Tuesday, 6 November 2012

అనంతుని అహంకారం


                              అనంతుని అహంకారం

                 పూర్వం ఒకప్పుడు ఈశ్వరపురం అనే గ్రామంలో అనంతుడనే మోతుబరి రైతు ఉండేవాడు. చిన్నతనంనుండీ తండ్రివద్ద మెలుగుతూ వ్యవసాయ పధ్ధతుల్లోమంచి మెలకువలూ , అనుభవం సంపాదించాడు .అందువల్లే తండ్రి ఇచ్చిపోయిన పది ఎకరాలనూ పాతికకు పెంచి , పండ్ల తోటలూ,వరి, పప్పుధాన్యాలతో పాటుగా కూరపాదులూ తృణధాన్యాలూ సాగుచేస్తూ మంచి రైతుగా గ్రామంలో గుర్తింపు పొందాడు.మంచి దిగుబడి పొందుతున్న అతడిని అందరూ  మెచ్చుకోడంతో  వాడిలో కాస్త గర్వం ,అతిశయం పెరగ సాగాయి. 

    గ్రామంలోని రైతులంతా రాత్రి భోజనాలయ్యాక గ్రామం నడిబొడ్డున ఉన్న రచ్చబండ వద్ద చేరేవారు, గ్రామపెద్దతో  తమసాధకబాధకాలు చెప్పు కునేవారు . ఆయన ఏదైనా పరిష్కారం సూచించేవాడు. ఒక రోజురాత్రి  అనంతుడు రచ్బబండవద్ద కెళ్ళే సరికి గ్రామపెద్దతో సహాఅంతా సునందుని ఓదార్చడం చూసి  " ఏమైంది ? " అని అడిగాడు.  
దానికి  దానయ్య అనే మరో రైతు " అనంతా! ఈరోజు సునందుని సంతలో మోటయ్య అనేటోకు వ్యాపారిమోసంచేశాడు." అనిచెప్పగానే,అనంతుడు నవ్వి " వ్యాపారం,వ్యవసాయం అంత సులువైనవి కావు, తెలివితేటలు , అనుభవం లేకుంటే ఎవరైనా సులువుగా మోసంచేస్తారు "అనడంతోగ్రామపెద్దతో సహా  అంతాఅనoతుని తొందరాపాటుకు నొచ్చుకున్నారు.
అసలేబాధలోఉన్నసునందుముఖంచిన్నబోడంకూడాఅంతా గమనించారు.గ్రామపెద్ద"కేవలంఅనుభవం తెలివితేటలూ మాత్రమే చాలవు అనంతా! ఒక్కోమారు ఎంత తెలివైనవారైనా మోసపోడం ఖాయం " అన్నాడు.
దానికిఅనంతుడు"నేనుమీమాటఅంగీకరించను.తెలివితేటలువుoటే ఎంతమోసాన్నైనా తప్పించుకో వచ్చు . చూడండి నేనెన్నడూ మోసపోలేదు సంతలో " అనడంతో , బాధలో ఉన్న సునందు " ఐతే నీవు చాలా తెలివైన వాడినంటావ్ ?" అని అడిగాడు. " ముమ్మాటికీ! నేనెన్నడూ ఎవరిచేతా మోస పో లేదు,  పోను కూడా ఎందుకంటే ప్రతిపనీ బాగా ఆలోచించి చేస్తాను గనుక " అని ధీమాగా చెప్పాడు అనంతుడు.
        దానికి సునందు " నీవు ఎప్పుడైనా ఎవరివల్లైనా మోసపోతే నేను 20 వేల వరహా లిస్తాను, నీవు మోసపోతే ఏంపoదెమోచెప్పు." అనగా , గ్రామపెద్ద కలుగజేసుకుని "ఊరంతటికీతెలివైనవాడినంటున్న అనంతుడు మోసపోతే సునందుకు 40 వేల వరహాలు ఇవ్వాల్సి ఉంటుంది .ఈపందెంమూడుమాసాల  వరకూ మాత్రమే! దీనికి మేమంతా సాక్ష్యం ఏమంటావు  అనంతా!నీకు సమ్మతమేనా!?" అన్నాడు సవాలుగా.   అనంతుడు " అలాగే నేను మోసపోవడమంటూ జరగదు, ఉత్త పుణ్యానికి సునందు మరో 20వేల వరహాలు పొగొట్టుకుంటాడనే నాబాధ" అన్నాడు వేళకోళంగా .

