Tuesday, 20 November 2012

కొక్కిరమ్మ గుడ్లుకొక్కిరమ్మ గుడ్లు

కొక్కిరమ్మ గుడ్ల కథని రకరకాల రూపాల్లో చెబుతుంటారు. ఏదో ఒక రూపం మీకూ తెలిసే ఉంటుంది. దీన్ని సరదాగా చదవండి- మీకు తెలిసినకథని గుర్తుచేసుకోండి. 
రచన: ఆదూరి హైమావతి, విశ్రాంత ప్రధానోపాధ్యాయిని, బెంగుళూరు.
పిల్లలూ! నా చిన్నప్పుడు- అంటే నాకు ఆరేడు ఏళ్ళప్పుడన్న మాట (ఇప్పుడు నాకు 65!) మా అమ్మమ్మ సత్యాన్ని గురించి చెప్పిన ఈ కథ నాకింకా జ్ఞాపకం. సత్యం మానవులకే కాక, పశు-పక్ష్యాదులకు సైతం ఒక్కటేననీ, అసత్యం చెప్పిన వారికి దండనతప్పదనీ ఈ కథ వలన తెలుస్తుంది. అందుకే మీకు ఈ కథను 'కొత్తపల్లి 'ద్వారా చెప్పాలన్పించి, చెప్తున్నాను.
పూర్వం ఒక కొక్కిరమ్మ ముంతంత ఇల్లుకట్టుకొని, దాన్లో మూడు పుట్ల వడ్లు పోసుకుని, వడ్లమీద గుడ్లు పెట్టుకుని, గుడ్ల మీద తాను పడుకుంది. ఇంతలో ఒక ఏనుగు వచ్చి, "చలిగా ఉంది కొక్కెరమ్మా, నాక్కాస్త చోటిస్తావా?" అని అడిగింది, దానికి కొక్కెరమ్మ "ఏనుగన్నా! నేను ముంతంత ఇల్లు కట్టుకుని మూడు పుట్ల వడ్లు పోసుకుని, వడ్ల మీద గుడ్లు పెట్టుకుని, గుడ్ల మీద పడుకున్నా, నా వెనక చోటుంటే నువ్వు పడుకో" అంది.
"సరే" అని కొంగ వెనుక ఏనుగు పడుకున్నది.
ఇంకాస్త సేపటికి ఒక నక్క వచ్చింది- "కొక్కెరమ్మ కొక్కెరమ్మా! నాక్కాస్త చోటిస్తవా?" అని అడిగిందట అది. "నక్క బావా! నేను ముంతంత ఇల్లు కట్టుకొని మూడు పుట్ల వడ్లు పోసుకొని వడ్లమీద గుడ్లు పెట్టుకొని, గుడ్లమీద పడుకున్నా, నా వెనక చోటుంటే ఏనుగు పడుకుంది, ఏనుగు వెనక చోటుంటే నువ్వు పడుకో" అంది.
నక్క వచ్చి ఏనుగువెనుక పడుకుంది.
మరికొంత సేపటికి ఒక పిల్లి వచ్చింది- "కొక్కెరమ్మ కొక్కెరమ్మ ! నాక్కాస్త చోటిస్తవా?" అంది. కొక్కెరమ్మ చెప్పింది- "పిల్లిమావా! నేను ముంతంత ఇల్లుకట్టుకుని, మూడు పుట్ల వడ్లు పోసుకుని, వడ్ల మీద గుడ్లు పెట్టుకుని, గుడ్ల మీద పడుకున్నా, నా వెనక చోటుంటే ఏనుగు పడుకుంది, ఎనుగు వెనక చోటుంటే నక్క పడుకుంది, నక్కెనక చోటుంటే నువ్వు పడుకో!" అంది. పిల్లి కూడా పడుకుంది.
మరికొంత సేపటికి ఒక గుర్రం , ఒక తోడేలు వచ్చాయి. రెండూ కొక్కెరమ్మను అలాగే అడిగాయి. కొక్కెరమ్మ వాటికీ అలాగే చెప్పింది. రెండూ వచ్చి పడుకున్నాయ్.
మధ్య రాత్రి అయ్యే సరికి కొక్కెరమ్మకు పట పట మనే శబ్దం వినిపించింది.
"ఏంటా శబ్దం? ఎవరైనా నా గుడ్లుకానీ‌ తింటున్నారా?" అడిగింది కొక్కెరమ్మ నిద్రలోనే.
"లేదు కొక్కెరమ్మా! చలికి నా పళ్ళు పట పటమని కదులుతున్నాయి" అందట పిల్లి.
తెల్లారినాక చూసుకుంటే కొక్కెరమ్మ గుడ్లు లేనే లేవు!
కొక్కెరమ్మ విచారంతో "మీ అందరికీ నేను రాత్రి చోటిచ్చాను. అయినా మీలో ఎవరో నాగుడ్లు తినేశారు. ఎవరో చెప్పి తప్పు ఒప్పుకోండి మర్యాదగా" అంది.
"మేమెందుకు తింటాం కొక్కెరమ్మా! నువ్వెంత మంచిదానివో మాకు తెలీదా?" అన్నాయి అన్నీ.
"మీరంతా గుండ్లకమ్మ నదికి వచ్చి ఒక్కోరూ ఆ నదిలో మునిగి ప్రమాణం చేయండి. ఎవరైతే గుడ్లు తిన్నారో వారిని గుండ్లకమ్మే ముంచుతుంది"అందిట కొక్కెరమ్మ ఏడుస్తూ.
అన్నీ సరేనని నదిలో నిల్చుకొని కొక్కెరమ్మ చెప్పినట్లు పలికాయి: "కొక్కెరమ్మ గుడ్లంట, నేనంట తిన్ననంట, తిన్ననంటె ముంచు ముంచు గుండ్లకమ్మ-లేకుంటే తేలగొట్టు గుండ్లకమ్మ " అని మూడుమార్లు ప్రమాణం చేసి అన్నీ ఆ నది నీళ్లలో మునిగాయి.
అన్నీ నీళ్ళలోంచి బయటకి వచ్చాయి- కానీ పిల్లిమాత్రం రాలేదు: గుండ్లకమ్మలో కొట్టుకు పోయింది.
అప్పుడు మిగిలినవన్నీ "చూడు, కొక్కెరమ్మా! నువ్వేమో నీ ముంతంత ఇంట్లో చలి రాత్రిలో పడుకోను చోటిచ్చావు మాకు. కృతజ్ఞతలేని ఆ దొంగ పిల్లి నీ గుడ్లన్నీ తినేసింది. కానీ గుండ్లకమ్మ నది అసత్యానికి అన్యాయానికి తగిన శిక్షే విధించిందిలే, బాధపడకు "అని ఓదార్చాయి.
చూశారా పిల్లలూ! అన్యాయానికి, కృతఘ్నతకూ శిక్ష తప్పదు మరి! ఎప్పుడూ నీతి నిజాయితీలతో నడచుకుంటూ ఇతరులకు చేతనైన సాయం చేస్తుంటారు గదూ!


మార్చి 2012 కొత్తపల్లి పిల్లలమాసపత్రికలో ప్రచురితం.

చంటి గాడి పండ్ల తోట.


