Tuesday, 28 July 2020

చేయూత.

చేయూత.

  లాయర్ రామనాధం వడివడిగా నడుస్తున్నాడు. ఆయనకు తన వృత్తికి సంబంధంచిన ఏవిషయమైనా స్వయంగా వెళ్ళి సేకరించడం అలవాటు. ఆపని మీదే  ఆరోజు ఒక పట్టణమూ నగరమూ కాని ఆ ఊరకి వచ్చాడు. 
          ఉదయాన్నే బయల్దేరటాన ఏమీ తిన కుండా వచ్చాడు. వేగంగా నడుస్తు ఆకలిగా ఉండటాన ఒక బ్రడ్ ఐనా తిందామని అక్కడున్న ఒక బేకరీ మందు ఆగాడు.
      బ్రెడ్ తీసుకుని ,డబ్బిచ్చి,వెళ్ళబోతుండగా , తనమందు నిల్సున్న పది ,పన్నెండేళ్ల ఒక కుర్రాడు,
 " బాబయ్యా ! నాకూ ఒక బ్రెడ్ ఇప్పిస్తారా? నిన్న టి నుంచీ ఏమీ తినలేదయ్యా !" అని అడిగాడు.
దానికి రామనాధం " ఒక బ్రెడ్ ఇస్తే ఏం చేస్తావు? " అని అడిగాడు.
"సగం నేను తిని సగం మా అమ్మ కు ఇస్తానయ్యా! మంచంలో పడి ఉంది."
"రెండుబ్రెడ్ లు ఇస్తే?"
"ఒకటి నాకు ఒకటి అమ్మకు '
" నాలుగిస్తే ?" -      
" ఈ రోజుకు చెరొకటి, రేపటికి చెరొకటి."
" ఎనిమిదిస్తే ?"  -      
" నాలుగు మా కోసం ఉంచుకుని మరోనాలుగు మా మురికివాడలో ఉన్న మసలాళ్ళకు ఇస్తానయ్యా !"   
" పదహారు ఇస్తే?" -           
  " అయ్యా ! మిగతా ఎనిమిదీ రైలు స్టేషన్లో అమ్ము తానయ్యా !"
"ఆడబ్బులతో ఏం చేస్తావు?"
"ఆడబ్బు తో మరో కొన్ని బ్రేడ్డు ముక్కలు కొని మరు నాడు రైల్లోమ్ముతానయ్యా ? అలా చిన్న వ్యాపారం చేసుకుని అడుక్కోకుండా మా అమ్మను పోషంచు కుంటానయ్యా ! వైద్యం చేయిస్తానయ్యా !"
" నిజంగానా! నీ మాటలు నమ్మవచ్చా?"                                                                                " మీ పాదాలసాక్షి .ఐదో తరగతి చదూకుంటున్నప్పుడు  మా అయ్య తాగి తాగీ పోయాడు. మా అమ్మ నా చదువు కోసం దాచిన డబ్బు కోసం అమ్మను చావ గొట్టేటోడు. అడ్డం పోయిన నాకూ దెబ్బలు తగిలాయి. ఆ దెబ్బలకు మా అమ్మకు ఎక్కడో నరాలమీద దెబ్బ తగిలి తెలీని జబ్బు వచ్చి మంచాన బడిందయ్యా ! " అనిచెప్పి ఏడవసాగాడు.
రామనాధం వెంటనే బేకరీ వానితో మాట్లాడి 50 బ్రెడ్డులు వానికి ఇప్పిచాడు. ఆ తర్వాత తన పనిమీద వెళ్ళాడు.  
         రామనాధానికి బయట ఏమీ తినే అలవాటు లేదు,అందువల్ల పనిమీద  వేరే ఊరు వస్తున్నపుడు పండ్లుమాత్రం తినేవాడు. పనిపూర్తయ్యేసరికి మిట్టమధ్యాహ్నమైంది.ఒక అరటి పండు తిని ,తన ఊరు వెళ్దామని , బస్టాండు లో అరటి పండ్ల దుకాణం వద్ద ఆగాడు.  ఒక అరటి పండు కొని తినబోతుండగా
, పక్కనే  ఉన్న  చెట్టుక్రింద  పది ,పద మూడేళ్ళ ఒక బాలుడు తన చేతిలో అరటి పండుకేసి చూట్టం గమనించాడు. వాడిని దగ్గకి రమ్మని  సైగ చేశాడు.
వాడు దగ్గరకి రాగానే " ఒక అరటి పండిస్తే ఏం చేస్తువు? "అని అడిగాడు.
"తింటానయ్యా ! నిన్నటేలనుంచీ ఏమీ తినలేదయ్యా! కడుపు కాలతాండి. అడుక్కోడంసిగ్గు బాబయ్యా !పని చేద్దామంటే ఇచ్చేవారే లేరు. ‘ఇంత చిన్నవాడివి ఏం పనిచేస్తువు పో పో ’అంటున్నారయ్యా!. "
" రెండు పళ్ళిస్తే ఏం చేస్తువు?"
"ఒకటి ఇప్పుడుతిని ఒకటి రాత్రికి ఉంచు కుంటాన య్యా."

