Monday 8 July 2013

ఎవరి పనివారే!

చిన్నారి 

ఎవరి పనివారే!

apr -   Mon, 8 Jul 2013, IST
పూర్వ పళనివర్మ రాజ్యంలో రామన్న పాలెం అనే గ్రామం ఉండేది. ఆ ఊరి చెరువు చాలా పాతది అందులోనూ పెద్దది. వచ్చేది వర్షాకాలం కావడంతో చెరువు గండి పడుతుందని గ్రామస్తులంతా గ్రహించారు. ఊరి రచ్చబండ దగ్గర గ్రామపెద్దతో కలిసి ఈ విషయం చర్చించారు. చెరువును బాగు చేయాలని కోరుతూ రాజుకు ఒక విన్నపాన్ని పంపాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా రైతుల్లో చదువొచ్చిన రంగప్పచేత ఒక విన్నపాన్ని రాయించి, అందరూ వేలి ముద్రలు వేశారు. వినతి పత్రాన్ని తీసుకుని తహసీల్దారుకు అందజేశారు. పై అధికారులకు, రాజాస్థానానికి, చివరకు రాజుకు చేరింది.
మహారాజు పళనివర్మ ఆ వినతి పత్రాన్ని పూర్తిగా చదివి సమస్యను అర్థం చేసుకున్నారు. అంతేకాక ఆ చెరువును బాగు చేయడానికి ఎంత సమయం, డబ్బు అవసరము అవుతాయో అంచనా వేయమని మంత్రులను ఆదేశించాడు. ఆయన కింది స్థాయి అధికారులకు చెప్పగా, వారు తహసీల్దారుకు పురమాయించారు. ఆయన చెరువు చుట్టూతా కలియ తిరిగి ఎక్కడెక్కడ ప్రమాదముంది? ఏ ప్రాంతం బాగా దెబ్బతిన్నది, ఎంత డబ్బు, సమయం అవసరమవు తాయో తెలుపుతూ ఆయన ఒక నివేదికను సిద్ధం చేశారు. దానిని ఎప్పటిలాగే పై అధికారులకు, వారు రాజాస్థానా నికి,  అక్కడ నుంచి పళనివర్మ సముఖమునకు చేరింది. ఈ తతంగమంతా పూర్తయ్యేసరికి వేసవికాలం పోయి తొలకరి రానేవచ్చింది. వర్షాలు బాగా పడుతుండడంతో చెరువు నిండి పోయింది. ఇక మరోపెద్ద వర్షం వస్తే చెరువు కట్ట తెగిపోతుంది. అనుకోకుండా ఆ ఊళ్లో బలాదూర్‌గా తిరిగే వీరన్న ఆ చెరువును గమనించాడు.మరో వర్షం వస్తే ఊరే మునిగి పోతుందని గ్రహించిన వీరన్న తోటి సావాసగాళ్లను పలుగు, పార, గునవపం, తట్టా, బుట్టలూ తెమ్మని పురమాయించాడు. వారంతా కలిసి కొండరాళ్లను తెచ్చి గండి పడుతుందని భావించిన చోట అడ్డుగా వేశారు. అలుగుపారే ప్రాంతం వద్ద కాలువను లోతుగా తవ్వి ఆ మట్టిని రాళ్లమీద పోశారు. పూడుకుపోయిన కాలువను తవ్వి నీరు వేగంగా బయటకు పోయేందుకు ఏర్పాట్లు చేశారు. మిగిలిన చిన్నచిన్న మరమత్తులు చేసేసి హాయిగా ఇంటికి వెళ్లిపోయారు.
యువకులు చేసిన పని ఆనోట ఈనోట పడి చివరికి గ్రామపెద్దకు చేరింది. అదే సమయంలో ఒక రాచకార్యం నిమిత్తం అక్కడికి వచ్చిన పళినివర్మ యువకులు చేసిన పనిని మెచ్చుకున్నారు. అంతేకాక వారికి తన కొలువులో ఉద్యోగాలు కూడా ఇచ్చారు.
నీతి-ఎవరిపని వారు చేసుకుంటే కష్టనష్టాలే ఉండవు.
- ఆదూరి హైమావతి, చికాగో(అమెరికా).
ఆంధ్రప్రభ ఆదివారం[ 7/7/2013 ] ' చిన్నారి ' శీర్షికలో ప్రచురితం.