పుష్కరిణి
వెబ్ మ్యాగజైన్లో ప్రచురితం.
భాస్కర
శతక విశిష్టత-1
Wednesday, May 8, 2013 9:39 AM
ఆదూరి
హైమవతి
మన తెలుగుభాష అద్భుతమైనది, రసమయమైనది. పిల్లలకూ, పెద్దలకూ చక్కని నీతులనూ, , ఆచరించవలసిన సల్లక్షణాలనూ చిన్నచిన్న పదాలతో హృద్యంగా పద్యరూపంలో చెప్పగల సాహిత్యం మనది. ముఖ్యంగా శతకాలు
మన సాహిత్యంలో ఎంతోప్రముఖమైనవి. అందఱినీ ఆకట్టుకునే విధంగా రాగయుక్తంగా చదివేవారికీ వినేవారికీ ఆనందాన్ని కలిగించేవి శతకపద్యాలు. అంతే కాక సామాజిక
నియమాలనూ, నీతులనూ, మానవులు ఆచరించవలసిన పధ్ధతులనూ చిన్నచిన్న పదాలతో అర్ధవంతంగా తెలియపఱచడం శతక లక్ష్యంగా చెప్పవచ్చు.
తాము చెప్పదలచిన విషయాలను ఒక మకుటం (పద్యాంతంలోని
సంబోధన) తో వ్రాస్తారు కవులు.
కొన్ని శతకాలు సంస్కృతాంధ్రభాషల మిశ్రమ రచనలుగా ఉంటాయి. కొన్ని అచ్చతెలుగు శతకాలు గ్రామ్యభాషలోనూ, వాడుకభాషలోనూ రచించబడ్డాయి.
శతకం
అంటే వంద. శతక రచనలో
సంఖ్యకు ప్రాధాన్యత ఉన్నా సంస్కృత సంప్రదాయా
న్ననుసరించి శతకాలలో 100, 108, 116 పద్యాల
వఱకూ వ్రాయటం ఆచారంగా ఉంది. వందకంటే తక్కువగా
ఉన్న పద్యాలు కల రచనలను శతకం
అనలేము. వందకంటే ఎక్కువ అంతకు పైబడిన పద్యాల
రచనలను సంఖ్యను బట్టి 200 పద్యాలు
ఉన్నట్లైతే ద్విశతి, 300 పద్యాలున్నట్లైతే త్రిశతి, 500 పద్యాలుంటే పంచశతి, 700 ఉంటే సప్తశతి అనటం
జఱుగుతున్నది. వెయ్యి పద్యాలకు పైన ఒకే మకుటంతో
ఉన్న పద్యాలున్న రచనలను కూడా శతకంలో చేర్చారు.
భర్తృహరి
వ్రాసిన ’సుభాషిత త్రిశతి‘ 300 పద్యాలతో సంస్కృతములో ప్రసిద్ధిచెందినది. వేమనపద్యాలు 3000 కు పైగాఉన్నా, ఒకే
మకుటం తో ఉండటం వలన వేమన
శతకం అని పిలవబడుతున్నది. శతకంలోని
చివఱి పాదం గానీ, పాదాంతంలో
ఒక పదం కానీఒకపేరునుసంబోధి స్తూ ఉంటుంది. దీనినే
మకుటం అంటారు. ఈ మకుటం సంబోధనావిభక్తితో
అన్ని పద్యాలలో ఒకేగా ఉంటుంది. ఉదాహరణకు
- వేమన శతకంలో ‘విశ్వధాభిరామ వినురవేమ !’, కాళహస్తీశ్వరశతకంలో ’శ్రీకాళహస్తీశ్వరా!, నారాయణశతకంలో ‘నారాయణా!, వేంకటేశ్వరా, దాశరథీ కరుణాప యోనిధీ! అలాగే భాస్కర శతకంలో
'భాస్కరా!' అనేవి ఆయా శతకాలకు
మకుటాలు. శతకాలకు మకుట నియమం ఉన్నందున
శతకంలోని పద్యాలను ఒకటి లేక రెండు
వృత్తాలలో మాత్రమే వ్రాయటానికి వీలుంటుంది. ఇహ, శతకాలన్నిటిలోను సాధారణంగా
ఒకే రసం కనిపిస్తుంది. భక్తిరస
శతకాలలో భక్తిరసంతో కూడిన పద్యాలు మాత్రమే
వ్రాయడం జఱుగుతుంది. వీర, రౌద్ర, హాస్య,
శృంగారాదులు కనిపించవు.
భాస్కర
శతకాన్ని రచించిన మారయ (మారవి) వెంకయ్యకవి
క్రీ.శ.1550-1650 కాలంలో శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతంలో నివసించినట్లు తెలుస్తున్నది. ఈ ప్రాంతంలో ఉన్న
అరసవిల్లి సూర్యదేవాలయంలోని సూర్యభగవానుణ్ణి సంబోధిస్తూ భాస్కర శతకాన్ని వ్రాశాడని అంటారు. ఇందులోని నీతిబోధల వల్లనూ, కవిత్వం వల్లనూ ఇది బాగా ప్రాచుర్యాన్ని
పొందింది. ప్రతివిషయాన్నీ
చక్కని పోలికతో వ్రాశాడు కవి మారవి వెంకయ్య.
