Monday, 10 March 2014

పరీక్ష.

హోం >> చిన్నారి Andhraprabha.com

పరీక్ష.

రచన: ఆదూరి హైమవతి

అదో ప్రాధమికోన్నత పాఠశాల. అసెంబ్లీ సమావేశం జరుగుతున్నది. హెడ్మాస్టర్ గారు పిల్లలనుద్దేశించి మాట్లాడుతున్నారు. "పిల్లలూ! ఈరోజు మన పాఠశాలలో ఒక ప్రత్యేకమైన పండుగ. అందరూ మొదటి పీరియడ్లో మీమీ తరగతులను అలంకరించుకోవాలి. ఒకగంట తర్వాత మీ తరగతి గదులను పరిశీలించి ఎవరి తరగతి గది అందంగా ఉంటుందో ఆ తరగతి పిల్లలకంతా అభినందన పత్రాలూ, కలర్ పెన్సిల్స్ బహుమానం. అసెంబ్లీకాగానే మీమీ తరగతి గదులను హడావిడి లేకుండా నిశ్శబ్దంగా శుభ్రపరచుకోండి.." అని తన ప్రసంగం పూర్తిచేశారు.

అసెంబ్లీ పూర్తయి అంతా తమ గదుల్లోకి వెళ్ళారు. ఎంత నిశ్శబ్దంగా ఉండాలని హెడ్మాస్టర్ చెప్పినా అన్నితరగతి గదుల్లోంచీ పెద్దగా మాటలు, హడావిడీ వినిపిస్తూనే ఉంది. ఉపాధ్యాయులు, హెడ్మాస్టర్ వరండాల్లో తిరుగుతూ అన్నీ గమనిస్తూనే ఉన్నారు.

గంట సమయం పూర్తి కాగానే బెల్ మ్రోగింది. పిల్లలంతా తమ బెంచీల్లో కూర్చున్నారు. హెడ్మాస్టర్ టీచర్లందరితోపాటు ఒక్కోక్లాసూ పరిశీలిస్తూ అన్ని తరగతులూ తిరిగారు. పిల్లలందరికీ ఒకే టెన్షన్. ఏ తరగతికి ఈబహుమతి వచ్చి ఉంటుందో' అని. 

సాయంకాలం కానే ఐంది. పిల్లలంతా నిశ్శబ్దంగా వచ్చి అసెంబ్లీలో లైన్లలో నిల్చున్నారు.

హెడ్మాస్టర్ గారు "పిల్లలూ! మీరంతా ఎంతో అందంగా మీమీ తరగతి గదులను అలంకరించుకోడం చాలాసంతోషం. ఐతే మేము మధ్యాహ్నం లంచవర్లో ప్రతి తరగతి నుంచీ ఆయా తరగతుల లీడర్లను పంపి మేము వారి అభిప్రాయాలు కూడా తీసుకున్నాము. ఇప్పుడు ప్రతితరగతి లీడరూ వచ్చి వారు ప్రతి తరగతిలో తాము చూసిన అంశాలంపై తమ అభిప్రాయాలను అసెంబ్లీలో అందరితో పంచుకోవాలని కోరుతున్నాను. ఆ తర్వాతే బహుమతి ఎవరికో ప్రకటిస్తాము." అని చెప్పారు.   

ముందుగా ఏడోతరగతి నుంచీ ఆతరగతి లీడర్ ఏడుకొండలువచ్చి "మాక్లాస్‌ను మేము బాగా శుభ్రపరుచుకుని , గోడల దుమ్ము దులుపుకుని మా బెంచీలన్నీ శుభ్రంచేసుకున్నాం. అందరికంటే మా క్లాసే పరిశుభ్రంగాఉంది. ఆరో తరగతివారు, దుమ్మంతా కిటికీలోంచి బయటపోశారు. ఐదో తరగతి మూలల్లో బూజు ఉంది. నాల్గోతరగతి వారి బెంచీలమీద దుమ్ము ఉంది. మూడో తరగతిలో నేలమీదంతా రంగు చాక్పీసులతో పిచ్చిపిచ్చిగా ముగ్గులేశారు. రెండోతరగతిలో దుమ్ము ఉంది. ఒకటో తరగతి గోడలనిండా పిచ్చిరాతలే.అందరికంటే మాక్లాసే బ్యూటిఫుల్ గా ఉంది. ఈ పరిశుభ్రతా  బహుమతి మాకే రావాలి " అని వెళ్ళితనలైన్లో నిల్చున్నాడు.

