Tuesday 9 April 2019

అడిగేవాడికి చెప్పేవాడు లోకువ...


అడిగేవాడికి చెప్పేవాడు లోకువ...

"నాన్నా నాకు బైక్ కొంటావా కొనవా? నేను సైకిల్ లో వెళుతుంటే అంతా నన్నూ చూసి నవ్వడమే. ఛీపన్నెండోక్లాస్ చదువు తు న్న ఫణి ఇంటికి వచ్చీరాగానే సైకిల్ దూరంగా విసిరేసి, కుర్చీలో చతికిలబడ్దాడు. ఇంటిముందున్న పూలతోటలో మొక్కలకు నీళ్ళుపడుతున్న పరమేశం "సరే ముందువెళ్ళి అమ్మ చేసిన నేతిగారెలు తినేసిరాపో." అంటూ కొడుకును బుజ్జగించ బోయాడు
  "నీ బుజ్జగింతలు నాకు మామూలే. ముందు మాటివ్వు." అంటూ మొండిపట్టు పట్టాడు ఫణి.
    వాడి మాటలు విని వంట ఇంట్లోంచీ బయటికి వచ్చిన వసం తమ్మ "ఏరా! ఇంటికి రాగానే నాన్నగారితో వాదనలలేంటీ? రా లోపలికి నేతి గారెలు చల్లారుతున్నాయ్!" అంటూ వాడిని లేపే ప్రయత్నం చేసింది.
  "ఉండమ్మా! నేయిగారెలో నేతి బూరెలో తర్వాతిమాట. ముందు నాకు మాటివ్వండి. ఆతర్వాతే అన్నీ" అంటూ చిన్నపిల్లడిలా కాళ్ళూ నేలకేసి కొట్టసాగాడు ఫణి.
"మరీ చిన్నపిల్లాడివైపోతున్నావ్!. వయస్సుకు తగ్గట్లు ప్రవర్తించ రా ఫణీ!"
"ఔనే అమ్మా! నాకు బైక్ తోలే వయస్సు రావటానే కదా అడుగు తున్నాను. ఇంతకాలం సైకిల్ లోనే కదా వెళ్ళాను. బైక్ అడిగా నా! వచ్చే ఏడు కాలేజీకి వెళతాను. అప్పుడూ సైకిల్ లోనే వెళ్లమంటారా? అందరికీ నవ్వుకోను నేనొక వినోదమై పోయాను" అంటూ బుంగమూతి పెట్టుకున్న కొడుకును చూసి తల్లీ తండ్రీ ఒకేమారు నవ్వారు
   వారి నవ్వుచూసి ఫణికి వళ్ళు మండింది. "మీకూ నన్ను చూస్తే నవ్వుగా ఉందా!" అనంటూ పెద్దగా అరిచాడు.

