Monday, 27 July 2020

అల్ప సంతోషి .


అల్ప సంతోషి .
     ‘మా అన్నయ్య ‘ అని  కాదు కానీ , వాడు చాలా మంచి వాడు, తెలివైన వాడూనూ.  ఒక్కమారు చూస్తే చాలు  ఇట్టే పట్టుకుని అట్టే అల్లుకు పోతాడు. వాడి తెలివి చూసి స్కూళ్ళో పంతుళ్ళంతా  ఆశ్చర్య పోయేవారు  చిన్నప్పటి నుంచే.  అదేదో ‘ ఏక సంధా గ్రాహిట! ‘అదేట వాడు. కేవలం  చదువే కాదు , వాడి బుధ్ధీ చాలా మంచిది. పెద్ద లెవరు కనిపించినా నడుం వంచి మరీ నమస్కరిస్తాడు.  ఎవరికైనా ఎదైనా సాయం కావలిస్తే  వెనకా ముందూ చూసు కోకుండా చేసేస్తాడు. వాడి చేతి వ్రాత చక్క గా ముత్యాలు పొదిగి నట్లుంటుంది.  ముత్యాలకైనా  కాస్తంత ఎక్కడైనా  వంపులుంటాయేమో  కానీ  మా అన్న చేతి వ్రాత అచ్చంగా అచ్చు గుద్ది నట్లుంటుంది. వాడి చేతి వ్రాతకే  మాస్టార్లంతా ముగ్ధులై పోయేవారు  . ఎన్ని ఉన్నా ఏం లాభం?  వాడి చేతి వ్రాత ఎంత బావుంటుందో వాడి తలవ్రాత అంత బాగా లేదు.  దానికి కారణం మేం పుట్టిన కులం .ఆకులాని కున్న పెద్ద పేరు. అదేమా పాలిటి శాపమైంది.కూటికి కొర గాని పేరు.                                                                                                                                                                                              
               మాతాత  అంటూంటాడు " పుట్టినపుడూ మంచి రోజు చూడను బ్రాహ్మడు  కావాలి ,పేరు పెట్టేప్పుడూ కావాలి,జాతకం చూసి చెప్పనూ,అన్న ప్రాశనకూ,అక్షరాభ్యాసానికీ,పెళ్ళికీ పేరంటాలకూ, ఇళ్ళలో చేరనూ,చివరకు చావుకూ బ్రాహ్మడు కావాలి, మంచికీ చెడుకూ అన్నింటికీ కావా లి, కానీ ఆ కులాన్నిమాత్రం అంతా ద్వేషించేవారే ! వారేం పాపం చేశారనీ?  వెనకటి కొక కధ చెప్పినట్లు ‘మేకపిల్ల నదిలో దిగువన నీరు త్రాగు తుండగా తోడేలు, చూసి దాన్ని ఎలాగైన చంపి తినాలని యోచించి, "నీ ఎంగిలి నీరు నాకు వస్తున్నది , నాకు కోపం వచ్చింది నిన్ను చంపే స్తాను " అందిట, దానికా మేకపిల్ల " అదేలా వస్తుంది తోడేలు మామా! నేను దిగువన నీరు త్రాగుతున్నాను , నీ ఎంగిలే నాకు వస్తున్నది " అనగా, తోడేలు " మీతాత  వెనకటికి నేను నీరు త్రాగుతుంటే  ఎంగిలి నీరు  వదిలాడు. అందుకని నిన్ను చంపు తాను "అందిట . దానికి మేక పిల్ల "నేను అప్పటికి పుట్టనైనా లేదు , నీవైనాపుట్టి ఉన్నవోలేదో! నన్నేదో చేయాలని ఇలా అంటున్నావు , ఐనా ఆపాపం నాకెలా వస్తుందీ?  " అంటూ తుర్రుమందిట. అలా  ఎప్పుడో ఎవరో ఏదో చేశారని ఇప్పుడు మన కీ బాధలా! " ఆయ నెంత  అనుభవంతో , బాధతో  ఆమాటన్నా డో తెలీదు  కానీ,  మా అన్నమాత్రం మాఈ  కులంలో పుట్టడమే వాడి పాలిటి నేరమూ, శాపమూ ఐంది.     
