Thursday, 10 April 2014

స్మరియింపుడు రామనామమున్

స్మరియింపుడు రామనామమున్

రచన: ఆదూరి హైమవతి

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం
అని చదువుకుంటూ తాత, క్రికెట్ బ్యాట్‌తో వెళుతున్న మనవడ్ని కేకేశాడు.
“ఒరేయ్ మనవడా! ఈరోజు సాయంకాలం రామాలయంలో ఉపన్యాసముంది. నన్ను తీసుకెళ్ళాలిరా!”
“నీకేం పనిలేదా తాతా! ఊరికే ఇంట్లో కూర్చోలేవా! ఎప్పుడూ ఉపన్యాసాలూ, సత్సంగాలూ, హరికధలూ, బుర్రకధలూ అంటూ నాబుర్ర, తినేయకపోతే ఇంట్లో కూర్చుని ఆ రామనామమేదో అనుకోకూడదా!” విరుచుకుపడ్డ మనవడు రాముని చూస్తూ బోసినవ్వు నవ్వాడు తాత.
“ఒరే రాముడు కూడా నీలాగే  ఇంట్లోకూర్చుని, కడుపులో చల్లకదలకుండా హాయిగా భార్యతో రాజ్యమేలుకోక అడవులపాలై తిరుగుతూ ఎందరో రాక్షసులను సంహరించి ఉండకపోతే ఈనాడు లోకమంతా రాక్షసమయం అయ్యేది!
'ఇప్పుడైనా ఆ సంతతివారే కదా తాతా పాలించేది' అంటూ వచ్చాడు రాము జతకాడు రాఘవ.
'ఐనా తాతా! నీకు రాముడంటే అంత ఇష్ట మెందుకూ! ఆయనా మామూలు మనిషేగా! భార్యను ఎవరో అపహరిస్తే ఏడ్చాడుట కూడానూ..' అంటున్న రామును చూసి, 'ఔనురా నీలాంటివారికంతే  తెల్సు. అందుకే రారా రామాలయానికి అంటున్నా, నాతో వచ్చి వినండి, సందేహాలుంటే అడిగి తీర్చుకోండి. కాస్తంత భారతీయ సంస్కృతి తెల్సుకోండి, ఇప్పుడే ఇవన్నీతెల్సుకోవాలి. పాశ్చాత్యత వంట బట్టించుకోక, భారతీయత గురించీ తెల్సుకుంటే భారతీయ సంతతిగామిగులుతారు., పదండి, ఇద్దరూనూ' అంటూ తాత ఇద్దర్నీ వెంట బెట్టుకుని రామాలయం చేరాడు.
అక్కడ శ్రీరామనవమి కావటంతో జనం క్రిక్కిరిసి కూర్చునున్నారు. ఉపన్యాసకులు ఉపేంద్రనాధ్ రాగానే అంతా లేచి నిలబడి చేతులు జోడించి నమస్కరించారు. ఆయన చిరునవ్వుతో అందరికీ ప్రతినమస్కారం చేసి రామార్పణం అంటూ, అందర్నీ కూర్చోమని సైగ చేశాడు. తనకు కేటాయించిన తుంగచాప మీద కూర్చుని ముందుగా, గణేశునీ సరస్వతీదేవినీ ధ్యానం చేసుకుని, గొంతు సవరించుకుని కమ్మని కంఠంతో ఇలా పాడాడు.
“వేదవేద్యే పరేపుంసీ జాతే దశరధాత్మజే 
వేదః ప్రాచేత సాదాసీత్ సాక్షాత్  రామాయణాత్మనా.."
వేదవేద్యుడైన భగవంతుడే రామునిగానూ వేదమే రామాయణం గానూ అవతరించింది. ఆవేదవేద్యుని గురించీ చెప్పుకోడం వినడం మహద్భాగ్యం.’ రామోవిగ్రహవాన్ ధర్మః ‘ అన్నారు, అంటే శ్రీరామచంద్రుడే ధర్మాన్ని ఆకారంగా దాల్చినవాడు.
