Tuesday, 28 July 2020

న్యాయవర్తనం



                        న్యాయవర్తనం
      
          రాఘవాపురంలో ఒక నిరుపేదరాలైన రాఘవమ్మ  ఏకైకపుత్రిక పూజ. ఆఊర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో శ్రధ్ధగా చదువుకునేది. రైతుకూలీ ఐన ఆమె త్రండ్రి హటాత్తుగా చనిపోడంతో తల్లి రాఘవమ్మ ఎంతో ఓర్పుగా, నేర్పుగా , ప్రతిరోజూ రాత్రిపూట న్యాయాన్నీ, ధర్మాన్నీ గురించి చెప్తూ తన బిడ్ద మనస్సులో న్యాయాన్ని నాటుతూ తన బిడ్డను పెంచి, పోషించ సాగింది.ఆమెమారు బేరానికీ కూరలు తెచ్చి ఊర్లో , ఎంతో  నిజాయితీగా ,సాధారణ లాభంతో  అమ్మి వచ్చిన దాంతో బిడ్ద చదువుకు ఆ సొమ్ము దాచి పొదుపుగా ఖర్చుచేసేది . న్యాయవర్తనమే ఆమె ధనంగా జీవించేది  .
 
 ఎవరు గమనించినా గమనించకున్నా  సర్వాంత ర్యామి ఐన భగవంతుడు  అంతా గమనిస్తాడని ' ఆమె నమ్మిక. న్యాయమైన సంపాదనే తమకు అచ్చుబాటవుతుందని ఆమె ప్రగాఢవిశ్వాసం.   
     ఆసొమ్ముతో ఇద్దరి కడుపులు నింపుకుంటూ ,కలో గంజో త్రాగుతూ కొంతపైకం బిడ్దపై చదువుకు దాచేది. ఇలా ఉండగా పూజ తమ ఊర్లో చదువు పూర్తై పై చదువులకు పట్నం వెళ్ళాల్సి వచ్చింది.
 రాఘవమ్మ తనగోడు రోజూతన  వద్ద కూరలుకొనే ఒక ఆఫీసరమ్మ తో చెప్పుకునేది.
 ఒకరోజు రాఘవమ్మ ఆమె తో " ఆపీసరమ్మా!! నగరంలో నాబిడ్దను సదవేయాలి .ఎక్కడేస్తే మంచిగుంటదో ,ఏసదువు బాగుంటదో సెప్పండమ్మా పున్నెముంటాది!." అని అడగ్గా , ఎంతో కాలంగా నిజాయితీ గా కూరలు వాడుగ్గా తనకు ఇస్తున్న ఆమెను చూసి ఆ ఆఫీసరమ్మ " రాఘవమ్మా!! నేను రేపు నగరం వెళుతున్నాను. నా బిడ్దనుకూడా కాలేజీ లో వేయాలి. నీ బిడ్దనూ నాతోపంపు. నేను చేరుస్తాన్లే, భయపడకు. నీవు రానక్కరలేదుకే." అని తీసుకెళ్ళి పూజమార్కులు చూసి సంతోషించి ,తనకు బాగా తెలిసిన కాలేజీలో  నర్శింగ్ లోచేర్పించి ,హాస్టల్లో సీటు ఇప్పించి , ఫీజుకూడా తానే   కట్టి వచ్చింది.పూజ మార్కులకు ఎటూ స్కాలర్ షిప్ వస్తుందని  ఆమెకు తెల్సు.
