-
నిజాయితీ... నిర్భీతి.. ఉక్కుసంకల్పం!
నేడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి
-
పిరికి కండలనెరుగని బిరుదు మగడు
-
కార్యశూరుడు తెగుదారి ధైర్యధనుడు
-
ఇనుపమానిసి తప్పున్న నేరినైన
-
ఢీకొనగ జాలువాడు పటేలతండు!
సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే
పేరులోనే తేజం, గాంభీర్యం కన్పిస్తుంటాయి. స్వాతంత్య్ర సమరయోధులలో
ప్రసిద్ధుడైన 'పటేల్' తనదైన శైలిలో పోరాడి భారతదేశపు 'ఉక్కుమనిషి'గా
పేరుగాంచాడు. 1875 అక్టోబర్ 31న గుజరాత్‌లోని నాడియర్లో, జవేరీ భాయి,
లాడ్‌లా పటేల్‌లకు నాల్గవ సంతానంగా జన్మించాడు. ప్రాథమిక విద్యాభ్యాసం
స్వగ్రామంలోనే జరిగింది, ఉన్నత న్యాయశాస్త్ర విద్యకై ఇంగ్లాండు వెళ్ళి
బారిష్టర్ పరీక్షలో ఉత్తీర్ణుడైనాడు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి
అహ్మదాబాదులో న్యాయవాద వృత్తిని చేపట్టాడు. అప్పటికే వివాహమైనందున తన భార్య
ఝవెర్బాను పుట్టింటి నుండి తీసుకొచ్చి గోద్రాలో కాపురం పెట్టాడు.1904లో
ఆయనకు కుమార్తె మణిబెన్, 1906లో కుమారుడు దహ్యాభాయ్ జన్మించారు. సర్ధార్
వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి అని నిరూపించే సంఘటనలు ఆయన జీవితంలో ఎన్నో.
1909లో ఆయన ఓ న్యాయసభలో వాదిస్తుండగా ఆయనకు ఒక టెలిగ్రాం వచ్చింది. ఆయన
దాన్ని తీసుకుని చదివి జేబులో పెట్టుకొని తిరిగి తన వాదన ప్రారంభించి, కేసు
గెలిచారూ. 'ఆ టెలిగ్రాం ఏమిటని' అడిగినవారితో అప్పుడు, కాన్సర్ వ్యాధితో
బాధపడుతున్న తన భార్య మరణించిందని చెప్పారు. అంతా ఆశ్చర్యపోయారు. అంతటి
మనోనిశ్చలత మానసిక స్థితి గలవాడు గనుకే ఆయన్ను 'పిరికికండల నెరుగని బిరుదు
మగడు' అన్నారు. భార్య మరణానంతరం తిరిగి వివాహం చేసుకోక తన కుటుంబసభ్యుల
సహకారంతో పిల్లలను పెంచి పెద్దవాళ్ళను చేశారు... దేశంలో జరుగుతున్న
జాతీయోద్యమ ప్రభావానికి ప్రభావితుడై, తన వృత్తిని నిర్వహిస్తూనే గాంధీజీ
చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. 1928 లో బార్దోలీలో
బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం విధించిన పన్నులకు వ్యతిరేకంగా 'కిసాన్'
ఉద్యమం చేపట్టి విజయవంతంగా నడిపించి, దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు.
అప్పుడే అతనికి సర్దార్ అనే పేరు వచ్చింది. గాంధీ మొదలుపెట్టిన సహాయ
నిరాకరణోద్యమంలో పాల్గొని దాదాపు 300,000 మంది సభ్యులతో కలిసి, 15 లక్షల
రూపాయల విరాళాలు సేకరించారు. విదేశీ వస్తుదహనంలో భాగంగా తనవద్ద నున్న
తెల్లదొరలు వేసుకొనే బట్టలను అగ్నిలో వేసి కాల్చేశాడు. తన కుమార్తె మణి,
కొడుకు దాహ్యాతో కలిసి జీవితాంతం ఖాదీ బట్టలు ధరించాలని నిర్ణయించుకున్నా
డు. గుజరాత్‌లో మద్యపానం, అస్పృశ్యత, కులవిచక్షణలకు వ్యతిరేకంగా పనిచేశారు.
1931 కరాచి భారత జాతీయ కాంగ్రెస్ సదస్సుకు అధ్యక్షుడిగా ఎన్నికైనాడు.
ఉప్పు సత్యాగ్రహం, 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమాలలో కూడ ప్రముఖ పాత్ర
వహించాడు. మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్య్రోద్యమంలో
పాలుపంచుకున్నాడు. దేశప్రజల దృష్టిని ఆకర్షించాడు. బ్రిటిష్ వారికి
వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమంలోనే కాకుండా దేశప్రజల సంక్షేమం కోసం అనేక
సాంఘిక ఉద్యమాలను చేపట్టాడు. 1931లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు
అధ్యక్షత వహించాడు. భారత రాజ్యాంగ రచనలో ప్రముఖ పాత్రవహించి, అతిముఖ్యమైన
ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించాడు. స్వాతంత్య్రానంతరం
జవహర్‌లాల్ నెహ్రూ మంత్రిమండలిలో హోం మంత్రిగాను, ఉప ప్రధానమంత్రిగాను
బాధ్యతలను నిర్వహించాడు. జాతీయోద్యమ సమయంలోనే వల్లభాయ్ పటేల్ నెహ్రూతో
విభేదించారు. ముఖ్యంగా 1936 భారతీయ జాతీయ కాంగ్రెస్ సదస్సులో నెహ్రూ
ప్రవచించిన సోషలిజంను వల్లభాయ్ పటేల్‌లు వ్యతిరేకించారు.
