Monday, 11 November 2013

వాగ్దేవి విహారస్థలాలు

వాగ్దేవి విహారస్థలాలు
Monday, May 6, 2013 10:21 AM
ఆదూరి హైమవతి, షికాగో.

తల్లీ నిన్నుదలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవునా
యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శో
భిల్లంబల్కుము నాదువాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహినీ
ఫుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా !

అని ' పలుకులతల్లి ' 'వాగ్దేవి 'దయ కోసం అనాదిగా అంతా తల్లిని అర్చిస్తూనే ఉన్నారు. ' ఋగ్వేదం, దేవీ భాగవతం, బ్రహ్మవైవర్త,పద్మపురాణాలలోనూ తల్లి సరస్వతి గురించి అనేక కధలున్నాయి. సరస్వతీదేవి ఆద్యంత రహిత,శక్తి స్వరూపిణి అని వివిధస్తోత్రాలలో స్తుతిస్తాం. బ్రహ్మసకల సృష్టికర్త గనుక సరస్వతిని కూడా బ్రహ్మయే సృష్టించాడని, సృష్టికార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్వపై ఆమెను ధరించాడనీ ఒక కధ. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తిస్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతా దేవి ప్రసాదించిందని దేవీభాగవతం తెలుపుతోంది. సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక కధనం. వాక్, బుద్ధి,వివేకం,విద్య ,కళలు,విజ్ఞానం - వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని మనం అర్చిస్తాం . దేవత హంసవాహనంపై, 'కచ్ఛపి' అనే పేరుగల వీణ ధరించి స్వరాలు పలికిస్తూ , ప్రార్ధించినవారికి విద్యాబుధ్ధులు , జ్ఞానం ప్రసాదిస్తుంటుంది. తల్లి తెల్లని పద్మంపై ఆసీనురాలై , తెల్లని వస్త్రాలు ,తెల్లని ముత్యాల సరాలు  ధరించి దరహాస వదనంతో భక్తుల పాలిట  కొంగుబంగారంగా ఉంటుంది.

     శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
     హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
     దార సుధాపయోధి సితతామర సామరవాహినీ శుభా
     కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ!

అంటూ, బమ్మెరపోతనాచార్యులు తల్లి సరస్వతిని స్తుతించారు.

పరాశక్తి తొలిగా ధరించిన ఐదురూపాల్లో సరస్వతి ఒకటి. మాత కేవలం చదువులనే కాదు ,సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుంది. బ్రహ్మ, భూదేవి, సనత్కుమారుడు, ఇంద్రుడు ,శ్రీకృష్ణుడు , శివుడు, బృహస్పతి, వాల్మీకి, వ్యాసుడు మొదలైన మహామహులు అనేక సందర్భాలలో సరస్వతీదేవిని ప్రార్ధించి కృతకృత్యులైన వారే! యాజ్ఙవల్కమహర్షి ఓసారి పొరపాటున గురువు ఆగ్రహానికి గురై తాను చదువుకున్న చదువునంతా మఱచి పోతాడు. అపుడాయన సూర్యుని ప్రార్ధించగా మహర్షి భక్తికి  మెచ్చి వేదవేదాంగాలను సూర్యుడు ఆయనకు బోధిస్తాడు, ఐతే  యాజ్ఞవల్క్యుడికి జ్ఞాపకశక్తి లేక పోవటాన అంతా మఱచిపోవడం సూర్యుడు గమనించి,సరస్వతీ స్తోత్రాన్నిభక్తి తో పఠించమని చెప్తాడు ,యాజ్ఞవల్క్య మహర్షి భక్తితో సరస్వతీ స్తుతి చేస్తాడు, సరస్వతి మహర్షిని మళ్ళీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా ఆశీర్వదిస్తుంది.

తల్లిని పూజిస్తే బుద్దివికాసంతోపాటు , సకలశుభాలూ సమకూరుతాయని భక్తుల విశ్వాసం. వాక్కు, బుద్ధి, విద్య, జ్ఞానాలకు, భాషకు, లిపికి అధిష్టానదేవత సరస్వతీదేవి. ఈమె వీణాపుస్తక ధారిణి. శుద్ధసత్యస్వరూపిణి. హంస ఆమె వాహనం. సరస్వతి బ్రహ్మ దేవుని నాలుక యందు నివసిస్తుంది. పలుకు తేనెల బంగారుతల్లి. వేదాలకు జనయిత్రి. తెల్లని వన్నెలు విఱజిమ్ముతూ,  తెల్లని వస్త్రాలు ధరించి  వీణ, పుస్తకాలు చేదాల్చి, రత్న భూషణాలు మెడలో ధరించి, సకల శాస్త్రాలకూ అధిదేవత అయిన సరస్వతీదేవి భక్తులకు కోరిన కోర్కెలు ప్రసాదిఒచేందుకు ఆయత్తమై ఉంటుంది. ఆమె దయ ఉంటే మూర్ఖుడు సైతం పండితుడు కాగలడు. ఆమెను తృణీకరించిన మహా పండితుడుసైతం జ్ఞాన భ్రష్టునిగా, వివేకశూన్యునిగా మారి సర్వం పోగొట్టుకుని పిచ్చివాడయిపోతాడు. అందుకే తల్లి కరుణ కోసం మనం పరిపరివిధాల ప్రాధేయపడతాం.

