Friday 11 January 2013

జనవరి12 -వివేకానందుని జయంతి .

                                  వివేకానందుని జయంతి.
బెంగాలీ ' షామీ బిబేకానందో ' గా  ప్రసిద్ధి గాంచిన 'హిందూ యోగి ' స్వామీ వివేకానంద. ఈయన మొదటి పేరు ' నరేంద్ర నాథ్ దత్తా '. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ ,తత్త్వ శాస్త్రములలో సమాజం పై  అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్రలో ను భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠ  వ్యవస్థాపకుడు.

భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండులలో యోగ, వేదాంత శాస్త్రము లను తన ఉపన్యాసాల ద్వారా, వాదనల తోనూ  పరిచయము చేసిన ఖ్యాతి అతనికి దక్కింది. గురువు గారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం పై ఎన్నో ఉపన్యాసాలు చేశాడు. అతని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరధం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యుల య్యారు.  పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి వివేకానందుడే! ' తూర్పు దేశాల తత్త్వాన్ని ' అమెరికాలోని ' షికాగో ' లో జరిగిన ప్రపంచ మత సమావేశంలో ,' పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రెలిజియన్స్ 'లో 1893 లో ప్రవేశపెట్టాడు.  షికాగోలోను, అమెరికాలోని ఇతర ప్రాంతాలలోను ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు.

      అమెరికా పర్యటనానంతరం తిరిగి భారత దేశం వచ్చి 'రామకృష్ణ మఠాన్ని 'స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. 39 సం. అతితక్కువ జీవనకాలంలో అతి ఎక్కువ గా భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని పాశ్చాత్య దేశాలలో చాటిని మహామహుడు వివేకానందుడు.జనవరి 12, 1863న జన్మించిన ఈయన  - ముప్పై తొమ్మివయేట జులై 4న 1902 లో ఏళ్ళ వయసు లోనే మరణించాడు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మ దినాన్ని "జాతీయ యువజన దినోత్సవం" గా ప్రకటించింది.
   
     కలకత్తాలో ఒక ఉన్నత కుటుంబానికి చెందిన విశ్వనాధ్ దత్త , భువనేశ్వరి దేవి దంపతులకు నరేంద్ర నాధుడు జన్మించాడు. చిన్నప్పటి నుంచే ధ్యానం చేసే వాడు. బాలుడిగా ఉన్నపుడు నరేంద్రుడు చాలా ఉల్లాసంగా, చిలిపిగా ఉండేవాడు. సన్యాసుల పట్ల యోగుల పట్ల అమితమైన ప్రేమను కనబరిచేవాడు. వారు ఏదడిగినా సరే  లేదనకుండా ఇచ్చేసేవాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న్నట్లుగాచిన్నప్పటీ నుంచే అతనికి నిస్వార్థత , ఇంకా ఔదార్య గుణాలు అలవడ్డాయి.

      నరేంద్రుడు ఆటలలోనూ, చదువులో కూడా అందరికంటే ముందుండేవాడు. ఏకసంథాగ్రాహి. పాఠాన్ని ఒక్కసారి చదివితే మొత్తం గుర్తుంచుకునేవాడు. ఆయన పఠనావేగం అందర్నీ అబ్బుర పరచేది.అతని జ్ఞాపకశక్తి అమోఘమైనది. 17 సం.వయస్సులోనే  మెట్రిక్యులేషన్ పరీక్షలో  ఉత్తీర్ణుడై కళాశాలలో చేరాడు. రోజు రోజుకూ అతని జ్ఞాన తృష్ణ అధికంకాసాగింది. దైవం గురించి తెలుసుకోవాలని ఎంతో ఆసక్తితో ఉండేవాడు. చరిత్ర ఇంకా  సైన్సు తోపాటు పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని కూడా ఔపోసన పట్టాడు. అలా చదువులో ముందుకెళుతున్న కొద్దీ అతని మదిలో అనుమానాలు, సందేహాలు, అస్పష్టత ఎక్కువ కాసాగాయి. భ్గవత్తత్వాన్ని,బ్రహ్మతత్త్వాన్నిఆకళింపుచేసుకోలేక పోయాడు.నరేంద్రుడు తనకు వచ్చిన సందేహాలను  అనేక మందిపండితుల ముందు వెలిబుచ్చాడు. వారంతా వాదనలలో ఆరి తేరిన వారు. కానీ వారి వాదనలేవీ నరేంద్రుడిని సంతృప్తిపరచలేకపోయాయి. వారు ఆలోచిస్తున్నమార్గం కూడా వివేకానందుడికి నచ్చలేదు.   వారెవరికీ భగవంతునితో ప్రత్యక్ష అనుభవం లేదు.

