Saturday, 17 May 2014

చిటికెలపందిరి.

 

 

 

హోం >> చిన్నారి                        

 

చిటికెలపందిరి.

 

కథ: ఆదూరి హైమవతి

 

 


చిన్నారులూ! మీరు చిన్నారులు కాదు మహా మేధావులు. ఏలాగంటారా! ఇది చదవండి మీకే తెలుస్తుంది, మీలాంటి ఒక చిన్నారి చివరకు ఆంజనేయ స్వామినే బురిడీ కొట్టించాడు మరి! ఆ కథనం బెట్టిదనిన...
కిరణ్‌కు క్రికెట్ అంటే ప్రాణం. చదువంటే అంతగా గిట్టదు. ఏదో అమ్మా నాన్నగార్ల కోసం స్కూల్ కెళుతుంటాడు, పైగా అక్కడ వాడి తోటి క్రికెట్ ఆటగాళ్ళంతా ఉంటారాయె!
నాన్న నరసింహం కిరణ్ మార్కులు చూసినపుడల్లా అపర నరసింహావతారం దాల్చుతుంటాడు. తల్లి లీలావతి ఆపద కాస్తుంటుంది.
"ఈ మారు మార్కులు 60 దాటకపోతే హాస్టల్లో పడేస్తాను. అక్కడ మెడలు వంచి చదివిస్తారు."అని హెచ్చరించాడు. కిరణ్‌కు హాస్టలంటే మహాభయం. అక్కడ వాడిక్లాస్ మేట్ ఒకడున్నాడు. చాపమీద క్రిందపడుకోవాలిట, చన్నీటి స్నానమట. తిండి రేషన్‌లా పెడతారుట! రాత్రి 11గం.వరకూ చదవాలిట! తెల్లవారు ఝామున మూడింటికే లేపుతారుట! లేకపోతే కొడతారుట! బాబోయ్! వాడురోజూ ఏడుస్తుంటాడు. భయంతో కిరణ్ తల్లి కొంగుచాటున చేరి "అమ్మా! నేను హాస్టల్లోచేరనే, ఇంట్లోనే చదువుకుంటా. నాన్నకు చెప్పవే!"అంటూ బ్రతిమాలాడు.
"ఏంటండీ మీరుమరీనీ, ఒక్కగానొక్కబిడ్డను హాస్టల్లో వేస్తారా! వాడేం దిక్కులేనివాడా! చాల్చాలు ఆపండి" అంటూ వాడ్ని వెనకేసుకొచ్చింది. తల్లిప్రేమకదా.
"ఒరేనాయనా! నీవు నాతోపాటుగా రోజూ ఆంజనేయస్వామి ఆలయానికి రారా! ఆయన పిలిస్తే పలికే దేవుడురా! నిన్ను తప్పక ప్యాస్ చేయిస్తాడు." అంటూ వాడికి భక్తినూరిపోసింది. దాంతోవాడు ఉదయం గుడికీ, స్కూల్ తర్వాత క్రికెట్‌కూ హాయిగా వెళుతూ ఆంజనేయ స్వామిమీద భారం మోపాడు.
పరీక్షలు దగ్గరపడేసరికి పదోతరగతి పిల్లలందరికీ దేవునిపై భక్తిపెరిగిపోయింది. ముడుపులు కట్టేవారూ, ఆంజనేయ స్వామికి తమలపాకుల దండలేస్తామనేవారు, చిట్టిగారెలు, అప్పాలూ వేస్తామనే వారు, మక్కువగా రోజుకో మొక్కు మొక్కుతున్నారు. 
ఒకరోజున కిరణ్ "అమ్మా! ఆంజనేయస్వామి నన్ను ప్యాస్ చేయిస్తాడుగా?'మా క్లాస్ మేట్సంతా చాలామొక్కులు మొక్కుతున్నారమ్మా! నేను ఏదో ఒక కొత్తమొక్కు మొక్కుకుంటానే!" అన్నాడు.
"దాందేముంది నాయనా! 40రోజులు ప్రదక్షిణాలూ, పాసయ్యాక వంద కొబ్బరికాయలూ కొడతానని మొక్కుకో."అంది వాళ్ళమ్మ కిరణ్ తల ప్రేమగా నిమురుతూ.
ఆమాటలు విన్న వాళ్ళనాన్న "చదివితే పాసవుతారుగాని, పుస్తకం పట్టకుండానే మొక్కులు మొక్కినంత మాత్రాన ఏదేవుడూ పాస్ చేయించడు, బధ్ధకపు వెధవా! వాడికితోడు నీవో బడుధ్ధాయి తల్లివి. కూర్చోబెట్టి చదివించు. ఫలితం ఉంటుంది." అని కోప్పడ్డాడు. తల్లి నాయనా కాస్తంత చదవరా! దేనికైనామంచిది" అని బ్రతిమాలగా కిరణ్ పుస్తకాలు ముందేసుకుంటే, ఒక్కటీ అర్థమై చావట్లేదు వాడికి. ఏనాడైనా పుస్తక తెరిస్తేనా!
