాప్రాణదాతవు !నాకిప్పుడు బాగానేఉంది, నీవూఇంటికివెళ్ళకపోయావ్ ?  నీపిల్లలూ బళ్ళనుండీ వచ్చేవేళైందికదా! " అంది ప్రేమగా పార్వతి చేతులుపట్టుకుని ప్రియమణి.
       " అదేంటి  పెద్దమ్మొగోరండా! మిమ్మల్నొంటరిగొదిలి నేనెట్టపోగల్దునమ్మా! ఉంటారోళ్ళునాపెనిమిటి ఇంటికాడికి  కెల్లిండు  గదమ్మో గోరూ!" అంది .
" అమ్మొగోరండా !మీరేమనుకోపోతే నాదో కోరిక ! తీరస్తరా!" అంది పార్వతికాస్తంత బిడియంగా.
" చెఫ్ఫు పార్వతీ నీకేమైన కావాలా?".  అడిగిందిప్రియమణి.
" అమ్మొగోరండా ! ఇటుచూడండా! మీకిట్టవైన  , మీరుకోతుకొంటన్న ఈ పని సేయాలని నాకనిపించి ఇయన్నీతెచ్చిన్నండా !" అంటూ ప్రియమణీని మెల్లిగా దిండుకానించి కూర్చోబెట్టి పక్కనే ఉన్నటేబుల్ పై తాను అమర్చినవిచూపింది పార్వతి.
అక్కడ పార్వతి తనింటిపనిమనిషి కేవలం తమకు పనిచేస్తున్నందుకు తామింత అన్నం పెట్టి , జీతం ఇస్తున్నందుకు , పనిమనిషిగాతామంతా పిలిచే పార్వతి , తనమనస్సెరిగి తనచిరకాలవాంఛితాన్నిలా నెరవేర్చను ఆమె చేసిన ప్రయత్నాన్ని చూసిన ప్రియమణి మనస్సు ఆనందంతోమైమరచిపోయింది  , ఆత్మీయత అనేది స్వార్ధంలాగే స్వపరభేదం తెలీనిదని అర్ధమైప్రియమణిమనస్సుపార్వతిపట్లమమత తోనిండిపోయింది. ఆహృదయభారాన్ని మోయలేని ఆమెశరీరం పక్కకు వాలిపోయింది.పక్కనే బల్లపై పార్వతి ఏర్పాటు చేసిన లక్ష్మీదేవి , వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి ఫోటోలు ,వాటికి అలంకరించిన పూలమాలలూ, పండ్లు , కొబ్బరికాయ , సాంబ్రాణికడ్డీలు, కర్పూరం సహస్రనామాలున్నకొత్త  పుస్తకం  పార్వతిని చూసి ఫక్కుననవ్వాయి. 
                     వార్త ఆదివారం సంచికలో 19-8-2012 న ప్రచురితం. 

Wednesday 15 August 2012

విశ్వమానవప్రేమికుడు అరవిందుడు


                                              యోగి అరవిందఘోష్  మహర్షి    
                                       .
స్వాతంత్య్ర సముపార్జనకు తమదైన శైలిలో శ్రమచేసినమహానుభావుడుఅరవిందమహర్షి .ఆయన  తన జన్మదినం నాడే భారతదేశ దాస్యశృంఖలాలుఖండింపబడతాయని  ముందేచెప్పినజాతీయోద్యమ  నాయకుడు, సత్య సంకల్పుడు, ఆయనవలెనే ఆయన పాజిటివ్ థింకింగ్ ఎంతో మహోన్నతమైనది!
 అరవిందఘోష్ సుప్రసిద్ధ బెంగాలీ పండితుడు,ఒక మంచి కవి ,జాతీయవాది,యోగి,తత్త్వవేత్త.గురువు.
అరబింద్ ఆగస్టు 15, 1872 న కోల్‌కతా లో కె.డి.ఘోష్ ,స్వర్ణలతాదేవిలకుజన్మించాడు.తండ్రికె.డి.ఘోష్  వైద్యుడు.తల్లి స్వర్ణ లతా దేవి గొప్ప భక్తురాలు.ఈయన పూర్తి పేరు అరబిందో ఘోష్. అరవింద అనగా బెంగాలీలోపద్మముఅనిఅర్థం.అరవిందఘో ఘోష్ కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయంలో  అసాధారణతిభావంతు   డైన విద్యార్థిగా గుర్తింపు పొంది, సివిల్ సర్వీస్(ఐసిఎస్) పరీక్షలోఉన్నతశ్రేణిలోఉత్తీర్ణుడయ్యారు..ఐసిఎస్ పదవిని నిరాకరించి 1892లో భారతదేశానికి తిరిగి వచ్చాడు.
