Saturday, 6 April 2019

పీనాసి కావమ్మ.


సామెత- పిల్లికి బిచ్చం పెట్టనివాడు పిలిచి పిల్లనిస్తాడా!  

                 కధ పేరు. పీనాసి కావమ్మ.


"తాతగారండీ!"అంటూ అతిమర్యాదగా వచ్చిన మనవడ్ని చూసి
"ఏరా! అంతమర్యాద !చెప్పు ఏం కావాలో?"అన్నాడు తాత.
"తాతగారూ ! పీనాసితనం అంటే ఏంటండీ!"
"అంటేఎవ్వరికీ ఏమీ ఇవ్వకుండా ఉన్నదంతా దాచుకునే స్వభావం. వారు తినరూ మరొకరికి పెట్టరు. మైజర్ అన్నమాట. లోభి అనికూడా అంటారు."
"తాతగారూ ! దానిమీద ఒక కధ చెప్పరూ!"
"అలాగే జాగ్రత్తగా విను. ఉన్నదంతా ఇవ్వడం త్యాగం. కొంత ఉంచు కుని ఇవ్వడం దానం. అసలు ఎంత ఉన్నా ఎవ్వరికీ ఏమీ ఇవ్వకపోడం పీనాసితనం. పిసినారివారికి ఎవర్ని చూసినా భయమే ఏమి అడుగుతారో అని. అలాంటి ఒక పిసినారి గురిం చిన కధ చెప్తాను విను."
పాపేశ్వరంలో పోలయ్య, కావమ్మా అనే భార్యాభర్తలు ఉండే వారు. కావమ్మ బహు పీనాసి. వారు కోర్టు ముందు బడ్డీ పెట్టుకుని, ఉదయం కాఫీ టీ లతో పాటుగా ఇడ్లీ, వడా, సాయంకాలం మిరప కాయ బజ్జీ, బోండా అమ్మేవారు. ఇద్దరూ ఉదయాన్నే లేచి వెళ్ళి తెల్లారే సరికి తమ బడ్డీ మీద అన్నీతయారు చేసి ఉంచే వారు. చాలా రుచిగా ఉండటానా, అది టౌన్ కు సెంటర్ కావటానా వ్యాపారం మూడుపూలూ ఆరు కాయల్లా సాగుతున్నది. బాగానే వెనకేయ సాగారు.
కావమ్మకు అత్తా ఆడపడుచు లంటే పడేది కాదు, ఎక్కడ తమ డబ్బు అప్పడుగుతారోని భయం. కావమ్మ ఇరుగు పొరుగులతో నూ పెద్దగా స్నేహం చేయదు, ఎందుకంటే తమ బడ్డీలో అప్పు కోసం వస్తారని
  ఇంట్లో ఉన్నంతసేపూ పనితోనూ, బడ్డిలో వ్యాపారంతోనూ తప్ప మరెవ్వరితో మాట్లాట్టమే ఉండదు.
ఒకమారు పోలయ్య అక్కా బావా తమ కుమార్తెకు టౌన్ లో సంబంధం చూడను కామయ్య ఇంటి కొచ్చి, తమ పని కాగానే వెళ్ళిపోయారు
  కావమ్మకు భయం పట్టుకుంది. సహజంగా కావమ్మ చాలా పిసి నారి కావటాన, బాగా సంపాదిస్తున్నా రాత్రులైనా ఏమీ వండక బడ్డీమీద మిగిలిపోయిన బజ్జీలూ బోండాలూ తిని కడుపు నింపు కోమంటుంది పోలయ్యను, కాస్త రుచిగా ఏమీ వండేదికాదు.
మిగిలినవి ఏం చేస్తామయ్యా! ఊరికే ఎవరికిస్తాం, అవి తినేస్తే సరి అనేది
  అలాంటిది ఆమె ఆడపడుచు, ఆమె భర్తా వస్తారంటే భయమే సింది, వారికి అన్నీ వండిపెడితే డబ్బు ఖర్చవుతుందని బాధ.
అలాంటి కావమ్మ ఆడపడుచు, ఆమె భర్తా వచ్చి తమ వ్యాపారం చూసి పోయాక , వాళ్ళ కూతురి పెళ్ళికి అప్పు అడుగు తారేమోనే భయం పట్టుకుంది. వెంటనే పోలయకు సైతం తెలీకుండా ఒక పెద్ద బాన తెచ్చి దాని మీదంతా బూడిద పూసి ఒక మూల పెట్టి దానిమీద పాత, చిరుగు గోతాలు వేసింది. దాన్లో తాము దాచిన డబ్బు మూటకట్టి ఉంచింది. డబ్బు దాచే వ్యవహారమంతా భార్య కే వదలిన పోలయ్య ఏమీ పట్టించుకునే వాడు కాదు.

