బరువు దించేవాడు
First Published: 03 Jul 2014 05:31:02 PM IST
Last Updated: 03 Jul 2014 05:32:14 PM IST
కథ: ఆదూరి హైమవతి
మేలుకో కిట్టయ్య మేలుకోవయ్యా! మేలుకుని మమ్మల్ని ఏలుకోవయ్యా!
నందునీ పుత్రుడా యశోద కన్నయా ! రాధమ్మ మిత్రుడా! మాపాలిదేవుడా! తానే రాసుకున్న మేలు కొలుపులు పాడుతూ బామ్మ దేవుని గదిలో పూజకు అన్నీ సమకూర్చుకుంటున్నది.
అబ్బా! బామ్మా! ఏంటే శలవు రోజు కూడా నన్ను నిద్ర పోనివ్వవా! పాటలు మొదలెట్టావ్! కోపంగా కప్పుకున్న దుప్పటితోనే వచ్చింది వసుధ.
నీకు శలవైతే నా పూజ మానుకోవాలా ఏంటే వసూ! నా కిట్టయ్యను నిద్ర లేపోద్దుటే!
నిద్ర లేపితే కానీ లేవడా నీ కిట్టయ్య? ఐనా నీ బాధలూ బరువులూ ప్రత్యేకంగా ఏమన్నా తీరుస్తాడా ఏం నీ కిట్టయ్య! అంటూ వాదనకు దిగింది వసుధ.
మరి బరువు బాధా తీర్చేవాడు గనుకే కదా ఆయన్నే నమ్ముకుని పూజించడం! నీకేం తెలుసే మహా ఐదోక్లాస్ చదువుతున్నావ్! దేవుడ్ని గురించీ నీకేం తెల్సుచెప్పు. బరువు దించుతాడన్నావే అదెలాగో చెప్పు చూద్దాం... నా పరీక్షల బరువు తీర్చుతాడేమో చూస్తాను.“ బామ్మతో పంతానికి దిగి ఎదురుగా బాసిం పెట్లు వేసుకుని కూర్చుంది వసుధ, దుప్పటికప్పుకునే..
వత్తులపెట్టె ఎదురుగా పెట్టుకుని విబూదిలో చేతులు అద్దుకుని వత్తులు చేసుకుంటూ చెప్పసాగింది బామ్మ. గోపికలు కృష్ణయ్యను ఎంతో ప్రేమించేవారు. ఒక్కరోజు కృష్ణుని చూడకండా ఉండలేకపోయేవారు. గోపికలంతా మంచినీటి బావికి దుత్తలు తీసుకుని వెళ్ళేప్పుడు, కృష్ణయ్య కూడా వెళ్ళేవాడు. మురళి వాయిస్తూ వారికి శ్రమ తెలీకుండా మాటలు చెప్తూ వెంటే ఉండేవాడు. వారు కృష్ణ నామం చేసుకుంటూ తమ పనులన్నీ సునాయాసంగా చేసుకునే వారు.
ఒక రోజున ఒక గోపిక వంటరిగా మంచి నీళ్ళ బావి కెళ్ళింది, వెంట కృష్ణయ్య కూడా వెళ్ళాడు మురళి వాయిస్తూ. ఆ గోపిక మూడు దుత్తలు తీసుకెళ్ళి బావి నీరు చేది దుత్తలు నింపుకుని, అక్కడే ఉన్న కృష్ణయ్యను కిట్టయ్యా! మూడు బుంగలు తలపై కెత్తు కోడం కష్టంగా ఉంది, కాస్తంత సాయం చేయవా అని అడిగింది.
కృష్ణయ్య నవ్వుతూ తల అడ్డంగా ఊపాడు. గోపిక మళ్ళా వేడి కోలుగా అడిగింది. కిట్టయ్యా! సాయం చేయవా ఈ బుంగలు నాతల పైకెట్టవా అని. కృష్ణయ్య మళ్ళా తల అడ్డంగా ఊపాడు.
ఇదేం న్యాయం కిట్టయ్యా! సాయం చేయమంటే తల అడ్డంగా ఊపుతావు ఇదేనా స్నేహ మంటే! అంది.
నవ్వుతూ అక్కడి నుండీ వెళ్ళిపోయాడు కృష్ణుడు. గోపిక ఎలాగో తంటాలు పడీ పడీ బుంగలు మూడూ తల పైకెత్తుకుని మెల్లిగా ఇల్లు చేరింది. గుమ్మంవద్దే ఉన్న కృష్ణయ్య, ఆ బుంగలు దింపుకోను సాయం చేశాడు.
గోపిక కోపంగా ఏం కిట్టయ్యా! మహా వచ్చావు సాయం చేయను. బుంగలు తల కెత్తుకున్న దాన్ని దింపుకో లేననా! పెద్ద వచ్చావు సాయం చేయను! అంటూ కోపంగా మూతి ముడుచుకుని మాట్లాడింది.
'కృష్ణుడు నవ్వుతూ నేను బరువులు దింపే వాడినే కానీ బరువులు ఎత్తే వాడిని కాను. మీ బరువులు, భారాలన్నీ దింపుతాను అన్నాడు.
గోపికకు దానిలోని అంతరార్థం తెల్సివచ్చింది. భక్తితో కిట్టయ్యకు నమస్కరించింది.
“తెలిసిందిటే! కృష్ణ తత్వం నీకు తెలియాలంటే ఇంకాపెద్ద దానివి కావాలి. అప్పుడు అర్థమవుతుంది కానీ వెళ్ళి స్నానం చేసి రాపో. ప్రసాదం తయారుగా ఉంది. వేడివేడి చక్కెర పొంగలి కిట్టయ్యలాగా నీకూ ఇష్టమేగా పదపద. అంటూ బామ్మ పూజ చేసుకోడంలో మునిగిపోయింది.
రచన: ఆదూరి హైమవతి.
No comments:
Post a Comment