         సాహిత్య వ్యాసంగంలో కృషిచేస్తూనే , స్వాతంత్య్రోద్యమపొరాటంలోపాల్గొన్నాడు.ఈ పొరాటములో ఈయన  అతివాదులుగా విప్లవమార్గాన్నిఎంచుకొన్నారు."బరోడా"కుట్ర కేసులోఈయనకలకత్తా కేంద్ర కారాగారములో వున్నప్పుడుకలిగినఅనుభూతులతో పూర్తిగా ఆధ్యాత్మిక మార్గములో పయనించారు. వడొదరాలోనిమహారాష్ట్రయోగి ఐన విష్ణుభాస్కర్ లెలె ఉపదేశముతోఅధ్యాత్మికమార్గంపట్ల ఆకర్షితుడై అరబిందో రాజకీయం నుంచి ఆధ్యాత్మికత వైపుకు క్రమక్రమంగా ప్రవేశించడం జరిగింది.. రెండవసారి కోల్‌కతాలోని ఆలీపూర్ కేంద్రకారాగారంలోశిక్షఅనుభవిస్తున్నపుడుఆధ్యాత్మికత పట్ల గాఢమైన ఆసక్తి కలిగింది.ఇక్కడఆయనచేసినభగవద్గీతపారాయణం,అనుసరణఆయనకుఅనేకఆధ్యాత్మికఅనుభూతుల్ని కలిగించాయి.
ఆతరువాత పాండిచ్చేరిలో ఆశ్రమస్థాపనచేయటం జరిగింది. అరవిందునిబోధల వలన ఎంతోమంది ఆయనకుశిష్యులుగామారారు.అరవింద్‌. Thelifedevine,సావిత్రిలాంటిఅద్భుతమైనకావ్యాలను  అందించిన ఋషి అరవిందమహాశయుడు. పరిపూర్ణమానవుని అవతరణ జరుగుతుందని, దానికోసం తన తపశ్శక్తిని వెచ్చించి అత్యున్నతమైన ఆధ్యాత్మికప్రవాహాన్ని భూమి వైపు మళ్ళించిన గొప్ప యోగ సాధకుడు అరవిందయోగీంద్రులు.  
న్యూ ల్యాంప్ ఫర్ ఓల్డ్అనేశీర్షికనముంబాయికి చెందిన ఇందు ప్రకాశ్ పత్రికలో 1893 ఆగష్టు నుంచి 1894 మార్చివరకూఅనేకవ్యాసాలనుచాలాఘాటుగారాశాడు. జాతీయతఅనేది మతం. దాన్ని దైవం ఇచ్చింది. ఈ భావం హృదయానికి, ఆత్మకు సంబంధించినదని అరవింద ఘోష్ జాతీయతను నిర్వచిస్తూ వ్యాసాలనురాశారు.1906లో అరవిందఘోష్ కళాశాల అధ్యక్షుడయ్యాడు. బెంగాల్ జాతీయ కళాశాలను స్థాపించి, బిపిన్‌ చంద్రపాల్, తిలక్‌లతో కలిసి రాజ్యాంగ పద్ధతుల ద్వారా ఆందోళన కొనసాగించాడు. విదేశీ వస్తు బహిష్కరణ అమలు జరిపాడు. వీటన్నిటి ద్వారా దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించవచ్చని సూచించాడు. 1905లో బెంగాల్ విభజనానంతరంరాజకీయాల్లోచురుకుగాపాల్గొన్నారు. వందేమాతరమ్ పత్రిక నిర్వహణలో బిపిన్ చంద్రపాల్‌తోసహకరించారు. బెంగాల్ యుగంధర్ పత్రికను ప్రారంభించారు.పుదుచ్చేరిలో నాలుగుసంవత్సరాలు ఏకాగ్రతతోయోగాభ్యాసం చేసినతదనంతరం 1914 వ సంవత్సరంలో' ఆర్య 'అనే అరవై నాలుగు పేజీల సమీక్షను మాసపత్రిక రూపంలో వెలువరించాడు. తర్వాతఆరున్నరసంవత్సరాలపాటుఆయనఈపత్రికద్వారానేతనముఖ్యమైనరచనలనుధారావాహికంగా ప్రజలకు చేరవేశాడు.