       

చంటిగాడి పళ్లతోట

పండ్ల తోట! ఎట్లా ఉండాలి?! ఎలా పెంచాలి?! ఈ కథ చదివి చూడండి....ఇది కథా, జీవితాదర్శమా, అసలు? 
రచన: శ్రీమతి ఆదూరి హైమవతి, విశ్రాంత ప్రధానోపాధ్యాయిని, బెంగళూరు.
చంటి గాడికి అప్పుడప్పుడే ఐదేళ్ళు వచ్చాయి. "ఇహ ఆటలు కట్టిపెట్టి బడికి పోవాలి" అన్నాడు నాన్న. "ఓఁ పోతా! నేనెందుకు పోను?!" అన్నాడు చంటి. "మా నాన్నే!" అని మురిసిపోయింది బామ్మ.
తర్వాత ఒక రోజున చంటిగాడు నిద్రలేచేసరికి ఇల్లంతా హడావిడిగా ఉంది. ఎవర్ని పిలిచినా పలికేలా లేరు. అమ్మ వంటగదిలో ఉంది. అప్పుడే ఏవేవో వంటలు చేసేస్తోంది. నాన్న పనివాళ్ళకు పనులు పురమాయిస్తున్నాడు. చంటిగాడు పూజగదిలో ఉన్న బామ్మ దగ్గర- కెళ్ళాడు- "బామ్మా! గడపలకు పచ్చగా పసుపు పూసి, ఎఱ్ఱగా కుంకుమ బొట్లు పెట్టారేంటి? గుమ్మాలకు ఆకుపచ్చ మామిడి ఆకులేంటి? స్తంభాలకు ఆ అరటి చెట్లేంటి? రంగురంగుల ఆ పూలేంటి? నల్లని ఆ పలక ఎవరికి? ఆ తెల్ల చొక్కాయి, నీలం నిక్కరు ఎవరికి? ఈ రోజు ఏం పండగ?" అంటూ సందేహాలవర్షం కురి పించాడు.
బామ్మ నవ్వింది- "అబ్బో! ఫరవాలేదే, చంటీ ! నీకు రంగులన్నీ తెలిసి పోయాయి, బళ్ళో చేరటానికి అర్హత వచ్చినట్లే! ఈ రోజు నువ్వు బళ్ళో చేరే పండగరా, చంటీ !" అంది .
ఆరోజు చంటి వెళ్ళి తల స్నానంచేసి, అమ్మ ఇచ్చిన కొత్త చొక్కాయి వేసుకుని అమ్మ-నాన్నలతోపాటు పీటలమీద కూర్చుని పూజ చేశాడు. అందరూ కలిసి వాడికి అక్షరాభ్యాసం చేశారు.
అదే రోజున వాడు బడిలో చేరాడు. ఆ రోజున ఒకటోతరగతి పంతులుగారు పలకపైన 'ఓ న మః ' రాసి ఇచ్చారు వాడికి. చంటిగాడు అన్నాడు "మానాన్న ఇంట్లో బియ్యంలో రాసేసారుగా వీటిని?!" అని. పంతులు గారు నవ్వి "ఇక మీదట వీటిని రోజూ తరగతిలో నీ అంతట నువ్వే రాయాలి, తెలుసా?" అని అడిగారు. బుధ్ధిగా తల ఊపాడు చంటి. "నువ్వు చక్కగా మా బళ్ళో చేరావు కదా, అందుకని ఇవాళ్ళ నీకు మేం ఏవో బహుమతులు ఇస్తాం. ఏమిటో‌ కనుక్కో!" అన్నారు పంతులుగారు. చంటి ఏవేవో వస్తువుల పేర్లు చెప్పాడు గానీ‌, అవేవీ కావన్నారు పిల్లలు, నవ్వుతూ. 
ఆరోజు సాయంకాలం బడి వదలగానే పంతులుగారు వచ్చి, ఐదు పండ్ల మొక్కలు తెచ్చి ఇచ్చాడు చంటికి. స్కూల్లో పిల్లల వయసును బట్టి, ఎవరిది ఎన్నో పుట్టిన- రోజైతే, అయ్యవార్లు వాళ్ళకి ఆ రోజున అన్ని మొక్కలు బహుమతిగా ఇస్తారట- ఒకటో‌ తరగతిలో ఐదు; రెండో తరగతిలో ఆరు, మూడో తరగతిలో ఏడు; ఇలాగ! వాళ్ళు వాటిని ఎక్కడో ఒక చోట నాటి, శ్రద్ధగా పెంచాలట!
చంటిగాడు బామ్మని, అమ్మని ఊపిరి తిప్పుకోనివ్వక, ఆ మొక్కల్ని నాటేవరకూ గొడవ చేస్తూనే ఉన్నాడు. ఇంటికి నాలుగు మూలల్లోనూ నాలుగు మొక్కలు నాటారు- ఇక మరో బాదం మొక్క మాత్రం మిగిలింది. "దాన్ని పెరట్లో వంట గది బయట పెట్టండర్రా ! చక్కగా ఆకులు కోసుకుని విస్తరి కుట్టుకుని భోజనం చేయచ్చు" అన్నది బామ్మ. 
అప్పుడు మొదలైంది ఆ అలవాటు- ప్రతిరోజూ చంటిగాడు నిద్రలేవగానే వెళ్ళి ముందుగా బాదం మొక్క దగ్గర కూర్చొని ముఖం కడుక్కునేవాడు. ఆపైన ఇంటిచుట్టూ తిరిగి అన్ని మొక్కల్నీ చూసుకునేవాడు. వాటన్నింటికీ నీళ్ళు పోసి, ఆ తర్వాతగానీ తను స్నానం చేసేవాడుకాదు! అట్లా వాడు రెండో తరగతికి వచ్చేసరికి అయ్యవార్లు మరో ఆరు మొక్కలిచ్చారు. మూడో తరగతికి వచ్చేసరికి ఏడు మొక్కలు. నాలుగో తరగతిలో ఎనిమిది. ఐదులో తొమ్మిది మొక్కలు. అటుపైన వాడు హైస్కూలుకు పోవలసి వచ్చింది!
హైస్కూల్లో పిల్లలకు మొక్కలు ఇచ్చేవాళ్ళు కాదు. అయినా చంటిగాడి బామ్మ ఊరుకుంటేగా? ప్రతి సంవత్సరం వాడి పుట్టిన రోజుకి ఆమె తనంత తానుగా వాడికి మొక్కల బహుమతి ఇవ్వటం మొదలు పెట్టింది. అలా అలా చంటిగాడు పదో తరగతికి వచ్చేసరికి 95మొక్కలు, అదనంగా వాడి స్నేహితులు తెచ్చి ఇచ్చినవి 13- మొత్తం 108 మొక్కలతో 'చంటిగాడి పండ్ల తోట' తయారయింది!
మామిడి , సపోటా , దానిమ్మ , నిమ్మ , జామ , పనస, నారింజ, బత్తాయి ఇంకా రకరకాల అరటి పండ్లూ, కాయలతో కళకళలాడి-పోతున్నది వాడి తోట. ఊళ్ళో ఎవ్వరికీ అంత మంచి తోట లేనే లేదు!
పదోతరగతి పరీక్షల తర్వాత, పాఠశాల వార్షికోత్సవ సభలో పెద్ద పంతులు గారు మాట్లాడుతూ "చంటి మా బళ్ళో చదవడం మాకెంతో గర్వకారణం. తనకు ఐదో ఏట లభించిన మొక్కనుండి, పదో తరగతిలో వాళ్ళ బామ్మ ఇచ్చిన మొక్క వరకూ అన్ని మొక్కలనూ బ్రతికించి, తన పండ్లతోటలో అందంగా, నిండుగా నిల్పుకుని, పరిసరాల పరిరక్షణ కావిస్తున్న చిన్న రైతు- చంటి. అతన్ని కొంత సేపు తన తోట గురించి చెప్పమని కోరుతున్నాను" అన్నారు ఆప్యాయంగా. 
