Monday, 10 December 2012

మతాబుల మతలబు.


  మతాబుల మతలబు.
     మాధవయ్య గుమ్మంలో అడుగుపెట్టగానే చేతన్, చిన్మయ్ వచ్చి "చూడండి తాతగారూ !  మాస్నేహితులంతా  బోల్డుబోల్డు ,మతాబులు, చిచ్చుబుడ్లు , టపాసులు కొనుక్కుంటే నాన్న ఈ ఏడూ ఏమీ కొనరుట! , ఇప్పటివరకూ మేం చిన్నవాళ్ళమని కేవలం కాకర పువ్వొత్తులుమాత్రమే కొనేవారు, ఇప్పుడు పెద్దయ్యాం , పదేళ్ళొచ్చాయ్ , మీరన్నాచెప్పరా ! తాతగారూ ! " అంటూ ఆయన కాళ్ళు చుట్టేసుకున్నారు.
చేతన్, చిన్మయ్ ల అమ్మఅనసూయమ్మ"ఉండండర్రా ! తాతగారిని లోపలికి రానివ్వండి, మీ పితూరీలు గుమ్మంలోనే మొదలెట్టేశారా?"అంటూ వారిని వారించింది.
       మాధవయ్య వారిద్దరినీ లోనికి తీసుకెళ్ళి " మీకు డబ్బులతో కొనక్కరలేని ఢాం
టపాసులూ , అంటించ కుండానే పూలు చిమ్మే చిచ్చుబుడ్లూ ,వెలిగించకుండా నే వెలిగి పోయే వెండితీగలూ, ఇంకాచాలాచాలా   మీరుమనసుపడేఎన్నోమతాబులుచూపుతాను  సరా !"అనివారికి ,పల్లెనుండీవాళ్ళబామ్మస్వయంగాచేసి  పంపినదీపావళిమీఠాయిలు   అందించాడు. పిల్లలిద్దరూ మిఠాయిలు  చేతికి అందగానే అన్నీమరచి అవి తినడంలో పడ్డారు.
       " అమ్మా! అనసూయా! ముందుగా అనుకున్నట్లే పిల్లలిద్దరినీ నా వెంట దీపావళికి తీసుకెళ్ళనే వచ్చాను, మరునాడే తెచ్చి దింపుతాను, " అనిచెప్పి ఆమె ముందుగానే సర్దిఉంచినవారిబట్టలసంచీతో  ఆయనకార్లోపిల్లలతోబయల్దేరారు.అమ్మకుచేతులూపుతూ  పిల్లలు సరదాగా  తాత తోకార్లో కూర్చున్నారు. కారు సాగగానే " తాతగారూ ! వెలిగించకుండానే వెలిగే వెండితీగలూ.. .. " అనిమొదలెట్టిన పిల్లలతో,
 " ఆగండాగండి ! అంత తొందరైతే ఎలా? ఆపనిమీదే ఉన్నాగా..ముందుగా మీకోకధ చెప్పనా ?" అని మాధవయ్య అనగానే పిల్లలిద్దరూ
" ఓ కధంటే మాకెంతో ఇష్టం చెప్పండి తాతగారూ ! "  అనిసరదా పడ్డారు.
" అనగనగా ఒకగ్రామంలో మీలాంటి పిల్లడొకడు సూర్యం అని ఉండేవాడు.వాడికి మీలా దీపావళి   పండు  గంటే   మహా  సరదా.   టపాసులు  కాల్చను ఎంతో ఇష్టపడేవాడు  .
.వాళ్ళనాన్నను టపాసులుకొనమని మహా గోలపెట్టేవాడు.
    సూర్యం నాన్న " టపాసులకు ధనం వృధాచేయరాదనీ ఆధనంతో ఎవరికైనా పేదలకు సాయం చేయాలనీ "చెప్పేవాడు ,టపాసులు కాల్చేప్పుడు చాలాప్రమాదాలు జరుగు తాయనీ అందు వలన టపాసులు కాల్చేప్పుడు పెద్దవారు దగ్గరుండాలనీ కూడ చెప్పే వాడు,  ఎందుకంటే ముఖ్యంగాపల్లెల్లో అన్నీ పూరిళ్ళూ ఉండేవి ఆరోజుల్లో . అసలు పండగంటే ఏందో టపాసులు ఎందుకు కాలుస్తారో మీకు తెలుసా?" అని అడిగినతాతతో " పండగంటే ...పండగే ! టపాసులు కాలిస్తే సరదాగా ఉంటుంది. మొన్న ప్రపంచకప్పు గెలిచి నందుకు అందరూ టపాసులు కాల్చడం మేము టివిలో చూశాం. ఎన్నికలు జరిగి నపుడు గెలిచిన వారు టపాసుకుకాల్చడమూ టీ.వి లోనే చూశాం  .సంతోషం కలిగితే టపాసులు కాల్చరా ఏం?" అన్నారు చేతన్, చిన్మయ్ .    
       "మరి  దీపావళికి ఎందుకు టపాసులు కాలుస్తారో తెలుసా?"