      అల్లాంటిసమయంలో నరేంద్రునికి  రామకృష్ణపరమహంసతో పరిచయం కలిగింది.రామకృష్ణ పరమ హంస కాళికాదేవి ఆలయంలో పూజారి. ఆయన పండితుడు కాదు కానీగొప్పభక్తుడు.అతనుభగవంతుని దర్శించాడని  జనం  చెప్పుకుంటుండగా నరేంద్రుడు విన్నాడు. ఏ పండితుడైనాసరే ఆయన దగ్గరకు వెళితే వారు ఆయనకు శిష్యులు కావలసిందే. ఒకసారి నరేంద్రుడు తన మిత్రులతో కలిసి ఆయనను కలవడానికి దక్షిణేశ్వర్ వెళ్ళాడు. రామకృష్ణ పరమహంస తన శిష్యులతోపాటు కూర్చుని ,భగవంతుని గురించిన విషయాలు చర్చిస్తున్నారు. నరేంద్రుడు తన స్నేహితులతోపాటు ఒక మూలన కూర్చుని వారి సంభాషణ ను ఆలకించసాగాడు. ఒక్కసారిగా రామకృష్ణ పరమహంస దృష్టి నరేంద్రుడి మీదకు మళ్ళింది. ఆయన మనసులో కొద్దిపాటి కల్లోలం మొదలైంది. ఆయన సంభ్రమానికి గురయ్యారు. ఏవేవో ఆలోచనలు ఆయనను చుట్టుముట్టాయి.పాతజ్ఞాపకాలేవో ఆయనను తట్టిలేపుతున్నట్లుగా ఉంది. కొద్ది సేపు అలాగే నిశ్చలంగా  నరేంద్రుని  ఆకర్షణీయమైన రూపం, మెరుస్తున్న కళ్ళు చూస్తూ ఆయనను ఆశ్చర్యానికి గురయ్యారు. ' నీవు పాడగలవా? 'అని నరేంద్రుడిని ప్రశ్నించాడు. అప్పుడు నరేంద్రుడు తమ మృధు మధురమైన కంఠంతో రెండు బెంగాలీ పాటలు గానం చేశాడు. ఆయన ఆ పాటలు వినగానే అదోవిధమైన తాదాత్మ్యత (ట్రాన్స్) లోకి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తరువాత నరేంద్రుని తనగదికితీసుకు వెళ్ళాడు. చిన్నగా నరేంద్రుడి భుజం మీద తట్టి, ఆయనతో ఇలా అన్నారుట, 'ఇంత ఆలస్యమైందేమి? ఇన్ని రోజులుగా నీ కోసం చూసి చూసి అలసి పోతున్నాను. నా అనుభావాలన్నింటినీ ఒక సరైన వ్యక్తితో పంచుకోవాలనుకున్నాను. నీవు సామాన్యుడవు కావు. సాక్షాత్తు భువికి దిగివచ్చిన దైవ స్వరూపుడవు. నీ గురించి నేనెంతగా తపించానో తెలుసా?' అంటూ కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు.