" నాలుగుపళ్ళిస్తే ?"
"ఈ రోజుకు  రెండు , రేపటికి రెండు"
"ఎనిమిదిస్తే? " -  
 " అయ్యా ! తమాషాకు అడుగుతున్నారా! నా కంత ఆశ లేదయాా ! ఐనా అడిగారు గనక చెప్తున్నా , ఆ చెట్టు క్రిందవున్న అవిటి వాళ్లకు ఇస్తానయ్యా!"
"పదహారిస్తే ?"         -                                                                                                                                  " బాబూ మీకంత పెద్ద మనసుండి ఇప్పిస్తే  మిగతా ఎనిమిదీ ఆ అవిటి వాళ్ళకే ఇస్తానయ్యా !" 
" మరి నీకు నలభై పండ్లుఇస్తే ఏం చేస్తువూ?"
" అయ్యా ! రెండు నేను  ఉంచుకుని మిగతా పండ్లు బస్టాండులో బస్సులో అమ్మి,అలా అలా అమ్ముకుంటూ
అడుక్కోకుండా ఎవరైనా ఉచితంగా ఇచ్చినా తీసుకో కుండా ,  అవిటివాళ్ళకు ఇస్తూ , అమ్ముకుంటూ బతికేస్తునయ్యా ! మా అమ్మ అయ్యా రైల్ ప్రమాదంలో ఒకే తూరి పోయారయ్యా ! ఇట్టా ఎవురైనా ఇస్తే తిని బతుకుతున్నానయ్యా! అడుక్కోడం తెలీదయ్యా ! "                                                                                                             రామనాధం వెంటనే ఆపండ్ల అంగడి వానితో మాట్లాడి ఒక బుట్ట  నిండా అరటి పండ్లుకొని వానికిఇచ్చా డు . ఆ బాలుడు రామనాధం రెండు కాళ్ళూ పట్టుకుని నమస్కరించి, కళ్లనీళ్ళతో ఆయన పాదాలు కడిగాడు .
 రామనాధం వాడిని లేపి,"వెళ్ళి నిజాయితీగా నీవు నాకు చెప్పినట్లే చేసిబతుకు ." అని బస్సెక్కి తన ఊరికి బయల్దేరివెళ్ళి పోయాడు.
  బస్సు లో వెళుతున్న ఆయనకు తన గతం మనస్సు లో మెదిలింది . గోదారికి వరదలొచ్చి ఒడ్డునున్న తన పల్లెపల్లేంతా వరద తాకిడికి కొట్టుకు పోయింది. అయ్యా, అమ్మా ఏమయ్యారో తెలీలేదు. ఎలా తాను బతికిబయట పడ్దాడోకూడా తెలీదు.కొట్టుకు పోతున్న తనకు ఒకపెద్ద కొబ్బరి చెట్టు కనిపించగా ఆమాను ఎక్కి కూర్చుని దాన్ని గట్టిగా వాటేసుకుని కూర్చున్న తానూ నీటి వాలుకు కొట్టుకు పోతుండగా ఎవరో చూసి కాపాడారు.  