" అదేమో  అందరూ కాలుస్తారు గనుక మేమూ కాల్చాలని అనుకుంటున్నాం . ఇప్పటి దాకా మానాన్న ఎప్పుడూ టపాసులు కొననేలేదు.ఎంతసేపూ అమ్మ టివిలో చూపడం తప్ప.మానేస్తగాళ్ళంతా మేము వెయ్యి రూపాయలకు  కాల్చాం,అంటే మరొకరు మేము మూడు వేలకు కాల్చాం అంటారు, పోలీసు అంకుల్ కొడుకైతే మేము పదివేలకు కాల్చాం  అంటాడు."

          " సరే ! అసలు టపాసులు ఎందుకు కాల్చాలో ముందు తెల్సుకోండి , పూర్వం నరకాసురుడనే రాకాసి , దేవుని ప్రార్ధించి, తల్లి చేతులోతప్ప చావులేని   వరాలుపొంది , ఆవర గర్వంతో విఱ్ఱవీగి అందరినీ బాధించేవాడు, అంతా వెళ్ళి విష్ణుమూర్తిని అర్ధించగా, ఆయన  వారికి  అభయం   ఇచ్చి  ,కృష్ణునిగా సత్యభామతో కలసి వెళ్ళిఆనరకాసురుని  
సత్యభామచేత  వధింపచేస్తాడు . ఎందుకంటే ఆమె భూదేవి అవతారం ,నరకాసురుని తల్లి  భూదేవి, అది అతడికి తెలీదు.ప్రజలంతా అప్పటి వరకూ ఆనరకాసురుని భయంతో ఇళ్ళలో దీపాలు సైతం పెట్టుకోక చీకటి ఇళ్ళలో ఉండేవారట, నరకాసురుని మరణం తర్వాత  ప్రజలంతా ఆనందంగా ఇళ్ళలోనూ, ఇళ్ళ ముందు దీపాలు వెలిగించుకుని టపాసులు మతాబులు కాల్చుకున్నారుట, ఇంతేకాక అలాంటి వాటిలో వాడే సురేకారం వంటి రసాయనాల వలన ఈఋతువులో సాధరణంగా వచ్చేక్రిమికీటకాదులునశించడo తో  వాటివలన వచ్చే వ్యాధులను అరికట్ట వచ్చు. ఐతే ఈటపాసుల వలన వీలైనంత వరకూ  వాతావరణం దెబ్బ తినకుండా చూడటం మనకర్తవ్యం.మీకింకోవిషయం తెలుసా? వేపనూనెకు ఆముదం, ఆవనూనెకలిపి వత్తివేసి దీపాలు వెలిగిస్తే అసలు దోమలేరావు మరి .ఇంకా ఎండువేపాకు ,ఆవాలు, ఆవ ఆకులు కలిపిమంటవేస్తే ఆపొగకు దోమలు పారిపోతాయి. "
" బావుంది తాతగారూ ! మాకు  తెలీనివిఎ న్నో చెప్పారు. మరైతే మానాన్నఎందుకని టపాసులు  , మతాబులు కొనను ఇష్టపడటం  లేదో మీరు చెప్పనే లేదు".

