Thursday, 10 April 2014

మనసుంటే మార్గం.

హోం >> చిన్నారి

మనసుంటే మార్గం.

రచన: ఆదూరి హైమవతి

చిన్నారులూ! హనుమంతుడు అఖండ రామ భక్తుడు. ఆయన రోమరోమానా రామనామం వినిపిస్తుంటుందిట! అంటే నిరంతరం నిద్రలో సైత రామనామాన్ని ఏమారక స్మరిస్తుంటాడన్నమాట హనుమ. 
రాముని ఒక్కనిముషమైనా వదలి ఉండలేడు హనుమ. శ్రీరాముడు అరణ్య వాసం పూర్తయ్యాక అయోధ్య చేరి పట్టాభిషిక్తుడౌతాడు. ఆపట్టాభిషేకానికి సుగ్రీవుడు తన సేనతో వచ్చి సంతోషంగా కొద్దిరోజులు గడిపి తిరిగి కిష్కింధకు వెళుతూ, హనుమను కూడా రమ్మంటాడు. తాను మరి కొంతకాలం రాముని సేవచేసుకుని వస్తానని వారిని సాగనంపుతాడు హనుమ.
 ఎంతోకాలంగా అరణ్యాలలో సంచరించిన అన్నగారికి సకల సౌకర్యాలూ సమకూర్చాలని అనుకుంటారు ఆయన తమ్ముళ్ళంతా. లక్ష్మణ, భరత ,శతృఘ్నులు రామునికి చేసే సేవలన్నీ ఒక పట్టిక రాసుకుంటారు. అవన్నీముగ్గురూ పంచుకుని రాముని వద్దకుపంపి అనుమతి కూడా పొందుతారు. 
స్నానం చేసేప్పుడు అవసరమైనవన్నీ అందించడం, స్నానానంతరం ధరించే దుస్తులు ఎంపికచేసి అందించడం, విసనకర్ర పట్టుకుని గాలి వీచడం, పాదాలు వత్తడం, భోజన సమయంలో దగ్గరుండి అన్నీ చూడటం మొత్తం రామునికి చేసే పనులన్నీ ఉదయం నుండీ రాత్రివరకూ ముగ్గురూ పంచుకుంటారు. 
హనుమకు ఏ సేవా మిగలదు. హనుమ వారి ముగ్గురితో "నాకు ఏసేవా మిగల్చకుండా చేశారే?" అని అడగ్గా, వారు "హనుమా! ఈ పట్టికలో లేని సేవ ఏదైనా ఉంటే దానిని నీవు చేసుకోవచ్చు" అంటారు ముక్తకంఠంతో.
హనుమ తీవ్రంగా ఆలోచించి, ఒక్క గెంతువేసి "ఆ! దొరికింది రామ ప్రభువు ఆవలిస్తే 'చిటికె' వేసే సేవ నేను తీసుకుంటే మీకేమీ అభ్యంతరం లేదుగా?" అంటాడు. వారు నవ్వుకుని "మాకేమీ అభ్యంతరం లేదు" అంటారు. 
ఐతే ఆక్షణం నుండీ హనుమ రాముని వీడక నీడవలె వెంట ఉండసాగాడు. రాముని తమ్ములు ముగ్గురూ " హనుమా! నీవు ఇలా నిరంతరం రామ ప్రభువును అంటిపెట్టుకుని ఉంటే మేము మా సేవలెలా చేసుకుంటాం? నీ సేవ అవకాశం వచ్చినపుడు చేసుకో, నియమ భంగం చేయకు" అంటారు. 
అప్పుడు హనుమ నవ్వుతూ" అయ్యలారా! రామ ప్రభువు ఎప్పుడు ఆవలిస్తాడో ఎవరికెరుక? అందుకే నిరంతరం వెంటనే ఉండి ఆవలించగానే చిటికె వేస్తాను" అని చెప్పాడు. అలా నిరంతరం రామ సన్నిధిని పొందే అవకాశం అందిపుచ్చుకున్నాడా భక్తుడు. అందుకే ' మనసుంటే మార్గ ముంటుంది' అంటారు పెద్దలు.  

No comments:

Post a Comment