బాలల భాగ్యవిధాత!
apr -
Tue, 13 Nov 2012, IST
పుట్టిన రోజు పండుగే అందరికీ, మరి
పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికీః అనే పాత సినిమా పాటలోని చరణం తొలి
ప్రధాని పండిత్ జవహర్‌లాల్ నెహ్రూకి వర్తించినంతగా మరి ఎవరికీ
వర్తించదేమో. ఆగర్భ శ్రీమంతుడైన జవహర్‌లాల్ నెహ్రూని సివిల్ సర్వీస్‌లోకి
పంపాలని ఆయన తండ్రి మోతీలాల్ నెహ్రూ ఆకాంక్షించారు. కాశ్మీర్‌కి చెందిన
మోతీలాల్ కుటుంబం కొన్ని తరాలక్రితం ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ వచ్చి
స్థిరపడ్డారు. మోతీలాల్ సుప్రసిద్ధ న్యాయవాది మాత్రమే కాక, జాతీయోద్యమంలో
చురుకైన పాత్ర వహించారు. జవహర్‌లాల్‌పై తండ్రి ప్రభావం పడింది.
కేంబ్రిడ్జిలో న్యాయశాస్త్ర పట్టా పొంది స్వదేశం తిరిగి వచ్చారు. అప్పటికే
జాతీయోద్యమం పూర్తి స్థాయి లో సాగుతోంది. దానికి ఆకర్షితుడైన నెహ్రూ
స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రవేశించారు. జాతీయోద్యమానికి సారథ్యం వహించిన
మహాత్మాగాంధీకి అత్యంత నమ్మకస్తునిగా త్వరలోనే గుర్తిం పు పొందారు.
ఉద్యమాలు, ఆందోళనలో పాల్గొన్నందుకు ఆయన తొమ్మిదేళ్ళు కారాగార శిక్షను
అనుభవించారు., జైలు నుంచి ఆయన తన కుమార్తె ఇందిరా ప్రియదర్శిని
(ఇందిరాగాంధీ)కి రాసిన 196 ఉత్తరాలు భారత దేశ ఆత్మను ప్రతిబింబింపజేశాయి.
జైలులో ఉన్నప్పుడే ఆయన గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, జీవిత చరిత్ర,
డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే గ్రంథాలను రాశారు. నెహ్రూ గొప్ప నాయకుడే కాక,
రచయిత కూడ. అఖిలభారత కాంగ్రెస్‌లో ఆయన కీలక పాత్ర వహించారు. లాహోర్
కాంగ్రెస్ సమావేశాలకు నేతృత్వం వహించారు. 1936, 1937, 1946లలో అఖిల భారత
కాంగ్రెస్‌కి అధ్యక్షునిగా వ్యవహరించారు. స్వాతంత్య్రోద్యమంలో మహాత్మా
గాంధీ తరువాత ద్వితీయ శ్రేణి నాయకునిగా గుర్తింపు పొందారు. గాంధీకి అత్యంత
విశ్వసనీయునిగా ఉండటం వల్లే, స్వాతంత్య్రానంతరం సహజంగా ప్రధానమంత్రి పదవి
ఆయనకే దక్కింది. ఆయన భార్య కమలా నెహ్రూ కూడా స్వాతంత్య్రోద్యమంలో
పాల్గొన్నారు. అయితే, చిన్న వయస్సులోనే ఆమె అనారోగ్యం కారణంగా కన్నుమూశారు.
అప్పటి నుంచి నెహ్రూ యోగక్షేమాలను ఆయన కుమార్తె ఇందిరాప్రియదర్శినియే
చూస్తూ వచ్చారు. దేశ విభజనకు దారి తీసిన పరిస్థితులు, ఆందోళనలతో నెహ్రూ
తీవ్రంగా కలత చెందారు. తొలి ప్రధానిగా ప్రమాణం చేసిన తరువాత ఆయన
జాతినుద్దేశించి చేసిన ప్రసంగం ఎటెస్ట్ విత్ డెస్టినీగా ప్రసిద్ధమైంది.