ఆయన ప్రవర్తన నరేంద్రుడికి వింతగా తోచింది. 'ఈయన పిచ్చి మనిషేమో !' అనుకున్నాడు. 'నీవుమళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తావు ?' అని రామకృష్ణుడు అడగ్గానే , ఆయన నుండీ ఎప్పుడు తప్పించుకుందామా అని చూస్తున్న నరేంద్రుడు, ' త్వరలోనే' అనిచెప్పాడు.  ఆయన బోధన పూర్తయ్యాక, నరెంద్రుడు ' మీరు భగవంతుని చూశారా? 'అని ప్రశ్నించాడు. దానికి  'అవును చూశాను నేను నిన్ను చూసిన విధంగానే, ఆయనతో మాట్లాడాను కూడా, అవసరమైతే నీకు కూడా చూపించగలను. కానీ భగవంతుని చూడాలని ఎవరు తపించిపోతున్నారు? ' అన్నాడాయన. 'ఇప్పటి దాకా ఎవరూ తాము భగవంతుని చూశామని చెప్పలేదు, కానీ ఈయన మాత్రం నేను భగవంతుని చూశానని చెప్తున్నాడు. ఎలా నమ్మడం?, ఇతను మతి తప్పి మాట్లాడుతుండవచ్చు. కానీ సరైన అవగాహన లేనిదే ఏ అభిప్రాయం ఏర్పరుచుకోకూడదు 'అని మనసులో అనుకున్నాడు నరేంద్రుడు.
                         ఒక నెల రోజులు గడిచాయి. ఒకరోజున నరేంద్రుడు ఒక్కడే దక్షిణేశ్వర్ కు వెళ్ళాడు. రామకృష్ణులవారు మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్నారు. నరేంద్రుని చూడగానే ఆయన చాలా సంతోషించారు. మంచం మీద కూర్చోమన్నారు. అలాగే ధ్యానంలోకి వెళ్ళి ఆయన కాలును నరేంద్రుడి ఒడిలో ఉంచారు.మరుక్షణం నరేంద్రుడికి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఆయనకేదో అయిపోతున్నట్లుగా అనిపించసాగింది.' నన్నేమి చేస్తున్నావు? నా తల్లిదండ్రులు ఇంకా బతికే ఉన్నారు. నేను మళ్ళీ వారి దగ్గరకు వెళ్ళాలి.' అని అరిచాడు. రామకృష్ణుల వారు చిరునవ్వు నవ్వుతూ 'ఈరోజు కిది చాలు 'అని చెప్పి తన కాలును వెనక్కి తీసేసుకున్నారు. నరేంద్రుడు మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. రోజులు గడిచేకొద్దీ ఒకరి పట్ల మరొకరు ఆకర్షితులవసాగారు.ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు.