  వంటరితనంతో భయభయంగా  నడుచుకుంటూ పక్క నున్న రైల్వేస్టేషను  దగ్గర కూర్చునిఏడుస్తున్న తనను, అప్పుడే రైలుదిగి న ఒకాయన ,తననుచూసి  " ఒరే పిలగాడా! ఈ సంచీ బరువుగా ఉంది , మా ఇంటి దాకా మోసుకు వస్తువా? పైస లిస్తాను, ఊరకే వద్దు, అన్నంపెట్టిస్తాను." అనిపిలిచాడు. ఆకలికి తట్టిలేపగా ,అలసట పక్కకునెట్టి  ,పైసలనగానే, అన్నం మాట వినగానే మోయలేని బరువున్నా సంచీ తలపైన పెట్టు కుని  ఆయన వెంట నడిచి వెళ్లాడు తాను.
 తన పుణ్యవశాన ఆదేవాలయంలో అడుగు పెట్టాడేమో, లేకపోతే ఏమైపోయేవాడో! 
ఆయన సతీమణీ అన్నపూర్ణమ్మతల్లిలా వచ్చి, తన ముఖం చూసి "ఏమబ్బాయ్! అలా ఉన్నావ్?" అని అడిగి విషయం అంతా తెల్సుకుని ,"కాళ్ళూ ముఖం కూడుక్కో అన్నంపెడాతాను ముందు.ఆతర్వాత మాట్లాడు కుందాం" అని కడుపునిండా తిండి పెట్టింది.  మహాతల్లి,  తప్పక ఏ స్వర్గంలోనో   ఉండే ఉంటుంది. తనకు అమ్మ పోయిందని దేవుడు ఈ అమ్మను ఇచ్చాడేమో అని తాను అనేక మార్లు అనుకున్నాడు. 
" చూడూ బాబూ! ఒంటరిపిల్లోడివి, ఎక్కడికెళ్తావు కానీ మా స్టోర్ రూములోఉండు ,  చేత నైన పనిచేస్తు బళ్ళో కెళ్ళి చదువుకో." అందా మహాతల్లి.ఆరోజు నుంచీ అప్పటికే ఐదో తరగతి చదువుతున్న  తాను శ్రధ్ధగా చదివి వారిమన్ననపొంది   ఇలా ఈ రోజు న్యాయవాదై ఆయనవద్దే శిక్షణపొంది ఆయన స్థానంలో నిలవడం తన జనం జన్మల అదృష్టంకాక మరేంటి?
 అందుకేతన కెవరైనా అనాధలు కనిపిస్తే తన గతం గుర్తొచ్చి ఏదైనా సాయం చేయాలనిపిస్తుంది. అది తన అలవాట్లో ఒకటై పోయింది ' అనుకుంటూ  బస్ ఆగగానే దిగి ఇంటికేసి నడిచాడాయన.
                                                             