జిల్లా అధికారులంతా చేరిన ఆసభలో చంటి లేచి నిలబడి ప్రసంగించాడు-
"ముందుగా మా చిన్నప్పటి బడిలోని అయ్యవార్లందరికీ, ఆ తర్వాత మా బామ్మ-గారికి, అమ్మ-నాన్నలకూ వందనాలు అర్పిస్తున్నాను. సభికులందరికీ నమస్కా-రాలు! అయ్యవార్లు, ఇంట్లో పెద్దలు కూడా పిల్లలకు సహకరిస్తే ఎవరైనా సాధించలేనిదేదీ ఉండదు. ప్రతి బడీ మా బడిలాగానూ, ప్రతి అయ్యవారూ మా అయ్యవార్లలాగాను ఉంటే దేశమే మారిపోతుంది. పరిసరాల కాలుష్యం పెరగదు. పర్యావరణ సమతౌల్యం దెబ్బతినదు. ఎవరికి కావలసిన ప్రాణవాయువు వాళ్ళ పరిసరాల లోనే తయారౌతుంది. అందరూ ఆరోగ్యంగా జీవించవచ్చు.
నిజానికి ఈ సన్మానం జరగవలసింది నాకు కాదు- నాకు మొట్టమొదటి బహుమతినిచ్చిన ఒకటో తరగతి అయ్యవారికి. స్కూల్లో చేరిన ప్రతి పిల్లవాని పుట్టినరోజు పండుగకూ మాపంతుళ్ళు ఐదేళ్ళైతే ఐదు , ఆరేళ్లైతే ఆరు మొక్కల చొప్పున ఇచ్చి ఇళ్ళలో పెంచమని కోరేవాళ్ళు. వాళ్ళు అలా నాకు ఇచ్చిన ఐదు మొక్కల్నీ ఆ రోజున నా బదులు మా బామ్మ, అమ్మ నాటారు. వాళ్లకి కృతజ్ఞుడిని. 
ఇప్పుడు మా బాదం చెట్టుకు పదేళ్ళు. మేం కావలసినన్ని బాదం పండ్లు తింటాం; బాదం ఆకుల విస్తళ్లలో ఫలహారాలు చేస్తాం. అరటి ఆకులు భోజనం చేయను వాడుకుంటాం. ఎంగిలి ఆకులను మా ఆవులు గేదెలు తింటాయి; మా దొడ్లో రాలిన ఆకులన్నీ చిమ్మి, గుంట త్రవ్వి, లోపల వేసి, మట్టికప్పితే గొప్ప 'పచ్చి రొట్ట ఎరువు ' తయారవుతుంది. మా పూలమొక్కలకూ, కూరపాదులకూ ఆ ఎరువునే వేస్తాం. మా తోటలో పండే కూరలు, ఆకుకూరలు, పండ్లు, పూలు- వేటికీ రసాయన ఎరువులు అవసరం కాలేదు. 
మా వంట ఇంటి గుమ్మం ముందు మా బామ్మ నాటిన బాదంచెట్టు పెద్ద పెద్ద ఆకులతో కొమ్మలతో విస్తరించి ఉంది. తన వెడల్పాటి ఆకులను అడ్డుగా ఉంచి వంటగదిలోకి దుమ్ము ధూళి రాకుండా అడ్డుకుంటుంది అది. నేను నాలుగో తరగతిలో ఉండగానే, మరిన్ని మొక్కలు నాటటంకోసం మా పెరటి పక్క స్థలాన్ని కొనేశారు మానాన్నగారు. 108 చెట్లతో ఈరోజున మాతోట ఇంత అందంగా ఉందంటే, దానికి పెద్దల ప్రోత్సాహం, వాళ్ల సహాయ సహకారాలే కారణం. మా ఇంట్లో వాడే నీరంతా కాలువలద్వారా అన్ని చెట్లకూ మళ్ళేలా సిమెంటుకాలువలు కట్టించారు మానాన్నగారు. మా నూతి వద్ద పడ్డ ప్రతి నీటి- బొట్టూ ఏదో ఒక మొక్కకు అందవలసిందే! అందుకే పెద్దల సహకారం పిల్లలకు అవసరమని చెప్పాను. 
ఇక, మా తోటలో కాసే పూలకోసం తుమ్మెదలు, పండ్లకోసం అనేక రకాల పక్షులు, వచ్చి చేరుతాయి. రోజూ మేం కోయిలల కుహూ రావాలతో నిద్రలేస్తాం, చిలుకల పాటలు వింటూ పనులు చేసుకుంటాం, కాకమ్మలు మేం పెట్టే అన్నపు మెతుకులకోసం కాచుకుంటాయి.
మేమంతా రోజూ‌ కనీసం ఒక్క గంట సేపైనా తోటపని చేస్తాం- అందువల్ల మా శరీరాలు గట్టిపడ్డాయి. ఆరోగ్యాలు బావున్నాయి. డెభ్భై ఏళ్ళ మా బామ్మ సైతం మాతో పాటు పనిచేస్తుంది. ఆ వయస్సులో సహజంగా వచ్చే వ్యాధులేవీ ఆవిడకు లేవు.
మేం తినటమే కాదు; మా చుట్టు పక్కలవాళ్ళకీ, మా బడి పంతుళ్ళకూ అందరికీ మా తోటలో పండిన కూరలు పంచి పెడతాం. చాలామంది మా నాన్నగారికి చెప్పారట- కూరగాయల్ని, పండ్లని పట్టణానికి పంపి అమ్మమని. అమ్మితే డబ్బు వస్తుంది- కాని, మేము కూరలు, పండ్లు, మొక్కలు బహుమతిగా ఇచ్చినపుడు మా స్నేహితుల ముఖాల్లో కనిపించే ఆనందం ఎన్ని వేలు పెట్టి కొంటే దొరుకుతుంది మాకు, చెప్పండి!?
మా ఇంటి చుట్టూ చెట్లు ఉండటం వల్ల వేసవిలో మాకు ఎండ వేడి లేనే లేదు. మా ఇంట్లోకి దుమ్మే రాదు. సాయంకాలాల్లో మా తోటను చూసేందుకు అనేక మంది వస్తుంటారు. వాళ్ళను మేము ఉత్తచేతులతో పంపనే పంపం. మా ఇంటి బొండు మల్లెలకోసం వీధి వీధంతా ఎదురు- చూస్తుంటుంది. ఊరి గుళ్ళల్లో దేవుళ్ళకు మా ఇంటి పూలతో కట్టిన మాలలు అలంకరిస్తారు- ఇంతకంటే గొప్ప ఆనందం ఏముంటుంది? ఇంటి తోటవల్ల నేను పొందిన ఈ అనుభవం నా జీవన ధ్యేయాన్ని నిర్దేశించింది. నేను వ్యవసాయశాస్త్రం చదవాలనుకుంటున్నాను.
అందరికీ మరోసారి వందనాలు. నా కోరిక కాదనక, అంతా మా తోటకు వచ్చి అక్కడ పండిన మామిడిపండ్లు , పనస తొనలు తిని వెళ్ళమని మనవి " అని ముగించాడు చంటి.
అంతా చప్పట్లు కొట్టారు. సభకు విచ్చేసిన కలెక్టరుగారు చంటిని అభినందిస్తూ అప్పటికప్పుడు వాడికి 'బాల రైతు' బిరుదు, బంగారు పతకమూ బహుమతిగా ఇచ్చారు!
అదండీ పిల్లలూ, 'చంటిగాడి పండ్లతోట' కధ! మరి మీరు కూడా మీ ఇళ్ళలో పండ్లచెట్లు పెంచుతారు కదూ!
                  
