Thursday, 23 July 2015

దృష్టి -సృష్టి



దృష్టి -సృష్టి

దృష్టి -సృష్టి  రచన–ఆదూరి.హైమవతి.

 

ఒక రోజున సాయం సమయంలో తులసీదాసు తాను వ్రాసిన ‘ తులసీ రామాయణం’ చదివి అర్ధం చెప్తుండగా , ఆయన చుట్టూ జనం కూర్చుని ఆరామాయణగాధను ఆలకిస్తున్నారు. ఆసమయంలో తులసీదాసు ” లంకా పట్టణం లోని అశోక వనంలో సీతమ్మ తల్లి విచారంగా అశోకవృక్షం క్రింద కూర్చుని దూరంగాఉన్నతటాకంలోని తెల్ల కలువలను చూస్తూ ., శ్రీరాముని స్మరించుకుంటూ , తన అవస్తకు చింతిస్తూ ఉంది ” అని పరవశంతో చెప్తుండగా పెద్దగాలి రివ్వున వీయసాగింది, అక్కడకూర్చున్న జనమంతా అది  ఏదో భీకర గాలీ వానా వచ్చేసూచనేమో అని భయపడసాగారు. ఇంతలో వాయుపుత్ర హనుమంతుడు అక్కడ దిగాడు.

” అయ్యా! తులసీదాసు గారూ!వందనం !మీ రామాయణ ప్రవచనం మధురంగాఉంది,నేను ఆకాశ మార్గాన వెళ్తూ వింటున్నాను,ఐతే తమరు ఒక్క చిన్న పొరపాటు చెప్తున్నారు,అందుకే నేను దిగివచ్చాను. ఆనాడు లంకా నగరంలోని అశోకవనంలో ఉన్నవి తెల్ల కలువలు కావు, ఎఱ్ఱ కలువలు ! తమరు అది సవరించి ప్రవచించండి ! తమ గ్రంధంలోనూ సవరించండి !” అని వినయంగా కోరాడు.

అక్కడి శ్రోతలంతా హనుమంతుని దర్శన భాగ్యం కలిగినందుకు మహదానంద పడసాగారు. తులసీదాసు ” రామ భక్త హనుమాన్  కు జయమగుగాక! హనుమత్ ప్రభూ! నేను నిరంతరం రామ నామం జపిస్తూ నాదైవం నా మనస్సులో స్పురింపజేసే ఆలోచనలనే ఈ రామాయణకావ్యంలో రచించాను. నాదేవుడు నాచే ఏతప్పూరాయించడు !” అని స్థిర చిత్తంతో , చిరునవ్వుతో చెప్పాడు .

దానికి హనుమ ” అయ్యా! తూలసీదాసుగారూ ! తమరు ఊహించి వ్రాస్తున్నారు,నేను స్వయంగా లంకా నగరాన్నీ, అశోక వనాన్నీ , తటాకంలోని  కలువలను దర్శించినవాడను, నేను ప్రత్యక్ష సాక్షిని . కనుక మీరు మరోలా భావించక మీ గ్రంధాన్ని సవరించాల్సిఉంది ” అని చెప్పాడు గంభీరకంఠంతో.

తులసీదాసు చిరునవ్వుతో ” హనుమా న్ జీ! స్వామీ ! నా ప్రభువు నాచే ఎన్నడూఒక్కతప్పైనా వ్రాయించడు, ఆనమ్మకం నాకుంది,అందువల్ల ఆచెఱువులోవి తెల్లకలువలేకానీ, ఎఱ్ఱకలువలు కానేకావు“  అని స్థిరంగా అన్నాడు .

ఇద్దరిమధ్యా వాగ్వివాదం పెరగసాగింది. అప్పుడు హనుమ “ఈ వాదన మనకెందుకు ? మనం వెళ్ళి సీతారాములను దర్శించి , ఆ సమయంలో ఆ కలువలను చూసిన ఆ తల్లినీ , అన్నివిషయాలూ ఆమె ద్వారా అలకించిన ఆ ప్రభువునూ అడిగి వాస్తవం తేల్చు కుందాం రండి ” అని కోరగా తులసీదాసు అంగీకరించాడు.ఇద్దరూబయల్దేరి వెళ్ళిశ్రీరాముని,సీతమ్మ తల్లిని కల్సి నమస్కరించి నిలిచారు.