       *****         
తర్వాత సుమారుగా మరో పదేళ్ళ తర్వాత  మరోకేసువివరాలు సేకరించను,విసహ్యాలు విచారించను అదే నగరానికి రామనాధం వెళ్ళి ఆ ఊర్లో బస్ దిగి నడవసాగాడు. 
ఉన్నట్లుండి ఒక యువకుడు వచ్చి ఆయన రెండు కాళ్ళూ పట్టుకుని  పాదాలు ముద్దు పెట్టుకున్నాడు. రామనాధం కంగారుగా రెక్కపట్టి వానిని లేపి " ఎవరు బాబూ నీవు ? " అని అడిగాడు.
"బాబయ్యా ! మీరునన్ను గుర్తుంచుకోక పోవచ్చుకానీ మిమ్ముల ను నేనెలా మరుస్తానయ్యా! మీరే నా దేవుడు. రండి బాబయ్యా ! మీరు పదేళ్ళక్రితం బుట్టెడు అరటిపళ్ళు ఇచ్చి నాబతుకు బాగుచేసిన దైవం.అలా మీకిచ్చిన మాట ప్రకారం అరటి పండ్లు బస్సుల్లో అమ్ముకుంటూ వ్యాపారం చేసుకుంటూ , మెలకు వలు తెల్సుకుని బండి మీద పండ్లు  అమ్ము తూ చివరకి ఇదో బాబయ్యా ఈ పండ్ల అంగడి పెట్టుకుని బాగా బతుకుతున్నానయ్యా!! మీరెప్పుడైనా తప్పక కనిపిస్తారన్నే నమ్మకంతో  వచ్చేబస్సూ పోయే బస్సూల్లో దిగేవారిని గమనిస్తూ చూస్తుంటానయ్యా!ఇన్నాళ్ళకు నా అదృష్టం కొద్దీ మీరు ఈ రోజు కనిపించారు.ఈ పండ్ల దుకాణం నడుపు తున్నానయ్యా! ! మీ పేరు తెలీదు,మీ ఫోటో లేదు .ఒక్క ఫోటో తీసుకుని ఇక్కడ తగిలించుకుంటానయ్యా ! " అంటూ తన మొబైల్ ఫోబులో ఒక ఫోటో తీసుకున్నాడు ఆయువకుడు.
రామనాధం సంతోషంగా వానిని చూస్తూ " మంచిది, నా ఫోటోవద్దు,పేరూవద్దు.నీ నిజాయితీ నిన్నీస్థితికి తెచ్చింది.ఆ నిజాయితీ నిలుపుకో చాలు.వస్తాను" అంటూ తన పనిమీద బయల్దేరాడు.  
  పనయ్యాక తిరిగి రైలెక్కి తన ఊరికి  వెళ్దామని  రైల్వే స్టేషన్ లోకి వెళ్ళి , టికెట్ కొంటుండగా ఒక యువకుడు వచ్చి పాదాలు పట్టుకుని నమస్క రించా డు.
రామనాధం" ఎవరు బాబూ!నీవు ?" అనగానే అతడు లేచి " బాబయ్యా ! బ్రడ్ బుడ్డోడిని.ఆరోజు మీరచ్చిన బ్రెడ్ అంతా అమ్ముకుని  మీకు చెప్పినట్లే వ్యాపారం చేసుకుంటున్నాను.ఈ దుకాణం నడుపుతున్నానయ్యా! బాబయ్యా ! మా అమ్మ ! అమ్మా ! ఈ బాబే మనకు జీవనం చూపింది." అంటూ ఒకావిడను చూపాడు. ఆమె చేతులు జోడించి నమస్క రించింది. 
 రామనాధం రెండు  కళ్లలోంచీ  ఆనంద  భాష్పాలు జలజలా రాలాయి.'పిల్లలు  దొంగలూ, హంతకులూ  కాను ఆకలి ,అవసరాలూ తప్ప పుట్టుకతోనే ఎవ్వరూ చెడ్డవారు కారన్న తన వాదనకూ, తాను చేస్తున్న ప్రయోగాలకూ సమాధానాలు’ లభించి తృప్తిగా మందు కు సాగి రైలెక్కాడాయన.
 ఇలాప్రతి ఒక్కరూ మరొకరికి చేయూతనిస్తూ పోతే  సమాజం ఎంత నిజాయితీగా ఉంటుందోకదా! 
                 *** 
                      

No comments:

Post a Comment