Sunday, 1 September 2013

అవసరాన్ని బట్టి...

అవసరాన్ని బట్టి...


apr -   Mon, 2 Sep 2013, IST


వరదాపురంలో వరదయ్య పెద్ద వడ్డీ వ్యాపారి. తన వద్దకు వచ్చే వారి అవసరాలను బట్టి వడ్డీరేట్లలో మార్పులు చేర్పులు చేస్తూ అధిక లాభాలను సంపాదించేవాడు. పొరుగూళ్లకు వసూళ్లకు వెళ్లడంలో దొంగల భయానికి భీముడు అనే వ్యక్తిని పనిలో పెట్టుకున్నాడు. ఒకరోజు సాయంకాలం తీరుబడిగా అరుగుమీద కూర్చున్న వరదయ్య దగ్గరకు ఆ ఊరి భూకామందు భూమయ్య అదరాబాదరా వచ్చాడు. ఆయన్ను చూసిన వరదయ్య ''ఊరకరారు మహాత్ములు.. ఏం పనిమాద వచ్చారో'' అన్నాడు.
''ఎంతటి వారైనా నీ దగ్గరకు రాక తప్పుతుందా వరదయ్యా! మా అవసరాలు అటువంటివి'' అన్నాడు భూమయ్య. ''ఇప్పటికిప్పుడు నీకంత అవసరం ఏమొచ్చిందయ్యా? అయనా ఊరి మొత్తానికి నీ అంత కామందు లేడే'' అని ప్రశ్నించాడు వరదయ్య.
''ఏముంది వరదయ్యా.. అమ్మాయి పెళ్లి కుదిరింది. వియ్యాలవారేమో ఈ శ్రావణ మాసంలోనే పెళ్లి చేయాలని పట్టుబట్టారు. ఉన్న సొమ్మంతా మామిడి తోటలమీద, పొలాలమీద పెట్టాను. మే నెల వరకూ సొమ్ము చేతికి రాదు. మంచి సంబంధం వదులు కోవడం ఇష్టం లేదు. నీవేమైనా ఆదుకుంటావని..'' అంటూ నాన్చాడు భూమయ్య.
''పెద్దచిక్కే తెచ్చిపెట్టావ్‌ భూమయ్యా! సాయం కోసం నిన్న సాయంత్రమే పొరుగూరి పుల్లయ్య, ఎల్లయ్యా ఇదే విషయంతో నన్ను కలిస్తే రేపు రమ్మని చెప్పా. ఏం చేయనబ్బా'' అని నసిగాడు వరదయ్య.
''బాబ్బాబు.. అలా అనకు. నీకు దండం పెడతా. వడ్డీ కావాలంటే కాసింత ఎక్కువే తీసుకో. నాకు ఎలాగైనా 20 వేల వరహాలు కావాలి. సొమ్ము చేతికి రాగానే పూవుల్లో పెట్టి ఇచ్చుకుంటాను'' అంటూ భూమయ్యా బతిమాలసాగేడు.
సరే ఏదో నా తంటాలు నేను పడతాను. అయితే ఈ విషయం మాత్రం బయట చెప్పకు. ఎందుకంటే ముందు అడిగిన వారికి కాదని నీకు ఇస్తే నా పరువు పోతుంది'' అని చెప్పి ఇంట్లోకి వెళ్లాడు వరదయ్య. వెళ్లే ముందు భీముడిని పిలిచి ''ఒరే ఇక్కడేవుండు. పుల్లయ్య, ఎల్లయ్య వస్తే నేను బయటకు వెళ్లానని చెప్పు'' అని ఆదేశించాడు. ఇంట్లోకి వెళ్లి 20 వేల వరహాలకు వడ్డీ లెక్కకట్టి 20 వరహాలను మొదటి నెల వడ్డీకింద మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని భూమయ్యకు అందించాడు.
భూమయ్య వెళ్లాక ''అయ్యా! మన వద్దకు నిన్నా, మొన్న కూడా ఎవరూ రాలేదు. మీరు భూమయ్యతో అలా అన్నారేంటి'' అని ప్రశ్నించాడు. ''అదంతా వ్యాపార రహస్యం రా'' నీకు అర్థం కాదని చెప్పాడు.వసూళ్లకు పొరుగూరికి వెళ్లిన ఇద్దరూ పని ముగించుకుని ఇంటిముఖం పట్టారు. తిరిగి వస్తుండగా వర్షం నెమ్మదిగా మొదలైంది. వాతావరణాన్ని గమనించిన భీముడు ''అయ్యా! బండి కట్టించుకుని వెళ్దాం'' అని చెప్పాడు.
ఇప్పుడు బండి కట్టమంటే 10 వరహాలు అడుగుతాడు. అయినా ఈ వర్షం చిన్నదే. నాలుగు చినుకులు పడి తగ్గిపోతుంది అనుకుని ''బండిఅవసరం లేదు లేరా'' అని చెప్పాడు.
కొద్ది దూరం వెళ్లాక వర్షం పెద్దగా పడటం మొదలైంది. అప్పుడు వారి వెంట ఒక బండి వస్తోంది. ''బండాపి మేమిద్దరం వరదాపురం వెళ్లాలి. మమ్మల్ని దించుతావా'' అని అడిగాడు వరదయ్య.
''అయ్యో! దానికేం భాగ్యం. తప్పకుండా అయితే మనిషికి 20 వరహాలు ఇవ్వాలి. అదికూడా బండి ఎక్కడడానికి ముందే'' అని షరతు పెట్టాడు బండివాడు.
''అదేంటి మాములూ 10 వరహాలేగా! ఆశ్చర్యంగా అడిగాడు'' వరదయ్య.
''అవునండి మీరు చెప్పింది నిజమే. అయితే అవసరాలను బట్టి రేటుంటుంది'' అయినా ఎక్కుతారా లేదా. తొందరగా చెప్పండి. అని గద్దించాడు బండివాడు. చేసిదిలేక మొత్తం 40 వరహాలు ఇచ్చి బండి ఎక్కాడు వరదయ్య. వారిద్దర్నీ ఇంటివద్ద దింపి వడ్డీపోనూ వచ్చిన లాభాన్ని చూసుకుంటూ ఇంటిముఖం పట్టాడు కామందు భూమయ్య.
ఆదూరి హైమావతి, చికాగో.
*************************
ఆంధ్రప్రభ ఆదివారం-చిన్నారిలో-ప్రచురితం.

No comments:

Post a Comment