       డిసెంబర్2011 కొత్తపల్లి పిల్లలమాసపత్రికలో ప్రచురితం.

     
                  
     
         

Monday, 12 November 2012

బాలల భాగ్యవిధాత!

బాలల భాగ్యవిధాత!

apr -   Tue, 13 Nov 2012, IST
  • రేపు చాచానెహ్రూ జయంతి
పుట్టిన రోజు పండుగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికీః అనే పాత సినిమా పాటలోని చరణం తొలి ప్రధాని పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూకి వర్తించినంతగా మరి ఎవరికీ వర్తించదేమో. ఆగర్భ శ్రీమంతుడైన జవహర్‌లాల్‌ నెహ్రూని సివిల్‌ సర్వీస్‌లోకి పంపాలని ఆయన తండ్రి మోతీలాల్‌ నెహ్రూ ఆకాంక్షించారు. కాశ్మీర్‌కి చెందిన మోతీలాల్‌ కుటుంబం కొన్ని తరాలక్రితం ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ వచ్చి స్థిరపడ్డారు. మోతీలాల్‌ సుప్రసిద్ధ న్యాయవాది మాత్రమే కాక, జాతీయోద్యమంలో చురుకైన పాత్ర వహించారు. జవహర్‌లాల్‌పై తండ్రి ప్రభావం పడింది. కేంబ్రిడ్జిలో న్యాయశాస్త్ర పట్టా పొంది స్వదేశం తిరిగి వచ్చారు. అప్పటికే జాతీయోద్యమం పూర్తి స్థాయి లో సాగుతోంది. దానికి ఆకర్షితుడైన నెహ్రూ స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రవేశించారు. జాతీయోద్యమానికి సారథ్యం వహించిన మహాత్మాగాంధీకి అత్యంత నమ్మకస్తునిగా త్వరలోనే గుర్తిం పు పొందారు. ఉద్యమాలు, ఆందోళనలో పాల్గొన్నందుకు ఆయన తొమ్మిదేళ్ళు కారాగార శిక్షను అనుభవించారు., జైలు నుంచి ఆయన తన కుమార్తె ఇందిరా ప్రియదర్శిని (ఇందిరాగాంధీ)కి రాసిన 196 ఉత్తరాలు భారత దేశ ఆత్మను ప్రతిబింబింపజేశాయి. జైలులో ఉన్నప్పుడే ఆయన గ్లింప్సెస్‌ ఆఫ్‌ వరల్డ్‌ హిస్టరీ, జీవిత చరిత్ర, డిస్కవరీ ఆఫ్‌ ఇండియా అనే గ్రంథాలను రాశారు. నెహ్రూ గొప్ప నాయకుడే కాక, రచయిత కూడ. అఖిలభారత కాంగ్రెస్‌లో ఆయన కీలక పాత్ర వహించారు. లాహోర్‌ కాంగ్రెస్‌ సమావేశాలకు నేతృత్వం వహించారు. 1936, 1937, 1946లలో అఖిల భారత కాంగ్రెస్‌కి అధ్యక్షునిగా వ్యవహరించారు. స్వాతంత్య్రోద్యమంలో మహాత్మా గాంధీ తరువాత ద్వితీయ శ్రేణి నాయకునిగా గుర్తింపు పొందారు. గాంధీకి అత్యంత విశ్వసనీయునిగా ఉండటం వల్లే, స్వాతంత్య్రానంతరం సహజంగా ప్రధానమంత్రి పదవి ఆయనకే దక్కింది. ఆయన భార్య కమలా నెహ్రూ కూడా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. అయితే, చిన్న వయస్సులోనే ఆమె అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. అప్పటి నుంచి నెహ్రూ యోగక్షేమాలను ఆయన కుమార్తె ఇందిరాప్రియదర్శినియే చూస్తూ వచ్చారు. దేశ విభజనకు దారి తీసిన పరిస్థితులు, ఆందోళనలతో నెహ్రూ తీవ్రంగా కలత చెందారు. తొలి ప్రధానిగా ప్రమాణం చేసిన తరువాత ఆయన జాతినుద్దేశించి చేసిన ప్రసంగం ఎటెస్ట్‌ విత్‌ డెస్టినీగా ప్రసిద్ధమైంది. హిందూ ముస్లిం ఐక్యత కోసం నెహ్రూ తొలి విద్యా మంత్రి మౌలానా అబ్దుల్‌కలామ్‌ ఆజాద్‌తోనూ, ఇతర ముస్లిం నాయకులతోనూ కలిసి పర్యటనలు జరిపారు. స్వతంత్ర భారత తొలి ప్రధానిగా ఆయన ప్రభుత్వ రంగ సంస్థలను అభివృద్ధి చేశారు. నీటిపారుదల ప్రాజెక్టులను దేవాలయాలుగా ఆయన పరిగణించేవారు. ఆయన అందించిన సహకారంతోనే భాక్రానంగల్‌, నాగార్జున సాగర్‌ వంటి భారీ ప్రాజెక్టులు వెలిశాయి. నవరత్నాలుగా అభివర్ణితమైన భారీ పరిశ్రమలను ప్రభుత్వరంగంలో నెలకొల్పింది ఆయనే. స్వాతంత్య్రోద్యమంలో మహాత్మునికి కుడిభుజంగా, నవభారత నిర్మాతగా పండిత్‌ నెహ్రూ గణుతికెక్కారు. దేశాభివృద్ధి కోసం పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టింది ఆయనే. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు సమానంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. మన దేశానికి మిశ్రమ ఆర్థిక వ్యవస్థే అనుకూలమైనదని ఆయన పదే పదే స్పష్టం చేస్తూ ఉండేవారు. అందుకు అనుగుణంగానే ప్రణాళికలను రూపొందించి అమలు జేశారు. దేశంలో నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు ప్రజలందరూ విద్యావంతులయ్యేందుకు తగిన ప్రణాళికలను ఆయన అమలు జేశారు. అంతర్జాతీయ రంగంలో కూడా నెహ్రూ ఎంతో పేరు ప్రతిష్ఠలను సంపాదించారు. అమెరికా, రష్యాలను సమాన దూరంలో ఉంచుతూ మూడవ ప్రపంచ దేశాలన్నీ కలిసి అలీన ఉద్యమం(నామ్‌)లో భాగస్వామ్యం కావాలని మొదటిగా పిలుపు ఇచ్చిందీ, నామ్‌కి పునాదులు వేసిందీ ఆయనే. పొరుగు దేశాలతో శాంతిసామరస్యాలతో మెలిగేందుకు ఆయన పంచశీల విధానాన్ని రూపొందించి అమలు జేశారు. పంచశీల విధానం నేటి పరిస్థితుల్లోనూ అనుసరణీయమైనదే. ఆ రోజుల్లో ఆయన మాట అందరికీ శిరోధార్యంగా ఉండేది. అయినప్పటికీ, తన అభిప్రాయం కన్నా మెజారిటీ నిర్ణయాన్నే గౌరవించేవారు. అందుకే ఆయనను ఇప్పటికీ సాటిలేని ప్రజాస్వామ్యవాదిగా అంతా కీర్తిస్తూ ఉంటారు.
-ఆదూరి హైమవతి
ఆంధ్రప్రభ దినపత్రికలో నవంబర్ 13న[ నవంబర్ 14జవహర్ లాల్ నెహ్రూ జయంతి] సందర్భంగా ప్రచురితం.  