అలా అన్నిక్లాసుల లీడర్లూ వచ్చి తమ ఉద్దేశాలనూ, తాము అన్నితరగతుల్లో గమనించిన విషయాలనూ చెప్పారు చివరగా ఒకటో తరగతి లీడర్ లాస్య ఛాన్స్ వచ్చింది. 

లాస్య వచ్చి “టీచర్లందరికీ నమస్కారం! ఫెద్దతరగతి అన్నలకూ అక్కలకూ నమస్కారం! నేను ఒకటో తరగతి. స్కూల్ అందరి లోకీ మేముచాలా చిన్నవాళ్ళం. ఐతే నేను మన హెడ్మాస్టర్ గారు చెప్పినట్లుగా అన్ని తరగతి గదులూ తిరిగాను. ఏడోతరగతి వారు రంగు కాయితాలతో గదిని బాగా అంకరించుకున్నారు. ఆగది చాలా బావుంది. అన్ని బెంచీలూ శుభ్రంతా తుడుచుకున్నారు. నల్లబల్ల కూడా బాగా తుడుచుకున్నారు. ఆరోతరగతి వారు తమ గదిని పూలతో అలంకరించారు. ఐదోతరగతి వారు తమ గదిని కాయితం పూలతో అలంకరించుకున్నారు. నాలుగో తరగతి వారు వారి గది అంతా కడుక్కున్నారు. మూడో తరగతివారు వారి బల్లలను గదిచుట్టూ గుండ్రగా వేసుకుని మధ్యలో ముగ్గులు వేసి, దానిలో టీచర్ కుర్చీ వేసి ఆకుర్చీమీద పూలు పెట్టారు. రెండోతరగతి వారు వారి తరగతిని చిమ్ముకుని తమ తెలుగు వాచకంలోని సరస్వతి బొమ్మను చింపి గోడమీద అంటించారు. నేను అన్ని తరగతుల్లో గమనించిన విషయాలు ఇవే సారూ!" అని చేతులు కట్టుకుని చెప్పింది.

“లాస్యా! మరి అందరి తరగతుల అందంగురించీ చాలా బాగా చెప్పావు కానీ నీతరగతి గురించీ చెప్పలేదేం అన్ని తరగతుల లీడర్లూ వారిగది ఎలా అలంకరించుకున్నారో చెప్పారు, నీవుకూడా చెప్పుమరి ?” అని అడిగారు హెడ్మాష్టర్ గారు. 

“సారూ! మేము ఒకటో తరగతి కదా! మా గదిని బాగా అలంకరించుకోడం మాకు అంతగా రాదు. మేము మాగదిని చీపురుతో తుడుచుకుని, మన బడి చిమ్మే రావులమ్మ వద్ద ఒక గుడ్డ తీసుకుని తడిబట్టతో తుడుచుకున్నాం, ఎందుకంటే నీటితో కడిగితే మాగది ముందు నీరు నిలిచి మేము జారిపడతామని, ఆ తర్వాత మా బల్లలన్నీ ఒకే లైన్ లోకి జరుపుకుని, మా బేగులన్నీ వాటిక్రింద పెట్టుకున్నాం, మా చెప్పులన్నీ మా తరగతి ముందు ఒకే వరుసలో పెట్టుకున్నాం. మాకు వచ్చిన అక్షరాలు, అంకెలూ అన్నీ మా గది నాలుగు గోడలకు ఉన్న నల్లబల్లపై ఎవరి ఎదురుగా వాళ్ళం రాసు కున్నాం.  రావులమ్మ నడిగి ఒకపాత అట్టపెట్టె తెచ్చుకుని ఒకమూలగా చెత్త వేసుకోను, మా పెనిసెళ్ళు చెక్కుకున్న పొట్టుగదిలో పడకుండా వేసు కోను, పెట్టుకున్నాం, రంగు కాయితాలు కానీ, పూలమాలలు కానీ కట్టుకోనూ, ముగ్గు లేసుకోనూ మాచేత కాలేదు. అందుకని మా గదిని మేము ఇంతే చేసుకున్నాం సారూ! అందుకే మాగది అందరి గదుల కంటే అందంగా లేదు." అని మెల్లిగా, స్పష్టంగా  చెప్పింది లాస్య. 