అదెందుకో చెప్పుకుందాం. 'రామ' అనగానే మన మనస్సు ఆనందంతో నిండిపోతుంది.' రమతీతి రామః అంటే ఆనందించేవాడు రాముడు ,' రమయతీతిరామః ' అంటే ఆనందాన్ని కలుగజేసేవాడు అనికూడా అర్ధం. అంతేకాదు బాల్యం నుండే రాముని చేష్టలుకానీ మాటలుకానీ అతి మధురంగా ఉంటాయి. తన తమ్ముల పట్ల అన్నగా నిరంతరం బాధ్యతగా ప్రవర్తించేవాడు కూడా, అపారమైన ప్రేమవాత్సల్యాలను చూపేవాడు.
ఇతరుల ఆనందమే తన ఆనందంగా భావించేవాడు. ఒక చిన్న సంఘటన చూడండి.
అప్పుడు రాముడు బాలుడు. ప్రతినిత్యం తన తమ్ములైన భరత, లక్ష్మణ, శతృఘ్నులతో బంతాట ఆడేవాడు. సమర్ధుడూ, లాఘవం తెల్సినవాడూ కనుక ప్రతిరోజూ రామునిదే విజయం, తమ్ములు ముగ్గురూనూ అన్నైన రాముడు గెలిచినందుకు సంతోషించేవారు. ఒకరోజున బంతాట అయ్యాక రాముడు పరుగుపరుగున తల్లి కౌసల్య వద్దకువచ్చి  'అమ్మా! ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది' అంటాడు.
కౌసల్య స్వేదంతో నిండి ఉన్న ప్రియ తనయుని ముఖాన్ని, తన పట్టు చేలాంచలంతో అద్దుతూ ఎందుకు కుమారా! అంత సంతోషం. నీవు నిత్య సంతోషివే కదా! ఈరోజు ప్రత్యేకత ఏముందీ, అని అడుగుతుంది.
తల్లీ! ఈరోజున నా తమ్ముడు భరతుడు బంతాటలో విజయుడయ్యాడు. అందుకే నాకు ఇంత సంతోషం అంటూ చిన్నగా గెంతసాగాడు. ఇంతలో తమ్ములు ముగ్గురూ పరుగుపరుగున కౌసల్య మందిరానికి వచ్చి, అమ్మా! అమ్మా! అన్నెక్కడా!! ఈరోజు మేం ముగ్గురం చాలా విచారంగా ఉన్నాం. అంటారు, దుఃఖిత వదనాలతో.  
అమ్మా! నేను మరీ విచారంగా ఉన్నాను. ఈరోజు అన్న రాముడు బంతాటలో తాను ఓడి నన్ను గెలిపించాడు. అంటూ బాధపడసాగాడు భరతుడు.. కౌసల్య చిరునవ్వు నవ్వి  నాయనలారా! రాముడేమో ఈరోజు బంతాటలో తమ్ముడు భరతుడు విజయం సాధించినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. మీరేమో అన్న రాముడు ఓడిపోయినందుకు బాధపడుతున్నారు. భరతుని గెలుపు రాముని సంతోషమూ, ఆమోదమూనూ, మరి మీరు విచారించడం ఎందుకూ అంది చిరునవ్వుతో.
అమ్మా! అన్న ఓడిపోడం ఎరుగుదుమా! విన్నామా! తాను కావాలని ఓడిపోయి నన్ను గెలిపించాడు. అంటూ కళ్ళు తుడుచుకోసాగాడు భరతుడు.
భరతా! నీ విజయం నాకెంతో  ముదావహం. నీవు వివారించకు. అంటూ తమ్ముని భుజం తట్టసాగాడు రాముడు.
కౌసల్య... నాయనలారా! మీ పరస్పర ప్రేమాభిమానాలు నాకు చాలా సంతోషం కలిగిస్తున్నాయి మీరు ఇలాగే మీస్వభావాలను శాశ్వతంగా నిలుపుకోవాలని నా అభిలాష. మీలో ఎవరు విజయం పొందినా అది అందరిదీనీ, ఆవిజయం మన రఘువంశానిదే కదా! అంటూ అందరినీ దగ్గరకు తీసుకుంటుంది.