Tuesday, 6 November 2012

దేవునికి కానుక

                                                

                 దేవునికి కానుక

విదేశాల్లో ఉంటున్న మనవడు వివేక్ తాతగారిని చూడాలని భారతదేశానికి వచ్చాడు. తాత సదానందంలో ఉత్సాహం ఉరకలు వేస్తున్నది. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.
మనవడు వివేక్‌కి పదమూడేళ్ళు. విదేశంలోనే పుట్టినా తెలుగుదనాన్ని పుణికి పుచ్చుకున్నాడు వాడు. దేశమంటే ప్రేమ, పెద్దలంటే గౌరవం, తాత అంటే అభిమానం, చక్కని చదువు- ఏ తాతకైనా అంతకంటే ఏం కావాలి? అందుకే, మనవడి పుట్టిన రోజునాడు వాడి పేరిట తమ ఊర్లో ఉన్న అన్నిఆలయాల్లోనూ పూజలు చేయించాలని సంకల్పించాడు సదానందం. వంటవాళ్ళనుపిలిపించి పది రకాల ’తీపులు‘ చేయించాడు; పదిరకాల పండ్లు తెప్పించాడు; కంచినుండి పట్టుచీరలు, పట్టుపంచెలు తెప్పించి, అన్ని ఆలయాల్లోనూ దేవుళ్ళకు సమర్పించాలని నిశ్చయించాడు.

అన్నీ కార్లో సర్దుకుని బయల్దేరాడు మనవడితోకల్సి. "నాయనా! వివేక్ ! ఎంతో కాలంగా అనుకుంటూ ఉన్నానురా, నీ పుట్టినరోజునాడు మన ఊర్లో ఉన్న అన్ని దేవాలయాల్లోను అర్చన చేయించాలని. కానీ మీరేమో అక్కడెక్కడో ఉంటిరి! ఇన్నాళ్లకు నా కోరిక తీరుస్తున్నావు- సంతోషంగాఉందిరా ! ముందుగా మనం వెంకటరమణుని ఆలయానికి వెళ్ళి అర్చన చేయిద్దాం. ఆ తర్వాత మిగిలిన ఆలయాలకు వెళదాం.." అంటూ తమ ఊళ్ళో ఉన్న గుడుల విశేషాలు చెప్పసాగాడు సదానందం.
ఊళ్ళో జనాలందరూ రోడ్డుమీదే ఉన్నట్లున్నారు; కారు మెల్ల మెల్లగా పోతున్నది. చలి వణికిస్తూన్నది. ఉదయం పదిగంటలైనా ఇంకా మంచు పూర్తిగా వదలనే లేదు. అంతలో ఒక ముసలివాడెవరో కారుకు అడ్డం వచ్చినట్లుంది, డ్రైవరు అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. ముసలాయనకి చొక్కా లేదు.
చినిగిపోయిన పాత పంచె ఒకటి కట్టుకొని ఉన్నాడు. చలికి వణుకుతున్నాడు. "క్షమించండి బాబూ, చూసుకోలేదు" అంటూ రోడ్డు ఆవలికి నడిచి పోతున్నాడు.
అప్పుడు చూశాడు వివేక్. చాలా మంది ముసలివాళ్ళు, ముతకవాళ్ళు రోడ్డుమీద అక్కడక్కడా కూర్చొని ఉన్నారు- కొందరు ఏవేవో చిన్న చిన్న సామాన్లు అమ్ముతున్నారు. కొందరు ఊరికే అడుక్కుంటున్నారు. ఎవ్వరికీ ఒంటిమీద సరైన బట్టలు లేవు. చలికి అందరూ వణుకుతున్నారు.
అయినా ఎవరి పనిలో వాళ్ళున్నారు.
"తాతయ్యా, ఇక్కడ చాలామంది తాతలు ఉన్నట్లున్నారే, కానీ ఎవ్వరికీ చలి పుడుతున్నట్లు లేదు?" అడిగాడు వాడు, తాతయ్యని.
సదానందం అన్నాడు- "కాదురా, వాళ్లని చూసుకునేందుకు ఎవ్వరూ లేరు. అందునా ముసలివాళ్ళు కదా, బరువు పనులేవీ చేయలేరు. ఏదో ఇట్లా బ్రతుకుతున్నారంతే. వాళ్లకున్న కష్టాలముందు ఈ చలి ఏపాటి?" అని.
వివేక్ ఏమీ అనలేదు. కొద్దిసేపటికి "తాతగారూ! కారు ఆపించండి, ఓసారి" అని చెప్పడంతో డ్రైవర్ కారు ఆపాడు. వివేక్ గబగబా కారుదిగి, డిక్కీలో ఉన్న పండ్ల బుట్ట , కొత్త బట్టలు ఉంచిన సంచీ చేతపట్టుకొని వెనక్కి నడవటం మొదలు పెట్టాడు. వీధి ప్రక్కన ఉన్న ముసలి వాళ్లందరికీ ఆ కొత్తచీరలు, పంచెలు, బుట్టలోఉన్న పండ్లు పంచి ఇవ్వటం మొదలు పెట్టాడు!
సదానందం కారులోనే కూర్చొని మనవడిని చూస్తూ ఉండిపోయాడు.
అక్కడి ముసలివాళ్లంతా విస్తుపోతున్నారు; కంగారు పడుతున్నారు- "బాబూ ! తమరెవరు? ఇంత ఖరీదైన బట్టలు మాకు ఇస్తున్నారే, మీ పెద్దవాళ్లు కోపగించు-కుంటారేమో! మాతో పోట్లాడతారేమో! ఇంతకీ తమరెవరు బాబూ?" అని భయం భయంగా అడుగుతున్నారు వాళ్ళు.
"నేను సదానందంగారి మనవడిని. మా తాతగారు చాలా మంచివారు. మీకు ఇవన్నీ ఇచ్చినందుకు ఏమీ కోపగించుకోరు. దేవునికి చాలా బట్టలుంటాయి. ఆయనకు కావాలన-గానే ఇచ్చేవాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. 'అయినా వీళ్లంతా ఇక్కడ చలికి వణుకుతూ ఉంటే, నాకు మాత్రం కొత్త బట్టలు తెచ్చావేంటి?' అని దేవుడు నన్ను తిడతాడు- ఎందుకు, అట్లా అవ్వటం? ఇంద తీసుకోండి, ఈ తీపులన్నీ తినండి చక్కగా" అంటూ తను తెచ్చిన తీపులన్నిటినీ పూర్తిగా ముసలి-ముతకలకు పంచేశాడు వివేక్ .
అన్నీ పంచాక, ఖాళీ బుట్టలు-సంచులతో వచ్చి కార్లో కూర్చుని "తాతగారూ ! మీకు కోపం రాలేదు కదా, నన్ను క్షమిస్తారా ? మిమ్మల్ని అడక్కుండానే అన్నీ ఇట్లా పంచేశాను- పాపం వాళ్లని చూస్తే జాలి వేసింది మరి " అని అడిగాడు వివేక్.
అప్పటివరకూ మనవడు చేసిన పని గురించే ఆలోచిస్తున్న సదానందం సంతోషంగా నవ్వాడు- "నువ్వు చేసిన పని చాలా గొప్పదిరా! నాకు కోపం ఎందుకు వస్తుంది?! సంపదలు ఉన్నా, లేకున్నా మనం అందరం ఆ భగవంతుని బిడ్డలమే. అవసరంలో ఉన్న తన బిడ్డలకు సాయంగా ఇవన్నీ అందించినందుకు కరుణా-మయుడైన ఆ భగవంతుడు చాలా సంతోషించి ఉంటాడు; మనల్ని దీవిస్తాడు. నిజం! అయితే నాకు కాస్త చిన్నతనంగా ఉందిరా- '13 ఏళ్ళున్న నీకు తట్టిందే, ఈ విషయం- అది ఇన్నేళ్ళుగా నాకెందుకు తట్టలేదు?' అని సిగ్గుగా ఉంది.
పద, ఇక ఆ భగవంతుడిని దర్శిద్దాం. నీ మంచి మనసు ఇప్పుడు చేసిందే, అర్చన- అది ఈ మధ్యకాలంలో ఆయనకు చాలా సంతోషాన్నిచ్చిన కానుక అయి ఉంటుంది!" అంటూ కారును ముందుకు పోనిమ్మని చెప్పాడు సదానందం.
         కొత్తపల్లి పిల్లలకధలపుస్తకం తెలుగు మాసపత్రిక నవంబర్ 2012 లో ప్రచురితం.