ముందుగా హెడ్మాస్టర్ గారు క్లాప్స్ ఇచ్చారు, ఆతర్వాత టీచర్లంతా క్లాప్స్ ఇచ్చారు. అదిచూసి అన్ని తరగతుల పిల్లలూ క్లాప్స్ ఇచ్చారు.

"గుడ్ లాస్యా! అందుకే మీ ఒకటో తరగతికే ఈ పరిశుభ్రతా బహుమతి ఇస్తున్నాం. ఎందుకంటే ముందుగా శుభ్ర పరుచుకోవలసినది మనస్సును. అది మీ తరగతి లీడరుగా నీకుంది. పెద్ద తరగతుల వారి గదుల అందం, శుభ్రతా గురించి చక్కగా చెప్పావు. నేను అడిగేవరకూ మీ తరగతి గురించీ చెప్పనేలేదు. తమ గురించీ తక్కువగా చెప్పుకోడం పెద్దవారి గురించిన మంచిని ఎక్కువగా చెప్పడం సంస్కారం. పైగా తరగతి గది ఎలా ఉండాలో మీ ఒకటో తరగతి గది అలాగే ఉంది. మీకు వచ్చిన అక్షరాలనూ, అంకెలనూ, బొమ్మలనూ  బోర్డుమీద మీకు  కేటాయించిన స్థలంలో వ్రాశారు.బల్లలనూ, బ్యాగులనూ, చివరకు చెప్పులనూ వరుసగా ఉంచుకున్నారు. నీళ్ళతో కడిగిన మిగతా క్లాసులముందు నీరు చేరి తడిగాఉంది. మీతరగతి గదిముందు తడే లేదు, ఒక అట్టపెట్టె చెత్తవేయను స్వయంగా ఆలోచించి తెచ్చి ఉంచుకోడం గొప్ప ఆలోచన. 

ఉన్నదాంతో మీగదిని ఒక తరగతి గదిలా రూపొందించిన మీ తరగతికే బహు మతి, ఒకటో తరగతి పిల్లలంతా చిన్నవారైనా తమ లీడర్ మాటలను విని అన్ని తరగతుల కంటే నిశ్శబ్దంగా పని చేసుకున్నారు. సాధారణంగా చిన్న పిల్లల తరగతిలోనే ఎక్కువ అల్లరి ఉంటుంది, దానికి వేరుగా మీ తరగతి గది నిశ్శబ్దంగా ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ తరగతి ఉపాధ్యాయిని ని  నేను అభినందిస్తున్నాను. దీని వెనుక ఆమెకృషి ఎంతగానో ఉంది. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఆమెకు ప్రత్యేక బహుమతి ఈ పూల  బొకే ఇస్తున్నాము.

చిన్న వారైనా వారిలోని క్రమశిక్షణకు వారిని అభినందిస్తూ ఒకటో తరగతి పిల్లలందరికీ  ప్రశంసాపత్రాలూ, రంగుపెన్సిళ్ళూ బహుమతిగా ఇస్తున్నాను. చిన్నదైనా పెద్దవారిని గౌరవించడం, తన తరగతి గది అలంకరణలో పిల్లలందరినీ కలుపుకు పోయి ఈ విజయం సాధించిన, నాయకత్వ లక్షణాన్ని పుణికి పుచ్చుకున్న లాస్యకు నా ప్రత్యేక బహుమతి ఈ బొమ్మల పుస్తకం. ఈ శుభ్రత నిజానికి తరగతి గదికి కాదు మనస్సులకు, మంచితనానికీ పరీక్ష." 

అంటూ హెడ్మాస్టర్ గారు బహుమతి లాస్యకు ఇవ్వగానే ఆ ప్రాంతమంతా చప్పట్ల శబ్దంతో నిండిపోయింది.

2 comments:

  1. Cleanliness is next to Godliness. This is narrated well in the story.Congrats Hymavathy garu.

    ReplyDelete
  2. ప్రియ ఉమగారూ!
    కధ చదివి మీ అమూల్య అభిప్రాయం తెలిపినందుకు కృతఙ్ఞతలండీ.
    ఆదూరి.హైమవతి

    ReplyDelete