అసలు జరిగిందేమంటే సునందు చాలామంచి మనసున్నవాడు. మామిడి కాయలు అంతా ముందే దింపించి పొగబెట్టి పండించి సంతలో ముందుగానే టోకు ధరకు అమ్మి సొమ్ము చేసేసుకుంటారు. సునందు మాత్రం చెట్లకే పండ్లను ఉంచి పక్వానికి  వచ్చాక దింపించి అమ్ముతాడు , కొనితినేవారు ఆనందపడాలనీ ఆఆనందమేఅమ్మినవాడికీ పండించినవానికీ ఆశీర్వచనమని భావించేవాడు.         అందువల్ల ఊరివారంతా పండ్లను దింపించాక వారానికి తాను దింపించి అమ్మేవాడు.ఈ మారూ అలాగే పది మామిడి పండ్ల బండ్లతో వెళ్ళాడు సంతకు, దిగుబడి బాగా ఉండటాన మంచి రంగురుచిగల మేలు రకం పండ్లుగనుకమంచిరేటువస్తేతనపెళ్ళికిఎదిగినకూతురురుక్మిణికినగలుచేయించి ,శ్రావణమాసంలో వివాహంజరిపించాలని సునందు ఆలోచన.
       సంతకెళ్ళగానే ముందుగా మోటన్న కనిపించాడు. ప్రతిఏడాదీ తనవద్ద బేరంచేసే బయ్యన్న కోసం వెతికి ఎండెక్కిపోతున్నందున మోటన్నతోబేరం కుదుర్చుకున్నాడుసునందు.ఐతేమోటన్నమోసగాడు, సునందును సులువుగా మోసం చేసి తక్కువ వెలకే కొని ఎక్కువవెలకు తాను సంతలోని అంగళ్ళలో వేసుకోవచ్చని " సునందూ !నీవు మూడురోజులు ఆలస్యంగావచ్చావు ,ఈరోజుఅంతవెలలేదుఏంచేద్దాం చెప్పు , నీకోసమని వందకు 3వరహాలు తగ్గించి తీసుకుంటాను, లేదా నీవు రేపటి వరకూ ఆగు, రేపటి రేటు ఎక్కు వైతేఆరేటుకే కొంటాను " అని చెప్పగానే , సునందు " రేపటివరకూ ఎక్కడుంటాను, పళ్ళు బాగా మాగాయి, రేపటికి పాడౌతాయేమో!ఎలాగో తీసేసుకో,పొద్దుండగానే గ్రామానికి వెళతాను " అని తన పది బళ్ళ మామిడి పళ్ళూ మోటన్నఅడిగిన వెలకంటే మూడు వరహాలు తక్కువకు ఇచ్చేసి వచ్చాడు,       తాను ఆసించిన ధర రానందుకు చాలా బాధపడుతూ ఇల్లుచేరాడు.
            ఆసాయంకాలo సునందు బావమరది బంగారయ్య,బావగార్నీ,చెల్లెల్నితనచెల్లాయి పెళ్ళికి ఆహ్వానించను వస్తూ  ఓ బుట్టెడు మామిడి పళ్ళు తెచ్చాడు.సునందుమామిడిపళ్ళుచూసిఆశ్చర్యంగా  " బంగారూ ! ఇవినా తోటలో పళ్ళు ? నీకెక్కడివీ?'" అనగా బంగారయ్య" పిల్లలున్న ఇంటికివస్తూ ఉత్తి చేతులతో రాలేక సంతలో కొన్నాను బావా ! వంద 20 వరహాలు , చాలా బావున్నయ్ కదూ !" అనగానే సునందుకు తానెంత మోసపోయిందీ  అర్ధ మైంది.ఆవిషయమే ఆరోజు రచ్చబండవద్ద గ్రామస్తులందరితో మనస్సు విప్పి చెప్పుకున్నాడు సునందు.  
 ఇది జరిగిన మండలం రోజులకు అనంతుడు ఓరోజున ఉదయాన్నే తన గిత్తల గూడు బండిలో తోట ల్లోంచీ వెళుతుండగా గ్రామపెద్ద ఎదురై " ఏం అనంతూ ! ఎక్కడికో ప్రయాణoలాగుంది, కుటుంబంతో !" బండిలో అతడి భార్యా, పిల్లలూ ఉండటo చూసి ప్రశ్నించాడు." ఔను  !మామాతమ్ముడికొడుకు నామకరణానికి  వెళ్తున్నాం, పదిరోజులుమకాం " అన్నాడు బండి ఆపి.