అనంతుని అహంకారం


                              అనంతుని అహంకారం

                 పూర్వం ఒకప్పుడు ఈశ్వరపురం అనే గ్రామంలో అనంతుడనే మోతుబరి రైతు ఉండేవాడు. చిన్నతనంనుండీ తండ్రివద్ద మెలుగుతూ వ్యవసాయ పధ్ధతుల్లోమంచి మెలకువలూ , అనుభవం సంపాదించాడు .అందువల్లే తండ్రి ఇచ్చిపోయిన పది ఎకరాలనూ పాతికకు పెంచి , పండ్ల తోటలూ,వరి, పప్పుధాన్యాలతో పాటుగా కూరపాదులూ తృణధాన్యాలూ సాగుచేస్తూ మంచి రైతుగా గ్రామంలో గుర్తింపు పొందాడు.మంచి దిగుబడి పొందుతున్న అతడిని అందరూ  మెచ్చుకోడంతో  వాడిలో కాస్త గర్వం ,అతిశయం పెరగ సాగాయి. 

    గ్రామంలోని రైతులంతా రాత్రి భోజనాలయ్యాక గ్రామం నడిబొడ్డున ఉన్న రచ్చబండ వద్ద చేరేవారు, గ్రామపెద్దతో  తమసాధకబాధకాలు చెప్పు కునేవారు . ఆయన ఏదైనా పరిష్కారం సూచించేవాడు. ఒక రోజురాత్రి  అనంతుడు రచ్బబండవద్ద కెళ్ళే సరికి గ్రామపెద్దతో సహాఅంతా సునందుని ఓదార్చడం చూసి  " ఏమైంది ? " అని అడిగాడు.  
దానికి  దానయ్య అనే మరో రైతు " అనంతా! ఈరోజు సునందుని సంతలో మోటయ్య అనేటోకు వ్యాపారిమోసంచేశాడు." అనిచెప్పగానే,అనంతుడు నవ్వి " వ్యాపారం,వ్యవసాయం అంత సులువైనవి కావు, తెలివితేటలు , అనుభవం లేకుంటే ఎవరైనా సులువుగా మోసంచేస్తారు "అనడంతోగ్రామపెద్దతో సహా  అంతాఅనoతుని తొందరాపాటుకు నొచ్చుకున్నారు.
అసలేబాధలోఉన్నసునందుముఖంచిన్నబోడంకూడాఅంతా గమనించారు.గ్రామపెద్ద"కేవలంఅనుభవం తెలివితేటలూ మాత్రమే చాలవు అనంతా! ఒక్కోమారు ఎంత తెలివైనవారైనా మోసపోడం ఖాయం " అన్నాడు.
దానికిఅనంతుడు"నేనుమీమాటఅంగీకరించను.తెలివితేటలువుoటే ఎంతమోసాన్నైనా తప్పించుకో వచ్చు . చూడండి నేనెన్నడూ మోసపోలేదు సంతలో " అనడంతో , బాధలో ఉన్న సునందు " ఐతే నీవు చాలా తెలివైన వాడినంటావ్ ?" అని అడిగాడు. " ముమ్మాటికీ! నేనెన్నడూ ఎవరిచేతా మోస పో లేదు,  పోను కూడా ఎందుకంటే ప్రతిపనీ బాగా ఆలోచించి చేస్తాను గనుక " అని ధీమాగా చెప్పాడు అనంతుడు.
        దానికి సునందు " నీవు ఎప్పుడైనా ఎవరివల్లైనా మోసపోతే నేను 20 వేల వరహా లిస్తాను, నీవు మోసపోతే ఏంపoదెమోచెప్పు." అనగా , గ్రామపెద్ద కలుగజేసుకుని "ఊరంతటికీతెలివైనవాడినంటున్న అనంతుడు మోసపోతే సునందుకు 40 వేల వరహాలు ఇవ్వాల్సి ఉంటుంది .ఈపందెంమూడుమాసాల  వరకూ మాత్రమే! దీనికి మేమంతా సాక్ష్యం ఏమంటావు  అనంతా!నీకు సమ్మతమేనా!?" అన్నాడు సవాలుగా.   అనంతుడు " అలాగే నేను మోసపోవడమంటూ జరగదు, ఉత్త పుణ్యానికి సునందు మరో 20వేల వరహాలు పొగొట్టుకుంటాడనే నాబాధ" అన్నాడు వేళకోళంగా .

