Monday 10 December 2012

ఒకే శ్రోత

                   ఒకే  శ్రోత
        ఒక మారు ఒక పండితుడు కంచిలోని శంకరాచార్యులవారి వద్దకు వెళ్ళి , భక్తి తో నమస్కరించి ,
" స్వామీ ! నేను గొప్ప పండితుడ్ని.భగవద్గీత ప్రవచనం చేయడంలో పేరు పొందిన వాడిని.ఇంతవరకూ వేయి ప్రవచనాలు చేశాను . తమరు అనుగ్రహిస్తే ఈ శంకర మఠం లో  భాగవద్గీత ప్రవచనం పద్ధెనిమిది రోజులపాటు చేయాలని సంకల్పించి వచ్చాను.అనుగ్ర హించగలరు." అని విన్నవించుకున్నాడు.  
  ఆచార్యులు చిరునవ్వుతో " దాందేముంది తప్పక ప్రవచించు ,నేను ఒక పక్షంపాటు యాత్రలకు వెళ్ళవలసి ఉంది.నీవు నిర్విఘ్నంగా నీపని కానీ." అని చెప్పి ఆచార్యులు మఠం విడచి యాత్రలకై బయల్దేరారు.

 మన పండితుడు ఆరోజున మహదానందంగా భగవద్గీత ప్రవచనం మొదలుపెట్టారు. పద్దెనిమిది రోజులూ ఇట్టే గడచిపోయాయి. ఆచార్యులవారు యాత్రలు ముగించుకుని వచ్చారు.పండితుడు వెళ్ళి ఆచార్యుల పాదాలకు నమస్కరించగా " ఏం ! నాయనా! నీ భగవద్గీత ప్రవచనం నిర్విఘ్నంగా సాగిందికదా! ఏ ఇబ్బందీ కలుగ లేదు కదా!నేను సమయానికి లేకుండా వెళ్ళవలసి వచ్చింది నాయనా! " అని పలుకరించారు.

" స్వామీ మొదటిరోజు శ్రోతలు బాగానే వచ్చారు.క్రమంగాతగ్గి చివరకు ఒక్కరుమాత్రమే మిగిలారు స్వామీ ! నాశ్రమంతా వృధా ఐంది ,అదే నాబాధ !" అని చెప్పాగా , ఆచార్యులవారు " నాయనా ! శ్రీకృష్ణ భగవానులవారు గీత బోధించినపుడు విన్నది అర్జునుడు ఒక్కడేకదా!నీలా ఆయన బాధపడినట్లు లేదే!" అన్నారు . పండితుడి అహంకారం వదలి తలదించుకున్నాడు,ఆచార్యులవద్ద తాను మహా పండితుడినని చెప్పుకున్నoదుకు  
              విద్యాగర్వం మహాచెడ్డదిసుమా!
2011 చంద్రబాలలో ప్రచురితం[ నెల గుర్తులేదు]

No comments:

Post a Comment