   ఇలా ఉండగా, ఒక రోజున రెండో కొడుకు దగ్గరుంటున్న పోల య్య తల్లి వచ్చింది. కావమ్మ గుండెలో బండ పడ్డట్టు భయప డింది అత్త తమ వ్యాపారమూ సంపాదనా చూస్తుందని

  పోలయ్య తల్లి తను మనవరాలి పెళ్ళి కుదిరిందనీ పెళ్ళిమా టలు మాట్లాడుకోను పెళ్ళికొడుకు తరఫువారు ఇంటికివస్తారని, తాను కావలసిన ఏర్పాట్లు చేయను ముందుగా వచ్చాననీ’  చెప్పింది
   ఇల్లంతా సర్దింది. కోడలు బుధ్ధి తెలుసు గనుక తాను తెచ్చిన డబ్బుతో సరుకులు కూరలు కొని తెచ్చింది, కావలసిన పిండి వంటలు, ఏర్పాట్లన్నీ చేసింది.

  కావమ్మా, పోలయ్యా బడ్డీ కొట్టుమీద ఉండటాన అత్త ఇంట్లో ఏం చేస్తున్నదో వారికి తెలీనేలేదు. పాత కుండలూ, చిరుగు గోతాలూ ఇంట్లో ఉండటాన ఆమె పెళ్ళివారొస్తే అవన్నీ చూస్తే బావుండ ద ని అన్నీ తీసేసి  వీధిలోకి విసిరేసింది
    కాసేపటికి వీధులు ఊడ్చేవారు వచ్చి అవన్నీ పోగేసుకుపో యారు. పెళ్ళివారు వచ్చి, మాటలయ్యాక, ముహూర్తాలు పెట్టుకు ని, కావమ్మ అత్త చేసి ఉంచిన మిఠాయిలు ఫలహారాలూ తిని వెళ్ళిపోయారు
   ఆ సాయంకాలమే అత్త కూడా వెళ్ళిపోయింది. కావమ్మ నిదా నంగా పోలయ్య పడుకున్నాక డబ్బు దాద్దామని వెళ్ళి చూస్తే అక్కడ పాత గోతాలూ లేవు, బానా లేదు
   లబో దిబో మని అరుస్తూ పోలయ్యను లేపి విషయం చెప్పిం ది. పోలయ్య నవ్వి "నీ పీనాసి తనం తగలేయా! మనుషుల్ని చూడగానే నీ సొమ్మంతా దోచుకున్నట్లు ఏడుస్తావ్! బాగానే శాస్తి జరి గింది. నీ పినాసితనం తెల్సిన మా అమ్మా, అక్కా వారికి కావలసిన ఏర్పాట్లన్నీ వారి సొమ్ముతోనే చేసుకున్నారు. పిల్లికి బిచ్చం పెట్టనివాడు పిలిచి పిల్లనిస్తాడా ' అని నీ సొమ్ముతో వారి కి పిడికెడన్నం పెట్టవని వారికి తెల్సు. ఐనా నీడబ్బు వారెందు కు అడుగుతారే ! వారికి తెలీకుండా, నాకైనా చెప్పకుండా ఆపాత బానలో దాచావు. నాడన్నా మా అమ్మగానీ, అక్క గానీ మనింట్లో చేయి కడిగారా! నీ బుద్దే నీకు బాగా గడ్డి పెట్టిందిలే ఏడువ్ !" అంటూ అటు తిరిగి పడుకున్నాడు.