అసలు జరిగిందేమంటే సునందు చాలామంచి మనసున్నవాడు. మామిడి కాయలు అంతా ముందే దింపించి పొగబెట్టి పండించి సంతలో ముందుగానే టోకు ధరకు అమ్మి సొమ్ము చేసేసుకుంటారు. సునందు మాత్రం చెట్లకే పండ్లను ఉంచి పక్వానికి  వచ్చాక దింపించి అమ్ముతాడు , కొనితినేవారు ఆనందపడాలనీ ఆఆనందమేఅమ్మినవాడికీ పండించినవానికీ ఆశీర్వచనమని భావించేవాడు.         అందువల్ల ఊరివారంతా పండ్లను దింపించాక వారానికి తాను దింపించి అమ్మేవాడు.ఈ మారూ అలాగే పది మామిడి పండ్ల బండ్లతో వెళ్ళాడు సంతకు, దిగుబడి బాగా ఉండటాన మంచి రంగురుచిగల మేలు రకం పండ్లుగనుకమంచిరేటువస్తేతనపెళ్ళికిఎదిగినకూతురురుక్మిణికినగలుచేయించి ,శ్రావణమాసంలో వివాహంజరిపించాలని సునందు ఆలోచన.
       సంతకెళ్ళగానే ముందుగా మోటన్న కనిపించాడు. ప్రతిఏడాదీ తనవద్ద బేరంచేసే బయ్యన్న కోసం వెతికి ఎండెక్కిపోతున్నందున మోటన్నతోబేరం కుదుర్చుకున్నాడుసునందు.ఐతేమోటన్నమోసగాడు, సునందును సులువుగా మోసం చేసి తక్కువ వెలకే కొని ఎక్కువవెలకు తాను సంతలోని అంగళ్ళలో వేసుకోవచ్చని " సునందూ !నీవు మూడురోజులు ఆలస్యంగావచ్చావు ,ఈరోజుఅంతవెలలేదుఏంచేద్దాం చెప్పు , నీకోసమని వందకు 3వరహాలు తగ్గించి తీసుకుంటాను, లేదా నీవు రేపటి వరకూ ఆగు, రేపటి రేటు ఎక్కు వైతేఆరేటుకే కొంటాను " అని చెప్పగానే , సునందు " రేపటివరకూ ఎక్కడుంటాను, పళ్ళు బాగా మాగాయి, రేపటికి పాడౌతాయేమో!ఎలాగో తీసేసుకో,పొద్దుండగానే గ్రామానికి వెళతాను " అని తన పది బళ్ళ మామిడి పళ్ళూ మోటన్నఅడిగిన వెలకంటే మూడు వరహాలు తక్కువకు ఇచ్చేసి వచ్చాడు,       తాను ఆసించిన ధర రానందుకు చాలా బాధపడుతూ ఇల్లుచేరాడు.
            ఆసాయంకాలo సునందు బావమరది బంగారయ్య,బావగార్నీ,చెల్లెల్నితనచెల్లాయి పెళ్ళికి ఆహ్వానించను వస్తూ  ఓ బుట్టెడు మామిడి పళ్ళు తెచ్చాడు.సునందుమామిడిపళ్ళుచూసిఆశ్చర్యంగా  " బంగారూ ! ఇవినా తోటలో పళ్ళు ? నీకెక్కడివీ?'" అనగా బంగారయ్య" పిల్లలున్న ఇంటికివస్తూ ఉత్తి చేతులతో రాలేక సంతలో కొన్నాను బావా ! వంద 20 వరహాలు , చాలా బావున్నయ్ కదూ !" అనగానే సునందుకు తానెంత మోసపోయిందీ  అర్ధ మైంది.ఆవిషయమే ఆరోజు రచ్చబండవద్ద గ్రామస్తులందరితో మనస్సు విప్పి చెప్పుకున్నాడు సునందు.  
 ఇది జరిగిన మండలం రోజులకు అనంతుడు ఓరోజున ఉదయాన్నే తన గిత్తల గూడు బండిలో తోట ల్లోంచీ వెళుతుండగా గ్రామపెద్ద ఎదురై " ఏం అనంతూ ! ఎక్కడికో ప్రయాణoలాగుంది, కుటుంబంతో !" బండిలో అతడి భార్యా, పిల్లలూ ఉండటo చూసి ప్రశ్నించాడు." ఔను  !మామాతమ్ముడికొడుకు నామకరణానికి  వెళ్తున్నాం, పదిరోజులుమకాం " అన్నాడు బండి ఆపి.
" మరి ఇంటినిండా వరి బస్తాలు వేశావాయె ,  ఏంఫరవాలేదా? " 
" బాగానే జాగ్రత్తచేశాను, పాలేర్లను కాపలా ఉంచాను, మాఇంటి పెంపుడుకుక్కలు రోజంతా కాపలా కాస్తూ , చీమచిటుక్కు మన్నా చీల్చేస్తాయి. "
" మరి పప్పుధాన్యాలూ గాదెల్లో పెట్టావుకదా? "
వాటికీ ఏమీ ఫరవాలేదు, ఆగాదెలపైన  పేడ అలికించి మా ఆవుల్ని కట్టేశాను, మాపాలెగాళ్ళు వాటి ఆలనాపాలనా చూస్తారు.ఎవ్వరికీ ఆక్రింద గాదెలున్నట్లు తెలీదు."
" మరి మామిడిపళ్ళూ, తృణ ధాన్యాలూ అమ్మిన సొమ్ము చాలానే ఉండాలి జాగ్రత్త పరచావుగా?ఏదో పొలం బేరమాడుతున్నవాయె!"
 " దానికీ తగుజాగ్రత్త చేశానులే! సొమ్ముదాచిన బానను దేవుని మూలగదిలోచీ తీసి కూటి కుండల మధ్య దాచాను, ఏదొంగా తెల్సుకోలేడులే, వస్తానయ్యా !పొద్దెక్కే వేళకు ఊరు చేరాలి " అంటూ బండి సాగించాడు.
 పదిరోజులయ్యాక ఇల్లు చేరిన అనంతుడు భార్య , వంట చేయను కూటికుండలుసవరించగా అన్నీ ఓటు బోసి ఉన్నాయి ,వాటి అడుగున ఉంచిన సొమ్మున్నబాన కన్పించనే లేదు అనంతుకు ఎంత వెతికినా.
వాడికేదో అనుమానంవచ్చి ఆవులను కట్టేసిన చోట ఉన్న గాదెలను త్రవ్విచూడగాఅవీఖాళీగాఉండటం  చూసి బేజారెత్తింది అనంతుకు, వరిధాన్యం ఉంచిన బస్తాలు బస్తాలుగానే ఉన్నాయికానీ వాటిలో వరికి బదులు చెత్త చెదారం ఉంది. గుండెలు బాదుకుంటూ గ్రామపెద్ద వద్దకెళ్ళిచెప్పుకున్నాడు"మీరేన్యాయం  చేయాలి ఆరోజు ఊరెళుతున్నట్లు మీకే చెప్పాను , బహుశా ఇదిసునందుపనేఐఉంటుంది,నన్నుదెబ్బ తీయను ఈదొంగతనం చేయించి ఉంటాడు "  అనిచెప్పగా , గ్రామపెద్ద ఆరాత్రి అందరినీ పిలిపించి " ఈ అనంతు ఊరెళుతూ ఏవేవి ఎక్కడ దాచింది నాకుచెఫ్ఫాడు . తెలివైనవారుఇలా దాచిన ప్రదేశాలు చెప్తారా? ఇపుడు ఈ దొంగతనం, సునందు మీదవేయటం ఏంబావుంది? తోటల్లోఎంతోమంది పని చేస్తుంటారు, ఎవరైనా నీగుట్టులన్నీ వినిచేయవచ్చుకదా? నిజానికి సునందు పక్షం రోజులుగా తన బావమరది ఇంట జరిగే పెళ్ళికి వెళ్ళిఉన్నాడు. మోసపోకుండా ఉండను తెలివి ఒక్కటే చాలదు , అనుభవమూ చాలదు. ఒక్కో సమయంలో ఎంతెతెలివైన వారైనా మోసపోతారు.నీవేదానికి ఉదాహరణ.  నీసొమ్మoతా భద్రం గా నాయింట ఉంది వెళ్ళి తెచ్చు కోపో. ఎవ్వర్నీ తక్కువచేయటం తగదు." అని మందలించాడు. సిగ్గుతో తలదించుకున్నాడు అనంతుడు.-------
                        చందమామ ఆగస్టు 2012 సంచికలో ప్రచురితం .