శతకాల్లో భాస్కరశతకానికి తనదైన ఒక ప్రత్యేకత
ఉంది. ఇది భక్తిశతకం కాదు,
మనకి బాగా తెలిసిన వేమన,
సుమతీ వలె నీతి శతకం. సంస్కృతం
నుండి తెలుగులోకి అనువదించిన భర్తృహరి నీతిశతకాన్ని మినహాయిస్తే తెలుగులో వృత్తాలలోవున్న నీతిశతకం భాస్కర శతకం మాత్రమే అనవచ్చు.
ఇలాటి వృత్తాలకి చక్కని, చిక్కని ధార అవసరం. అది
పుష్కలంగా ఉన్నదే భాస్కరశతకం. పద్యాల నడకతో పాటు గా చక్కని దృష్టాంతాలతో ఈ శతకంలోని పద్యాలని
పాఠకుల మనసులలో ముద్రపడేట్టు చేస్తాయి. భాస్కర శతకంలోని పద్యాలు ఉత్పలమాల లో 64, చంపకమాలలో 42 ఉన్నాయి. పురాణాల నుంచి ఎన్నో ఉదాహరణలు
చెప్తూ , మనిషికి అత్యవసరమైన నైతిక విలువల గుఱించీ,
సత్ప్రవర్తన-సదాలోచనల గుఱించీ, ధార్మిక ప్రవృత్తి గూర్చీ చెప్తూ, అశాశ్వతమైన ధనం పట్ల ఉండకూడని
ఆసక్తినీ, వ్యక్తి సామాజిక బాధ్యతల గుఱించీ, త్యాగబుద్ధి, పట్టుదల, స్త్రీలతో సంబంధములు తదితర విషయాల గుఱించీ
కవి చక్కగా చెప్పాడు.
ఫూర్వం
పాఠశాలల్లో చిన్నపిల్లలకు సరళమైన శతకాలను నేర్పి, ఆ శతకాలలోని చిన్నచిన్న
నీతిసూత్రాలనూ, కృష్ణశతకం వంటివాటి ద్వారా శ్రీకృష్ణుని లీలలనూ, మహిమలనూ చిన్నారి మనసుల్లో నాటుకునేలా చెప్పడం జఱిగేది. క్రమంగా విద్యాబోధనలో విద్యార్ధులు సాహితీ వివర ణలతో కూడిన పద్యాలూ, శతకాలూ
, వాటి అర్ధాలను ఆకళింపు చేసుకునే జ్ఞానంలభించేది. ఈనాడు భాషకు ప్రాధాన్యత
తగ్గి, శతకాల విశిష్టత మఱుగున
పడిపోయింది. ఐతే, శతకాలలో నేర్చుకోదగిన
విశేషాలు, ఆనాటి సమాజనీతులూ, పద్ధతులూ
ఎన్నో మనకు కనిపిస్తాయి. వేమనశతకం
సులభమైన పదాలతో రచింపబడి పండిత పామర జనులకు
సులువుగా అర్ధమయ్యేలాఉంటుంది. ఇక సుమతీ శతకం,
భాస్కర శతకం, నారాయణ శతకం,
నారసింహ శతకం ఇలా అనేక
శతకాలు మన తెలుగుభాషకు వన్నెలను
సమకూర్చాయి. పూర్వం పది శతకాలు కంఠోపాఠం
పడితే కవైపోతారనే మాట వినిఉన్న అనేకులు
శతకాలను వల్లెవేసి తామూ పద్యరచన చేసినవా
రున్నారు. ప్రస్తుతం మనం ‘భాస్కర శతకం’
లోని కొన్నిపద్యాలు చూద్దాం.
శ్రీగల
భాగ్యశాలిఁ గడుఁ జేఱఁగ వత్తురు
తారు దారె దూ
రాగమన
ప్రయాసమున కాఁదట నోర్చియునైన నిల్వ
ను
ద్యోగము
జేసి రత్ననిలయుండని కాదె సమస్తవాహినుల్
సాగరుఁ
జేఱుటెల్ల మునిసన్నుత ! మద్గురుమూర్తి ! భాస్కరా !
ఓ సూర్యభగవానుడా ! ధనవంతుని వద్ద గల ధనం
పట్ల ఆకర్షణతో జనం ఆయన వద్దకు
ఎన్నో ఇబ్బందులు పడైనా వెళ్ళను ఇష్టపడతారు.