రాముడు బాల్యం నుంచే అలా తన తమ్ముల ఆనందమే తన ఆనందంగా ప్రవర్తించేవాడు.
మరి ఈ రామావతారంలో వారు ప్రత్యేకంగా మానవులకు ఎలా ఆదర్శప్రాయులయ్యారో రామకధను మనస్సుకు పట్టించుకుంటే కానీ తెలీదు. రాముని సేవించిన కపులు అనితర సాధ్యమైన వారధిని ఐదు రోజుల్లో నిర్మించగలిగారు అది రామనామ మహత్వం. 
విశ్వకర్మ కొడుకైన నలుని పర్యవేక్షణలో 100 యోజనముల పొడవు, 10 యోజనముల వెడల్పు గల వారధి కట్టారు. వానర భల్లూకసేనలు రాక్షసులనందర్నీ సమూలంగా నిర్జించాయి. ఇదీ రామనామ మహిమే! వారధి కట్టడంలో ఉడుత సైతం సముద్రపు నీటిలో మునిగి ఆ తర్వాత ఇసుకలో తన శరీరాన్ని పొర్లించి వారధికట్టే రాళ్ళపై ఆ ఇసుకని విదిల్చసాగింది. రామ కార్యానికై తన వంతు కృషి చేసినందుకు రాముడు సంతసించి దాని శరీరాన్ని మూడు వేళ్ళతో నిమురగా చారలు పడ్డాయిట! అంటే రాముడు చిన్నప్రాణి సేవనుకూడా గుర్తించేంత ఉత్తముడన్నమాట.
అరణ్య వాస సమయంలో ఒకమారు రాముడు నదీతీరంలోని ఇసుకలో తన విల్లునుంచి, చేతిలోని బాణాన్ని ఇసుకలో గ్రుచ్చి, ముఖ ప్రక్షాళన కావించుకుని వచ్చి గ్రుచ్చిన బాణం లాగగా దాని కొసకు రక్తం అంటి ఉండటం చూస్తాడు. ఆశ్చర్యంగా అక్కడ ఇసుక త్రవ్వి చూడగా ఇసుకలో ఒక కప్ప ఉంటుంది, దాన్ని బయటకు తీసి ఉపచారం చేసి ఓ మండూకమా! నాబాణం దిగగానే నీవు నన్నేల పిలువవైతివి అని ప్రశ్నించగా, ఆ అజిరము రామా! ఏమి నాభాగ్యము నేడు కదా నా జన్మ తరించినది. ఈ దెబ్బవలన కదా నాజన్మ సార్ధకమగునట్లు భగవాన్ రాముని అరచేత నిల్చితిని రామా! నాకెవరైనా ఆపద కలిగించినచో నేను 'రామా! అని తమను సాయంకోసం అర్థించే దాన్ని, కానీ, రామా నీ బాణమే నా మేనిలో దిగినపుడు సాయంకోసం మరెవర్ని అర్థించగలను. అందుకే నీ బాణం కలిగించిన బాధను ఓర్చుకుని ఉన్నాను అంటుందిట. రాముడు కారుణ్య  భావంతో దాని గాయాన్ని నయం చేస్తాడు. చూశారా! రాముని దయా స్వభావం. అంత చిరు జీవి కదాని దాన్ని పట్టించుకోకుండా వెళ్ళక దానిబాధ నివృత్తి చేసిన దయామూర్తి రాముడు.
మరొక మహాగొప్ప సంఘటన చెపుకుందాం. రామునికి మహిళల పట్లగల ఔదార్యం, గౌరవం మహా గొప్పవి.