వాసవుని వ్యాపారదక్షత


                         వాసవుని వ్యాపారదక్షత
    పురంధరుడు ,పరమేశుడు మంచి స్నేహితులు. ఇద్దరూ వ్యాపారoలోమంచి  దిట్టలు.ఒకరిది వస్త్ర వ్యాపారమైతే,మరొకరిది పచారీ దుకాణం. ఇద్దరూ కష్టపడి న్యాయంగా సంపాదించి ధనికులైనవారే. నెలకోసారిఒక్కోరిఇంట్లోకలిసితమవ్యాపారసాధకబాధకాలుచెప్పుకోడంవారికిఅలావాటు .ఆరోజునపరమేశుడుపురంధరునిఇంటికివచ్చాడు.వారిద్దరూఆరుబయటకూర్చునికబుర్లుచెప్పుకుంటుండగాఒకబిచ్చగాడువచ్చి"అయ్యా!ఉదయంనుండీఏమీతినలేదు ,ఏదైనాఉంటేకాస్త ఇప్పిస్తారాబాబూ!“ అని అడిగాడు.
పరమేశుడు కోపంగా" ఏమోయ్! కాలు కన్ను బాగున్నాయ్! ఇలా బిచ్చమెత్తుకోకపోతే ఏదైనాపని చేసుకోవచ్చుగా?" అన్నాడు.
" బాబయ్యా! ఊహతెల్సినప్పట్లుండీ అమ్మెవరో నాయనెవరో తెలీక ఇలా ఊళ్ళు పట్టుకు తిరుగు తున్నాను. ఇల్లావాకిలా ? నన్నునమ్మిపని ఇచ్చేదెవరు ?అందుకే ఇలా పిరికెడు మెతుకులకోసం ఇల్లిల్లూ తిరిగి చివాట్లుతింటున్నాను.ఆభగవంతునికీనామీదజాలిలేదు." అన్నాడు విచారంగా. వాడిని చూసిన పురంధరునికి జాలేసింది.
లోపలికి కేకేసి వాడికి కడుపునిండా అన్నం పెట్టించి " చూడు బాబూ! నీపేరేంటన్నావ్ అని అడిగాడు.
వాసవుడంటారుబాబయ్యా!” వినయంగా చెప్పాడు అతడు.
కండబలంఉన్నవాడివిగుండెబలంతోపనిచేసుకోవాలికానీఇలాబిచ్చమెత్తిఎంతకాలంబతుకుతావు
వాసవా ! కనపడని దేవుడిని, దయ్యాన్నీ తిట్టుకునేబదులు , నీమేధ ఉపయోగించి , స్వయం శక్తితో నీప్రయత్నం నీవు చేసి కష్టించి పని చేసుకోవచ్చుగా?" అన్నాడు .
" బాబయ్యా! నన్నునమ్మి మీరేమైనాపనిఇప్పిస్తే చేస్తాను " అన్నాడుఆకలితీర్చినందుకు కృతఙ్ఞతతో  .
" సరే నేను నీకొక బుట్టెడు చెట్టుకు పండిన మంచి మల్గోవా మామిడిపళ్ళు ఇప్పిస్తాను.నీవు వాటిని అమ్మి సొమ్ము జమచేయి. నియాయితీ నిరూపించుకుంటే నీకు నేను సాయంచేస్తాను." అని ఇంట్లోకి కేకేసి తనపాత బట్టలజత ఒకటి తెప్పించి , పనివారి చేత పండిన మామిడి పండ్లబుట్ట ఒకటి బయటికి తెప్పించాడు."చూడు వాసవా !నీవీచిరిగినబట్టలతోవెళితేఎవ్వరూపండ్లుకొనకపోవచ్చు.ఈబట్టలు
వేసుకునిపండ్లుఅమ్ముకురా!" అన్నాడువాసవుని తో పురంధరుడు.
" అయ్యా! ఈపoడు ఒక్కోటీ ఎంతధరపలుకుతుందో చెప్పండి " అని వినయంగా అడిగాడువాసవుడు.
వాడికున్న వ్యాపారమెలకువకు పురంధరునికి సంతోషంకలిగింది." చూడూ వాసవా !ఇవి మంచి రుచికరమైన పండ్లు, ఒక్కోటీ సంతలో ఐతే ఇరవై రూపాయల ధరపలుకుతుంది , నీవు ఇల్లిల్లూ తిరిగి అమ్ముతావు గనుక ఎంత ధరకు ఇవ్వవచ్చో నిర్ణయించుకో." అని చెప్పి పంపాడు.

వాడటు వెళ్ళగానే " నీ స్వభావం మార్చుకోనేలేదా పురంధరా! బిచ్చగాళ్ళను నమ్మవచ్చా! వాడాపళ్ళ బుట్టతో ఉడాయించకపోతే చూడు. హాయిగా మూడునాళ్ళు నీడనకూర్చుని. తింటాడు, ఆపైనవేరే ఊరెళ్ళి పోతాడు , బుట్టెడుపళ్ళు వృధాచేశావు." అన్నాడు పరమేశుడు.
" పోనీలే పరమేశా! మనమూ మొదట్లో చిన్న వ్యాపారoచేసుకున్నవాళ్ళమేగా! మనకా రోజున ఆరాఘవయ్యబాబు సాయం చేయ బట్టే మనం ఈరోజున ఇంతవారమయ్యాం , మనమూ మరొకరికి సాయంచేస్తేవానిబతుకూబాగుపడవచ్చు.లేదావాడికిఒకబుట్టెడుమామిడిపళ్ళుదానంచేసినపుణ్యం
నాకు దక్కకపోదు." అన్నాడు నిశ్చింతగా
" నిన్నుమార్చడం ఎవ్వరివల్లా కానిపని. " అన్నాడు స్నేహితుని ఏమీ అనలేక పరమేశo. అతడెవ్వరినీ సులువుగా నమ్మడు.
" సరిపద భోజనం చేసి కాస్త విశ్రమిద్దాం సాయంకాలం నేను కొత్తగా వేయించిన కొబ్బరితోట చూపుతాను ." అంటూ లేచాడు పురంధరుడు.
సాయంకాలం వారిరువురూ కొబ్బరితోటవైపు విహారంగా బయల్దేరారు." నీమామిడిపళ్ళ దాన ఫలం నీకు దక్కేట్లే ఉంది పురంధరా! " అని పరమేశం అంటుండగా , దూరం నుంచీ ఖాళీ బుట్టపట్టుకుని వాసవుడు రావటం ఇద్దరూ చూశారు. వాసవుడు దగ్గరికివచ్చి " అయ్యా! మీచేతిచలవేమో పండ్లు సులువుగానే అమ్ముడయ్యాయి.ఇదుగోండి పైకం ,మరికాస్త ఆలస్యమై ఉంటే మీరుదొరక్కపోదురేమో" అంటూ సొమ్ము పురంధరుని చేతికి ఇచ్చాడు
." ఒక్కోపండూ ఎంతకమ్మావేం?" ఆసక్తితో అడిగాడు పరమేశం.
" అయ్యా! ఐదుపళ్ళకు ఒకపండు ఉచితమని చెప్పి ఒక్కోటీ ముప్పై రూపాయలకుఅమ్మాను..బుట్టలో నూట ఇరై ఆరు పళ్ళున్నాయిబాబయ్యా! ఒక్కోటీ ఇరవైకి ఆమ్మితే రెండువేల ఐదువందల ఇరవై రూపాయలువచ్చేవి.నేనుఐదింటికిఒకటిఉచితంగాఇచ్చినందున 21 పళ్ళు ఉచితంగా ఇచ్చినా ఒక్కోటీ ముప్పై కు అమ్మటంవలనఆరువందలముప్పైరూపాయలు  అదనంగా వచ్చాయి. తీసుకోండిబాబూ!" అంటూ సొమ్ము పురంధరునికి ఇచ్చాడు.
పురంధరుడు సంతోషంగాచూశావా పరమేశా! చిన్న సహాయం అందితే ఎవరైనాతమతెలివిప్రదర్శించే అవకాశం వస్తుందని ఈసోమయ్య నిరూపించాడు.”
" వాసవా !! నీ నిజాయితీకి వ్యాపారదక్షతకు చాలాసంతోషంగాఉంది.ఇంత తెలివైనవాడివి చక్కగా వ్యాపారం చేసుకో! భిక్షమెత్తడం మానెయ్యి, సరే ఆరువందలముప్పైరూపాయలు నీవే, నీతెలివికి ,ఎండనపడి అమ్మినందుకూభత్యం  . రేపువచ్చి మరో రెండుబుట్టలుపట్టుకెళ్ళి అమ్ముకో, ఒకవారమయ్యాక పోగైన నీ డబ్బుతో స్వంతంగా ఏదైనా వ్యాపారం మొదలెట్టుకో. నీకుకావల్సినసాయం  నేను తప్పక చేస్తాను. నీకుమంచి వ్యాపారదక్షత ఉంది  .కష్ట పడితే ఫలితం తప్పక ఉంటుంది ,వాసవా !" అంటూ వాడిభుజంతట్టి పంపాడు .
                       చందమామ అక్టోబర్ 2012 సంచికలో ప్రచురితం.