హిందూ ముస్లిం ఐక్యత కోసం నెహ్రూ తొలి విద్యా మంత్రి మౌలానా అబ్దుల్‌కలామ్
ఆజాద్‌తోనూ, ఇతర ముస్లిం నాయకులతోనూ కలిసి పర్యటనలు జరిపారు. స్వతంత్ర
భారత తొలి ప్రధానిగా ఆయన ప్రభుత్వ రంగ సంస్థలను అభివృద్ధి చేశారు.
నీటిపారుదల ప్రాజెక్టులను దేవాలయాలుగా ఆయన పరిగణించేవారు. ఆయన అందించిన
సహకారంతోనే భాక్రానంగల్, నాగార్జున సాగర్ వంటి భారీ ప్రాజెక్టులు
వెలిశాయి. నవరత్నాలుగా అభివర్ణితమైన భారీ పరిశ్రమలను ప్రభుత్వరంగంలో
నెలకొల్పింది ఆయనే. స్వాతంత్య్రోద్యమంలో మహాత్మునికి కుడిభుజంగా, నవభారత
నిర్మాతగా పండిత్ నెహ్రూ గణుతికెక్కారు. దేశాభివృద్ధి కోసం పంచవర్ష
ప్రణాళికలను ప్రవేశపెట్టింది ఆయనే. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు సమానంగా
అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. మన దేశానికి మిశ్రమ ఆర్థిక వ్యవస్థే
అనుకూలమైనదని ఆయన పదే పదే స్పష్టం చేస్తూ ఉండేవారు. అందుకు అనుగుణంగానే
ప్రణాళికలను రూపొందించి అమలు జేశారు. దేశంలో నిరక్షరాస్యతను
నిర్మూలించేందుకు ప్రజలందరూ విద్యావంతులయ్యేందుకు తగిన ప్రణాళికలను ఆయన
అమలు జేశారు. అంతర్జాతీయ రంగంలో కూడా నెహ్రూ ఎంతో పేరు ప్రతిష్ఠలను
సంపాదించారు. అమెరికా, రష్యాలను సమాన దూరంలో ఉంచుతూ మూడవ ప్రపంచ దేశాలన్నీ
కలిసి అలీన ఉద్యమం(నామ్)లో భాగస్వామ్యం కావాలని మొదటిగా పిలుపు ఇచ్చిందీ,
నామ్‌కి పునాదులు వేసిందీ ఆయనే. పొరుగు దేశాలతో శాంతిసామరస్యాలతో
మెలిగేందుకు ఆయన పంచశీల విధానాన్ని రూపొందించి అమలు జేశారు. పంచశీల విధానం
నేటి పరిస్థితుల్లోనూ అనుసరణీయమైనదే. ఆ రోజుల్లో ఆయన మాట అందరికీ
శిరోధార్యంగా ఉండేది. అయినప్పటికీ, తన అభిప్రాయం కన్నా మెజారిటీ
నిర్ణయాన్నే గౌరవించేవారు. అందుకే ఆయనను ఇప్పటికీ సాటిలేని
ప్రజాస్వామ్యవాదిగా అంతా కీర్తిస్తూ ఉంటారు.
-ఆదూరి హైమవతి
ఆంధ్రప్రభ దినపత్రికలో నవంబర్ 13న[ నవంబర్ 14జవహర్ లాల్ నెహ్రూ జయంతి] సందర్భంగా ప్రచురితం.
హలో సార్!నమస్కారం !
ReplyDeleteనిరభ్యంతరంగా నాబ్లాగ్ తెలుగుబ్లాగ్స్ లో ఉంచండి, తెలుగువారంతా కలసినచోట ఉండి పరస్పరం ఆలోచనలు , పంచుకోడమంత అదృష్టం ఏముందండీ!
ఆదూరి.హైమవతి.