                                                       ******             
 "ఎమే చెల్లాయ్! పోస్ట్ మ్యాన్ పోలయ్య వచ్చాడుటే!" ఇంట్లోంచీ విని పించిన అన్న మాట కు తల పైకెత్తి చూసి " లేదురా ! ఇంకారా లేదు.  ఇక్కడే ఉన్నాలే రా!"  అని జవాబిచ్చాను . మళ్ళీ నా ఆలోచన ఏటో  పోతోంది.                                                                                                                              మా అన్నకు  తాత మాటంటే మహా గురి. మా ఊరి సర్కార్ బళ్ళో చదివేప్పటి నుంచే మా  అన్న మా తాత తో కల్సి పూజలకూ,  వ్రతాలకూ వెళ్ళే  వాడు . అవీ ఇవీ మా తాతకు అందిస్తూ పూజలయ్యాక  భోజనం చేసి వచ్చే వాడు. మా తాత చేసినట్లే తానూ చేయగల  నేర్పు సంపా దించాడు . వాడు ఏకసంధా గ్రాహి కదా!  
మా అమ్మా ఎవరైనా వంటకు పిలిస్తే  వెళ్ళేది . నేనూ వెళ్ళి’ అమ్మకు సాయం ‘- అన్న పేరుతో ఇంత తిని వచ్చేదాన్ని. అమ్మ తినకుండా వాళ్ళిచ్చింది  డబ్బాలో  పెట్టుకు తెచ్చి అన్నకు పెట్టేది . చాలా సార్లు అమ్మ కడుపునిండా నీళ్ళు త్రాగటం  చూశాన్నేను. మా నాన్న తన అసహాయతకు కళ్ళనీళ్ళు పెట్టుకోడం నేనూ , అన్నా కూడా చూశాం .                                                                                          
   అన్న అనేవాడూ " నాన్నా! దుఃఖ పడకు, నేను బాగా చదువుకుని ఉద్యోగం చేసి మీ కంతాకడుపు నిండా అన్నం పెడతాగా!"  అని.    ఆమాట విని  మానాన్న మరింతగా దుఃఖ పడేవాడు,  అమ్మ సరే సరి, ఆమె కళ్ళు ఎప్పుడూ మా పరిస్థికి గంగా యమున లే.                                          
   తాత మాత్రం "నిజం రా ! బాగా చెప్పావు. నీవు సాధించి తీరుతావురా! నాకా నమ్మక ముంది, మన గాయత్రీ మాతే మనకు రక్ష ,మనం చేసే జపం ఎందుకు వృధా పోతుంది రా! నీకు మంచి ఉద్యోగం వచ్చితీరుతుందిరా నాన్నా! అని మా అన్న బుజం తట్టి ధైర్యం చెప్పేవాడు.                                                   ఎవరైనా ముత్తైదువుకు పెట్టే తద్దినాలకు అమ్మను పిలిస్తే , వంట కూడా తానే చేస్తాననీ , మంత్రాలు చెప్పను  తాతనూ , భోక్తగా మానాన్న నూ పిలవమని కోరేది. ఆరోజు అంతా కడుపు నిండా తినేవారం. వారు అమ్మకు పెట్టే చీరతో నాకు పరికణా కుట్టేది చేత్తోనే. అన్నకు వడుగు చేసి జంధ్యం వేయటాన వాడికీ బాలవటువు గానో ,సుబ్రహ్నణ్య  షష్టికి  బ్రాహ్మచారి గానో  వెళ్ళే అవకాశం అప్పుడప్పుడూ దక్కేది.                                                                                                                  
          అప్పుడు మాఊరు  500 గడప గల ఊరు. క్రమేపీ జనం నగరాల బాట పట్టి నేడు పాడుపడ్ద పల్లైంది. మాఊరిబాగు గురించీ ఎవ్వరికీ పట్టదు.  మా ఊరి సర్కార్ బడి పెద్దపంతులు అన్నగారు  ఒకమారు వారింట బాలవటు పూజలో అన్నను చూసి, వివరాలడిగి వాడిని తనతో బలవం తాన నగరం తీసుకెళ్ళి వారాలు కుదిర్చి , తమ కారు షెడ్ లో వసతి కల్పించి  హైస్కూల్ లో వేసి చదువు కొనసాగించాడు. అలా వాడి చదువు పట్టణం లో  హైస్కూల్ దాకా కొనసాగింది. మా అన్నకు పదో తరగతి లో పట్టణానికే ఫస్ట్ వచ్చిందిట. కొన్నికాలేజీలవాళ్ళు ఫ్రీగా చదువు చెప్పించి ఇంజనీర్నో  డాక్టర్నో చేస్తామన్నారు. మా అన్న ఒప్పుకోలేదు. అన్నేళ్ళు  చదువుతూ కూర్చుంటే మా అందరి పొట్టలూ నింపేదేలా అనీ.  వాడికి ఎప్పుడూ అదే ధ్యాస పాపం .