" మరి ఇంటినిండా వరి బస్తాలు వేశావాయె ,  ఏంఫరవాలేదా? " 
" బాగానే జాగ్రత్తచేశాను, పాలేర్లను కాపలా ఉంచాను, మాఇంటి పెంపుడుకుక్కలు రోజంతా కాపలా కాస్తూ , చీమచిటుక్కు మన్నా చీల్చేస్తాయి. "
" మరి పప్పుధాన్యాలూ గాదెల్లో పెట్టావుకదా? "
వాటికీ ఏమీ ఫరవాలేదు, ఆగాదెలపైన  పేడ అలికించి మా ఆవుల్ని కట్టేశాను, మాపాలెగాళ్ళు వాటి ఆలనాపాలనా చూస్తారు.ఎవ్వరికీ ఆక్రింద గాదెలున్నట్లు తెలీదు."
" మరి మామిడిపళ్ళూ, తృణ ధాన్యాలూ అమ్మిన సొమ్ము చాలానే ఉండాలి జాగ్రత్త పరచావుగా?ఏదో పొలం బేరమాడుతున్నవాయె!"
 " దానికీ తగుజాగ్రత్త చేశానులే! సొమ్ముదాచిన బానను దేవుని మూలగదిలోచీ తీసి కూటి కుండల మధ్య దాచాను, ఏదొంగా తెల్సుకోలేడులే, వస్తానయ్యా !పొద్దెక్కే వేళకు ఊరు చేరాలి " అంటూ బండి సాగించాడు.
 పదిరోజులయ్యాక ఇల్లు చేరిన అనంతుడు భార్య , వంట చేయను కూటికుండలుసవరించగా అన్నీ ఓటు బోసి ఉన్నాయి ,వాటి అడుగున ఉంచిన సొమ్మున్నబాన కన్పించనే లేదు అనంతుకు ఎంత వెతికినా.
వాడికేదో అనుమానంవచ్చి ఆవులను కట్టేసిన చోట ఉన్న గాదెలను త్రవ్విచూడగాఅవీఖాళీగాఉండటం  చూసి బేజారెత్తింది అనంతుకు, వరిధాన్యం ఉంచిన బస్తాలు బస్తాలుగానే ఉన్నాయికానీ వాటిలో వరికి బదులు చెత్త చెదారం ఉంది. గుండెలు బాదుకుంటూ గ్రామపెద్ద వద్దకెళ్ళిచెప్పుకున్నాడు"మీరేన్యాయం  చేయాలి ఆరోజు ఊరెళుతున్నట్లు మీకే చెప్పాను , బహుశా ఇదిసునందుపనేఐఉంటుంది,నన్నుదెబ్బ తీయను ఈదొంగతనం చేయించి ఉంటాడు "  అనిచెప్పగా , గ్రామపెద్ద ఆరాత్రి అందరినీ పిలిపించి " ఈ అనంతు ఊరెళుతూ ఏవేవి ఎక్కడ దాచింది నాకుచెఫ్ఫాడు . తెలివైనవారుఇలా దాచిన ప్రదేశాలు చెప్తారా? ఇపుడు ఈ దొంగతనం, సునందు మీదవేయటం ఏంబావుంది? తోటల్లోఎంతోమంది పని చేస్తుంటారు, ఎవరైనా నీగుట్టులన్నీ వినిచేయవచ్చుకదా? నిజానికి సునందు పక్షం రోజులుగా తన బావమరది ఇంట జరిగే పెళ్ళికి వెళ్ళిఉన్నాడు. మోసపోకుండా ఉండను తెలివి ఒక్కటే చాలదు , అనుభవమూ చాలదు. ఒక్కో సమయంలో ఎంతెతెలివైన వారైనా మోసపోతారు.నీవేదానికి ఉదాహరణ.  నీసొమ్మoతా భద్రం గా నాయింట ఉంది వెళ్ళి తెచ్చు కోపో. ఎవ్వర్నీ తక్కువచేయటం తగదు." అని మందలించాడు. సిగ్గుతో తలదించుకున్నాడు అనంతుడు.-------
                        చందమామ ఆగస్టు 2012 సంచికలో ప్రచురితం .

2 comments:

  1. నాకు నచ్చింది ఈ కధ.

    ReplyDelete
    Replies
    1. చాలాసంతోషం ! నా కధ నచ్చినందుకు !

      Delete