సరస్వతి మాత యొక్క అనేక నామాలు విధంగా ఉన్నాయి. శారద ,హంసవాహిని ,జగతీ ఖ్యాత ,వాగీశ్వరి ,కౌమారి, బ్రహ్మచారిణి ,బుద్ధిధాత్రి ,వరదాయిని ,క్షుద్ర ఘంట ,భువనేశ్వరి ,భారతి, వీణాపుస్తుకధారిణి ,అనుష్టుప్, ఆదిత్య, , ఉక్తి, ఐందవి, కభార్య కాదంబరి, కాషాయ మోహిని, కాషాయ వల్లభ, గీః, గీర్దేవి, గౌః, జూం, పుస్తకమ్, బ్రాహ్మీ, భగవతీ, భారతీ, భాషా, మహాలక్ష్మీః, వర్ణ రూపిణీ, వాక్, వాణీ, వారీ, , శ్రీః, సావిత్రీ ...మొదలైనవి.

హిందూమత ప్రభావం ఉన్న బౌద్ధమతంలో కొన్నిచోట్ల మంజుశ్రీ, మహాసరస్వతి, వజ్రసరస్వతి, ఆర్యవజ్ర సరస్వతి, వజ్రవీణాసరస్వతి, వజ్ర శారద వంటి పేర్లతో సరస్వతి ఆరాధన జరిగినట్లు , జైనులు శృతదేవతగా, షోడశ విద్యా దేవతలకు అధికారిణిగా సరస్వతిని ఆరాధించినట్లు ,శ్వేతాంబరులు హంసవాహిని అని ఈదేవిని స్తుతించినట్లు, "శ్రీ మద్భోజ నరేంద్ర చంద్ర నగరీ విద్యాధరీ" అని భోజుడు వాగ్దేవిని ప్రతిష్టించాడని చారిత్రక ఆధారాలవలన తెలుస్తోంది .

సరస్వతీక్షేత్రాలు దేశవ్యాప్తంగా  - బాసర,వర్గల్, కాష్మీర్ లోని శారదా మందిరం ,రాజస్థాన్  లోని పుష్కర్, కర్ణాటక లోని శృంగేరి, తమిళనాడులో 'కూతనూర్' ,రాజస్థాన్ లోని పిలాని మొదలైనచోట్ల ఉన్నాయి. క్రీ.పూ. 2 శతాబ్దికి చెందిన సరస్వతీ విగ్రహము ఉత్తరప్రదేశ్లో మధుర సమీపంలోని 'ఖజ్జాలీటీలా'లో లభించింది. గుప్తరాజులలో ఒకడైన సముద్ర గుప్తుడు తన సువర్ణ నాణెములపై ఒకవైపు సరస్వతీ దేవిని, మరొకవైపు వీణను ముద్రించాడు. అలాగే క్రీ.పూ. 550-575 ప్రాంతంలో ఒక గౌడవంశ రాజు తన నాణెములపై సరస్వతీదేవి రూపమును ముద్రించాడు.

క్రీ.. 10 శతాబ్దంలో ఒరిస్సా (ఖచ్చింగ్)లో వీణాపాణియైన సరస్వతి  విగ్రహం చెక్కబడింది. పాలవంశపు రాజుల నాటివని చెప్పబడుచున్న సరస్వతి విగ్రహాలు పాట్నాలోను, కలకత్తా (హాష్తోష్) మ్యూజియంలోను భద్రపఱచబడ్డాయి. ఇంకా వివిధ మ్యూజియాలలో సరస్వతీశిల్పాలున్నాయి. ఖజురాహోలోని పార్శ్వనాధాలయంలోను, ఖందరీయ మహాదేవాలయంలోను వాగ్దేవి విగ్రహాలున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని ఘంటసాలలో క్రీ.పూ. 2 శతాబ్దికి చెందిన సరస్వతీ విగ్రహం లభించింది. క్రీ.. 10 శతాబ్దికి చెందిన చాళుక్యుల కాలం నాటి విగ్రహం సామర్లకోట భీమేశ్వరాలయంలో ఉంది. కారెంపూడి, తంజావూరు, హలెబీడు, శ్రీరంగంలలో సరస్వతీదేవి విగ్రహాలున్నాయి.