తీవ్రవాద జాతీయవాదాన్ని సమర్థించిన తత్వవేత్తలు, భారతదేశపు సర్వజ్ఞతను విశ్వసించారు. విదేశీ ప్రభుత్వసంస్థలప్రాబల్యం, సంస్కృతీ ప్రభావంనుంచి స్వాతంత్య్రం సాధించిన తర్వాతే హిందూ సంస్కృతి శిఖరాగ్రాలను అందుకుందని వారు నమ్మారు. జాతీయతను మత పరిభాషలో ప్రకటించారు. 
అరవిందఘోష్ అకుంఠిత దీక్షతో భారతమాత దాస్యశృఖంలాలను పగులగొట్టడానికి సాయుధసమరం జరిపినస్వాతంత్య్ర యోధుడు. అనేక ఏళ్ళపాటుపుదుచ్చేరిలో ఆయనకార్యకలాపాలుసాగించారు.బ్రిటిష్ దురాక్రమణకు ప్రతినిధి ఐనఆనాటి వైస్రాయ్ లార్డ్ మింటో చేత మోస్ట్ డేంజరస్మాన్అనివర్ణించబడిన, నాటివిప్లవవీరుడు అరవిందుడు1910ఏప్రిల్ 4న బ్రిటిష్ పాలనలోఉన్నభారతదేశాన్నివదిలి, ఫ్రెంచి వారి ఆక్రమిత ప్రాంతమైన భారతదేశంలోని పాండిచేరిచేరాడు.
       1902 ప్రాంతాలలో, కింగ్స్‌ఫర్డ్ అనేఆంగ్లేయుడు,నాలుగుసంవత్సరాలు కలకత్తాలో మేజిస్ట్రేట్‌గా పనిచేసాడు. అతడుచాలా కఠినుడు, రాజకీయ నేరాలకు ఆయన శిక్షలు చాలా దారుణంగా వుండేవి. వందేమాతరంఅని నినాదమిచ్చిన నేరానికి, బహిరంగంగా కొరడాదెబ్బల శిక్షవిధించాడు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ లార్డ్‌మోరే కూడా ఈ దారుణ శిక్షలకు చలించిపోయి, వైస్రాయ్ లార్డ్‌మింటోకు అంత తీవ్రమైన శిక్షలనుతగ్గించమనిఉత్తరంరాసాడు. తరువాత కింగ్స్‌ఫర్డ్, బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు జిల్లా జడ్జిగా వెళ్లాడు.బెంగాల్విప్లవకారులసంఘంఅతనినివధించాలనినిర్ణయించింది.ఈబాధ్యతఖుదీరాంబోస్,ప్రఫుల్ల రాకీలకుఅప్పగించబడింది.1908 ఏప్రిల్ 30 తేదీనవీరిరువురూ,కింగ్స్ ఫర్డ్ అనుకునివేరే బండి మీద బాంబులు విసిరారు. దానిలోని, కెన్నడీఅనే కుటుంబానికి చెందిన, ఇద్దరు స్త్రీ లు మరణించారు.దానితో దేశమంతా గగ్గోలెత్తింది మే 1నఖుదీరాంబోస్ అరెస్టయితే అరెస్టయిన ప్రఫుల్లరాకీ తాను రహస్యాలు ఎక్కడ బయటపెడతానో అన్న భయంతో ఏప్రిల్ 5న తానే కాల్చుకుని ఆత్మహత్యచేసుకున్నాడు. దీని వెనక గల కుట్రను ఛేదించదలుచుకున్న ప్రభుత్వం, అరవిందుల పేరుతోగల 'మురారి పుకార్ 'తోటను సోదాచేసి అరవిందుల సోదరుడు హరీంద్రనాథ దత్‌ను, ఇంకా కొంతమందిని అరెస్టు చేసారు.
