పిల్లలూ! నా చిన్నప్పుడు- అంటే నాకు ఆరేడు ఏళ్ళప్పుడన్న మాట (ఇప్పుడు నాకు 65!) మా అమ్మమ్మ సత్యాన్ని గురించి చెప్పిన ఈ కథ నాకింకా జ్ఞాపకం. సత్యం మానవులకే కాక, పశు-పక్ష్యాదులకు సైతం ఒక్కటేననీ, అసత్యం చెప్పిన వారికి దండనతప్పదనీ ఈ కథ వలన తెలుస్తుంది. అందుకే మీకు ఈ కథను 'కొత్తపల్లి 'ద్వారా చెప్పాలన్పించి, చెప్తున్నాను.
పూర్వం ఒక కొక్కిరమ్మ ముంతంత ఇల్లుకట్టుకొని, దాన్లో మూడు పుట్ల వడ్లు పోసుకుని, వడ్లమీద గుడ్లు పెట్టుకుని, గుడ్ల మీద తాను పడుకుంది. ఇంతలో ఒక ఏనుగు వచ్చి, "చలిగా ఉంది కొక్కెరమ్మా, నాక్కాస్త చోటిస్తావా?" అని అడిగింది, దానికి కొక్కెరమ్మ "ఏనుగన్నా! నేను ముంతంత ఇల్లు కట్టుకుని మూడు పుట్ల వడ్లు పోసుకుని, వడ్ల మీద గుడ్లు పెట్టుకుని, గుడ్ల మీద పడుకున్నా, నా వెనక చోటుంటే నువ్వు పడుకో" అంది.
"సరే" అని కొంగ వెనుక ఏనుగు పడుకున్నది.
ఇంకాస్త సేపటికి ఒక నక్క వచ్చింది- "కొక్కెరమ్మ కొక్కెరమ్మా! నాక్కాస్త చోటిస్తవా?" అని అడిగిందట అది. "నక్క బావా! నేను ముంతంత ఇల్లు కట్టుకొని మూడు పుట్ల వడ్లు పోసుకొని వడ్లమీద గుడ్లు పెట్టుకొని, గుడ్లమీద పడుకున్నా, నా వెనక చోటుంటే ఏనుగు పడుకుంది, ఏనుగు వెనక చోటుంటే నువ్వు పడుకో" అంది.
నక్క వచ్చి ఏనుగువెనుక పడుకుంది.
మరికొంత సేపటికి ఒక పిల్లి వచ్చింది- "కొక్కెరమ్మ కొక్కెరమ్మ ! నాక్కాస్త చోటిస్తవా?" అంది. కొక్కెరమ్మ చెప్పింది- "పిల్లిమావా! నేను ముంతంత ఇల్లుకట్టుకుని, మూడు పుట్ల వడ్లు పోసుకుని, వడ్ల మీద గుడ్లు పెట్టుకుని, గుడ్ల మీద పడుకున్నా, నా వెనక చోటుంటే ఏనుగు పడుకుంది, ఎనుగు వెనక చోటుంటే నక్క పడుకుంది, నక్కెనక చోటుంటే నువ్వు పడుకో!" అంది. పిల్లి కూడా పడుకుంది.
మరికొంత సేపటికి ఒక గుర్రం , ఒక తోడేలు వచ్చాయి. రెండూ కొక్కెరమ్మను అలాగే అడిగాయి. కొక్కెరమ్మ వాటికీ అలాగే చెప్పింది. రెండూ వచ్చి పడుకున్నాయ్.
మధ్య రాత్రి అయ్యే సరికి కొక్కెరమ్మకు పట పట మనే శబ్దం వినిపించింది.
"ఏంటా శబ్దం? ఎవరైనా నా గుడ్లుకానీ‌ తింటున్నారా?" అడిగింది కొక్కెరమ్మ నిద్రలోనే.
"లేదు కొక్కెరమ్మా! చలికి నా పళ్ళు పట పటమని కదులుతున్నాయి" అందట పిల్లి.
తెల్లారినాక చూసుకుంటే కొక్కెరమ్మ గుడ్లు లేనే లేవు!
కొక్కెరమ్మ విచారంతో "మీ అందరికీ నేను రాత్రి చోటిచ్చాను. అయినా మీలో ఎవరో నాగుడ్లు తినేశారు. ఎవరో చెప్పి తప్పు ఒప్పుకోండి మర్యాదగా" అంది.
"మేమెందుకు తింటాం కొక్కెరమ్మా! నువ్వెంత మంచిదానివో మాకు తెలీదా?" అన్నాయి అన్నీ.
"మీరంతా గుండ్లకమ్మ నదికి వచ్చి ఒక్కోరూ ఆ నదిలో మునిగి ప్రమాణం చేయండి. ఎవరైతే గుడ్లు తిన్నారో వారిని గుండ్లకమ్మే ముంచుతుంది"అందిట కొక్కెరమ్మ ఏడుస్తూ.
అన్నీ సరేనని నదిలో నిల్చుకొని కొక్కెరమ్మ చెప్పినట్లు పలికాయి: "కొక్కెరమ్మ గుడ్లంట, నేనంట తిన్ననంట, తిన్ననంటె ముంచు ముంచు గుండ్లకమ్మ-లేకుంటే తేలగొట్టు గుండ్లకమ్మ " అని మూడుమార్లు ప్రమాణం చేసి అన్నీ ఆ నది నీళ్లలో మునిగాయి.
అన్నీ నీళ్ళలోంచి బయటకి వచ్చాయి- కానీ పిల్లిమాత్రం రాలేదు: గుండ్లకమ్మలో కొట్టుకు పోయింది.
అప్పుడు మిగిలినవన్నీ "చూడు, కొక్కెరమ్మా! నువ్వేమో నీ ముంతంత ఇంట్లో చలి రాత్రిలో పడుకోను చోటిచ్చావు మాకు. కృతజ్ఞతలేని ఆ దొంగ పిల్లి నీ గుడ్లన్నీ తినేసింది. కానీ గుండ్లకమ్మ నది అసత్యానికి అన్యాయానికి తగిన శిక్షే విధించిందిలే, బాధపడకు "అని ఓదార్చాయి.
చూశారా పిల్లలూ! అన్యాయానికి, కృతఘ్నతకూ శిక్ష తప్పదు మరి! ఎప్పుడూ నీతి నిజాయితీలతో నడచుకుంటూ ఇతరులకు చేతనైన సాయం చేస్తుంటారు గదూ!


మార్చి 2012 కొత్తపల్లి పిల్లలమాసపత్రికలో ప్రచురితం.