రామ రావణ యుధ్ధంలో, రావణుడు సర్వ సేనా సహితంగా మరణించాక, ఎంతోకాలంగా నిల్చుని ఉండి కాళ్ళు పీకుతుండగా రాముడు ఒక ఎత్తైన రాతిమీద కాళ్ళూ బార్లగా జాపుకుని కూర్చుని సేదతీరుతున్నసమయంలో, దూరం నుండీ అక్కడికి ఒక స్త్రీ మూర్తి వస్తున్నట్లుగా గమనిస్తాడు. ఆమె మరికాస్త దగ్గరకు రాగానే చాపుకున్న తన కాళ్ళను ముడుచుకుని లేచి నిలుచుంటాడు.
అమ్మా! మీరెవరు ఈ నిశీధిలో, పీనుగుల గుట్టల మధ్య, వంటరిగా ఇలా నిర్భయంగా ఎందుకొచ్చినట్లూ అని ప్రశ్నిస్తాడు.
ఆమె చేతులు మోడ్చి రామా! నేను రావణుని పట్టపురాణిని మడోదరిని. నాకు ఎంతోకాలంగా మిమ్ము చూడాలనే కోరిక ఉండినది. ఐతే నేను విరోధిని చూడను నాభర్త అనుమతించడు. పైగా నాకు కొన్ని కట్టుబాట్లు, నిబంధనలూ ఉంటాయి. ఇప్పుడు అంతా మరణించాక నాకు ఏ అవరోధమూ లేదు కనుక, సకలగుణాభిరాముడనీ, సీతను తప్ప ఏ ఇతరస్త్రీనీ ముట్టుకోడనీ, ముట్టనివ్వడనీ విన్నాను. నా భర్త పరాయిస్త్రీలందరినీ నిర్భంధించి తన కౌగిట బంధించి బాధించేవాడు. పరస్త్రీల పట్ల మాతృభావం కల అంతటి ఉత్తమునీ, సకల సద్గుణాభిరామునీ, ఔన్నత్య మూర్తిని దర్శించి తరించాలనే మనసు తీరింది. వస్తాను, అని నమస్కరించి వెళుతుంది మండోదరి.
ఇదీ రాముని ఔన్నత్యానికి నిదర్శనం. అంతేకాదు రాముడు, సీతాకూడా చాలా హాస్య స్వభావులు. రాముని వివాహమయ్యాక ఒకరోజున వంటరిగా సీతతో పరిహాసమడుతూ రాముడు..  'సీతా మా అయోధ్యలో ప్రజలు నేల చాలుకు నాగళ్ళకు ’ఆడబిడ్డలు’ పుడుతున్నారని విని భయంతో భూమిదున్ననే సందేహిస్తున్నారు సుమా!' అన్నాట్ట పరిహాసంగా నవ్వుతూ.
సీత తల ఊచి 'అయ్యో... సత్యమా! మరి మా విదర్భ రాజ్యంలో ప్రజలంతా పండుగలకూ పబ్బాలకూ పాయసం వండుకోనే భయపడుతున్నారుట! పాయసానికి మగబిడ్డలు పుడుతున్నారని వారికి భయంట!' అంటుంది మరో విసురు విసుర్తూ. ఇద్దరికిద్దరూ పరిహాస ప్రియులే!
ఇహ సీతా మాత రామాయణంలో చాలా కధలు చెప్తుంది. సీత రామ లక్ష్మణులు వనవాస సమయంలో రోజుకో ఆశ్రమంలో నివసిస్తూ వారితో సత్సంగాలు చేసుకుంటూ ధర్మమీమాంస చేస్తూ వెళ్ళేవారుట! ఒక మారువారు ఒక ఆశ్రమాన్ని దర్శించను బయల్దేరుతుండగా సీత రాముని ధనుర్భాణాలు అందిస్తూ చిరునవ్వు నవ్వుతుంది. మెల్లిగా నాధా! వనవాసానికి వచ్చి, మీరిలా ఈ ధనుర్భాణాలు రోజూ ధరించడం నాకు ఆశ్చర్యంగా ఉంది సుమా! ఇవి ప్రస్తుతం, మనకు అవసరమా! అందిట. రాముడు నవ్వి  సీతా! మనం మునివేష ధారులమే కానీ మన స్వీయ రక్షణార్ధం బాణాలు ధరించడంలో తప్పేముందీ! అన్నాట్ట.