     అదన్నమాట ! ఎవ్వరికీ ఏమీ ఇవ్వకుండా దాచుకుంటే ఇలాగే వీధిపాలవుతుంది. మనం సంపాదించే దానిలో కనీసం ఒక్క పర్సెంటైనా అంటే మనవద్ద వంద రూపాయలుంటే ఒక్క రూపాయి దానం చేయడం కష్టంకాదు కదా! అలా ఇవ్వడం సాగిస్తే ఇంకా ఇంకా వస్తుంటుంది, ధనమూ, మంచి పేరూనూ. తెల్సిందా!"
"భలేచెప్పావు తాతా! నేనూ నా కిడ్డీ బ్యాంక్లో దాచుకున్న సొమ్ము లో ప్రతినెలా ఒక్క పర్సెంట్ దానం చేస్తాను."అంటూ వెళ్ళాడు మనవడు.
                                                *****

 


పుస్తకం హస్తభూషణం.

తాతగారి గదిలో పుస్తక అలమార దగ్గర హర్ష కుదురుగా కూర్చు ని, ఒకపెద్ద గ్రంధం తీసి చూస్తున్నాడు. తాతగారు పూజ ముగిం చి వచ్చారు.
"ఏరా హర్ష! ఏం గ్రంధం చదువుతున్నావ్!" అని అడిగారు ఆశ్చ ర్యంగా.
"లేదు తాతగారూ! భాష నాకేం అర్థమవుతుందీ! అంతా కొత్త పదాలే. బొమ్మలు చూస్తున్నానంతే." అని అన్నాడు.

     "బావుందిరా హర్షా! నీలాంటి వాళ్ల కోసమే పుట్టినట్లుంది సామెత. 'పుస్తకం హస్త భూషణం' అని." అని అన్నారు తాతగారు.
"అదేంటి తాతగారూ! కాస్త అర్థమయ్యేలా చెప్పరూ! హస్తమంటే ఏంటీ?"
"హస్తమంటె చెయ్యిరా! పద! ఆలా తోటలో కూర్చుని చెప్పు కుందాం." అంటూ మనవడితో కలిసి తోటలోకి నడిచారు

      ఇద్దరూ చప్టామీద కూర్చున్నారు పూలబాలకేసి చూస్తూ.
"త్వరగా చెప్పండి తాతగారూ! మళ్ళా మా స్నేహితులు వస్తారు, వారితో కొద్దిసేపు ఆడుకోవాలి" అంటూ తొందరచేస్తున్న మన వడికేసి చూస్తూ అదేరా హర్షా! నా అనుభవం చెప్తాను, విను.  అవి నేను ఉపాధ్యాయ వృత్తిలో చేరిన తొలిరోజులు. రోజుకో పుస్తకం చదివి కొత్త విషయాలు నేర్చుకోందే నాకు తోచేదికాదు. మా గురువులు 'ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి. రోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉండాలని చెప్పిన మాటలు పాటించేవాడిని. రోజూ స్కూలయ్యాక గ్రంధాలయంకేసి వెళ్లే వాడిని. గ్రంధాలయం చాలాదూరం ఐనందున టౌన్ బస్ లో వెళ్లేవాడ్ని. ఆగ్రంధాలయంలో చాలా పుస్తకాలు ఉండేవి
చందా కడితే ఇంటికీ ఇచ్చేవారు.
అలారోజూ బస్ లో వెళుతుండగా నేనొక వ్యక్తిని గమనించేవాడ్ని. తెల్లని నేత పంచె లాల్చీ ధరించి , తలపాగాకూడా పెట్టుకుని, నుదుట పెద్ద ఎర్రని కుంకుమ బొట్టు విభూతి ధరించి, చూట్టానికి పెద్ద పండితునిలా ఉండేవాడు. ఒక పెద్ద గ్రంధాన్ని చేతిలో ఉంచు కుని బస్సెక్కి, దిగేవరకూ దాన్ని చదువుతూ, గ్రంధా లయం రాగానే పుస్తకం ఇచ్చేసి, మరో పెద్ద పుస్తకం పట్టుకు పోయేవాడు
    అక్కడ కూర్చుని మా అందరిలా చదివేవాడుకాదు. అందు వల్ల అతడితో మాట్లాడటానికి అయ్యేదికాదు. అతనికి నేను అనే క సార్లు బస్ లో సీటు కూడా ఇచ్చాను. బస్ చాలా రద్దీగా ఉండ టాన అక్కడ పలకరించను అయ్యేదికాదు.