ఎక్కడో పుట్టిన నదులు రత్నాకరుడైన సముద్రుని
చేఱుటకై ఎంతో శ్రమించి ఎన్నో
మైళ్ళు ప్రయాణించి చేఱి తమ ఉనికిని
కోల్పోతాయి కానీ ఆయన వద్ద
గల రత్నాలను అందుకోలేవు. ధనము పట్ల ఆకర్షణ
అలా ఉంటుంది. (కనుక జాగ్రత్త సుమా
అని కవి హెచ్చఱిక కావచ్చు)
చదువది
యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు
నిరర్థకమ్ము గుణసంయుతు లెవ్వఱు మెచ్చరెచ్చటన్
బదునుగ
మంచి కూర నలపాకము చేసిననైన
నందు నిం
పొదవెడు
నుప్పులేక రుచి పుట్టగ నేర్చునటయ్య
భాస్కరా!
ఇది మనలో చాలా మందికి
తెలిసిన పద్యమే. అందఱికీ అర్థమయ్యే పద్యమే. ఇందులో విశేషమంతా, "ఇంచుక" అన్నపదంలోనూ, ఈ రసజ్ఞ తని ఉప్పుతో
పోల్చడంలోనూ ఉంది. అంటే రసజ్ఞత
కూడా తగిన పాళ్ళల్లోనే ఉండాలి.
ఇది ఎంత అవసరమో, ఎక్కువగా
ఉండకపోవడమూ అంతే అవసరం. రసజ్ఞత
మంచి గుణమే కదా, అది
ఎక్కువైతే ఏమిటి సమస్య ? అనే
అనుమానం మనకు రావచ్చు. ఉప్పెక్కువైతే
ఏమవు తుందో, రసజ్ఞత ఎక్కువైనా అదే అవుతుంది. ఉప్పెక్కువైతే
అదెంత మంచి, అపురూప పదార్ధమైనా
గానీ, నోట పెట్టలేము కదా!
అలానే రసజ్ఞత ఎక్కువైతే, మనం చెప్పదలచిన అసలువిషయం
మఱుగున పడుతుంది. కనుక ఏదైనా తగుపాళ్ళలోనే
ఉండాలని సూచన.
ఊరక సజ్జనుం డొదిగియుండిననైన, దురాత్మకుండు ని
ష్కారణ
మోర్వలేక యపకారము చేయుట వాని విద్యగా;
చీరలు
నూఱుటంకములు చేసెడివైనను బెట్టెనుండగాఁ
జేఱి
చినింగిపోఁగొఱుకు చిమ్మట కేమి ఫలంబు భాస్కరా!
ఎంతో
ఖరీదైన చీరలను పెట్టెలో జాగ్రత్తగా దాచిఉంచినా చిమటపురుగు ఆపెట్టెలో చేఱి వాటిని కొఱికి
ధరించను పనికిరాకుండా చేస్తుంది. దాని వలన దాని
కడుపు నిండేదేమీ ఉండదు . అలాగే మంచివాడు తన
పని తాను చేసుకుపోతూ ఎవ్వఱి
జోలికీ రాకున్నా దుర్మార్గుడు కావాలని అతనికి ఏదో కీడు, హాని
చేయాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇదీ దుష్టుని లక్షణం,
కనుక దుష్టులకు దూరంగా ఉండమనీ, తగు జాగ్రత్త వహించమనీ
కవి హెచ్చఱిక.
అక్కఱపాటు వచ్చు సమయంబునఁ జుట్టుములొక్కఱొక్కఱిన్
మక్కువ
నుద్దరించుటలు మైత్రికిఁ జూడఁగ యుక్తమే సుమీ
యొక్కట
నీటిలో మెఱక నోడల బండ్లును
బండ్ల నోడలున్
దక్కక
వచ్చుచుండట నిదానము గాదె తలంప భాస్కరా!.
ఈ లోకంలో అవసరాన్ని బట్టి బంధువులు దగ్గఱకు
చేఱుతారు. అక్కఱ తీఱగానే వెళ్ళిపోతారు.
ఒకఱికొకఱు సహాయం చేసుకోడం సహజం.
నీటియందున్న ఓడలు బండ్లను ఆవలి
ఒడ్డుకు చేఱుస్తాయి. అవే బండ్లు నేలపైన
ఓడలను సైతం దూరానికి చేఱవేస్తాయి.
పరస్పర సహాయం చేసుకోవాలని కవి
చెప్తాడు.
అడిగినయట్టి
యాచకుల యాశలెఱుంగక లోభవర్తియై
కడపిన
ధర్మదేవత యొకానొక యప్పుడు నీదు వానికె
య్యెడల
నదెట్లు పాలు తమకిచ్చునె యెచ్చుటనైన
లేఁగలన్
గడువఁగనీనిచోఁ
గెఱలి గోవులు తన్నును గాక భాస్కరా.
ఎంతో
ధనం కలిగి ఉన్నా అవసరానికి
ఎవఱైనా ధనసహాయం కోరినప్పుడు లోభగుణంతో సహాయం అడిగిన యాచకుల
కోరిక తీర్చకపోతే వారు నిరాశతో వెళ్ళిపోతారు.