  నీళ్ళ పైపు ఆపేసి వచ్చి కొడుకు పక్కన కూర్చున్నాడు పర మేశం. వసంతమ్మ కూడా పక్కనే కూర్చుంది.
"అలాగే నాన్నా! ఇంతకూ నీకెలాంటి బైక్ కావాలో చెప్పు." అంటున్న తండ్రికేసి చూసి "నిజంగానే అడుగుతున్నారా! లేక ఇదీ నవ్వులాటకా!"
"నవ్వులాట ఏంటిరా వెర్రి నాగన్నా! నాన్నగారు అడుగుతుంటే చెప్పూ" అంది తల్లి వసంతమ్మ.
"నాకు 'యమహా కంపెనీ లో కొత్త మోడల్ వచ్చింది. అది కావా లి."
"సరే దాని పేరే భయంకరంగా ఉంది! మరి రేటెంత?
"కొత్తగా రాయల్ ఎన్ఫీల్డ్ థండర్ ర్డ్ 500X విడుదలైంది. దీని రూ.1.98క్షలు. అదైనా ఫరవాలేదు. ఇండియన్ మార్కె ట్‌ లోకి మరో ఏడు బైక్లు వస్తున్నాయి. వాటి రేటు 95 వేల నుండీ 13 లక్షల వరకు వున్నాయి."
''ఓహ్! అంతే నా! ఫరవాలేదులే! లేచి టిఫిన్ కానీ వెళదాం. నా స్నేహితుని బైక్ షాపొకటి ఉంది. నా దగ్గర అంత డబ్బు లేక పోతే అప్పైనా ఇస్తాడు. వేగం రా వెళదాం అంటున్న తండ్రిని ఆశ్చర్యంగా చూశాడు ఫణి
     ఇది నిజమా కలా అనే అనుమానం కూడా వచ్చింది వానికి. ఏదైతే అది అవనీ, ఈమాటు పట్టు వదిలేది లేదు అనుకుంటూ లేచి, కాళ్ళూ, చేతులూ కడుక్కొని అమ్మ పెట్టిన వేడి వేడి నేతి గారెలు, అల్లం పచ్చడితో కడుపునిండా లాగిచ్చి బయటికి వచ్చే సరికి తండ్రి కూడా తయారుగా ఉండటాన, నన్ను మోసగించ ట్లేదు అని నిర్ధారణ అయ్యాక, తండ్రి సైకిల్ తొక్కుతుండగా వెనక కూర్చున్నాడు.
      'బైక్ కొని తిరిగి వచ్చేప్పుడు సైకిల్ ను అక్కడే అమ్మేసి రావాల్సిందే అనే గట్టి నిర్ణయమూ తీసుకున్నాడు ఫణి.
     ఇద్దరూ బైక్ షాపు ముందు, సైకిల్ ఆపి దిగారు. లోపలికెళ్ళి కూర్చున్నాక షాపు యజమాని వచ్చి తండ్రిని ఆలింగనం చేసు కుని సంతోషంగా పలకరిస్తుంటే ఫణికి ఆశ్చర్యమేసింది
    ‘ఇంత పెద్ద షాపు యజమాని తన తండ్రికి ఆప్తమిత్రుడా! ఇది ముందే తెలిసుంటే ఎప్పుడో మారాం చేసి బైక్ కొనిపించుకునే వాడిని కదా' అనుకుంటూ కూర్చున్నాడు.
      వారి మర్యాదపూర్వక పలకరింపులయ్యాక, కాఫీ సేవించాక "ఇహ చెప్పు పరమేశం! ఏంటీ నా షాపు పవిత్రం చేశావు, కొడుకు తో కలిసి!" అంటూ మొదలెట్టాడాయన.
"మరేం పెద్దగా పనేం లేదుకానీ! మావాడికి ఒక బైక్ కావాలిట." అని ఆపాడు పరమేశం.
ఇహ ఆషాపు యజమాని మరియు కోటీశ్వరుడైన బంగారయ్య అందు కున్నాడు.
"నీకెన్నేళ్ళు బాబూ!"
"నేను ట్వల్త్ క్లాసండీ!" అన్నాడు ఫణి.
"ఓహో! అలాగా! అంటే కనీసం పద్దెనిమిదేళ్ళు ఉండాలి, ఔనా!"
"ఔనండీ!"
"బైక్ తోలడం వచ్చా?"
"అదెంత పని! బైక్ ఉంటే మా స్నేహితులు ఒక్క రోజులో నేర్పేస్తారు. అందరికీ బైక్స్ నడపడం వచ్చు."
" అలాగా! మా వాడూ గతేడాది పన్నెండో క్లాస్ లో ఉండేవాడు. నీలాగే నా తల తిని బైక్ కొనిపించుకుని స్నేహితులతో వెళ్ళాడు. నేర్చుకుని వస్తానని. ఇంతవరకూ రాలేదు."
"అయ్యో ఎక్కడి కెళ్లాడండీ!" ఆశ్చర్యంగా అడిగాడు ఫణి.
