Wednesday, 9 July 2014

ప్రతిభాశాలి చాచా నెహ్రూ


Like andhraprabha.com on facebook

ప్రతిభాశాలి చాచా నెహ్రూ...

కథ: ఆదూరి హైమవతి

చిన్నారులూ! పూవు పుట్టగానే పరిమళిస్తుందనే మాట వినే ఉంటారు. తెలివైన వారు పసితనంలోనే తమ ప్రఙ్ఞను చూపుతారు. ఇది సుమారుగా 113 ఏళ్ళక్రిందట జరిగిన సంఘటన. ఒక మారు కొందరు బాలురు ఒక తోటలో బంతి ఆట ఆడుతున్నారు. వారంతా పది పన్నెండేళ్ళ వారు. షుమారుగా పాతికమంది ఉంటారు. వారి చేతిలో బత్తాయి కాయంత బంతి ఉంది. అంతా వర్తులాకారంగా నిలబడి బంతి విసురుకుంటూ ఆడుతున్నారు. అది పెద్ద తోట, పెద్దపెద్ద వృక్షాలతో ఉంది. సాయంకాలం చల్లని గాలులు వీస్తున్నాయి. పిల్లలతా ఆ చల్లని వాతావరణంలో హాయిగా ఉత్సాహంగా ఆడుకుంటున్నారు.
ఇంతలో ఒక బాలుడు ఠీవిగా నడుస్తూ చిన్న లాఠీలాంటి కర్ర విలాసంగా ఊపుకుంటూ విహారానికై ఆతోటలోకి వచ్చాడు. దూరంగా తనతోటి వయస్సు పిల్లలు  ఆడుకోడం గమనించాడు. మెల్లిగా నడుస్తూ వారి సమీపానికి వస్తున్నాడు. ఇంతలో ఒకబాలుడు విసిరిన ఆ బంతి వెళ్ళి అక్కడే ఉన్న ఒక చెట్టు తొర్రలో పడింది. అంతా పరుగుపరుగున వెళ్ళి చెట్టుచుట్టూ మూగారు. అది చాలా పెద్ద చెట్టు. దాని కాండమే  ఐదడుగుల వ్యాసంతో  ఉంది. దాని మొదట్లో ఉన్న తొర్ర ఇంకా చాలా లోతుగా ఉండటాన ఆపిల్లల చేతికి ఆ బంతి అందలేదు.
అంతా బతి విసరిన బాలుని తిట్టసాగారు. "నీవంత వేగంగా విసరటం వల్లే ఆబంతి ఈ తొర్రలో పడింది. ఇప్పుడెలా ఆడుకుంటాం. నీవల్లే ఆట ఆగి పోయింది. అందరూ తనని తిట్టడంతో ఆబాలుడు  ఏడవసాగాడు. ఇంతలో ఠీవిగా నడుస్తున్న బాబు వారి వద్దకు చేరి ఎందుకు మీరంతా అతడ్ని తిడు తున్నారు? అతడేం చేశాడు? ఆట ఆపేసి ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏదైనా సాయంకావాలా? అంటూ వారిని అడిగాడు. దానికి అంతా వీడు బంతిని వేగంగా విసరటంతో అది వచ్చి ఈ చెట్టు తొర్రలో పడింది, చేతికి అందటం లేదు. ఇహ ఎలా ఆడుకుంటాం, అంతా వీడి వల్లే..' అంటూ అంతా మళ్ళీ మళ్ళీ అనడంతో వాడు ఏడ్పు సాగించాడు.
ఏడ్వకు, ఉపాయం ఆలోచించాలి. ఊరికే తూలనాడుకుంటే ఉపయోగం లేదుకదా!' అంటూ తొర్ర సమీపానికి వెళ్ళి చూశాడా బాబు. తనచేతిలోని లాఠీని లోపలికి పెట్టి చూశాడు. అది చాలా లోతుగా ఉంది. కొద్దిసేపు ఆలో చించాక 'మీరు ఆ పంపువద్దకెళ్ళి ఆ బొక్కెనతో నీరు తీసుకురండి' అంటూ చెట్లకు నీరు పోసేందుకై అక్కడ ఉన్న పంపును చూపాడు. బిరబిరా వారిలో కొందరు వెళ్ళి బొక్కెన నిండా నీరు తెచ్చారు. దాన్ని ఆ బాబు ఆచెట్టు తొర్రలో పోశాడు.అది నిండలేదు. మరో బొక్కెన , మరో బొక్కెన నీరు పోశాక చెట్టు తొర్ర నిండి తేలికగా ఉండటాన ఆ బంతి పైకి తేలింది. దాన్ని చేత్తో తీసి వారికి అందించాడు ఆబాబు. అంతా చప్పట్లు చరిచి అతడి తెలివితేటలకు ఆశ్చర్య పోయారు. బంతి తీసుకుని వెళ్ళారు.
పసితనం నుండే అలా తన ప్రఙ్ఞచూపిన ఆ బాలుడే పడిత జవహర్ లాల్ నెహ్రూ. పిల్లలందరికీ చాచా నెహ్రూ, స్వతంత్ర భారతదేశ తొలి ప్రధానమంత్రిగా సేవలందించిన ప్రఙ్ఞాశాలి.
ఆదూరి హైమవతి.

No comments:

Post a Comment