      నరేంద్రుడి గొప్పతనాన్ని తెలుసుకోవడానికి రామకృష్ణులవారికి ఎంతో సమయం పట్టలేదు. కాళికా దేవి ఆయనకు మార్గనిర్దేశం కూడా చేసింది. కానీ నరేంద్రుడుమాత్రం ఆయనను పరీక్షించేవరకూగురువు గా నిర్ణయించుకోకూడదనుకున్నాడు. 'భగవంతుని గురించి తెలుసుకోవాలంటే స్త్రీలగురించిధనంగురించి వ్యామోహాన్ని విడనాడాలని చెప్పేవాడు' రామకృష్ణులు. నరేంద్రుడు ఆయనకు ప్రియతమ శిష్యుడు. అలాగని నరేంద్రుడు చెప్పిన అన్ని విషయాలతో ఆయన ఏకీభవించేవాడు కాదు. విగ్రహారాధన చేసే వారిని నరేంద్రుడు బాగా విమర్శించేవాడు. అద్వైతాన్ని కూడా వ్యతిరేకించాడు. అలౌకిక అనుభవాల మీద అంతగా నమ్మకం లేదు.' నేనే బ్రహ్మను ,నేనే శివుణ్ణి 'అనేలాంటి వాక్యాలేవీ అతనిని అంతగా ప్రభావితం చేసేవి కావు. కానీ ఎప్పటికప్పుడు రామకృష్ణులవారు నరేంద్రుని సరైన మార్గంలోకి తీసుకువచ్చేవాడు.
           నరేంద్రుడు నెమ్మదిగా ప్రాపంచిక సుఖాలపై వ్యామోహం తగ్గి సన్యాసం వైపు మొగ్గు చూపడం ప్రారంభించాడు. అది తల్లిదండ్రులు గ్రహించారు. అప్పుడు నరేంద్రుడు  బియ్యే పరీక్షకు తయారవు తున్నాడు. 1884లో బియ్యే పాసయ్యాడు. అతని స్నేహితుడొకడు పార్టీ ఏర్పాటు చేశాడు. ఆ పార్టీలో నరేంద్రుడు పాట పాడుతుండగా తెలిసింది పిడుగు లాంటి వార్త. తండ్రి మరణించాడని. వెనువెంటనే ఆ కుటుంబాన్ని పేదరికం ఆవరించింది.సంపాదనలేకపోడం, దైనందిక జీవితానికి ఖర్చుపెట్టుకోనుకుడా ధనంలేకపోయింది. దారిలేక చేబదుళ్ళుచేయటంతో  , అప్పులిచ్చిన వాళ్ళు వేధించడంమొదలుపెట్టారు. కొద్దిమంది న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. నరేంద్రుడు ఉద్యోగం కోసం కాళ్ళరిగేలా తిరిగాడు. బట్టలు మాసిపోయి చిరిగిపోయాయి. రోజుకొకపూట భోజనం దొరకడం కూడా గగనమైపోయింది. చాలా రోజులు ఆయన పస్తులుండి తల్లికి, చెల్లెళ్ళకు, తమ్ముళ్ళకు తిండి పెట్టేవాడు. వారితో తను స్నేహితులతో కలిసి తిన్నట్లు అబద్దం చెప్పేవాడు. కొన్నిసార్లు ఆకలితో కళ్ళు తిరిగి వీధిలో పడిపోయేవాడు. ఇంత దురదృష్టం తనను వెన్నాడుతున్నా ఎన్నడూ భగవంతుని మీద విశ్వాసం కోల్పోలేదు. 'నీవు కాళికా దేవికి మరియు తోటిప్రజలకు సేవ చేయాల్సిన వాడివి, నీవు ధైర్యంగా ఉండాలి 'అంటూ రామకృష్ణుల వారు నరేంద్రుని ఓదార్చేవారు.
     తరువాత నరేంద్రుడు కొద్దిరోజులపాటు 'విద్యాసాగర్ 'పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాడు. ఇప్పుడు కుటుంబానికి కనీసం తినడానికి తిండైనా దొరుకుతున్నది. బోధకుడిగా పనిచేస్తూనేతనన్యాయ విద్యను కొనసాగించాడు. గురువుగారి ఆరోగ్యం క్షీణించింది. ఆయనకు గొంతు క్యాన్సర్ సోకింది. నరేంద్రుడు తన ఉద్యోగం, చదువు రెండు మానేసి గురు శుశ్రూషలో మునిగిపోయాడు. రామకృష్ణుల వారికి మరణం సమీపిస్తోంది. చివరి రోజున ఆయన నరేంద్రుడిని పిలిచి అతడితలపై చేయి ఉంచి అలా మృదువుగా తాకాడు. ఆయన ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ నరేంద్రుడికి ధారపోసి ఇలా అన్నాడు. 'నరేన్! నీవు ఇప్పుడు సర్వశక్తిమంతుడవు. వీళ్ళంతా నా బిడ్డలవంటి వారు. వీరిని చూసుకోవాల్సిన భాద్యత నీదే 'అన్నాడు. నరేంద్రుడి హృదయం బాధతో నిండిపోయింది. గదిలోంచీ బయటకు వెళ్ళిపోయి చిన్న పిల్లవాడిలా దుఖించడం మొదలుపెట్టాడు.రామకృష్ణులవారుచనిపోయినతరువాతఆయనశిష్యులందరూ కలిసి 'బరనగూర్‌లో' ఒక అద్దె ఇంట్లో నివాసం ప్రారంభించారు. ఆ ఇల్లు చాలా పాతది అయినప్పటికీ నగరం యొక్క రణగొణ ధ్వనులకు చాలా దూరంగా గంగానది ఒడ్డున ఉండేది. అక్కడినుండి రామ కృష్ణుల వారి సమాధి చాలా దగ్గరగా ఉండేది. అక్కడే 'రామకృష్ణ మఠం 'స్థాపించడం జరిగింది.అక్కడున్న యువసన్యాసులకు రెండే లక్ష్యాలు ఉండేవి. ప్రజలకు సేవ చేయడం , ముక్తిని సాధించడం. కొద్ది మంది యువకులు తమ కుటుంబాల్ని వదిలిపెట్టి సన్యాసులు గా మారారు. నరేంద్రుడు కూడా సన్యాసిగా మారి ఆమఠానికి నాయకుడయ్యాడు. ఆ యువ సన్యాసులు తిండి, బట్ట గురించిపెద్దగాఆలోచించేవారుకాదు.  ఉపవాసం ఉన్నపుడు కూడా తమ చదువును ధ్యానాన్ని నిర్లక్ష్యం చేసేవారు కాదు. నరేంద్రుడు వారికి సంస్కృతాన్ని బోధించేవాడు. మఠానికి వచ్చే వారికి  గురువుగారి బోధనలను విడమరిచి చెప్పేవాడు.
                       నరేంద్రుడు సన్యాసం స్వీకరించి వివేకానందుడిగా మారాడు. భారతదేశమంతా అతని గృహమైంది.     ఇక్కడి ప్రజలు అతని సోదర, సోదరీమణులయ్యారు. దురదృష్టవంతులైన తన సోదరుల కన్నీళ్ళు తుడవడం అతనికి ఎంతో ఆనందాన్ని కలిగించేది. దేశమంతా పర్యటించాడు. తనకున్న ఆస్తి అంతా ఒక కాషాయ వస్త్రము, ఒక కమండలము, శిష్యగణం మాత్రమే. తన  పర్యటనలో అతను ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించాడు. దారి మద్యలో గుడిసెల్లోనూ, సత్రాలలోనూ నివసించేవాడు, కటిక నేలమీదనే నిద్రించేవాడు. అనేక మంది సాధువుల సాంగత్యంలో గడిపాడు. ఆధ్యాత్మిక చర్చలతో, పవిత్ర కార్యాల గురించిన చర్చలతో సమయం గడిపేవాడు. చాలా దూరం కాలినడకనే నడిచేవాడు. ఎవరైనాఆయన్ని   ఆహ్వానిస్తే   వారి వాహనాల్లో ఎక్కేవాడు. ఆళ్వార్ దగ్గర కొద్ది మంది ముస్లింలు కూడా ఆయనకు శిష్యులయారు. ఎవరైనా రైలు ప్రయాణానికి టిక్కెట్టు కొనిస్తేనే రైలులో ప్రయాణం చేసేవాడు. చాలాసార్లు తన దగ్గర డబ్బులేక పస్తుండాల్సి వచ్చేది. 