స్వామీ! నేను పసితనంలో ఉండగా మా తల్లిగారు నాకు చెప్పిన ఒక కధ గుర్తు వస్తున్నది చెప్పమన్నారా అందిట. 'రాముడు అరుగుపై కూర్చుని, చెప్పు వింటాను అన్నాట్ట. సీతమ్మ తల్లి, నాటికే నేటికీ ప్రభోధాత్మకమైన ఒక కధ ఇలా చెప్పిందిట. సీత తానూ కూర్చుని చెప్పసాగింది.
“పూర్వం ఒక ముని తపస్సు చేసుకుంటూ భగవత్ ధ్యానంలో కాలం గడపసాగాడు. ఆయన తపో మహిమకు భయపడ్డ ఇంద్రుడు తన పదవికి భంగం కలుగుతుందనే భీతితో యోచించి ఒక పధకం పన్నాడు. తాను ఒక బ్రాహ్మణ రూపంలో, పదునైన తళతళ లాడే ఒక పొడవైన కత్తిని జాగ్రత్తగా ఒరలో ఉంచుకుని ఆ ముని ఆశ్రమానికి వస్తాడు. ఆ ముని తపస్సు చాలించి విశ్రాంతి పొందేవేళ చూసి కళ్ళుతెరచి నంతనే సమీపిస్తాడు.
ఓ మునీశ్వరా నీవే దిక్కు రక్షించు.” అంటూ పాదాలపై బడతాడు. ముని,  బిడ్డా! నీవెవరు నీకొచ్చిన కష్టమేమి చెప్పు, నాచేతనైనదైతే తప్పక నీఇబ్బంది తీర్చే ప్రయత్నం చేస్తాను, అని అభయమిస్తా డు.
స్వామీ! మీరు చేయతగినదే! నేను ఒక పనిమీద  దూరప్రాంతం వెళ్ళవలసి వచ్చింది. నా ఈ కరవాలం నాప్రయాణానికి సమస్యగా ఉంది. దీన్ని జాగ్రత్త పరచను ఎవ్వరూ అంగీకరించడంలేదు. అందుకే  మిమ్ము ఆశ్రయించాను. దీని పదును తరుగ కుండా ప్రతినిత్యం తైలం అద్ది తుడిచి శుభ్రపరచి ఒరలో ఉంచాలి. మీకు శ్రమ ఇస్తున్నందుకు మన్నించండి మునీంద్రా! అంటూ వినయంగా చేతులు జోడించి నమస్కరిస్తాడు. ఆ మారు వేషధారి ఇంద్రుడనీ, అతడి కోరిక సరైనది కాదనీ, తన నిత్య కృత్యాలకు దానివల్ల ఆటంకం రానున్నదనీ గ్రహించలేని ఆముని ఆ బ్రాహ్మణుని కోరిక మన్నించి పంపుతాడు. లోకోపకారమే కదా మా ధర్మం! తప్పక నీకరవాలాన్ని మాఆశ్రమంలో భద్రపరుస్తాను వెళ్ళిరా బ్రాహ్మణోత్తమా! అని హామీ కూడా ఇస్తాడు. 
ఆరోజునుండీ ఆముని తన తపస్సు పక్కనపెట్టి, ప్రతిరోజూ స్వయంగా ఆకత్తిని  ఒరలోంచీ తీసి తైలంపూసి మెత్తని వస్త్రంతో తుడిచి శుభ్రపరచి తిరిగిదాన్ని ఒరలో ఉంచడం దిన చర్యగా మారుతుంది. కొంతకాలానికి తనమాట మేరకు దాన్ని చక్కగా శుభ్రపరుస్తున్నానో లేదో అనే  భావన మనస్సులో బలపడి దాన్ని తీసిచూడటం, పదును పరీక్షించడం మొదలెడతాడు. అతడి తపస్సు, ధ్యానం అటకెక్కుతాయి. మనస్సంతా ఆకర వాలం మీదే! కళ్ళుమూసినా తెరచిన్నా ఆ కత్తే కనిపించసాగింది. కొంతకాలమయ్యాక ఆకత్తిని  చేత్తోపట్టుకుని నడవసాగాడు. 