అప్పుడు ధర్మదేవత ఆ లోభిగుణం చూసి
వానికి సంపదలు ఇవ్వను ఇష్టపడదు. ఎలాగంటే, తమ లేగదూడలను పాలు
కుడువనివ్వక యజమాని పాలుపితుకను వచ్చినపుడు ఆవులు వానికి పాలను
ఇవ్వకపోగా కాలితో తంతాయి. కనుక సంపద ఉన్నప్పుడు
తగినంతగా అసహాయులకు దానం చేయాలని అర్ధం.
అతిగుణహీనలోభికిఁ
బదార్థము గల్గిన లేక యుండినన్
మితముగఁ
గాని కల్మి గల మీఁదట
నైన భుజింపఁ డింపుగా
సతమన్మినము
దేహమును సంపద నేఱులు నిండిపాఱినన్
గతుకఁగఁజూచుఁ
గుక్క తన కట్టడ మీఱక
యెందు భాస్కరా !
పిసినారివాడు ధనం లేనప్పుడు అతితక్కువగా
ఎలా ఖర్చుచేస్తాడో, పుణ్యవశాన పుష్కలంగా ధనం లభించినా గానీ
ఖర్చుచేయడు, తినడు, ఎవ్వఱికీ ఏమీ ఇవ్వడు. వాని
లోభగుణం వాడిని నీచునిగానే ఉంచుతుంది. ధనం వాడిని ఉత్తమునిగా
మార్చలేదు. నిండుగా నీరు పాఱుతున్న నదిలో
కూడా కుక్క కతుకుతుందే గానీ
నీటిని నోటితో త్రాగలేనట్లు గుణహీనుని గుణం మారదు. కనుక
ధనంఉన్నప్పుడు ధారాళంగా ఖర్చుచేసి దానధర్మాలు చేయాలని కవి చెప్తాడు.
(రెండో భాగం వచ్చే సంచికలో)
భాస్కర
శతక విశిష్టత-2
Thursday, June 27, 2013 8:40 AM
ఆదూరి
హైమవతి
(గత సంచిక తరువాయి)
ఉ|| కారణమైన కర్మములు కాక దిగంబడవెన్ని గొందులం దూఱిన
నెంతవారలకు…
అనే పద్యంలో పరీక్షిత్తు మహారాజు పాండవ వంశజుడు, కాని
కలిప్రభావంతో తాను ధరించిన బంగారు
కిరీటంలోశని ప్రవేశించడం వల్ల మాయా భ్రాంతికి లోనై
ధ్యానంలో ఉన్న శమీక మహర్షి
మెడలో చనిపోయిన పామును వేసి పాపకార్యం చేయటం
వలన అతడి కుమారుడు మహాశక్తి
సంపన్నుడైన శృంగి చేత శాపానికి
లోనై మరణభయంతో నడిసముద్రములో మేడను నిర్మించుకొని ఉన్నా
గానీ మరణించక తప్పలేదు. కనుక కర్మఫలమును అనుభవించక
ఎవ్వఱికీ తప్పదు, కావున మంచికార్యాలను చేసి
పుణ్యాన్ని సంపాదించమని చెప్పడం ఈ పద్యం అంతరార్ధం.
కర్మమనుభవింపక తీఱదు .
చ|| కులమున నక్కడక్కడ నకుంఠిత ధార్మికుఁ డొక్కఁ డొక్కఁ డే కలిగెడుగాక....
అనే పద్యంలో కవి –ఉత్తమ మానవుని
గుఱించి చెప్తాడు. గొడుగుకామ కోసం వంకర లేని
నిలువుకఱ్ఱలు కొన్ని చెట్లకు మాత్రమే ఉంటాయి. అన్ని చెట్లకు వంకర
లేని కఱ్ఱలు ఉండవు. అలాగే ధర్మాత్ముడూ, గుణవంతుడూ
ఐన వాడు అక్కడక్కడ ఒక్కో
కుటుంబంలోనే పుడుతుం టాడు, అతడి వలన ఆ
వంశానికే మంచిపేరు లభిస్తుంది. ఉత్తమపురుషుని వలన వంశానికీ, కుటుంబానికీ
పేరుప్రఖ్యాతులు శాశ్వతంగా ఉంటాయి. కనుక ఉత్తమ మానవులుగా
జీవించమని అర్ధం.
ఉ|| క్రూరమనస్కులౌ పతుల గొల్చి వసించిన
మంచివారికిన్…
అనే పద్యంలో సముద్ర జలాలను చేఱిన కమ్మని నీరుగల
నదులు ఉప్పుజలాలుగా మారిపోయినట్లే క్రూరాత్ముని వద్ద పనిచేసే ఉత్తములు
సైతం యజమాని చెప్పిన పని చేయవలసి రావటం
వలన దుర్మార్గులుగా మారిపోతారు. మంచివారు చెడ్డవారిని చేఱినట్లైన, వారి చెడుగుణాలే
తమకూ పట్టుబడతాయి. కనుక చెడ్డవారికి దూరంగా
ఉండమనీ, తాము పనిచేసే కొలువు
సైతం ఉత్తమంగా ఉంటేనే తమ సద్గుణాలు నిలు
స్తాయి, కనుక కేవలం
ధనం కోసమే కాక తమ
మంచి స్వభావం నిల్పుకునే విధంగా మంచి ఉద్యోగంలో కొనసాగాలని,
మంచివారితో స్నేహం వలన సమాజం మొత్తం
మంచిగా మారుతుందనీ సూచన. ఐతే సముద్రం
మంచిది కాదని కాదు. సులభ
గ్రాహ్యమయ్యేందుకు వాడుకున్న ఉదాహరణగా మనం గుర్తించాలి.