వర్గల్ :- .హైదరాబాదుకు సుమారు 48 కి.మీ. దూరం లోగల వర్గల్లోని వాగ్దేవి  సరస్వతీ దేవి ఆలయం ఇప్పుడిప్పుడే ప్రాముఖ్యాన్ని పొందుతోంది   .భక్తులు ఆలయం గురించీ తెలుసుకుని అమ్మ దర్శనానికై రావడం మొదలుపెడుతున్నారు .  అమ్మవారి ఆలయం చిన్న కొండపైన చూడముచ్చటగా ఉంటుంది. మాఘశుధ్ధ త్రయోదశిరోజున వర్గల్ లోని విద్యాసరస్వతీ అలయంలో నిర్వహించే '2 నుండీ 4 సం. పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం హృద్యంగా  ఉంటుంది. వసంతపంచమీ ఉత్సవాలు వైభవంగా  జనవరి 20 జఱుగుతాయి. ఉత్సవాల్లో  వేలసంఖ్యలో   భక్తులు దేవీదర్శనానికి వస్తుంటారు.  కంచి శంకరమఠం వారిచే ఆలయం నిర్వహింపబడుతోంది, ఇచ్చటి వేదపాఠశాలలో ఎంతోమంది విద్యార్ధులు వేదాభ్యసనం చేస్తున్నారు.  విద్యాసరస్వతితోపాటుగా 3 అడుగుల ఎత్తైన శనిదేవుని విగ్రహం, లక్ష్మీగణపతి, శివ, వైష్ణవ ఆలయాల కాంప్లెక్స్  కొండపైన చక్కని శిల్పసంపదతో మనస్సును దోచుకుంటుంది.

కాశ్మీర్ లోని శారదామాత ఆలయం  చాలా పురాతనమైనది.  ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న కాశ్మీర్ భూభాగంలో ఉన్న మందిరం చారిత్రికంగా చాలా ముఖ్యమైనది. కాశ్మీర్ చరిత్రకారుడైన కల్హణుడు తన రాజ తరంగిణిలో మందిరం గుర్కించి చాలా వివరంగా వ్రాశాడు. "నమస్తే శారదా దేవి కాశ్మీర మండల వాసిని" అన్న ప్రార్ధన దేశమంతటా వినిపించేది. శాండిల్యమునికి శారదా దేవి ఇక్కడ  ప్రత్యక్షమైనదని అంటారు  . దేశం లోని పండితులందఱికీ ఇది పరమ పవిత్రక్షేత్రం. ఆది శంకరాచార్యులవారు , రామానుజాచార్యులవారు వంటి గురువులు ఇక్కడికి వచ్చి దేవి దర్శనం చేసుకొన్నారని అంటారు. మందిరం ఉన్న స్థలాన్ని కూడా కల్హణుడు  తన కాశ్మీర రాజచరిత్రలో వర్ణించాడు.

బాసర :- ఆదిలాబాదుజిల్లాలోని బాసర పుణ్యక్షేత్రం నిర్మల్ పట్టణానికి 35 కి.మీ. దూరంలో గోదావరినది ఒడ్డున, హైదరాబాదుకు సుమారు 200 కి.మీ. దూరంలో ఉంది. బాసరలో జ్ఞానసరస్వతి అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీఱి ఉన్నారు. ఇక్కడి మందిరం చాళుక్యులకాలంలో నిర్మింపబడింది. మందిరం ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది.