మా అన్నకు మేమంటే ప్రాణం, మాప్రాణాలూ మా అన్నమీదే! వాడికి  మొదటి నుంచీ సాయం చేసిన పంతులు గారి సాయంతోనే ప్రభుత్వ కాలేజీలో  ఇంటర్లో చేరాడు. ఆపంతులుగారి  సలహా తోనే  లైబ్రరీ లో  ఏవేవో  పుస్తకాలు చదువుతూ  బ్యాంక్ పరీక్షలకూ ,LIC పరీక్ష లకూ , ఇంకా ఏవేవో ఆఫీసుల్లో ఉద్యోగాలకూ టెంత్ క్లాస్ మార్కుల తో వచ్చే పోస్టల్, టెలిఫోన్ ఆఫీసుల్లో ఉద్యోగాలకూ రాత్రింబవళ్ళూ చదివేవా డు. ఆపంతులు గారి కారు షెడ్లో ఉంటూ వారింట పనులన్నీ చేస్తూ వారి అబ్బాయి కారు డ్రైవర్ సలహా మేరకు కొన్ని కార్లు తెల్ల వారు ఝామునే లేచి వెళ్ళి కడుగుతూ జీవించను కావాల్సిన పనులె న్నో నేర్చు కున్నాడు. 
వాడి జీవిత ఆశయం మా అందరికీ వెతుక్కో కుండా కడుపు నిండా ఇంత తిండి పెట్టడమే.’ ఆకార్లు కడగ్గావచ్చిన సొమ్ము దాచి మమ్మ ల్నిచూడను వచ్చేప్పుడు బియ్యం,పప్పూ ఇంకా కొన్ని దినుసులూ కొని మోసుకు తెచ్చేవడు పాపం. అవిచూసి అమ్మా, నాన్న కన్నీళ్ల తో అంటే ఆనంద భాష్పాలను కుంటా వాడి తల కడిగే వారు. 
                 ***                                                                                                                                                                                                        "ఏమే చెల్లాయ్! పోస్ట్ మేన్ పోలయ్య  వచ్చాట్టే!" మళ్ళీ మళ్ళీ ఇంట్లోంచీ అన్నమాటలు . వాడికి జ్వరం వచ్చి లేవలేక  లోపలినుంచీ  కేక లేస్తు న్నాడు లేని ఓపిక తెచ్చుకుని.  "ఒరే అన్నా! నే చెప్తాలేరా ! కళ్ళు మూసుకు పడుకో."అని నేనూ అరిచాను.                                                                                         ఉచితంగా వచ్చేది కానీ, భిక్ష మెత్తడం కానీ కూడని పనని మా ఇంటిల్లి పాదీ విశ్వసించే మాట.  పట్టణంలో చదువుకునేప్పుడు ,ఒక రోజు న వాడు కారు కడుగు తుంటే పక్కింటి తాత గారు ఒకాయన చూసి, దగ్గర కొచ్చి "నిన్నెక్కడో చూసి నట్లుందయ్యా!" అంటూ ఊరూ, వివ రాలూ అడిగి ,"ఇదేం పనయ్యా ! మీ ముత్తాత గారు వేద పండితులు, ఆయన గొంతువిప్పి వేదం చదువు తుంటే అంతా మహదా నందం గా శిలల్లా నిల్చుని వినేవారు. ఆయన కంఠం అలాంటిది, ఖంగు ఖంగున మ్రోగు తుండేది కంచు ఘంటలా. అప్పుడు నేను చిన్న వాడ్ని. ఐనా గుర్తుంది. అలాంటి వంశంలో పుట్టిన నీవేంటయ్యా ఇలా కార్లు కడగడం ! సిగ్గు సిగ్గు!" అన్నారట.                                             దానికి మా అన్న" తాత గారూ!