ఉ|| గిట్టుటకేడ గట్టడ లిఖించిన నచ్చట
గాని యొండుచో బుట్టదు
చావు....
నుదుటన్
వ్రాసిన వ్రాత కన్న కలదే
నూరేళ్ళు చింతించినన్ అన్నట్లు మన కర్మను తప్పించుకునే
ప్రయత్నం చేయటం వృధా. నుదుటివ్రాతను
మార్చుకోటం మానవప్రయత్నంలో సాగదు. శూద్రకుడనే ఒక మహారాజు కాశీక్షేత్రంలో
మరణిస్తే స్వర్గప్రాప్తి లభిస్తుందని తలచి, కాశీనుండిబయ టికి వెళ్ళకుండా
తన మోకాలి చిప్పలను తొలగించుకుని అక్కడే నివసించసాగాడు. కాశీరాజు కొత్తగా కొన్న ఒకగుఱ్ఱం ఎవ్వఱినీసవారీకిఎక్కనీక
ఇబ్బంది పెడుతుండటం విని, తాను గుఱ్ఱాలను
స్వాధీనం చేసుకోడంలో దిట్ట కనుక, తనను
దాని పైకి ఎక్కిస్తే దాన్ని
స్వాధీనం చేసు కుంటాన ని చెప్పాడు, అలా ఎక్కించగానే అది
అతణ్ణి అడవిలోనికి తీసుకెళ్ళి ఒక మఱ్ఱిచెట్టుకేసి కొట్టగానే
ఆ మహారాజు అక్కడే మరణిస్తాడు. ఎంత ప్రయ త్నం చేసినా
తన మృత్యువు స్థానాన్ని మార్చుకోలేకపోయాడు. కనుక మంచి కార్యములను
చేసి పురాకృత కర్మలను కొంతైనా తగ్గించుకొని, తర్వాతి జన్మలకు మంచి ఫలితాలను దాచుకొనాలి.
బ్యాంకుబ్యాలెన్సులు కర్మలను మార్చజాలవు. సత్కృత్యాలే మనకు రక్ష.
ఉ|| ఏల సమస్తవిద్యల నొకించుక
భాగ్యము గల్గియుండినన్ జాలు...
అనే పద్యంలో అదృష్టాన్ని గుఱించి ప్రస్తావిస్తాడు కవి. మానవులు పుణ్యకర్మల
ఫలితంగా అదృష్టవంతులై అందఱిచే గుర్తింపబడి గౌరవం పొందుతారు . ఎంత
విద్యావంతుడైనా కానీ అదృష్టం లేకపోతే
గుర్తింపబడడు. కొండలపై ఉన్న ఱాళ్ళు వాని
భాగ్యం చేత దేవతావిగ్రహాలుగా మలచబడి
అందఱిచే పూజింపబడి నమస్కారాలు అందుకుంటుంటాయి. కనుక అదృష్టాన్ని మించినది
లేదు. ఆ అదృష్టం కోసం
ఎల్లప్పుడూ మంచి మనస్సుతో మానవసేవ
చేస్తూ పుణ్యం సంపాదించాలి. పుణ్యకార్యాలు చేయాలి.
ఉ|| ఒక్కఁడె చాలు నిశ్చల బలోన్నతుఁ
డెంతటి కార్యమైనఁ దాఁ
జక్కనొనర్పఁ , గౌరవులసంఖ్యులు పట్టిన ధేనుకోటులం
జిక్కఁగనీక తత్ప్రబల సేన ననేక శిలీముఖంబులన్
మొక్కపడంగఁజేసి తుదముట్టఁడె యొక్క కిరీటి భాస్కరా
!
ఈ పద్యం ఎంతో మధురమైనది.
సంఖ్యాబలం గల కౌరవులు తమబలగాలతో
విరాట మహారాజు ఆవుల మందలను మళ్ళించుకొని
పోతుండగా ఒక్క అర్జునుడు వారందఱినీ
నిలువఱించి మూర్ఛపోగొట్టి గోగణాన్ని మఱలించుకొని పోయినట్లుగా, నీతి, ఆత్మబలమూ ఉన్నట్లైన
ఎంతటి కఠిన కార్యమునైననూ చేయగల సమర్ధత పొందగలము.
ఇక్కడ నిశ్చలబలము అనగా నైతికబలము, మనోనిశ్చలతకు
దైవబలమూ, ధర్మబలమూ కూడా అవసరమని భావించవచ్చేమో
ఆలోచించవలసి ఉన్నది.
ఉ|| కట్టడ దప్పి తాము
చెడుకార్యముఁ జేయుచు నుండిరేనిఁ దోఁ బుట్టినవారినైన...