" ఇదో అక్కడికే వస్తున్నా.. ఇందాక ఒక అబ్బాయి సూర్యం గురించిన కధ మొదలెట్టానా,  అతడూ మీలా మతాబులు, టపాసులు కాల్చను ఉత్సాహపడేవాడు .ఓమారే మైందంటే వాడు వాళ్ళనాన్నకు తెలీకుండా  స్నేహితుడు వాసు ఇంట్లో మతాబులు చుట్టను బొగ్గు పొడి,  సూరేకరం , గంధకం ఇంకా కొన్ని రసాయనాలు తెచ్చి రహస్యంగా పని మొదలె ట్టారు. అవి  చుట్టను కాయితం అవసరమై వాళ్ళు మరునాటికిఆపనివాయిదావేసుకుని అవన్నీ దాచి వచ్చారు. రోజురాత్రి సూర్యం  పక్కింటి వారు పట్నం నుండీ తెచ్చిన అవ్వాయి చువ్వాయిలు  కాలుస్తున్నపుడు ఒకటివెళ్ళి పక్కనున్న వాడి స్నేహితుడు వాసు  ఇంటి మీదపడటం తో , ఆఇంట్లో వీళ్ళుదాచి ఉంచిన రసాయనాలు ఉండటo అది పూరి ఇల్లుకావడoతో అంటుకుని కళ్ళులేనిముసలి 70ఏళ్ళ  వాసు  తాత బయటి కిరాలేక చనిపోయాడు.అప్పటినుండీ సూర్యానికి టపాసులుకాల్చేదీపావళి అంటేభయం,  అంతేకాక  తమ   తెలివితక్కువ  పని  వలన  వాసు  తాత మరణించాడనే పాప భీతితో బాధ   పడుతుంటాడు.  వాసు సైతం ఆనాటి నుండీ సూర్యం లా ఈ టపాసుల పండుగ ను మానే శాడు.ఆఇద్దరికి మాత్రంమే తాము చేసిన పని తెలుసు., పెద్దలకు తెలీకుండా చేయటం ఎంతప్రమాదమో అర్ధమై ఆనాటి నుండీ అల్లరిచిల్లరి తనoమానేసి చక్కగా చదువు కోసాగారు.తర్వాతకొన్నాళ్ళకు వాసు మనస్సులో దాచుకోలేక తన తండ్రితో చెప్పి ఏడ్చాడు.వాసుతండ్రి అతడిని క్షమించాడు , నిజంచెప్పినందుకు. ఆపైవారిద్దరూ ఎప్పుడూ దీపావళి మతాబులు కాల్చనే లేదు. ఆవాసే మీ నాన్నవాసుదేవరావని తెలివైన మీరీపాటికి గ్రహించారను కుంటాను.. మీకిపుడు మతాబుల వలన జరిగే ప్రమాదం అర్ధమైందను కుంటాను."  ఇలావారు మాట్లాడు తుండగా కారు ఒక మురికి కాలువ వద్దకు రాగానే " గోపీ !  కారుఆపు " అని మాధవయ్య కారుదిగి , పిల్లలిద్దరినీ దింపి , ఒక చెట్టుక్రిందకు చేరి "నరసింహం  ! నారాయణీ  ! రండి, వారందరినీ తీసుకు రండి  ! " అని కేక వేయ గానే 60ఏళ్ళ నరసిం హం " వస్తున్నానయ్యా" అంటు 30 మంది చేతన్ , చిన్మయ్ ల వయస్సువారిని తీసుకుని వచ్చాడు.పిల్లలిద్ద రూ వారిని పరికించి  చూశారు .  నిక్కర్లున్నవారికి చొక్కాలు లేవు, చొక్కలున్నవారికి నిక్కర్లులేవు. ఆడపిల్లలు  సైతం చిరిగిన గౌన్లతో చింపిరిజుట్టుతో విచారంగా ఉన్నారు. వారిని చూసి, పిల్లలిద్దరూ తమ బట్టల వంక చూసుకునిముఖముఖాలుచూసుకున్నారు.ప్రతిపండుక్కీ తమస్నేహితులతో పోల్చుకుని ఇంకా ఖరీదైన బట్టలు కొన్లేదని అమ్మతో జగడమాడటం  గుర్తువచ్చి వారికి సిగ్గేసింది.
        మాధవయ్య కారులోని సంచీ లన్నీ గోపీ  దింపగా , వాటిలోంచీ కొత్త చొక్కాలూ నిక్కర్లూగౌన్లూ ,పరికిణీలూ,తీసి  పిల్లల చేత   వారందరికీ  ఇప్పించి ,అవి  వేసుకోడoలో 
నరసింహం, నారాయణి , గోపిలతోపాటుగా వారికి సాయంచేస్తూ,అవన్నీవారు ధరించాక ,  అందరికీ తలనూనెలు రాయించి దువ్వించి వారిని వరుసల్లో నిలిపి చాలాఫోటోలు తీసి, అందరికీ మిఠాయిలూ, పండ్లూ పంచగా అవి తింటున్న వారి వెలిగే ముఖాలు చూపి ,
 " చేతన్, చిన్మయ్  చూడండి! ఇవిగో వెలిగించకుండానే వెలిగే వెండితీగలూ , మండించ కుండానే మండే మతాబులూ ,కాల్చకుండానే కాలే కాకరపువ్వొత్తులూ ,పూలు చిమ్మే చిచ్చుబుడ్లూ చూశారా ? మీకు నచ్చాయా ?" అని అడిగిన తాత  చేతులు పట్టుకుని
" తాతగారూ! ఇహ మేమెప్పుడూ ప్రతి పండుక్కీ కొత్తబట్టలూ, దీపావళికి మతాబులూ అడగనే అడగం , అమ్మ నాన్నలను  ఇబ్బందిపెట్టం ,ఆడబ్బంతా మా'కిడ్డి 'బ్యాంకు ల్లో  దాచి ఇక్కడి ఈ మతాబులూ, కాకరపువ్వొత్తులే చూస్తాం సరా ! చాలాకృతఙ్ఞతలు తాతగారూ ! మాకు మంచి మతాబులు చూపినందుకు " అన్నారు ఆనందంగా. 
     ************2011 చందమామలో ప్రచురితం [ నెలగుర్తులేదు] *****************

No comments:

Post a Comment