వారు ఏమీచెప్పకుండానే శ్రీరాములవారు ” హనుమా! తులసీదాసు వ్రాసినది సత్యం !లంకానగరం లోని అశోకవనంలోని సరస్సులో ఉన్నవి తెల్లకలువలే! ” అన్నారు చిరునవ్వుతో.

” ప్రభూ ! నేను స్వయంగా చూశానుకదా! నాకళ్ళే నన్ను మోసంచేస్తాయా! అమ్మా!సీతమ్మతల్లీ! తమరు చెప్పండి కలువల రంగు ఎరుపా! తెలుపా!” అన్నాడు హనుమ చేతులు జోడించి.సీతమ్మవారు చిరునవ్వుతో శ్రీరాముని వంక చూసింది.’తమరేచెప్పమన్నట్లుగా .

శ్రీరాములవారు ” హనుమా! నీవు రావణుని పట్ల క్రోధంతో ఉండటాన , నీకళ్ళు సైతం ఎఱ్ఱబారి చూసినవన్నీ నీకు ఎఱ్ఱగానే కనిపించాయి, నిజానికి అవన్నీ తెల్లనివే! మన దృష్టి ఎట్టిదో సృష్టీ అట్టిదిగా ఉంటున్నది ” అని చెప్పారు.హనుమ తన సందేహం తీరటంతో  , తులసీదాసుతో కలసి, తిరుగు ప్రయాణ మయ్యాడు.

చూశారా!  మన దృష్టిని బట్టే మన కళ్ళు లోకాన్నిచూస్తాయి కనుక మనం నిరంతరం మన మనస్సునూ మంచిగా ఉంచుకుని చూస్తే లోకమంతా మంచిగానే కనిపిస్తుంటుంది.అలా చేయను ప్రయత్నిద్దామా!

ఒక్కడేగా !?-


ఒక్కడేగా !?-ఆదూరి.హైమవతి.[కథ] 