ఆలయ చరిత్ర :- గోదావరి ప్రవహిస్తున్న పుణ్యభూమి వ్యాసమహర్షి పాదస్పర్శతో పునీతమైంది. వ్యాసమహర్షి ప్రశాంత చిత్తంతో తపస్సుచేయడానికి ప్రాంతానికివచ్చి ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మాండపురాణాన్ని రచిస్తున్నప్పుడు ప్రకృతి ఖండంలోని శక్తిని వర్ణించాల్సిరాగా, శక్తిని వర్ణించాలంటే మరింత తపశ్శక్తితో పాటు ఎలాంటి అంతరాయంలేని మహిమగల ప్రశాంత వాతావరణం అవసరమని భావించి ఆయన అన్నిప్రాంతాలూ తిరిగి బాసర చేఱుకున్నాడు. నాందేడ్నుంచి బ్రహ్మేశ్వరం వఱకు గోదావరి నాభిస్థానం అంటారు. అక్కడ వ్యాసుడు ధ్యానం చేసుకోవడానికి ఆగాడట , గోదావరితీరంలో ధ్యానముద్రలో ఉన్నఆయనకు శక్తిరూపం నీడలా కనిపించి వెనువెంటనే మాయమైందిట. దీంతో రూపం ఎవరిదా? అని దివ్యదృష్టితో చూడగా జ్ఞానసరస్వతి అమ్మవారు కనిపించారట. పూర్తిరూపం కనిపించకపోవడానికి కారణం అడగగా అమ్మ ఋషితో  ' ప్రతిరోజూ ధ్యానంచేసి గోదావరిలో పిడికెడు ఇసుకను అచ్చట వేయాలని, ఇలా వేసిన ఇసుకతో తన పూర్తి రూపం తయారవుతుందని, అనంతరం జ్ఞాన సరస్వతిగా అందరికి దర్శనమిస్తానని '  చెప్పిందిట. అప్పుడు వ్యాసుడు గోదావరితీరానికి కొంతదూరంలో ఉన్నకుమారచర పర్వతంలోని ఒక గుహలో తపస్సు ప్రారంభించాడట . అమ్మవారు చెప్పినట్టు ఇసుకను తీసుకువచ్చి ప్రస్తుతం బాసరలో ఉన్న కోనేరు ఎదురుగా వేయడం ప్రారంభించారట. ఇలా కొన్ని ఏళ్లు గడిచిన అనంతరం అమ్మవారి రూపం పూర్తయ్యి, ఆమె జ్ఞానసరస్వతిగా ఆవిర్భవించిందని పురాణకధనం.  విగ్రహానికి జీవం పోయడం కోసం తగిన శక్తి కలిగేందుకు సరస్వతిదేవి ఆయనకు జ్ఞానబీజాన్నిఉపదేశించింది. జ్ఞానానికి పుట్టుక బాసరలో జఱిగినందున బాసర జ్ఞానానికి పుట్టినిల్లుగా వెలుగొందుతోంది. భారతదేశంలో కన్యాకుమారిలో, కాశ్మీర్లలో సరస్వతీదేవాలయాలు ఉన్నప్పటికీ చదువులతల్లి  జ్ఞానసరస్వతీ  బాసరలోనిది మాత్రమేనని, దేశంలోమరెక్కడాలేదని అంటారు. అయితే ఒక్క సరస్వతీదేవినే ప్రతిష్టించడం సబబు కాదని, ఈమెకు తోడుగా  మహాకాళీ, మహాలక్ష్మీలను సైతం ప్రతిష్టించారు.

శక్తిరూపిణి శారద :- పుత్రసంతానం కోసం దశరథుడు ఇక్కడ పూజలు చేశాడు. ఎనిమిదిమంది దేవతలు కోనేరులోని వివిధ  ప్రాంతాల్లో స్నానాలు చేయడంతో దీనికి అష్టతీర్థ సరోవరమని పేరు వచ్చింది. అవే ఇంద్రతీర్ధం, సూర్యతీర్ధం, వ్యాసతీర్ధం, వాల్మీకి తీర్ధం, విష్ణుతీర్ధం, గణేషతీర్ధం, పుత్రతీర్ధం, శివతీర్ధం. ఒకసారి దుర్వాసమహాముని సరస్వతీదేవి ఇచ్చిన పుష్పమూలికను ధరించి స్వర్గలోకానికి వెళ్లి దాన్ని ఇంద్రునికి ఇచ్చాడు. ఇంద్రుడు దాన్ని ఐరావతానికి అలంకరించాడు. అది దాన్ని తొండంతో అందుకుని నేలమీద వేసింది. దీనికి కారణం ఇంద్రుడేననే కోపంతో అతడు త్రైలోక్యరాజ్య భ్రష్టుడై కుష్టువ్యాధి గ్రస్తుడు కూడా కావాలనిశపించాడు దుర్వాసుడు. ఇంద్రుడు బృహస్పతి మాట ప్రకారం కోనేరులోని తూర్పుభాగంలో స్నానంచేసి శాపవిమోచనం పొందాడు. దీనికారణం గా స్థానానికి ఇంద్ర తీర్థమని  పేరువచ్చింది. ఇంద్రుడు పూజలు చేసిన స్థలం సరస్వతీదేవి మందిరానికి పూర్వభాగంలో ఒకమైలు దూరంలో గోదావరి నదీతీరంలో ఉంది. దీనిని ప్రస్తుతం  ' కుక్కుటేశ్వరం ' అనిపిలుస్తారు.