          ఒకరోజున నేను కాస్త స్కూల్లో అలస్యమై లేటుగా బస్టాప్ కెళ్ళాను. రోజూ నేనెళ్ళే బస్ వెళ్లిపోయింది. ఆతర్వాతి బస్సెక్కి వెళ్ళాను. ఆపాటికే పండితుడు తన అలవాటు ప్రకారం కొత్త పుస్తకం తీసుకుని బయటికొస్తున్నడు. దొరికిన అవకాశాన్ని నేను వదులుకోదలచలేదు. 
   ఎదురుగా వెళ్లి "నమస్కారమండీ! తమరితో చాలా కాలంగా మాట్లాడాలనుకుంటున్నాను, నాకున్న కొన్ని సందేహాలూ తీరు స్తారేమోని" అంటూ మెల్లిగా నవ్వాను
  అతడూ నవ్వాడు. "మరి పేరు తెల్సుకోవచ్చా! ఇప్పటికి ఎంత కాలంగా గ్రంధాలయాన్ని పావనం చేస్తున్నారు? ఎన్ని గ్రంధా లు చదివారు?" అని అడిగాను
    దానికి అతడి నవ్వే సమాధానమైంది. మెల్లిగ తలూపి బయల్దే రాడు. ఆరోజు ఎలాగైన ఆతడి ఇంటికెళ్ళి నా సందేహాలు తీర్చు కోవాలనే పట్టుదలతో నేను అతడి వెనకాలే వెళ్ళాను. అతడు ఒక ఇంటిముందు ఆగాడు
   అతడితో పాటుగా నేనూ లోనికెళ్ళాను. అతడు ఇంట్లో ఒక గదిలో కుర్చీలో కూర్చుని ఉన్న ఒక ముదుసలి వ్యక్తికి గ్రంధం ఇచ్చాడు. ముసలి వ్యక్తి ఆత్రంగా గ్రంధం తీసుకొని చదవ డంలో మునిగిపోయాడు
  నేను దగ్గరగా వెళ్ళి "నమస్కారమండీ!" అన్నాను
 ఆ ముసలాయన తలెత్తి చూసి "ఎవరు బాబూ! కూర్చో! నారా యణా! కుర్చీపట్టుకురా!" అన్నాడు. 
  ఒక వ్యక్తి కుర్చీతెచ్చి వేసి వెళ్ళిపోయాడు
 నేను కూర్చుని "అయ్యా నేనొక ఉపాధ్యాయుడ్ని. రోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోందే నాకు నిద్రపట్టదు. తమరికి పుస్త కం తెచ్చిచ్చిన పండితుల వారితో మాట్లాడినాసందేహాలు తీర్చు కో వాలని నా ఆశ." అని అన్నాను
 అతడు పెద్దగా నవ్వాడు, చాలాసేపు. "వాడా! ఒరే నారాయణా! ఇలారా!" అని పిలిచాడు
  ఇందాక నాకు కుర్చీతెచ్చి వేసిన వ్యక్తి వచ్చాడు.
 "వీడేనండీ ! పండితుడు. వీడికి చదువంటే చాలా ఇష్టం. కానీ అబ్బలేదు. నా దగ్గర పనిచేస్తుంటాడు. ఇలా నా దుస్తులు ధరిం చి గ్రంధాలయానికి వెళ్లి నాకు పుస్తకాలు తెచ్చి ఇస్తుంటాడు. రాగా నే దుస్తులు మార్చేసుకుంటాడు. అంతా అతడ్ని పండితు డని భ్రమపడతారు. వీడికి పుస్తకమే హస్త భూషణం." అని నవ్వాడు.
అదిరా హర్షా! చదువులేకుండా ఊరికే పుస్తకాలు పట్టుకు తిరిగే వారిని చూసి సామెత చెప్తారు. అన్నారు తాతగారు
  ఇంతలో బయటినుంచి 'హర్షా !' అని వినిపించగానే హర్ష "థ్యాంక్యూ తాతా! టాటా| అంటూ బయటకురికాడు.
                                          ***

 


No comments:

Post a Comment