ఒక్కడేగా !?
ఒక్కడేగా !?
కిట్టిగాడు నిద్ర లేచేసరికి వాడిబామ్మతాత కనిపించక పోయే సరికి వాడికి తిక్కరేగింది. “ తాతా ! బామ్మా ! “అని పెద్దగా అరుస్తూ ఇల్లంతా తిరిగాడు. వంటగదిలో హడావిడిగా ఉన్నతల్లి వద్దకెళ్ళి” అమ్మా! బామ్మా,తాతా ఏరే?” అని అడిగాడు. 
” బయట తోటలో ఉన్నారేమో చూడు” అందివాడి అమ్మ .వాడుగబగబా తోటలో కెళ్ళి చూశాడు,అక్కడి సిమెంట్ బెంచి ఖాళీగా ఉంది. తిరిగి ఇంట్లోకి వచ్చి ఈమారు ” నాన్నా! బామ్మా తాతా ఏరీ?” అని అడిగాడు ” గడ్డం గీక్కుంటున్న వాళ్ళనాన్న తలతిప్పకుండానే ” పెరట్లో పూలుకోస్తున్నారేమో చూడరాదూ !” అన్నాడు. కిట్టిగాడు పెరట్లోకెళ్ళి అక్కడ గిన్నెలుతోముతున్న గంగమ్మను ,
” మాబామ్మా తాతా ఇక్కడగాని ఉన్నారా?” అని అడిగాడు .” లేరుబాబూ ! బయటికి గానీ వెళ్ళారేమో! ” అంది గంగమ్మ .
వాడితిక్క ఎక్కువై వీధిగుమ్మముందు అరచేతుల్లోముఖం పెట్టుకుని కూర్చున్నాడు, బామ్మతాతలకోసం ఎదురుచూస్తూ. కాస్త సేపటికి చేతులో పూజబుట్టతో వచ్చారు ఇద్దరూ.
వారు కినిపించగానే ఛెంగున గెంతి దగ్గరకెళ్ళి ” ఎక్కడకెళ్ళారు పొద్దుటే ?” ఆశ్చర్యంగా అడిగాడుకిట్టి.
” ఈరోజు’ గురుపూర్ణమి ‘కదరా ! అందుకని ఆలయానికి వెళ్ళివస్తున్నాం” అందిబామ్మ
“ అలాగేం ” అంటూ తాతచెయ్యిపట్టుకుని లోపలికి నడిచాడు కిట్టు. 
ఇంకో మారు మళ్ళీ బామ్మతాత లేవగామే కనిపించకపోడంతో ,’ఈరోజూ గుడికే వెళ్ళి ఉంటారని ‘ గుమ్మంలోనే కాపేశాడుకిట్టు. ” ఈరోజు ఏగుడికెళ్ళారు బామ్మా!” అని అడిగాడు వారురాగానే. 
” ఈరోజు వరలక్ష్మీ వ్రతంకదా ! అందుకని లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళాం” అందిబామ్మ .
మరో మారు బయటికెళ్ళివస్తున్న బామ్మతాతలతో ” ఈ రోజు ఏ ఆలయానికీ?” అన్నాడు.
” ఈ రోజున వినాయచవితిరా కిట్టూ ! అందుకని వినాయకుని గుడికి ” అందిబామ్మ.
మళ్ళీ ఇంకో మారు ఆలయం నుండీవస్తున్న వారిని కిట్టిగాడు” ఈరోజే ఆలయానికీ?” అన్నాడు , బామ్మ నవ్వుతూ ” దేవీనవరాత్రులురా కిట్టూ! అందుకే దుర్గాదేవి కోవెలకు ” అంది కుంకుమ వాడినుదుటపెడుతూ .
” బామ్మా! నాకో అనుమానం . మన దేవునిగదిలోనే దేవుడున్నడని నీవు పూజ చేస్తూ రోజుకోగుడి కి ఎందుకెళుతున్నావు? నీవునాకు రాత్రిపూట నిద్రపోయేప్పుడు రోజూకధలుచెప్తున్నావుగదా! ఓరోజునీవుచెప్పినకధ ……
ఒక ఊర్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. అతడిని ఆఫీస్ లోక్రిందివారు ” సార్ సార్” అనిపిలుస్తారు,అతడిపై అధికారులు ” మిస్టర్ ఎస్ పీ! ” అంటారు. ప్రజలు ” ఎస్ పీ సార్” అని, స్నేహితులు “ఏమోయ్ ! రావ్ ” అనీ , వాళ్ళ అమ్మనాన్న ” ఏరా!బాబూ ” అనీ , భార్య 
” ఏమండీ! ” అనీ , అన్నతమ్ములు , అక్కచెల్లెళ్ళూ ” అన్నా!” లేక ” ఒరే తమ్ముడూ ” అనీ , పిల్లలు ” నాన్నగారూ ” అనీ పిలుస్తారు.ఆఫీస్ కు యూనిఫాం వేసుకుంటాడు, ఇంట్లో పంచెకట్టుకుంటాడు, షికారుకు వేరేడ్రెస్ , నిద్రపోయేప్పుడు నైట్ డ్రెస్ , ప్రయాణాలకు వేరేడ్రెస్ ,కానీ ఏడ్రెస్ వేసుకున్నా , ఎవరెలా పిలిచినా అతడు ఒకే మనిషి. డ్రేస్ లూ , పిలిచే పధ్ధతులూ మారుతున్నాయికానీ మనిషి మారడంలేదు. భగవంతుడు ఒక్కడే రూపనామాలు మాత్రం వేరు , అందుకనే మనం దేవుని ఒకే రూపాన్ని ,ఒకే పేరున పూజిస్తే చాలు —‘ అనిచెప్పావుగదా ! మరి రోజుకోగుడికివెళుతున్నా రెందుకూ?” అని ఐదేళ్ళ కిట్టూగాడు అడిగినప్రశ్నకు బామ్మ తాత విస్తుపోయారు