మైసూరులో స్వామికి దివాను శేషాద్రి అయ్యర్ , మైసూరు మహారాజా వారితో పరిచయం కలిగింది. పండితుల సభలో స్వామీజీ సంస్కృతం లో చేసిన ప్రసంగం మహారాజా వారిని ముగ్ధుల్ని చేసింది. భారతదేశం వివిధ మతాల , వివిధ తత్వాల సమ్మేళనం. పాశ్చాత్యులు సైన్సులో మంచి పురోగతి సాధించారు. ఈ రెండు కలిస్తే మానవజాతి ఎంతో ముందుకు సాగగలదు. కనుకనేను అమెరికా వెళ్ళి అక్కడ వేదాంతాన్ని వ్యాప్తి చెయ్యాలనుకుంటున్నాను 'అని స్వామీజీ మైసూరు మహారాజాతో అన్నాడు. 'ఐతే ఆ ఖర్చులన్నీ నేనే భరిస్తా'నన్నాడు. మాహారాజా. స్వామీజీ ఆయనకు కృతజ్ఞతలు తెలిపి 'సమయం వచ్చినపుడు తప్పకుండాసహాయం తీసుకుంటానని 'చెప్పి సెలవు తీసుకున్నాడు.
తర్వా త స్వామీజీ భాస్కర సేతుపతి పరిపాలిస్తున్న రామనాడును సందర్శించాడు. 
         అక్కడి రాజు స్వామీజీని మిక్కిలి గౌరవించాడు. మీరు అమెరికాలో జరగబోవు సర్వ మత సమ్మేళనానికి తప్పకుండా హాజరవాలి. అందుకయ్యే ఖర్చంతా నేను భరిస్తాను అన్నాడు. దానిని గురించి తప్పకుండా ఆలోచిస్తానని ఆయనకు మాట ఇచ్చి అక్కడి నుంచి రామేశ్వరానికి వెళ్ళి చివరకు కన్యాకుమారి చేరుకున్నాడు. కొద్ది దూరం ఈదుకుంటూ వెళ్ళి ఒక రాయి మీద కూర్చున్నాడు. పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ భారతదేశపు ఆధ్యాత్మిక విలువల్ని వారికి వివరించడం తన ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నాడు. తరువాత స్వదేశానికి తిరిగి వచ్చి నిదురపోతున్న భారతజాతిని మేల్కొల పాలనుకున్నాడు. అతని ప్రయాణానికి ఖర్చుల నిమిత్తం దేశం నలుమూలల నుంచీ విరాళాలు వచ్చి పడ్డాయి. కానీ అతడు మాత్రం తన ప్రయాణానికి ఎంత కావాలో అంతే స్వీకరించాడు. మిగిలిన ధనాన్ని దాతలకు తిరిగి ఇచ్చివేశాడు. అతను ఎక్కిన నౌక బొంబాయి తీరం నుంచి 1893, మే 31వ తేదీన బయలు దేరింది.
   జులై నెలలో స్వామీజీ చికాగో నగరానికి చేరుకున్నాడు. సర్వమత సమ్మేళనాన్ని గురించి వాకబు చేశాడు. అప్పటికి ఆ సదస్సుకు మూడు నెలల వ్యవధి ఉంది. చికాగో నగరం చాలా ఖరీదయిన నగరం కావడంతో స్వామీజీ బోస్టన్ నగరానికి వెళ్ళాడు. దారి మధ్యలో ఒక మహిళ స్వామికి పరిచయం ఐంది. ఆయనతో కొద్ది సేపు మాట్లాడగానే ఆమెకు ఆయన గొప్పతనమేమిటో అర్థమంది. ఆయన సామాన్యుడు కాదని తెలిసి కొద్ది రోజులు ఆమె ఇంటిలో బస చేయమని కోరింది. స్వామీజీ అందుకు అంగీకరించాడు. అప్పుడప్పుడు చుట్టుపక్కల జరిగే చిన్న సభలలో ఉపన్యసించేవాడు. వీటిలో ప్రధానంగా భారతీయ సంస్కృతి మరియు హిందూ ధర్మం ప్రధాన అంశాలుగా ఉండేవి. నెమ్మదిగా చాలామంది పండితులు ఆయనకు మిత్రులయ్యారు. వారిలో ఒకరు జాన్ హెన్రీ రైట్. అతడు హార్వర్డ్ విశ్వవిద్యాలయం లో గ్రీకు విభాగంలో ఆచార్యుడు. సమ్మేళనానికి హాజరయ్యే సభ్యులంతా నిర్వాహకులకు పరిచయపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. కానీ స్వామీజీ తన పరిచయ పత్రాన్ని ఎక్కడో పోగొట్టుకున్నాడు. అప్పుడు రైట్ పరిచయ పత్రాన్ని రాశాడు. ఆ పత్రంలో స్వామీజీ చాలా మంది ప్రొఫెసర్ల కన్నా మంచి పరిజ్ఞానం కలవాడని రాసి పంపించాడు.  సర్వమతసదస్సు 1893, సెప్టెంబర్ 11న ప్రారంభమైంది.వివేకానందుడు చికాగో వచ్చిసదస్సుకు హాజరయ్యాడు.  దేశవిదేశాల నుంచి వచ్చిన వేలాది మంది ప్రతినిధులు అక్కడ చేరారు. వివేకానంద వారందరిలోకెల్లా చిన్నవాడు. అతను మాట్లాడే వంతు వచ్చేసరికి గుండె వేగం హెచ్చింది. అందరు సభ్యుల దగ్గర ఉన్నట్లు ఆయన దగ్గర ముందుగా తయారు చేసిన ఉపన్యాసం లేదు.అందువల్లా తన ప్రసంగాన్ని చివరలో ఉంచమని అధ్యక్షుడికి వివేకానందుడు విజ్ఞప్తి చేశాడు. ఉపన్యసించడానికి ముందు గురువైన రామకృష్ణులవారినీ, సరస్వతీ దేవిని మనస్పూర్తిగా ప్రార్థించాడు.