వేదం వినేవారు తగ్గిపోయి ఆదరణ, పోషణ లేక , మా తాతగారు పూజలు, వ్రతాలు, పెళ్ళిళ్ళూ , క్రతువు లూ చేయిస్తూ, అవే మంత్రాలు మా నాన్నగారికి నేర్పారు.వాటికీ ఆదరణ తగ్గి, మనిషి చనిపోగానే కాశీవెళ్ళి బూడిద గంగలో పోసేసి పిండ ప్రదానం చేసేసి చేతులు దులిపేసుకుని పోతుండగా ,తద్దినాలు పెట్టేవారు లేక వాటికీ డిమాండ్ పోయింది. ఐనా తాత గారూ! కాని పని చేస్తే సిగ్గు కానీ ఇలా కార్లు కడుక్కుని సంపాదించి కడుపు నింపు కుంటే సిగ్గెందు కండీ!"అన్నాట్ట.                                                             
       “నిజమే లేవయ్యా! మీవంశం అలాంటిది .ఎవ్వర్నీచేయిచాచి  అడుగేవారు కాదు మీ ముత్తాతలు సైతం. కష్టపడి క్రతువులో కర్మలో చేసి మాత్రమే  తగిన సొమ్ము దక్షిణగా పుచ్చుకునేవారు."అంటూ వెళ్ళా ట్టాయన.                                                                                                  
   మాఅన్న కు సాయంచేసిన పంతులు గారు కాలం చేశాక మా అన్న అక్కడ నుంచీ తిరిగి మా పల్లెకు వచ్చేశాడు. ఆయన కుటుంబ మూ ఏదో నగరానికి వెళ్ళిపోయిందిట. అప్పటికి మా అన్న డిగ్రీపూర్తైంది . ఉన్న నూకలతో మా అమ్మ గంజికాచి ఇస్తే, కాంతి లేని వీధి లైట్లలో చదివి , చదివి పోటీ పరీక్షలన్నీ వ్రాశాడు. వాడి దగ్గర చెప్పించుకోను వాడి స్నేహితులు మోటార్ బైకుల మీద వచ్చివెళ్లేవారు. వాళ్ళు మా అన్నకోసం పండ్లూ ఫలాలూ, స్వీట్లూ తెస్తే మా అమ్మ అవన్నీ వాళ్లకే ఫలహారంగా పెట్టేది.  మాపల్లెకు వచ్చి మాఇంటి ముందు న్న వేపచెట్టు అరుగు మీద కూర్చుని చెప్పించుకుపోయేవారు.మా అన్నచెప్తుంటే వింటున్న నాకే అన్నీ అర్ధమయ్యేవి, అంత బాగా చెబుతుండ బట్టే అంత దూరం నుంచీ  వాడికోసం వాడి స్నేహితులు వస్తున్నారని అర్ధమైంది.                                                   
    వాడికి మహా నమ్మకం తప్పక ఏదో ఒక ఉద్యోగం వచ్చేస్తుందని. వాడి స్నేహితులంతా యోగ క్షేమాలు ఉత్తరాలు వ్రాసేవారు. రిజల్ట్స్ రాగానే కార్డు ముక్క వ్రాస్తామని. టెలిగ్రాములు ఆగిపోయాయిట అందుకని. మా ఊరికి పేపర్లూ రావు. ఎవరైనా టౌన్ కెళ్ళి తెస్తేనే. మా ఊర్లో ఎవరికైనా ఉన్నాయేమో కానీ కడుపుకు తిండేలేని మాకు ఫోన్లెలా ఉంటాయీ!.                                                                    
   మా అమ్మకూ వంటలు తగ్గి పోయాయి.కర్మ క్రతువులూ లేవు. సగం , ముక్కాలు  ఊరు టౌన్ కెళ్ళిపోయింది. చిన్నపాటి రైతులూ ,కౌలు చేసేవారూ తప్ప. అంతా మాలాగా ఒక పూట గంజి త్రాగి బతికే వారే!                                                                                 