ఈ పద్యంలో అన్నదమ్ముల
బాంధవ్యాన్ని గుఱించిన హెచ్చఱికను మనం గమనించవచ్చు. దానితో
పాటుగా ధర్మాధర్మ విచక్షణను గుఱించిన ప్రస్తావన చేస్తాడు కవి. అనైతిక కార్యాలు
చేస్తున్న అన్న బలవంతుడైనా కానీ
విభీషణుడు ఎదిర్చి నీతిబోధించి కడకు అన్నకు శత్రువై
అతణ్ణి వీడి అన్న శత్రువైనా
కానీ ధర్మమూర్తి ఐన శ్రీరాముని శరణుజొచ్చి
చివఱకు లంకకే రాజవుతాడు. ఎంత
బంధువైనా దుర్మార్గుడైనవాడిని విడువటం మంచిదని హితవాక్యం.
ఉ|| కట్టడలేనికాలమున...
దశరథ మహారాజు సుపుత్రునిగా
జన్మించిన సాక్షాద్ భగవంతుడైన శ్రీరామునకు పట్టాభిషేకము చేయదలంచి ముహూర్తం కూడా నిర్ణయిం చిన వశిష్టముని
ప్రయత్నము సైతం భంగమై ఆయన
పదునాలుగేళ్ళు అడవులకు పోవలసి వచ్చినది. కనుక భాగ్యవశమున తప్పసంపదలు,
సుఖమూ ఎంతటివారికైననూ అందుకొన వీలుకావు అంటూ కాలమహత్యాన్ని చెప్తాడు.
ఉ|| కానక చేఱఁబోల దతికర్ముడు
నమ్మికలెన్ని చేసినం దాన
దినమ్మి...
ధనమో,
పదవో మఱేదో ఆశించి పాపాత్ముని
నమ్మి చెంత చేఱితే బోనులో
తనను పట్టను ఉంచిన ఆహారమును చూసి
చేఱువై బోనులో చిక్కుకున్న పందికొక్కు వలె అతడు తప్పుడు
మార్గంలో పడి ముప్పుపాలవుతాడని చెప్తాడు
కవి.
ఉ|| కాని ప్రయోజనంబు సమకట్టదు
తా భువి నెంతవిద్యవాఁ
డైనను....
ఈశ్వరుని
కుమారుడు, సకలవిద్యలకు ఆటపట్టు, అందఱికీ పూజ్యుడు, గజబల సంపన్నుడైన విఘ్నేశునికి
వివాహమే కాకపోడం చిత్రం కదా? ఇహ మానవులననెంత?
ఎంత విద్వాంసుడైనను, గొప్పవాని కుమారుడైననూ దైవబలము లేకున్నచో తన పనులు సక్రమంగా
నెఱవేఱవు. ఈ పద్యాన్ని బట్టి
ఆలోచిస్తే ఆ రోజుల్లో తమ
శక్తిసామర్ధ్యాల కన్నా దైవబలం పట్ల
దైవశక్తి పట్ల సమాజంలో నమ్మకమూ,
ఆచరణ ఉన్నట్లు తెలుస్తుంది. దైవబలం
కోసమైనా మానవులు మంచి ప్రవర్తనతో ఉంటారని
ఆనాటి సమాజంలోని పెద్దలు అలా చెప్పి ఉండవచ్చు.
(ఇంకా ఉంది)
భాస్కర
శతక విశిష్టత-3 (సమాప్తం)
Monday, July 15, 2013 8:19 AM
ఆదూరి
హైమవతి, షికాగో.
ఎడపక
దుర్జనుం డొరుల కెంతయుఁ గీడొనరించును
గాని యే యెడలను…
చెడుస్వభావం
కలిగినవారు ఇతరులకు చెడు చేస్తారే గాని,
ఎటువంటి పరిస్థితులలోనూ ఏమాత్రమూ మంచి చేయరు. ఇటువంటివారి
ప్రవర్తన చీడపురుగును పోలి ఉంటుంది. చీడపురుగు
చెట్టుకు ఎటువంటి మేలు ? అంటే కనీసం పుడిసెడు
నీరైనా పోయకపోగా, పూలు, పండ్లతో నిండుగా
ఉండి, చక్కగా పెఱుగుతున్న చెట్లను పాడుచేస్తుంది.
తెలియని
కార్యమెల్లఁ గడతేర్చుటకొక్క వివేకి జేకొనన్…
మనుష్యులు
నుదుటి మీద తిలకం పెట్టుకునేటప్పుడు
చేతిలో అద్దం ఉంటే అందులో
చూసుకుంటూ చక్కగా, పద్ధతిగాపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఏదైనా తనకు తెలియని
పనిని చేయవలసి వచ్చినప్పుడు... ఆ పనిలో నేర్పరితనం
ఉన్నవారి సహాయం తీసుకుంటే, ఆ
పనిని తప్పులు లేకుండా ఆలస్యం కాకుండా పూర్తిచేసుకోవచ్చును. ఏదైనా విషయం తెలియకపోవటంలో
దోషం లేదు. కాని తెలియకపోయినదానిని
గుఱించి ఇతరులను అడిగి తెలుసుకోకపోవటమే తప్పు.