సూర్యుడు ఆకలిని తట్టుకోలేక మంత్రోచ్ఛారణకు ముందుగానే భుజించడంతో ఆగ్రహించిన ఇంద్రుడు వజ్రాయుధంతో సూర్యుడు కాంతి హీనుని చేస్తాడు.  కోనేటికి ఆగ్నేయభాగంలో స్నానంచేయడంతో పూర్వవైభవాన్ని పొందాడు, సూర్యుడు పూజలుచేసిన చోటు సరస్వతీదేవికి  ఆగ్నేయదిశగా అఱమైలుదూరంలో గోదావరి నదీతీరాన ఉంది. ప్రస్తుతం దీనిని సూర్యేశ్వరమని పిలుస్తు న్నారు. ఆలయానికి దక్షిణ దిక్కున వేదవ్యాసుడు తపస్సు చేసిన ప్రాంతాన్ని ఇప్పుడు వ్యాసతీర్థం అంటున్నారు. ఇక్కడ వ్యాస మందిరం కూడా ఉంది. వాల్మీకి మహర్షి కోనేటికి నైరుతిదిశలో స్నానం చేసి, శ్రీమద్రామాయణం వ్రాశాడు. వాల్మీకి పూజలు చేసిన స్థలం బాసర బస్టాండు సమీపంలో రోడ్డుకు కుడివైపున శ్రీ వెంకటేశ్వర మందిరంగా వెలుగొందు తోంది. వినాయకుడు అగ్రపూజార్హత పొందేందుకు కోనేటికి వాయువ్య దిశలో స్నానం చేశాడు. గణేశుని మందిరం బాసరగ్రామం నుంచి సరస్వతీ మందిరానికి వెళ్లేమార్గం లో ఉంది.దశరథుడు ఉత్తర తీరంలోస్నానంచేయడంతో దీనిని పుత్రతీర్థం అంటున్నారు. కుమారస్వామి పూజలు చేసిన స్థానం కుమార తీర్థం అనీ, ఈశాన్య దిశలో ఈశ్వరుడు స్నానంచేసి దేవిని ధ్యానించిన ప్రాంతాన్ని శివతీర్థం అని పిలుస్తారు. సరస్వతీ మంది రానికి ఉత్తరాన ఒక మైలు దూరంలోని ప్రదేశాన్ని ' పాపహరేశ్వరాలయ 'మని పిలుస్తారు. కోనేటి మధ్యభాగంలో ఉన్నదానిని సరస్వతీ తీర్థం అని పిలుస్తారు.
మందిరం చాళుక్యుల కాలంలో నిర్మించినదిగా చెప్తారు. దేవాలయం ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో, ఆహ్లాదకరంగా ఉండ టం వల్ల ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది. ధ్యానదేవాలయానికి తూర్పుభాగమున ఔదుంబర వృక్ష (మేడిచెట్ల) ఛాయలో దత్త మందిరమూ, దత్త పాదుకలూ మనం చూడవచ్చు. మహాకాళీ దేవా లయం పశ్చిమ భాగమున నిత్యార్చనలతో చూడ ముచ్చటగా ఉంది. శ్రీ వ్యాసమందిరం దక్షిణదిశలో ఉంటుంది. ఇందులో వ్యాసభగవానుని విగ్రహము, వ్యాసలింగము ఉన్నాయి. మంది రానికి దగ్గఱలో ఒక గుహ ఉన్నది. ఇది నరహరి మాలుకుడు తపస్సుచేసిన స్థలమని చెప్తారు. అక్కడ "వేదవతి" అనే శిలపై తడితే ఒక్కో ప్రక్క ఒక్కో శబ్దం వస్తుంది. అందులో సీతమ్మవారి నగలున్నాయని చెప్తారు.
ఇంత మహా మహిమాన్వితమైన బాసరకు, నేటికీ  దేశవిదేశాల్లో నివశిస్తున్న భారతీయులు, ముఖ్యంగా ఆంధ్రులు ప్రత్యేకించివచ్చి, తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేసుకుని , తమ బిడ్డలు జ్ఞానసంపన్నులుగా, విద్యా వివేకాలతో, సద్బుధ్ధులతో  విరాజిల్లాలని  అమ్మ ను పూజించి వెళుతుంటారు. అట్టి జ్ఞానమూర్తిని దర్శించని జన్మ వృధా అనడంలో అతిశయం లేదని భావించవచ్చు. ఒక్కమారైనా అమ్మను దర్శిస్తే  జన్మ సార్ధక మవు తుంది.
                                                          
     ***************************పుష్కరిణి వెబ్ మ్యాగజైన్లో ప్రచురితం.