   మా అన్నమాత్రం ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచి , స్నానం ,జపం ,సంధ్యా వందనం చేసేసుకుని మా ఇంటి ముందున్న , ఇల్లంటే పూరి పాక.  ఆ పాకే మా అందరికీ ఆశ్రయ మిస్తున్న దేవాలయం, వేపచెట్టు క్రింది మట్టి అరుగుమీద కూర్చుని మనస్సులో గాయత్రి జపిస్తూ పోస్ట్ బంట్రోతు కోసం ఎదురు చూసేవాడు. ఆబంట్రోతు భుజానికున్న సంచీలోనే  - వాడి-- కాదు కాదు మా భవిష్యత్తు దాక్కో నుందని మా అన్న అభిప్రాయం .                                                                                                                                               
    మా తాతగారు పాకా ముందున్న మట్టి అరుగులమీద కూర్చుని ఉదయ సంధ్య నుంచీ సాయం సంధ్య వరకూ  సంధ్యా వందనం చేసు కుంటూ నీరు నోట్లో ఉధ్ధరిణె తో పోసుకుంటూ గొంతు తడుపుకుంటూ , కడుపునింపుకుంటూ గడుపు తుంటాడు. మానాయన మాత్రం సంధ్యా వందనం తర్వాత ఊర్లో ఉన్న పాడు పడుతున్న ట్లున్న శివాలయానికి వెళ్ళి , అటునుంచీ ఊర్లో ఉన్న నాలుగు వీధులూ తిరిగి తిరిగీ వస్తుంటారు.  ఎవరైనా ఏదైనా మంచి రోజో , తిధో వారమో చెప్పించుకుని , ఒక్క పది రూక లైనా ఇస్తారనే ఆశతో.                                                                                                                                                                    
     మా అమ్మ స్నానం చేసి తన కున్న రెండో చీర ఆరేసుకుని అది అరిందాకా తులసి కోట వద్ద జపం , పూజా లలిత చదువు కుంటూ కూర్చుంటుంది. ఆ లలితా మాతను మనస్సులో , "అమ్మా! ఈ పూటన్నా మా ఇంట్లో పొయ్యిలో పిల్లిని తరిమేసి అగ్గివెలిగిస్తావా! మాపై ఎందుకమ్మా ఇంత సీత కన్ను? ఏం పాపం చేసి పుట్టామమ్మా అంతా ఒక్క ఇంట్లో?" అని ప్రశ్నించుకుంటూ కూర్చునుంటుంది.   అప్పుడప్పుడూ అమ్మ నాకు ధైర్యం చెప్ప నో తనకు తాను ధైర్యం చెప్పుకోనో,  "మనకేమే చిన్నీ! మన పులుసు రాచ్చిప్పలో రామాయ ణమూ, మన బియ్యం బానలో భారతమూ, మనవంట వేదిక మీద వేదాలూ ,మన ఉట్టి మీద ఉపనిషత్తులూ  ఉండగా మనకేం భయమే! అవన్నీ మనల్ని చూడవూ?!" అంటూ నీళ్ళు నిండిన కళ్లతో నన్ను తన గుండెలకు గాఢంగా హత్తుకుంటుంటుంది అప్పుడప్పుడూ , నా మీద వెర్రి ప్రేమ పుట్టి నప్పుడేమో మరి !. లేక తమ అసహాయత గుండెల్ను పిండినప్పుడో!                                                                                                                                                         