చేతిలో అద్దం ఉంటే తిలకం
దిద్దుకోవటం ఎంత సులభమో, అదే
విధంగా తెలియని విషయాలను అడిగి తెలుసుకోవాలని కవి
ఈ పద్యంలో వివరించాడు.
తనకు
ఫలంబు లేదని యెదం దలపోయఁడు
కీర్తిగోరు నా ఘనగుణశాలి…
తనకు
ఉపకరించకున్నా ఇతరుల కోసం మంచివాడు
కష్టపడతాడు.ఆదిశేషువు భూభారం వహించి లోకరక్షణ చేస్తున్నాడు కదా!
దక్షుడు
లేని యింటికిఁ బదార్థము వేఱొకచోట నుండి వేలక్షలు వచ్చుచుండినన్…
యజమాని,
లేక బాధ్యత వహించే వ్యక్తి లేనిచోట ఎన్ని వస్తువులు వచ్చి
చేరినా నిలువవు. సద్వినియోగంకావు. గండిపడిన చెఱువుతో అట్టి ఇంటిని పోల్చాడు
కవి.
దానముఁ
జేయనేఱని యధార్మికు సంపద యుండి యుండియున్…
ఈ పద్యంలో కవి దానము చేయని
వాని సంపదను అడవిలో కాచే బూరుగచెట్టు పండ్లతో
పోల్చడం కవిచాతుర్యానికి నిదర్శనం.
దానము
సేయఁగోరిన వదాన్యున కీయఁగ శక్తి లేనిచో
నైన…
అలాగే
దానం చేయాలని ఉన్నా తన వద్ద
లేకపోయినా మఱొక చోటునుండి తెచ్చి
ఇచ్చేవానితో, సముద్రం నుండి నీటిని గ్రహించి
వర్షించే మేఘాలను పోల్చాడు .
పూరిత
సద్గుణంబు గలపుణ్యున కించుక రూపసంపదల్ దూరములైన…
అందం
లేని సద్గుణ సంపన్నుని లోకులు ఆదరించి గౌరవిస్తారని చెప్తూ రుచికరమూ, ఆరోగ్యకరమూ ఐన ఖర్జూర ఫలాలతో
సద్గుణుని పోల్చడం కవిప్రజ్ఞకు నిదర్శనం.
పూనిన
భాగ్యరేఖ చెడిపోయిన పిమ్మట నెట్టిమానవుం డైనను…
ఎంతో
సువాసనాభరితమైన అందమైన పూవు వాడిపోతే ఎవ్వఱూ
దానిని తీసుకోని విధంగా-మానవులు తమ స్థానముల నుండీ
(ధనమో, గౌరవపదవో, స్వస్థానమోబలమో, ఏదైనాకానీ) దూరమైనపుడు ఎవ్వఱూ లెక్కచేయరు.
బలయుతుఁడైన
వేళ నిజబంధుఁడు తోడ్పడుఁ గాని యాతఁడే బలము తొలంగెనేనిఁ దన
పాలిటి శత్రు…
బలంపోయిన
(శక్తి, ధనం, తెలివి మఱేదైనా
కానీ) వానిని బంధువులు, స్నేహితులూ వదిలేస్తారు, హీనపఱుస్తారు. బలంగా ఉన్న అగ్ని
అడవినే కాల్చేస్తున్నపుడు సహకరించిన వాయువు సన్నగా వెలుగుతున్న దీపాన్ని ఆర్పిన విధంగా… అంటాడు కవి. కనుక
నిరంతరం జాగ్రత్తగా జీవించాలని సూచన.
సన్నుత
కార్యదక్షుఁ డొక చాయ నిజప్రభ
యప్రకాశమై యున్నపుడైన…
సద్గుణ
సంపన్నుడు నిరంతరం ఇతరులకు మేలు చేయాలని చూస్తాడు,
ఏకచక్రపురంలో అజ్ఞాతంగా జీవిస్తున్న భీముడు లోకహితార్ధమై బకాసురుని వధించినట్లు-అని మహాభారత కథలోని
ఘట్టాన్ని ఉదహరిస్తాడు.
తగిలి
మదంబుచే నెదిరిఁ దన్ను నెఱుంగక దొడ్డవానితో
బగ…
కయ్యానికైనా
వియ్యానికైనా సమఉజ్జీ అవసరమని పెద్దలు చెప్పిన మాటలు గుర్తుచేస్తూ పొట్టేలు
అహంకరించి కొండను ఢీకొని తల పగులగొట్టుకున్నట్లుగా ఎదుటి బలం
తెలీకుండా విరోధించడం మంచిది కాదంటాడు. కోపంతో కూడిన అహంకారం మేలు
చేయకపోగా మనకే కీడు అవుతుంది
కనుక నిదానంగా ఆలోచించి ఏదైనా చేయమని హితం
చెప్తాడు.
