Thursday 10 April 2014

మహిళా 'మణిపూస'

Click Here
 

మహిళా 'మణిపూస'

రచన: ఆదూరి హైమవతి.

స్వతంత్ర భారత దేశానికి సర్దార్ వల్లభ భాయ్ పటేల్ ఉప ప్రధానిగా  ఉండేవారు. ఆయన కుమార్తె మణీబెహన్. తండ్రి వలె నిరాడంబర స్వాభావం, ధైర్య సాహసాలు, ఓర్పు కలది. ఆమె ఇంటి పనులన్నీ తానే స్వయంగా చేసేదిట! పనివారేలేరు! ఒక రోజున అప్పటి హోం మినిస్టర్ ‘మహావీర్ త్యాగి‘, పటేల్‌తో మాట్లాడటానికి ఆయన ఇంటికి వచ్చారుట! ఆసమయంలో మణీబెహన్, తన తండ్రి ఇంట్లో ధరించే పాత పంచలు చిరిగినవి తీసేసి అతికించి చీర వలె ధరించి ఉందిట.
ఆ సమయంలో ఆమె తండ్రి పటేల్, సుశీలానయ్యర్, అక్కడ ఏదో విషయం చర్చిస్తూ కూర్చుని ఉండగా, మహావీర్ త్యాగి లోనికి వచ్చి, మణీబెహన్‌ను చూసి, 'అమ్మాయీ! నీవు ఉప ప్రధాని కుమార్తెవు కదా! ఆయన గౌరవానికి తగినట్లు ఉండాలి కదా! నీవిలాంటి అతుకుల పాత చీరను ధరించడం ఆయనకు అవమానం కాదా! నీ వస్త్రధారణ బావు లేదు' అన్నాట్ట.
దానికి మణీ బెహన్ కోపంతో, ధైర్యంగా ఇలా చెప్పింది! 'త్యాగిగారూ! నీతి నిజాయితీలను గాలికి వదిలేసి స్వార్ధంతో డబ్బు సంపాదించడం అవమానం! కష్టపడి నా కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నదానితో సరిపెట్టుకోడం అవమానమెలా అవుతుంది ఇలాంటి చీర ధరించడం నాకే మీ అవమానంగా లేదు. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన ధనాన్ని విలాసాలకు దుర్వయం చేస్తూ ఆ సంపదను వృధా చేసే వారు అవమానపడాలి, నా గౌరవ మర్యాదలూ, నాతండ్రి గౌరవం ఎలా నిలుపు కోవాలో నాకు తెల్సు, ఇతరులు చెప్పాల్సిన పని లేదు. నా తండ్రికి ఏ ఇబ్బందీ కలుగ కుండా చూసుకుంటూ జీవిస్తున్న నాకేమీ అవమానం లేదు' అనిచెప్పి లోనికెళ్ళి పోయిందిట! 
ఈ మాటలన్నీ వింటున్న సుశీలానయ్యర్ “త్యాగిగారూ! మణీబెహన్ విషయం మీకు కొత్త! ఆమె ఉదయం లేచింది మొదలు రాత్రి వరకూ క్షణం వృధా చేయక పని చేస్తూనే ఉంటుంది. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటుంది. పాత్రలు తోమటం, తండ్రి బట్టలు శుభ్రం చేయటం, సమయం దొరగ్గానే రాట్నంతో నూలు వడికి, దానితో తండ్రికి కావల్సిన చొక్కాలూ, పంచలూ స్వయంగా నేస్తుంది. చిరిగిన పంచలను కుట్టి ఇలా చీర వలె తాను ధరిస్తుంది. తండ్రి హోదాను తన కోసం, వాడుకోడం ఆమెకు గిట్టదు. ఇలా జీవించడం ఆమెకు అగౌరవం కాదు. గర్వంగా భావిస్తుంది. ఆమెను చూసి మనం గర్వించాలి, ఆమెను మనం ఆదర్శంగా తీసుకోవాలి, నేటి యువతకు ఈమె ఆదర్శం. అని వివరిస్తుంది. 
మరి నేటి యువతకు ఆదర్శం ఎవరో మనకు తెలీదు.          

No comments:

Post a Comment