అదే ప్రసిద్ధి చెందిన ఆలీపూర్ బాంబు కేసు. దానిని కలకత్తా సెషన్స్ కోర్టులో విచారించింది బీచ్ క్రాఫ్ట్ అనే ఆంగ్లేయుడు . విచిత్రమేమిటంటే ఈయన అరవిందులు, కేంబ్రిడ్జ్‌లో సహోధ్యాయులు. గ్రీకుభాషలో అరవిందులు ప్రథముడైతే, బీచ్‌క్రాఫ్టు ద్వితీయుడయ్యాడు. ఈ కేసు విచారణకు ప్రభుత్వం పట్టుదలతో మద్రాసులోని ప్రముఖ క్రిమినల్ న్యాయవాది నార్టన్‌ను ప్రత్యేక ప్రాసిక్యూటర్‌గా నియమించింది. మరి వారికి దీటైన న్యాయవాది, ముద్దాయిల తరఫున ఎవరు వాదించగలరు? అపుడే చిత్తరంజన్‌దాస్ ఈ భారాన్ని వహించారు. పూర్తి కాలాన్ని ఈ కేసుకేవెచ్చించడంతో,ఆకర్మయోగికిచివరికిమిగిలిందిఏభైవేల అప్పు.... బండిని గుర్రాలను అమ్మేసుకున్నారు! 9 రోజులపాటు సాగిన ఆయనవాదన ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది.తనవాదననుముగిస్తూఅరవిందులవాణివారిమరణానంతరంకూడఒక్కభారతదేశంలోనేకాకుండా ప్రపంచమంతావినిపిస్తుందన్నారు! సరిగ్గాఅదేజరిగింది.దేశభక్తి వైతాళికుడుగా, జాతీయవాదప్రవక్తగా వున్న శ్రీ అరవిందులు ఆతరువాత విశ్వమానవ ప్రేమికునిగా అవతరించారు. 1909లో మే 6న బీచ్ క్రాఫ్ట్, అరవిందుడునిర్దోషిఅనితీర్పుచెప్పారు! కానిసోదరులు హరీంద్రునికి, ఉలాస్కరదత్ కు మరణశిక్ష విధించబడింది. దేశబంధు చిత్తరంజన్‌దాస్, కలకత్తా హైకోర్టుకి అప్పీలు చేసి, వారిమరణశిక్షను ద్వీపాంతరవాస శిక్షగా మార్పించగలుగుతాడు.
వారి 40 సంవత్సరాల పాండిచేరి జీవితంలో వారు విశ్వమానవ ప్రేమికునిగానే శ్రమించారు. ఐనా భారతదేశాన్నిగిరించిన ఆలోచన మరువలేదు. అరవిందుల అనేక గ్రంథాలుపాండిచేరి లోజీవించిన కాలంలోనే రచింపబడ్డాయి, అందులో ఒకటి ది ఫౌండేషన్ ఆఫ్ ఇండియన్ కల్చర్, ఆ ఉద్గ్రంధం, వారిఆర్య మాసపత్రికలో 1918 డిసెంబర్‌నుంచి 1921 జనవరి దాకా వెలువడింది. సుమారు 400 పుటలు.అందులోముఖ్యంగాభారతరాజనీతినిగురించి,4 ప్రకరణాలు, సుమారు 60 పుటలు వున్నాయి.  ఐనా తిరిగి ఈ తికమకల మధ్య, ఇంకాఒక నూతన వెలుగుకు,సాయంకాలపువెలుగుకాదు,ఉదయ కాలపుయుగసంధ్యకుఅవకాశముంది.యుగాలతరబడిఉండినభారతదేశంచనిపోలేదు.తనచిరసృజనాత్మకభావాలను ఇంకా పూర్తిగా వెదజల్లలేదుఈదేశం జీవిస్తుంది. ఇంకాతన కొరకుమరియు విశ్వమాన వాళికి ఎంతో సేవ చేయవలసింది వుంది...' అనేది ఆగ్రంధంలోని చివరివాక్యం. అరవిందుల నిర్యాణం 1950 డిసెంబర్ 5న జరిగింది.ఐనా ఆయన భారత ప్రజలేకాక ఎంతోమంది ప్రపంచ ప్రజలహృదయాల్లో చిరంజీవియే! అట్టి మహామహునిభారతస్వాతంత్య్రదినోత్సవాన ,అరవిందులజన్మదినోత్సవానఆయన్ని
 స్మరించడం ఉచితం.
-విశ్వమానవప్రేమికుడు అరవిందుడు.అనే టైటిల్తో ఆగష్టు 15న ప్రచురితం.




Thursday 2 August 2012

ఇస్తే వస్తాయ్...

                                                         ఇస్తే వస్తాయ్...