     నేను మాత్రం ఇల్లు చిమ్మి, తోమేందుకు అంట్లేం ఉండవు కనుక , దొడ్లోవేసుకున్న పూల మొక్కల పూలు కోసుకుని, వాటికి నీళ్ళు పోసుకుంటూ, మాల కట్టుకుంటూ అందర్నీ గమనిస్తూ  మధ్య మధ్యలో ఒక్కోగ్లాసు నీళ్ళు త్రాగుతూ ఉంటాను. ఆమధ్య మా అమ్మ ఒక పనిచేసింది. బీర, సొర , గుమ్మడి , టమోటా చిన్న మొక్కలు దిబ్బలో దొరికితే తెచ్చి నాటింది. మిట్ట మధ్యాహ్నం వరకూ చూచి చూసి ఆతర్వాత ఆ చెట్ల కాయలు కోసి , అన్నీకలగలిపి ,ఏదో ఒకటి వండు తుంది.అది అందరం దేవునికి నివేదనచేసి మా దొడ్లో అరిటాకులో పెట్టు కుని తినేస్తాం, అదే కూర, అదేపప్పూ, అదే అన్నం, అదే పెరుగు అని ఊహించుకుని తినేస్తాం. కాలే కడుపుకు మండే గంజిలా-. అంటారుకానీ ఆగంజీదొరక్క. ఆకలి రుచెరగదు కదా! ఐనా మా అమ్మచేయి తిగిరిన వంటగత్తె. ఆచేత్తో ఏం చేసి పెట్టినా మధురం గానే ఉంటుంది, ఆమె ప్రేమ ,అప్యాయత అంతా దాన్లో రంగరిచి పోస్తుందనుకుంటా.షిరిడీ సాయిబాబాలాగా. మా పెరట్లో ఉన్న జామ, బొప్పాయి,  అరటి చెట్లకు మేమంటే ఎంతో ప్రీతి, బాగా కాయలు కాచి మా కడుపులు నింపు తుంటాయి.నేను కొన్ని పండ్లు శివునికి కూడా సమర్పింస్తుంటాను.          
    నేను చిన్నతనంలో మాఊర్లో అప్పుడున్న, సర్కార్ బళ్ళో ఐదోక్లాస్ వరకూ చదువుకుని , ఇంట్లో మాతాత గారివద్ద సంస్కృతమూ, అమ్మవద్ద అన్నిదేవతల స్త్రోత్రాలు , రామాయణ మహా భారతాలూ , భగవద్గీతా, శతకాలూ , మా అన్నవద్ద కాస్తంత ఆంగ్లమూకూడా వంట బట్టించుకున్నాను. ఏం లాభం ఏదీ దేనికీ పనికి రాదాయె మాపాడుపడ్డ పల్లెలో . పోనీ నేను నేర్చుకున్నది ఎవరికైనా పిల్లలకు చెప్దామన్నా అంతా నగర నాగరికత కెళ్ళిపోయారు, అందుకే  సర్కార్ బడీ మూతపడింది. 
***                                                                                                                                                           పదిరోజులుగా తుఫాన్ . ఊరంతా జలమయం ఎక్కడికీ వెళ్ళేందుకు లేక ఇంట్లోనే కడుపులో కాళ్ళు ముడుచు క్కుర్చున్నాం. మా అన్న కు  జ్వరం కూడా వచ్చింది. పది రోజులయ్యాక వాడి జ్వరమూ, వానాకూడా కాస్తంత తగ్గింది. ‘చలి గాలిరా’ అని ఎంత వద్దంటున్నా విన కుండా మా అన్న  ఇంట్లోంచీ వచ్చి మా ఇంటిముందున్న వేప చెట్టు అరుగుమీద కూర్చుని పోస్ట్ బంట్రోతు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు.                       