      పూజ  శ్రధ్ధగా చదువుకుని మంచి మార్కులతో పాసయ్యింది.ఆఫీసరమ్మ సూచన మేరకు  ఒక పెద్ద హాస్పెటల్లో ఉద్యోగం కోసం దరఖాస్తు పెట్టుకుంది పూజ.  మార్కులూ అన్నీ బాగున్నా , ఏమాత్రం తెలీని పల్లెటూరిపిల్ల పూజకు ఉద్యోగం ఇవ్వను సుముఖత చూపలేదు ఆహాస్పెటల్ యజమానులు . ఐతే ఆ ఇంటర్వ్యూలో ఒక పెద్ద  స్వంత హాస్పెటల్ ఉన్న ఒక వైద్యుడుకూడా ఉన్నాడు. "నీకు ఇక్కడ ఉద్యోగం ప్రస్తుతం ఇవ్వలేము, నీవు వెళ్లవచ్చు.అవకాశం వున్నపుడు నీకు తెలియపరుస్తాం " అని చెప్పి తాము ముందుగా తెలియ పరచిన ప్రకారం అందరికీ ఇచ్చినట్లే రానూ పోనూ ఖర్చులు , భోజనం కోసం ఖర్చులూ ఇచ్చి పంపారు. 
        పూజ  బయటికి వచ్చి  చూసుకోగా తన బస్సుకు రానూపోనూ ఐన చార్జీలకంటే ఎక్కువ సొమ్ము ఇవ్వడం గమనించింది. వారు భోజనానికి కూడా ఇవ్వటాన అదీ ఎక్కువగానే ఉంది.  తాను తన ఇంటినుంచీ అమ్మ కట్టిచ్చిన భోజనం తెచ్చుకుని తినడం వల్ల ఆసొమ్ముకూడా మిగిలింది.
 పూజ అందరికీ ఇంటర్వ్యూలు పూర్తై ఆఫీసర్లు బయటికి వచ్చేవరకూ అక్కడి ప్రధాన ద్వారం వద్దే వేచిఉంది. ఇంటర్వ్యూలు నిర్వహించిన పెద్ద డాక్టరు బయట వేచి ఉన్న ఆమెను చూసి " నీకు ఉద్యోగం ఇవ్వలేము  వెళ్ళ మని చెప్పారు కదా! ఇంకా ఎందుకు ఉన్నావూ? పొద్దుపోతున్నది వెళ్లవచ్చుకదా!" అని అడిగాడు.
 పూజ నమస్కరించి  ,వినయంగా " సార్!  నాకు ఎక్కువ సొమ్ము ఇచ్చారు. నా ఊరికి రానూ పోనూ అంత టికెట్టుకు ఖర్చుకాలేదు. పైగా  భోజనానికీ ఇచ్చారు. నేను మా అమ్మ వండి ఇచ్చిన భోజనం తెచ్చుకుని తిన్నాను.అందువల్ల ఆ సొమ్మూ ఎక్కువే ఐంది. న్యాయార్జితం కానిసొమ్ము నేను తీసుకోను సార్!అదంతా మీకు చెప్పి తిరిగి ఇవ్వనే ఇక్కడ వేచి ఉన్నాను. మన్నించండి" అని చెప్పి ఆసొమ్ము ఇవ్వబోగా  , ఆ ఇంటర్వ్యూచేసిన డాక్టరు గారు ఆమె నిజాయితీకి ఆశ్చర్యపడి " సరే పూజా! నీవు రేపు వచ్చినా హాస్పెటల్లో  ఉద్యోగంలో చేరు. ఆ సొమ్ము తో పాటుగా నీ మొదటి నెలజీతం కూడా ఇదుగో తీసుకో . ఇదో నా హాస్పెటల్ అడ్రెస్ " అంటూ ఒక విజిటింగ్ కార్డు, సొమ్మూ ఇచ్చేసి వెళ్లాడు.
 చూశారా! పిల్లలూ! సత్ప్రవర్తన వల్ల రాదనుకున్న ఉద్యోగంకూడా పూజకు వచ్చింది. న్యామవర్తనమే మంచి రెకమెండేషన్. ఇది బాలలూ! న్యాయవర్తన మహిమ .చిన్న తనం నుండే న్యాయం గా ఉండటం అలవరచుకుని మంచి పేరు తెచ్చుకుంటారుగా!
 నీతి- న్యాయవర్తనమే మనలను కాపాడే నావ. 
                       ****


No comments:

Post a Comment