         
రఘురాం  ఒక సాధారణ గుమాస్తా.ఆయన భార్య  రాగిణి తమ మితమైన రాబడితో తన  పిల్లలిద్దరినీ ఎంతో క్రమశిక్షణతో పెంచుతున్నది .రాము , రాణి కవలలు. ప్రతి రోజూ రాత్రివారికి భారత భాగవత రామాయణ గాధలుచెప్తుంటుంది.చదువుతోపాటుగా చక్కని అలవాట్లు పిల్లలకు నేర్పేది.. .పిల్లలిద్దరూ చదివేస్కూల్ ప్రభుత్వపాఠశాల కావడంతో ఉచితవిద్యే ఐనా యూనిఫాం తప్పని సరి.పిల్లలిద్దరూ ఉదయాన్నే లేచి తయారై 2కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్కు నడిచివెళ్ళేవారు. ఎంతోమందికి సైకిళ్ళున్నాయనీ తమకూ కొనివ్వమనీ రాము తండ్రిని అడుగు తుండేవాడు. తల్లి రాగిణి " చూడు రామూ ! కాళ్ళులేనివారినెపుడైనా చూశావా?వారు నడవలేక డేకుతారు పాపం , నీకు భగవంతుడు చక్కగానడవను కాళ్ళు ఇచ్చినందుకు సంతోషించు.ఇతరులను చూసి అవన్నీ కావాలను కోడంకంటే నీకంటే తక్కువగా ఉన్నవారిని చూసి నీకు లభించిన వాటి తో తృప్తిపడటం మంచిలక్షణం. "అని చెప్పింది. " నీవెప్పుడూ ఇలాగే చెప్తావమ్మా!" అని విసుక్కున్నాడు రాము. చిన్నవాడైన రాము అప్పుడపుడూ తనతరగతిలోని పిల్లలనుచూసి వారికున్నవి తనకూ కావాలని అడగడం,    తనవద్ద ఉన్న స్పేర్ పెన్స్ కానీ నోట్బుక్స్ కానీ అవసరమైతే రాణికి ఇవ్వను ఇష్టపడక అక్కతో పేచీపడటంచూసినతల్లిరాగిణివాడికిబుధ్ధిచెప్పేసమయంకోసంవేచిచూడసాగింది..     .               
        
ఆరోజు తమ తరగతిలో క్రొత్తగాచేరిన 'నీరజ 'చాలా పాత డ్రెస్ వేసుకుని వచ్చింది స్కూల్కు. అంతా ఆమెను చూసి నవ్వు కున్నారు. ఎవ్వరూ ఆమెతో మాట్లాడలేదు. రాణి వెళ్ళి పక్కనకూర్చుని స్నేహంగానవ్వింది.నీరజ ఎంతోసంతోషించింది.అలావారి స్నేహం మొదలైంది. ఎన్నాళ్ళైనా నీరజ యూనిఫాం  వేసుకు రాకపోడంతో  టీచర్సంతా ఆమెను క్లాస్ లో నిల్చోబెట్టసాగారు." చూడూ నీరజా ! స్కూల్ నిబంధనలు పాటించాలి, నీవు ఒక్కదానివే ఇలాయూనిఫాంలేకుండా రాడం బావులేదు " అని మందలించారుకూడా. ఓరోజున ఆమెను క్లాస్ లోకి రానివ్వక  పోడంతో ఆమెచాలాబాధపడింది.నీరజ తండ్రి  కూలిపనిచేసి తనముసలి అమ్మనాన్నలతో సహా ఆరుమందిని పోషిస్తున్నాడు,నీరజ తల్లి ఆరోగ్యం బావుండదు.యూనిఫాం కుట్టించేస్థోమత  ఆయనకు లేదు. నీరజ కూడా ఎంతో కష్టపడి ఇంట్లో పని చేసి స్కూల్కు ఎలాగో వస్తున్నది. ఆమెకు చదువంటే ప్రాణం. రాణి మరునాడు అమ్మ నడిగి తన యూనిఫాం రెండోజత తెచ్చి నవీనబ్యాగ్ లో ఉంచింది."నవీనా ! నీవు ఈ యూనిఫాం వేసుకుని రా !నేను ఇచ్చినట్లు ఎవ్వరికీ తెలీదుసుమా!" అని ఒక లెటర్ వ్రాసి ఉంచింది. మరునాడు నవీన ఆయూనిఫాం వేసుకుని స్కూల్ కువచ్చింది ,కృతఙ్ఞతగారాణిని చూసి నవ్వింది.మరుసటివారం రాణిపుట్టినరోజుపండుగ రాగా ఆమె అమ్మమ్మా తాతా , మామా, అత్తా ,బాబాయ్ వచ్చి తలో జత బట్టలూ తెచ్చి బహూకరించారు." చూశావా! రామూ ! అక్క తనకున్న రెండుజతల యూనిఫాం లో ఒకజత నన్నడిగి , నవీనకు ఇచ్చింది గుట్టుగా ఎవ్వరికీ తెలీకుండా , అక్కకు ఎన్ని జతల బట్టలు వచ్చాయో చూశావా? ఇస్తే  వస్తాయ్ ! తెల్సుకో , నీవద్ద ఉన్న వాటిని ఇతరులతో పంచుకోడం నేర్చుకో ." అని చెప్పింది.
[హైదరాబాద్ నుండీ ప్రచురితమయ్యే ' బాలవికాస్ ' పిల్లలమాగజైన్లో  గతనెలలో ప్రచురితం ]