   "అమెరికా దేశపు ప్రియ సహోదరులారా! "అని స్వామీజీ తన మృధు మధుర కంఠస్వరంతో అనగానే సభ మూడు నిమిషాలపాటు చప్పట్లతో దద్దరిల్లింది.శబ్దం ఆగిన తరువాత తనప్రసంగాన్నిఆరంభించాడు.  అక్కడున్న ప్రతీ ప్రతినిధి స్వామీజీ ప్రసంగాన్ని ప్రశంసించారు. వార్తాపత్రికలు ఆయన వ్యాసాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. అక్కడి ప్రజలకు ఆయన ఆరాధ్యుడయ్యాడు. ఆయన మాట్లాడడానికి లేచాడంటే చాలు, చెవులు చిల్లులుపడే శబ్దంతో చప్పట్లు దద్దరిల్లేవి. కొన్ని సంస్థలు సభ జరుగు తున్నపుడు మధ్య లోనే తమ సంస్థకు ఆహ్వానించేవి.అనతి కాలంలోనే స్వామీజీకి ప్రపంచ ప్రఖ్యాతి లభించింది. ఎక్కడికి వెళ్ళినా స్వామీజీ తన ప్రసంగంలో భారతదేశపు విలువల్ని చాలా సేపు వివరించే వాడు. చరిత్ర అయినా, సామాజిక శాస్త్రం అయినా, తత్వశాస్త్రం అయినా, సాహిత్యమైనా ఎటువంటి తడబాటు లేకుండా ఉపన్యసించేవాడు.సన్యాసి వస్త్రధారణ ,హిందూ మతాన్ని చక్కగా తెలుపగల నైపుణ్యం, వికాసవంతమైన వ్యక్తిత్వం,ఈ మూడు గుణాలతో ఆయన అందరి హృదయాలను గెలవ గలిగాడు.వాదనలలో ఆయనను ఓడించగలిగిన వారు లేరు.ఆయన ఆంగ్ల నైపుణ్యం అపారం. అటువంటి మహోన్నత వ్యక్తి  
యుగానికి ఒకరే పుడతారు.ఆయనను సజీవంగా చూస్తూ ఆయన బోధనలను వినడం నిజంగా మనం చేసుకున్న పుణ్యం అని ఒక పత్రికవ్యాఖ్యానించింది.
స్వామీజీ కృషి వల్ల ఒక్క అమెరికాలోనే కాకుండా అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ భారతదేశం పట్ల గౌరవం ఏర్పడింది. ఆయన ఎక్కడ ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళినా జనం గుమికూడి ఎంతో ఓపికగా ఎదురుచూసేవారు. ఉపన్యాసం ఐపోగానే,ఆయన్ని తమ ఇళ్ళకు ఆహ్వానించి ఆదరించేవారు. ఇంగ్లాండు నుంచి కూడా ఆయనకు ఆహ్వానం లభించింది. ఆయనకు అక్కడ ఘనస్వాగతం లభించింది. వార్తా పత్రికలు ఆయనను ఘనతను, వాగ్ధాటిని శ్లాఘించాయి. ఎంతోమంది ఆయనకు శిష్యులయ్యారు. వారిలో ముఖ్యులు సిస్టర్ నివేదిత గా మార్పు చెందిన మార్గరెట్ నోబుల్. తరువాత ఆమె భారతదేశానికి వచ్చి ఇక్కడే ఉండిపోవడం జరిగింది.
         నాలుగు సంవత్సరాల పాటు విదేశీ పర్యటన తరువాత స్వామీజీ తిరిగి భారతదేశానికి విచ్చేశాడు. ఆయన తిరిగి వచ్చేసరికి ఆయన కీర్తి దశదిశలా వ్యాపించిపోయింది. జనవరి 15, 1897 ఆయన కొలంబో లో దిగగానే ఆయనకు చక్రవర్తికి లభించినంత స్వాగతం లభించింది. మద్రాసుకు చేరుకొనే టప్పటికి ఆయన అభిమానులు రథం మీద లాగుతూఊరేగించారు.లెక్కలేనన్నిపూలమాలలు,  సందేశాలు లభించాయి. ఎక్కడికి వెళ్ళినా తమ గురువు చెప్పిన సందేశాన్ని వ్యాప్తి చేశాడు.ఆయన దగ్గరకు మార్గదర్శకత్వం కోసం వచ్చేవారికి ఆధ్యాత్మిక విలువల యొక్క ప్రాధాన్యాన్ని బోధించేవాడు. అదే స్పూర్తితో, లక్ష్యంతో1897 లో రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు. తరువాత రెండు సంవత్సరాలలో గంగానది ఒడ్డున గల బేలూర్ వద్ద స్థలాన్ని కొని మఠం కోసం భవనాల్ని నిర్మించాడు.
         వివేకానందుడు గొప్ప తాత్వికుడు. అతని ముఖ్య బోధనల ప్రకారం అద్వైత వేదంతము తత్త్వ శాస్త్రములో నే కాకుండా , సామాజికంగా రాజకీయంగా కూడా ఉపయోగ పడుతుంది. రామకృష్ణుడు నేర్పిన ముఖ్యమైన పాఠాలలో 'జీవుడే దేవుడు' అనేది అతని మంత్రముగా మారింది. 'దరిద్ర నారాయణ సేవ' ,పేదల సేవే భగవంతుని సేవ, అనే పదాన్ని ప్రతిపాదించాడు. "విశ్వమంతా బ్రహ్మం నిండి ఉండగా మనము మనని గొప్ప వారని ఇతరులు తక్కువ వారని ఎలా అనుకుంటాము?" అనే ప్రశ్న తనకు తాను వేసుకుని ఈ తేడాలన్నీ మోక్ష సమయములో కలిగే దివ్యజ్యోతి లో కలిసి పోతాయని తెలుసు కున్నాడు. అప్పుడు పుట్టే ప్రేమ నుండి, తమలోని బ్రహ్మాన్ని తెలుసుకోలేని మనుష్యులను ఆదుకునే సత్ప్రవర్తన పుడుతుంది.అందరు తనవార నుకుంటేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందనే వేదాంత తత్వానికి చెందిన వ్యక్తి వివేకానందుడు. వ్యక్తిగత మోక్షము పై వ్యామోహాన్ని  వదిలివేసి, ఇతరులను బంధ విముక్తులను చెయ్యడమే మనిషికి జ్ఞానోదయమని నమ్మిన మహామహుడుఆయన. రామకృష్ణా మిషన్ను (రామకృష్ణా మఠము) "వ్యక్తి మోక్షమునకు, ప్రపంచ హితమునకు" అనే నినాదము మీద స్థాపించాడాయన.