బంగారయ్య కర్చిఫ్ తో కళ్ళు అద్దుకుంటూ "పైలోకాలకు, తిరిగి రాని లోకాలకు." అన్నాడు.
"ఐయామ్ సారీ సార్!" అన్నాడు ఫణి.
" సారీలన్నీ మా వాడి స్నేహితులు ఒక వెయ్యి మార్లు చెప్పా రయ్యా! ఒక్కో సారీకీ పది వేల పైన ఇవ్వగలను. నా కొడుకును తెచ్చిస్తే. సారీలు ప్రాణాలను ఇవ్వవు బాబూ!"
మౌనంగా ఉండిపోయాడు ఫణి.
"సరేను రా బంగారం! నీ సారోలూ, సారీలూ ఆపి, మావాడికి బైక్ ఏది కావాలో చూపు. నీ దగ్గర ఏమున్నాయో చెప్పు." అంటున్న తండ్రికేసి అభిమానంగా చూశాడు ఫణి.
"అలాగలాగే ముందీ పేపర్ కటింగ్ చూడమను మీవాణ్ణి." అంటూ తండ్రికి, పేపర్ కటింగ్ కట్ట అందించాడు బంగా రయ్య.
'వాటిలో, ఒక దాంట్లో --- బైక్పై వెళుతూ 20 అడుగుల లోతులో పడ్డ యువకుడు.' అనీ, మరో కటింగు లో కొడవలూరు మండలం చింతచెలిక గ్రామం వద్ద రెండు బైక్ లు ఢీ ప్రమాదంలో ఇద్దరూ స్పాట్ డెడ్. -మరో కటింగ్ లో - కొత్తగా పెళ్ళైన జంట బైక్ లో వేగంగా వెళుతూ మృత్యవాత," ఇలాంటివి ఒక పది కటింగ్స్ -- ఉన్నాయి.
"ఇవన్నీ ఎందుకయ్యా! మావాడికి మీ దగ్గరున్న బైక్స్ చూపు." అన్నాడు మళ్ళీ పరమేశం.
"పరమేశా! నేను టీనేజర్స్ కంతా ఇవన్నీ చూపాకే బైకులు అమ్ము తానయ్యా! నాలాగా ఉన్న కొడుకులను బైక్ లకూ బలివ్వకూడదని నా కోరిక. మా దగ్గరున్న బైక్స్ 50 వేలనుంచీ పదమూడు లక్షల పై చిలుకు ఉన్నాయి." అంటుండగానే -
"ఏవీ చూపిస్తారా!"అంటూ లేచాడు ఫణి.
"ఆహా చూపుతాం. ఐతే నీ స్నేహితులెందరి దగ్గర బైక్స్ ఉన్నా యి? ఎందరికి లేవు? ఎందరు బైక్స్ లేని వాళ్ళను హేళన చేస్తున్నారు? ఎందరు ఇతర్ల బైక్స్ మీద ఎక్కి తమాషా మాటలు మాట్లాడుతున్నారు? ఎందరు బైకులున్నవారు క్లాసులో ఫస్ట్ ఉన్నారు? ఎందరు క్లాసులెగ్గొట్టి సినిమాల కెళుతున్నారు? ఎంద రు వీకెండ్స్ లో ఇంట్లో ఎగస్ట్రా క్లాసులనిచెప్పి ఊళ్ళమీద బైక్ లమీద తిరగను వెళుతున్నారు? ఎందరు త్రాగి బైక్ నడుపుతూ పోలీసులకు దొరికిపోయారు?---" అంటూ బంగారయ్య అడుగుతుండగానే,
"ఏంటి బంగారయ్యా! అడిగే వాడికి చెప్పేవాడు లోకువని' తెగ ప్రశ్నలడుగుతున్నావ్! మా వాడికి బైక్ ఇవ్వవ్వా!" అన్నాడు కోపంగా పరమేశం.
"ఆగవయ్యా! పరమేశం. మీకొడుక్కు రావాల్సిన కోపం నీకెందు కుట! నేనడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు పాజిటివ్ గా వస్తే నీ కొడుక్కు కొత్తబైక్ ఊరికే ఇస్తానయ్యా! మన స్నేహాన్ని గుర్తుంచుకుని మా వాడిలా మీ వాడూ కాకూడదనే నాబాధ. నే నెంత చెప్పినా వినక 'అంతా సైకిల్ మీద వస్తూన్న తనను వెక్కి రిస్తున్నారని, బలవంతంగా బైక్ తీసుకెళ్ళాడయ్యా. ఒక్క రెండే ళ్ళు ఆగి ఉంటే నేనే ఇచ్చేవాడిని. ఇప్పుడు ఇద్దామన్న లేడు కదా! మీవాడిని ఆలోచించుకుని చెప్పమను." అని బంగారయ్య అడుగుతుండగానే ఫణి లేచి తండ్రి చెయ్యి పట్టుకుని షాపు బయటికి నడిచాడు.
                                                        ***

 


No comments:

Post a Comment