"ఒరే భలే ఐడియారా! ఈ ఒక్క ఐడియాతో మన జీవితాలే మారిపోతాయి. మనం ఆంజనేయ స్వామికి పూల పందిరి వేయిద్దాం, కనీసం బిట్ పేపర్ ఆన్సర్స్ తెలిసేలా చేయమని ప్రార్ధిద్దాం , బిట్స్ మాత్రమే చదువుదాం సరా!" అని కిరణ్ క్రికెట్ ఫ్రండ్స్ అంతా బిట్స్ ఏకబిగిని కంఠతా పట్టసాగారు.
పరీక్షలు రానే వచ్చాయి. మొదటి రోజున కిరణ్ ఫ్రండ్స్ అంతా చిటికె లేసుకుంటూ పరీక్ష హాల్లోకి వెళ్లసాగారు. అప్పుడే కిరణ్‌కు ఒక గొప్ప ఐడియా తట్టింది."స్వామీ! ఆంజనేయా! నీకు చిటికెల పందిరేయిస్తాను స్వామీ! నన్ను పాస్ చేయించు ప్రభూ!" అని మొక్కుకుని పరీక్ష హాల్లో ప్రవేశించాడు.
ఆలయంలోని ఆంజనేయస్వామికి చాలా సంభ్రమం కలిగింది.'ఇంతవరకూ ఒక్క భక్రుడైనా వేయించని ' చిటికెల పందిరి ' వేయిస్తానంటున్నాడు, ఈమొక్కు ఏ నాడూ నేను కనలేదూ, విననూలేదు, వీడినెలాగైనా పాస్ చేయించి ఆ ’చిటికెల పంది’రేయించుకోవాలి ' అనుకుని, బిట్స్ అన్నీవాడు చదివినవే వచ్చేలా చేశాడు. కిరణ్ బిట్సన్నీ బాగా వ్రాసి పరీక్షపాసయ్యాడు. 
తల్లి మురిసి ముద్దైపోయి "రానాయనా! ఆంజనేయ స్వామి ఆలయానికెళ్ళి మొక్కులు తీర్చుకొద్దాం “ అని తమలపాకుల మాలా, చిట్టి గారెలమాలా, కొబ్బరి కాయలూ పట్టుకుని బయల్దేరింది. అన్ని మొక్కులూ తీర్చుకున్నాక ,"అమ్మా! ఉండవే! మరో మొక్కు మిగిలి పోయింది.దేవుడికి చిటికెలపందిరేయాల" అంటూ దేవునికి ఎదురుగా నిల్చుకుని,
"స్వామీ! ఇదిగో చిటికెల పందిరి --" అంటూ చేత్తో చిటికె లేస్తూ ఇది ఒక స్తంభం, ఇది మరో స్థంభం అంటూ నోటితో పలుకుతూ చిటికె లేస్తూ స్థంభాలూ, అడ్డపట్టెలూ నిలువుపట్టెలూ, ఆకులూ ‘అని పలుకుతూ చిటికెలు వేస్తూ," స్వామీ నీమొక్కు తీర్చుకున్నాను చిటికెల పందిరేశాను." అని చెప్పి నమస్కరించి వెళ్ళాడు కిరణ్. 
ఆంజనేయస్వామి "ఓరీ నన్నే బురిడీ కొట్టించావు కదరా! ఇదా చిటికెల పందిరంటే!" అని విస్తుపోయాడు, పాపం దేవుడు.
రచన: ఆదూరి హైమవతి.

Friday, 16 May 2014

ఇ బుక్ గా కినిగె లో నీతికధలు పిల్లలప్రీతికధలు, బామ్మచెప్పిన భలే భలే కధలు అనే రెండు

అందరికీ నమస్కారం!

ఈ లింక్ లో నేను చిన్నపిల్లలకోసం  వ్రాసిన నీతికధలు , కొత్తపల్లి, ఆంధ్రభ్రభ దినపత్రికల్లో ప్రచురితమైన కధలు ఇ books ,[పిల్లలప్రీతికధలు, బామ్మచెప్పిన భలే భలే కధలు అనే రెండు  ] గా కినిగె లో   ప్రబ్లిష్ అయ్యాయని  తెలుపు టకు సంతోషించుచున్నాను. , దయచేసి చదివి మీ అమూల్య అభిప్రాయాలు తెలుపవలసినదిగా మనవి.మీకు నచ్చితే ఆవిషయం  కినిగె లో ప్రచురించవలసినది గాకోరుచున్నాను..
with best regards,
ఆదూరి.హైమవతి.