    'సిద్ధాంతాలు, పిడివాదాలు, సంప్రదాయాలు, దేవాలయాలు మున్నగువాటిని గురించి ఆలోచించక, మనిషి హృదయంలో దీపిస్తూన్న ఆత్మ వస్తువుతో సరిపోల్చితే అవి ఎందుకూ కొరగావు. ఆ వస్తువే ఆధ్యాత్మిక శక్తి. మొదట ఈ శక్తిని సముపార్జించండి. ఇతర ధర్మాలను నిందించవద్దు. ప్రతి మతంలోను, ప్రతి సిద్ధాంతంలోను, ఎంతోకొంత మంచి వుంటుంది.సోదర ప్రేమ గురించి ఊరికే ప్రసంగించక,ఆ ప్రేమను కార్యరూపంలో ప్రదర్శించండి.త్యాగ, సాక్షాత్కారాలను పొందినవాడే ప్రపంచంలోని సర్వమతాలలోని ఏకత్వాన్ని దర్శించగలడు. వ్యర్థ వాదాలకు ఆస్కారం లేదని గ్రహింపగలడు. అపుడే మానవాళికి సహాయం చేయగలడు. వాస్తవానికి అన్ని మతాలు ఒకే సనాతన ధర్మంయొక్క అంశాలు.' అని వివేకానందుడు బోధించాడు.