ఒకరోజున  అతడి కరవాలం తగిలి ఒక చిన్న మొక్క తెగిపోతుంది. ఆముని ఆహా! కరవాలం తగులగానే మొక్క తెగి పోయిందంటే దానికి పదును చక్కగా ఉంది, మరి ఈ వృక్ష శాఖ తెగుతుందేమో  చూద్దామని తలచి, ఒక వృక్ష శాఖను నరి కాడు. ఒక్క వేటుతో అది తెగిపడింది. ఆమునికిఎంతో సంతోషమైంది. అలాఆ అడవి లోనిమొక్కలు, వృక్షశాఖలను నరక సాగాడు, క్రమేపీ ఎదురైన జంతువులనూ, అడవిలో కనిపించిన మనుష్యులను సైతం నరికి నరహంతకునిగా మారి పోయాడు. అతడి తపస్సు కార్యక్రమాలన్ని నశించి, ఒక క్రూరునిగా తయారై, మరణానంతరం యమలోకాన్ని చేరాడు.
ఆయుధాలు ధరించి ఉంటే జరిగే అనర్ధాన్ని నేను ఈకధ వల్ల విన్నందున మీరు ఈ అరణ్య వాసంలో ఈధనుస్సు, బాణాలూ ధరించవలసిన అవసరం ఉందాని నా శంక కొలదీ అడుగుతున్నాను. అంది సీతమ్మతల్లి.
ఇలా రామాయణంలో ప్రతిపాత్రా రానున్న యుగాల్లోని మానవులకు ఆదర్శంగా నీతులనూ, కర్తవ్యబోధనూ చేసినవారే! ఇలా రామాయణం సర్వ వేళాలా సర్వ జనాళికీ ఆదర్శమైంది. 
వింటే రామాయణం వినాలి, తింటేగారెలు మాత్రమే తినాలి అనే మాట వినే ఉంటారు. రామాయణం సుధామధుర సమమైంది.  అందుకే ఈ పద్యం వినండి.
చక్కెరకంతె తీపి దధిసారముకంటెను రుచ్యమౌను పెం
పెక్కిన తేనెకన్న అతిరుచ్యమునీటనుపల్క పల్కగా
మిక్కిలి కమ్మనౌ అమృతమే యనిపించును కాన నిత్యమున్
చక్కగ దాన్ని మీరు మనసా!స్మరియింపుడు రామనామమున్--

భక్తాగ్రేసరులారా! ఈరోజున శ్రీరామనవమి సందర్భంగా మనందరం రామ చరిత్ర కాస్తంత సేపు చెప్పుకుని తరించాం. పవమాన సుతుడు పట్టుపాదారవిందములకూ నీనామ రూపములకూ నిత్య జయా మంగళం నిత్యంజయామంగళం.. అంటూ హారతి ఇచ్చాడు ఉపన్యాసకుడు. అంతా హారతి అద్దుకుని ప్రసాదం స్వీకరించి , ఇంటిదారిపట్టారు.
ఏరా మనవడా! రామాయణంలో ఏమీ లేదా వడపప్పు నముల్తూ అడిగాడు తాత. 
'తప్పైపోయింది తాతా, రామాయణమంటే ఏంటో తెలిసింది. రామనామం లోని గొప్పదనం తెలిసింది, మరెప్పుడూ నీరాముడ్ని, కాదు కాదు మన రాముడ్ని ఏమీ అనను గాక అనను' అంటూ లెంపలేసుకున్నాడు మనవడు టపటపామని.
ఓం శ్రీ రామాయ నమః

శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రభ.కామ్‌ పాఠకులకోసం ఆదూరి హైమవతిగారు పంపిన ప్రత్యేక కథ.

No comments:

Post a Comment