Wednesday 16 April 2014

నిజాయితీ మహిమ


 

నిజాయితీ మహిమ

రచన: ఆదూరి హైమవతి

రాజు, రవి చదువు పూర్తయి, ఉద్యోగంకోసం ఎదురుచూస్తున్నారు. ఇద్దరికీ ఒకే కంపెనీలో ఇంటర్వూకు పిలుపు వచ్చింది. ఆ పట్టణంలోని ఒక ఆంజనేయ స్వామిని అంతా  ' ఉద్యోగాల ఉపాసన ఆంజనేయ స్వామి' అని పిలుస్తూ భక్తిగా  పూజిస్తారు. చాలా ప్రసిధ్ధిపొందిన ఆ హనుమాన్ ఆలయానికి ఇద్దరూ 'ఉద్యోగం తమకు దక్కా'లని ప్రార్ధించడానికి వెళ్ళారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉండేవారంతా ఆఆలయానికివెళ్ళి, గర్భగుడి వెనుక గూట్లో ఉన్న ఆంజనేయ ప్రతిమవద్ద వంటరిగా పెద్దగా తమ కోర్కెను విన్నవించుకోడం వాడుక! అలా ఆ గూట్లో ప్రతిమకు విన్నవించుకున్నవారికంతా ఉద్యోగాలు వచ్చేసినందున ఆ వీరాంజనేయస్వామికి 'ఆ పేరు స్థిరపడిందిట!. 
స్నేహితులిద్దరూ ఆలయంలో ప్రవేశించి, అర్చించాక ముందుగా రాజు ఆలయం వెనుకకు వెళ్ళి ఆంజనేయ ప్రతిమకు తన కోర్కెవిన్నవించుకుని వచ్చాక, రవి వెళ్ళి తన విన్నపం మనవిచేసుకుని వచ్చాడు. 
మరునాడు ఇద్దరూ ఉద్యోగానికై ఇంటర్య్వూకు హాజరైనారు. ఆఫీసర్ గారు ఆ ఉద్యోగానికి వచ్చిన వారందరి సర్టిఫికేట్స్ పరిశీలించి అందరిలో ఎక్కువ అర్హత ఉన్న రాజు, రవిలను ఎంపికచేసి "ప్రస్తుతం ఒకే ఖాళీ ఉంది. మీఇద్దరిలో ఒకరికే ఉద్యోగం వస్తుంది. మీరు 'ఉద్యోగాల ఉపాసన ఆంజనేయ స్వామి'ని ప్రార్ధించే వచ్చి ఉంటారనుకుంటాను. మీరు ఏమని ప్రార్ధించారో ఈ పేపర్లో వ్రాసిఇవ్వండి" అని వారిద్దరికీ చెరో తెల్లకాయితం ఇచ్చారు. వారిద్దరూ తాము ఆంజనేయునికి విన్నవించుకున్న కోర్కెను వ్రాసి ఇచ్చారు. ఆఫీసర్ అవి చదివి..
"భళీ! బావుంది. సరే నేను నామనస్సు మార్చుకుంటున్నాను. మీఇద్దరికీ ఉద్యోగాలు ఇవ్వదలచాను" అని చెప్పి టైపిస్టును పిలిచి "వీరిద్దరికీ అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ టైప్ చెసి ఇచ్చి, ఈరోజే చేర్చుకోండి" అని చెప్పారు. ఇద్దరికీ ఆశ్చర్యమేసింది, ఒకే ఉద్యోగం ఉందని చెప్పిన ఆఫీసర్ ఇద్దరికీ ఉద్యోగం ఇవ్వడంలోని ఆయన ఆంతర్యం వారికి అర్ధంకాలేదు.
వారిద్దరూ ఏమని హనుమతుని ప్రార్ధించారో ఊహించగలరా! పిల్లలూ! రాజు "హనుమంతా! రవి నాకంటే ప్రఙ్ఞావంతుడు, నాకు ఉద్యోగం వెంటనే అవసరం, మాతండ్రి రిటైరయ్యారు, చెల్లి పెళ్ళి చెయ్యాలి, అమ్మ ఆరోగ్యం బాలేదు, వైద్యం చేయించాలి, రవి నాప్రాణమిత్రుడే! కానీ అతని కంటే ముందుగా నాకు ఉద్యోగం అవసరమని నీకూ తెల్సు! రవికి బాధ్యతలు నాకంటే తక్కువ, కనుక ఒకే ఉద్యోగం ఉంటే నాకే ఇప్పించు. ఇది స్వార్ధంకాదు, మిత్రద్రోహమూ కాదు. నా బాధ్యతలు నిర్వహించుకునే అవకాశం ఇప్పించమనే విన్నపం." అని ప్రార్ధించాడు.
రవి "స్వామీ! ఇద్దరం ఉద్యోగానికై హాజరవుతున్నాం, కానీ రాజుకు నాకంటే ముందు ఉద్యోగం అవసరం, ఒకే ఉద్యోగం ఉంటే ముందుగా రాజుకే ఇప్పించు, ఇది నావిన్నపం." అని ప్రార్ధించాడు. ఐతే అధికారి వ్రాసి ఇవ్వమని కోరగా, ఇద్దరూ నిజాయితీగా, తాము ఆంజనేయ స్వామిని కోరిన కోర్కేలనే వ్రాశారు, ఆఫీసర్ గారు వారి నిజాయితీకి మెచ్చుకుని, అలాంటి నిజాయితీపరులే తనకు అవసరమని భావించి ఇద్దరికీ ఉద్యోగాలు ఇచ్చారు. నిజాయితీ మహిమ చాలా గొప్పదిమరి!.

1 comment: