Friday, 28 February 2014

తొలగిన తెర

తొలగిన తెర

రచన : ఆదూరి హైమవతి

కనకయ్య శెట్టి కలియుగ కుబేరుడు. అతని ఇల్లు ఇంద్రభవనాన్నిమించి ఉంటుందని కనకపురి వాసులంతా భావిస్తారు. ఆయన ఇంటి దర్వాజా, గవాక్షపు తెరలే ఎంతో ఖరీదైనవనీ, ఇంట్లోని దీపాలన్నీ వెన్నెలను వెదజల్లే చంద్రుని కాంతిని మించి ఉంటాయనీ కధలుగా చెప్పుకుంటారు జనం. కనకయ్య శెట్టి ఇంటికి తూర్పుదిక్కున ' వేదవేద్యు'డనే ఒక పేద వైదిక భ్రాహ్మణుని పాక ఉంది. అది కనకయ్య శెట్టి ఇంట్లోని ఒక గదికంటే చాలా చిన్నది. ఆ పాకలో ‘వేదవేద్యుడు‘, అతని భార్య ‘వేదవతి‘, కుమారుడు 'విద్యాధరుడు‘ నివశిస్తుంటారు.

ప్రతినిత్యం, కనకయ్య శెట్టి కుంచెడు ధాన్యాన్ని ఉదయాన్నే ఇంటిముందుంచి, వచ్చే భిక్షువులకు గుప్పెడు చొప్పున బిక్ష వేయమని ఒక పని వాడిని నియమించాడు. ఆవిధంగా చేయడం తన గొప్ప దాతృత్వానికి నిదర్శనమని ఆయన భావన. తాను దానకర్ణుడంతటి వాడినని గర్వంగా అందరికీ చెప్పుకుంటుంటాడు. ఆయన తన పుట్టుపండుగను ఘనంగా చేసుకుని, గొప్పవారినంతా విందుకు ఆహ్వానించేవాడు. ఆయన ఇంటి సంపదను వీక్షించడానికి పిలిచిన వారంతా తప్పక వచ్చేవారు. వారంతా ఆయన ఏర్పాటుచేసిన విందులోని వంటకాలు భోంచేస్తూ, ఆయన ఇంటిపక్కన ఉన్న వేదవేద్యుని గుణగణాలను ధార్మికతను పొగిడేవారు. అది కనకయ్యకు కంటకంగా ఉండేది.

ఆ ఏడాది పుట్టుపండుగ పూర్తైన మరురోజున అందరూ అంతగా పొగుడుతున్న ఆ వేదవేద్యుని గొప్పతనమేంటో తెల్సుకోవాలనిపించి, కనకయ్య శెట్టి ఉదయం నుండీ దీక్షగా  వేదవేద్యుని కుటీరాన్ని పరిశీలించసాగాడు. వేకువకు ముందే ఇంటి వారు ముగ్గురూలేచి స్నాన పానాదులు పూర్తిచేసుకుని, దైవకార్యం చేసుకునే వారు. పాక ముందు, చుట్టూతా వేదవతి చిత్రించే రంగులముగ్గులు ఎంతో హృద్యంగా చూపరులను ఆకట్టుకునేవి. ఆముగ్గులు ఏదో సందేశాన్నిస్తున్నట్లు , అంతరార్థాన్ని చెప్తున్నట్లు ఉండటాన దారిన పోయేవారంతా ఆగి వీక్షించి వెళ్ళేవారు.. 

తన పూరిపాక చుట్టూ పెంచుకున్న పూలు కోసి, మాలలుకట్టి దేవాలయంలో ఇచ్చివచ్చేది వేదవతి. కుమారుడు విద్యాధరుడు ఐదు ఇళ్ళలో భిక్షకు వెళ్ళి వచ్చిన పదార్ధాలు తల్లికి అందించగా ఆమె వాటిని వండాక, అగ్నికార్యం చేశాక వారు ముగ్గురూ అతిధికోసం ఎదురుచూసి, వచ్చిన అతిధి ఎవరైనాసరే, అతడి కులమతాలతో, చదువు సంధ్యలతో పనిలేక ఆయన పాదాలు కడిగి, తమ నట్టింట, భోజనం వడ్డించి, సేవించి పంపేవారు. ఆతర్వాతే ఆ మిగిలిన పదార్ధాలను వారు భుజించేవారు. రోజంతా వారింట వేద పఠనం జరుగుతుండేది. మధ్యాహ్నం నుండి వేదవతి  జనావాసాలకు వెళ్ళి  వైద్య సేవలు అందించేది, ఆమె వైద్యంలో దిట్ట. 

విద్యాధరుడు పేద ధనిక అనే భేదంలేక విద్యకోసం తనవద్దకు వచ్చే పిల్లలకు అందరికీ విద్యాబోధన చేసేవాడు. సాయంకాలానికి వారి ఇంటిముందుకు వచ్చిన వారికంతా వేదవేద్యడు అనేక శాస్త్రాల నుండీ కధలు మానవతా విలువలు వివరిస్తూ, వారి ధర్మసందేహాలు తీర్చేవాడు. తమ వద్దకు వచ్చిన వారు అందించే ఫలాలను  భగవన్నివేదన చేసి అందరికీ పంచి వారు ఒక్క ఫలాన్ని మాత్రమే ప్రసాదంగా భుజించే వారు. ఎల్లప్పుడూ చిద్విలాసంగా ఉండే వారిని చూసి కనకయ్య శెట్టికి ఈర్ష్య  పెరిగిపోయింది. తుంగచాపల మీద పడుకుంటూ ఊరివారిచ్చిన భిక్ష తింటూ పూరిపాకలో కావి బట్టలతో నివసించేవారికంత ఆనందం ఎలా కలుగుతున్నదో అతగాడికి అంతుపట్టలేదు. ఎలాగైనా వారి ఆనందానికి ఆటంకం కలిగిస్తే తప్ప నిద్రపట్టని స్థితికి వచ్చాడు కనకయ్య.

కనకయ్య ఒక సాయంకాలం బాగా గమనించి, తన ఇంటి గవాక్షాల గుండా తన ఇంటి దీపాలకాంతి వేదవేద్యుని ఇంటి ముందు, ఇంట్లోకి ప్రసరించడం సహించలేక ఆ గవాక్షాలకు నల్లని తెరలు కట్టించాడు. అది ఆయన భవనానికి ఉన్న అందాన్ని తగ్గించగా, తన ఇంటిదీపాల కాంతి వేదవేద్యుని ఇంట పడనందుకు కనకయ్య సంత సించాడు. ఐతే వేదవేద్యుడి ఇంట దేవుని ముందున్న చిన్న దీపం ఆయన పూరిపాకనంతా వెలుగుతో నింపడం కనకయ్య గమనించి ఆశ్చర్యపోయాడు.
 
వేద వేద్యుడు అంత పేదరికం లోనూఎలా అoత ఆనందంగా ఉంటున్నాడో, అందరూ అతన్ని ఎందుకు పొగుడుతున్నారో తెల్సుకోవాలని, ఓమారు కనకయ్య సాయంకాలo అతడు చేసే సత్సంగానికి వెళ్ళాడు, తనను వేదవేద్యుడు  ప్రత్యేకంగా ఆహ్వానించనందుకు ఉడుక్కున్నా, తమాయించుకుని కూర్చున్నాడు. వేద వేద్యుడు చెప్పేమాటలు   వింటూ, చివరగా ఒక్కోరూ తమ సందేహాలు అడగ సాగారు.

ఒకవ్యక్తి ”మహాత్మా! తమరు మరోలా అనుకోకండి, తమరు ఇంత పేదరికంలోను ఇంత ఆనందంగా ఉండటానికి కారణం తెల్సుకోవాలని చాలాకాలంగా నామనస్సు వేధిస్తోంది ” అని అడిగాడు. దానికి వేదవేద్యుడు చిరునవ్వుతో,

”మాకు పేదరిక మేముంది! ప్రతిరోజూ అతిధికి భోజనం పెట్టి తింటున్నాం. ఆకలికి ఏనాడూ బాధపడలేదు. ధనం లేకపోడం పేదరికంకానే కాదు.  భావదారిద్ర్యమే నిజమైన దారిద్ర్యం.” అన్నాడు వేదవేద్యుడు.

”మరి మహాత్మా! తమ శ్రీమతి వేదవతీదేవి ఎంతోమందికి వైద్య సేవలు అందిస్తున్నారుకదా! పేదలను వదిలేసినా, ధనవంతుల వద్ద కొంత ధనం స్వీకరిస్తే తప్పులేదేమో! తమరు ఆ ధనాన్ని ఎటూ ఎవరికో ఇచ్చేస్తారు“ 

”అనారోగ్యానికి ధనం, పేదరికమనే తేడాలు లేవుగదా! అది ఆమె ఎన్నుకున్న, ఆమెకు చేతనైన మానవసేవ, సేవకు వెలకట్టడం అధర్మం కదా!“
  
”తమ కుమారులు ఎందరికో విద్యాదానంచేస్తున్నారు, వారివద్దనైనా కొంతధనం ….”

”తమరే విద్యాదానం అంటున్నారు! దానాన్ని ధనంతో కొలవడం అధర్మమే!’ అని పూరించాడు వేదవేద్యుడు.

”మహాత్ములారా! అవసరాన్ని మించినధనం గర్వాన్నికల్గిస్తుoది, భయం కౌగిట్లోకి చేర్చుతుంది. ఈర్ష్యకు దారి చేస్తుంది, పొగడ్తలనే విషగుళికలను స్వీకరింపజేసి అధోగతికి చేరవేస్తుంది. మనజన్మ సార్ధకం చేసుకోను జీవం ఉన్నంతవరకూ  సేవాధనాన్ని పోగుచేసుకోను కృషి చేయాల్సి ఉంది. అందుకు భగవంతుడు అవసరమైన అవకాశం మాకు కలుగజేసినందుకు ఆయనకు సదా కృతఙ్ఞులం.” అని అందరికీ నమస్కరించాడు వేదవేద్యుడు. ఆయన్నంతగా అందరూ ఎందుకు  పొగుడుతున్నారో అర్థమైన కనకయ్యశెట్టి తనతప్పు తెల్సుకుని తన ఈర్ష్య తననే వెక్కిరించగా 'అహంకారపు తెర 'తొలగి  సిగ్గుతో తల వంచుకున్నాడు. 

4 comments:

 1. Katha bagundi Hymavathy garu.Ahankaram veedithe jagamantha prema mayam.

  ReplyDelete
  Replies
  1. సంతోష మండీ ఉమగారూ ! కృతఙ్ఞతలు.
   ఆదూరి.హైమవతి

   Delete