 " ఒరే అన్నా! పోస్ట్ బంట్రోతు పోలయ్య వచ్చే సరికి మధ్యాహ్నం అవుతుందిరా! పైగా నగరం నుంచీ మట్టి రోడ్డెలా ఉందో తెలీదు కదురా! ఇంట్లోకొచ్చి కూర్చోరా! ఎందుకురా అలా ఎదురు చూట్టం? ఊర్లోకి వస్తే మనకు ఉత్తరం వస్తే ఇవ్వక ఎటుపోతాడ్రా!?" అన్నాను.                                                                                                                                                   
  దానికి అన్న పెరిగిన గడ్డం లోంచీ నిరాశగా నవ్వుతూ " చెల్లాయ్!వారం క్రితమే రిజల్ట్స్ వచ్చి ఉంటాయ్! మా స్నేహితులు కార్డ్ వ్రాయ లే దంటే నాకు అనుమానమేనే! ఐనా మెరిట్ కు ఉద్యోగాలెవరిస్తారే? ఉత్తర దక్షిణాల్లేకుండా ఉద్యోగం ఎలావస్తుందే? నాపిచ్చిగానీ! కన్న అమ్మా నాన్నలకు కడుపు కింత అన్నం పెట్టి కనీస రుణం తీర్చుకోలేని చవటనై పోయానే! "అంటూ పిచ్చిగా నవ్వి,మో కాళ్లలో తల దాచు కుని రోదిస్తున్న వాడ్ని చూస్తుంటే నాకు బాధేసింది. ఏడుపొచ్చింది.                                                                          " ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం కనీసం ప్యూన్ ఉద్యోగమన్నా మా అన్నకు ఇప్పించు గాయత్రీ మాతా!" అని ఆతల్లికి నమస్కరించుకుంటూ నేనూ వాడిపక్కనే  కూర్చున్నాను , గాయత్రి జపిస్తూ .                                                                                                               తాతగారు " ఒరే బాబూ! నీకు తప్పక ఉద్యోగం  ఆర్డర్ వస్తుందని నా మనస్సు చెప్తోందిరా! తప్పక వస్తుంది." అన్నారు.                       
     ఇంతలో అన్న స్నేహితులు పదిమంది మోటార్ బైకుల్లో వచ్చారు. "రాఘవా! మా అందరికీ బ్యాంకుల్లో, ఎల్.ఐ.సీలో , కలెక్టర్  ఆఫీసు, తాలుకా ఆఫీస్ లో ఉద్యోగాలు వచ్చాయి. తుఫాన్ కారణంగా వెంటనే రాలేకపోయాం రా! నీకు మాత్రం....."అంటూ  తలలు వంచుకుని మౌనంగా నిల్చున్నారు.
"ఏమైందిరా! నాకే ఉద్యోగమూ రాలేదా! నేను దేనికీ సెలక్ట్ అవలేదా! నాకు ఉద్యోగం చేసే యోగ్యతే లేదా!" అంటూ ఆవేశంగా ,ఆరాటంగా వాళ్ల కేసి చూస్తూ అడిగాడు.                                                                                           
 "రాఘవా! నీవే మాకు కోచింగ్ ఇచ్చావు, కానీ నీకు మాకు వచ్చిన ఉద్యోగా లేవీ రాలేదురా!! సో సారీరా రాఘవా! నీకూ--- నీకూ ---మాకు ఉద్యోగం వచ్చిన బ్యాంకు లో ప్యూన్ ఉద్యోగం వచ్చింది, బాధగా ఉందిరా!" అన్నారు వారు.                                                             
  " ఎందుకురా బాధ! నాకూ ఏదో ఒక ఉద్యోగం  వచ్చింది అంతే చాలు. మావాళ్ళలందరికీ వెతుక్కో కుండా కడుపు నిండా ఇంత అన్నం పెట్ట వచ్చు కదరా! తాతా నాకూ ఉద్యోగం వచ్చింది, నీవిక ఉధ్ధరిణె తో నీళ్ళుత్రాగుతూ కూర్చోనక్కరలేదు. చెల్లాయ్ ! నాకూ ఉద్యోగం వచ్చింది . నేనూ ఉద్యోగి నయ్యాను. అమ్మా! నాన్నా! నేనూ  ఉద్యోగినయ్యాను. మీకంతా కడుపునిండా ఇంతన్నం వేళకు పెట్టగలను. అమ్మా నీవింక కూరగాయలతో పులగం వండక్కర్లేదు. నాన్నా నీవింక గ్రామలో రూపాయకోసం ఎదురుచూస్తూ తిరగక్కర్లేదు.   చెల్లాయ నీవింక జామపళ్ళుతిని నీరుత్రాగక్కర్లేదు.  మన గాయత్రీమాత మనలను ఆదుకుంది. నాకు ఉద్యోగం వచ్చింది   " అంటూ నన్ను పట్టు కుని గిరగిరా త్రిప్పుతున్న  అన్న ను  చూసి వాడి ‘అల్పసంతోషాని’ కి నాకూ సంతోషమేసింది.     
.                      &&&&&&&&&&&&  

No comments:

Post a Comment