స్వాతంత్య్రానంతరం కూడా స్వదేశీ సంస్థానాల విలీనంలో నెహ్రూ శాంతి కాముకతను
కాదని బలవంతంగా బలప్రయోగం, సైనిక చర్యలు చేపట్టి విజయం
సాధించాడు.భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చాక స్వల్ప
వ్యవధిలోనే ఎలాంటి హింస రక్తపాతం లేకుండా 534 రాచరిక సంస్థానాలు స్వతంత్య్ర
భారతంలో కలసిపోయి భారత ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. కానీ నిజాం
పాలనలోని హైదరాబాద్ ప్రాంతం మాత్రం భారత ప్రభుత్వంలో కలవక స్వయంపాలన
చేస్తూ, 7వ నిజాం 'మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్' ఆదేశాలతో ఖాసిం రజ్వీ
సైన్యాలు తెలంగాణా ప్రాంతంలో భయంకరమైన అరాచకం సృష్టించాయి. ప్రజలను అనేక
ఇక్కట్లపాలు చేశాయి. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో దళాలు, సంఘాలు ఇంకా
స్వాతంత్య్ర సమరయోధులు కొందరు, నిజాం రజాకార్ల సైన్యాన్ని ఎదిరిస్తూ
ప్రజలకు సంపూర్ణ సహకారం అందించాయి. ఆ సమయంలో భారత ప్రభుత్వం, సర్దాల్
వల్లభాయ్ పటేల్ ఆదేశాలతో సైన్యం ''ఆపరేషన్స్'' పేరుతో 1948 సెప్టెంబర్
13న హైదరాబాద్‌లోని నిజాం రాజ్యంలో ప్రవేశించాయి. ఆ సంస్థానాన్ని నలువైపుల
నుంచి చుట్టుముట్టి దిగ్బంధం చేశాయి. వారి నెదిరించలేక 1948 సెప్టెంబర్
17న నిజాం ప్రభువు 'మీర్ ఉస్మాన్ ఆలీఖాన్' భారత ప్రభుత్వానికి సర్దార్
వల్లభాయ్ పటేల్ ఎదుట లొంగిపోయాడు. నిజాం సంస్థానం స్వతంత్ర భారతంలో
విలీనమైంది. ఈ విలీనంతో సంపూర్ణ భారతదేశం ఏర్పడింది. అదీ పటేల్
కార్యదక్షత. దేశ విభజననుద్దేశించి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలా అన్నారు.
''తీవ్రమైన రోగం శరీరాన్ని కబళిస్తున్నపుడు ఆ కుళ్ళిపోయిన అవయవాన్ని
ఖండించి, మిగిలిన శరీరాన్ని కాపాడుకోవటం మన కర్తవ్యం. ఇప్పుడు దేశ విభజనకు
ఒప్పుకోకపోతే ఇప్పట్లో స్వాతంత్య్రం వచ్చే అవకాశమే లేదు. మొత్తాన్ని
కోల్పోయే ప్రమాదముంది. దానికంటే కొంత వదులుకోవడానికి నేను ఇష్టపడతాను.'
సమయానికి తగిన సరైన నిర్ణయం తీసుకోవడంలో ఘనుడు పటేల్. కాశ్మీర్ అంశాన్ని
ఐక్యరాజ్య సమితికి నివేదించడంలో నెహ్రూతో విబేధించారు. పాకిస్తాన్‌కు
చెల్లించవలసిన రూ.55 కోట్లు ఇవ్వరాదని కూడా వల్లభాయ్ పటేల్ నెహ్రూతో
వాదించారు. తొలి రాష్ట్రపతి ఎన్నికలలో కూడా చక్రవర్తి రాజగోపాలచారి వైపు
నెహ్రూ మొగ్గు చూపగా, వల్లభాయ్ పటేల్ రాజేంద్రప్రసాద్‌ను ప్రతిపాదించి
సఫలీకృతుడైనాడు. అలాగే 1950 కాంగ్రెస్ సమావేశంలో నెహ్రూ అభ్యర్థి
కృపలానీని కాదని పురుషోత్తమదాస్టాండన్‌ను గెలిపించారు. కేవలం 40 నెలలు
మాత్రమే పదవిలో ఉన్నా అనేక దేశసమస్యలను తనదైన ప్రత్యేక పద్ధతిలో
పరిష్కరించారు. 1950 డిసెంబర్ 15న పరమపదించారు. ఆయన మరణించిన 4 దశాబ్ధాల
అనంతరం 1991లోభారత ప్రభుత్వం 'భారతరత్న బిరుదా న్ని' ఇచ్చి గౌరవించింది.
స్వార్థ రహితంగా, భారతదేశం తనది గా భావించి సేవించిన మహిమాన్వితుడు,
ఆదర్శసేవకుడు, ధీరగంభీర నాయకుడు అయిన 'సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను' ఆ యన
జన్మదినమైన అక్టోబర్ 31న స్మరించి నివాళులర్పించడం మన కనీస కర్తవ్యం...
ఆదూరి హైమవతి
apr -
Wed, 31 Oct 2012, ఆంధ్ర ప్రభ దినపత్రికలో ప్రచురితం
నిజమేనండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో గొప్ప వ్యక్తి.
ReplyDeleteచాలా సంతోషమండీ! మీరు చదివి మీ అభిప్రాయం చెప్పి నందుకు .
Deleteపటేల్ జీవిత చరిత్రని క్లుప్తంగా బాగా వ్రాసారు.
ReplyDeleteకిషోర్ గారూ ! మీ స్పందనకు చాలా సంతోష మండీ ! ఇటీవల ఇంటర్ నెట్ సరిగాలేక ఆలస్యంగా చూశానండీ !సారీ! జవాబివ్వడం ఆలస్య మైంది..
Delete