పలుమఱు
సజ్జనుండు ప్రియభాషలె పల్కుఁ గఠోరవాక్యముల్
పలుకడు…
సజ్జనుడు
ఎల్లప్పుడూ అందఱితోనూ మంచిగానే మాట్లాడుతాడు. ఎన్నడూ కఠినంగా మాట్లాడడు. ఒకవేళ ఎప్పుడైనా కఠినంగా
మాట్లాడినా, అవి మంచినే కలిగిస్తాయి
కానీ బాధించవు. మేఘాలు వడగండ్ల వాన కుఱిపించినా అవీ
కఱిగి నీరవుతాయే కానీ ఱాళ్ళుకావు అంటాడు.
ఈనాడు వడగళ్ళ వాన కుఱిసి పంటపొలాలూ,
పండ్లచెట్లూ నష్టపోవడం కేవలం అకాలవర్షాల వల్లనే.
ఆనాడు అకాల వర్షాలు లేకపోయిఉండవచ్చు.
ఎట్టుగఁ బాటుపడ్డ నొక యించుక ప్రాప్తము
లేక వస్తువుల్ పట్టుపడంగ
నేఱవు…
ప్రాప్తం
లేకపోతే ఎంత శ్రమించినా కొన్ని
అందవు, రాక్షసులు దేవతలతో సమానంగా అమృతం కోసం వాసుని
తలవైపు పట్టుకుని చిలికినా చివఱకు అమృతం దేవతల పాలైంది
తప్ప రక్కసులకు అందలేదు. కనుక మానవులు తమకు
లభించినదానితోనే తృప్తిపడాలంటాడు కవి.
ఒక్కడు
మాంసమిచ్చె మఱియొక్కడు చర్మముఁ గోసియిచ్చె… పరోపకారం కోసం ఒక మహనీయుడైన
శిబిచక్తవర్తి అతి చిన్నదైన పావురం
కోసం తన శరీర మాంసాన్నే
కోసి ఇచ్చాడు, దధీచి తన ప్రాణాన్నే
ఇచ్చి దేవేంద్రునికి వజ్రాయుధంగా తన వెన్నెముకనే సమర్పించాడు.
వీరు పేరుప్రతిష్ఠల కోసం త్యాగం చేశారా?
లేక లోకహితార్ధం చేశారా ? అని యోచించి వారి
త్యాగగుణాన్నికొంతైనా మనం అనుసరించాలంటాడు.
హీనకులంబునందు
జనియించినవారికి సద్గుణంబులె న్నేనియుఁ
గల్గియున్న నొక…
సూర్యోదయంతో
వికసించిన బుఱదలో పుట్టిన పద్మం చంద్రోదయం కాగానే
ముకుళించుకు పోయి వాడిపోతుంది. చల్లని
చంద్రుని చూడలేదు. ఎంత గొప్పవాడైనా కులం
వద్దకు వచ్చేసరికి తక్కువైపోతారంటాడు.
ఇలా భాస్కర శతక నీతులు సర్వమానవులూ,
సర్వకాలాల్లోనూ చదివి గ్రహించి ఆచరించదగినవి
గనుకనే నాటికీ నేటికీ ఆదరాన్ని పొందుతూ అందఱి నోటా నానుతూ
ఉన్నాయి. శతకకర్త మానవులకు సూక్ష్మధర్మాలనూ, మానవనైజాన్నీ , సేవాభావాన్నీ, మహనీయుల త్యాగాన్నీఇలా అందించి మానవజాతికి మహోన్నత మార్గాన్ని చూపారనడంలో లేశమంతైనా అతిశయోక్తిలేదని నా భావన. నా
శక్తి కొద్దీ ఈ భాస్కర శతకంలో
ని కొన్ని పద్యాలు నాకు తోచిన రీతిగా
వివరించే ప్రయత్నం చేశాను. ఉపాధ్యాయినిగా 40 సం. విద్యార్ధులకు శతకాలు
బోధించిన అనుభవంతో, నాకున్న జ్ఞానంతో ఈ వ్యాసాన్ని రూపొందించాను.
నా భావనలు అందఱితోనూ పంచుకోవాలనే ఆశతోనూ, ఇప్పటికీ భాస్కర శతక పద్యాల లోని నీతులను
కనీసం కొందఱు తలిదండ్రులైనా తమ పిల్లలకు ఇళ్ళలో
బోధిస్తే తెలుగుతో పాటు ఈ నీతులు
వంటబట్టి సమాజశ్రేయస్సుకు కృషి చేస్తారనే ఆశంసతోనూ
దీన్ని పుష్కరిణి తెలుగు ఆధ్యాత్మిక అంతర్జాల మాసపత్రిక ద్వారా సమర్పించుకుంటున్నాను.
(రచయిత్రి విశ్రాంత ప్రధానోపాధ్యాయిని – జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుగ్రహీత-1994, శ్రీ కంచి కామకోటి పీఠాధిపతుల జాతీయ అవార్డు బంగారు పతక గ్రహీత-2003)
No comments:
Post a Comment