 వివేకానందుడు గొప్ప తాత్వికుడు. అతని ముఖ్య బోధనల ప్రకారం అద్వైత వేదంతము తత్త్వ శాస్త్రములో నే కాకుండా , సామాజికంగా రాజకీయంగా కూడా ఉపయోగ పడుతుంది. రామకృష్ణుడు నేర్పిన ముఖ్యమైన పాఠాలలో 'జీవుడే దేవుడు' అనేది అతని మంత్రముగా మారింది. 'దరిద్ర నారాయణ సేవ' ,పేదల సేవే భగవంతుని సేవ, అనే పదాన్ని ప్రతిపాదించాడు. "విశ్వమంతా బ్రహ్మం నిండి ఉండగా మనము మనని గొప్ప వారని ఇతరులు తక్కువ వారని ఎలా అనుకుంటాము?" అనే ప్రశ్న తనకు తాను వేసుకుని ఈ తేడాలన్నీ మోక్ష సమయములో కలిగే దివ్యజ్యోతి లో కలిసి పోతాయని తెలుసు కున్నాడు. అప్పుడు పుట్టే ప్రేమ నుండి, తమలోని బ్రహ్మాన్ని తెలుసుకోలేని మనుష్యులను ఆదుకునే సత్ప్రవర్తన పుడుతుంది.అందరు తనవార నుకుంటేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందనే వేదాంత తత్వానికి చెందిన వ్యక్తి వివేకానందుడు. వ్యక్తిగత మోక్షము పై వ్యామోహాన్ని  వదిలివేసి, ఇతరులను బంధ విముక్తులను చెయ్యడమే మనిషికి జ్ఞానోదయమని నమ్మిన మహామహుడుఆయన. రామకృష్ణా మిషన్ను (రామకృష్ణా మఠము) "వ్యక్తి మోక్షమునకు, ప్రపంచ హితమునకు" అనే నినాదము మీద స్థాపించాడాయన.

  'ఉత్తిష్టత జాగ్రత ప్రాప్తవరాన్నిబోధత' - అనేనినాదంతో  భాజాతికీర్తిపతాకాలను విశ్వవ్యాప్తంగా ఎగరేసి. ప్రపంచజనాలనూ, యువతనూ మేల్కొలిపిన మహా మహుడు వివేకానందుని ఆయన జయంతి సందర్భంగా ఈ రోజు జనవరి 12న  స్మరించడం మనకనీస కర్తవ్యంగా భావించాలి.    

No comments:

Post a Comment