Sunday, 11 August 2013

అసూయ అనర్థ హేతువు

చిన్నారి 




అసూయ అనర్థ హేతువు


apr -   Sun, 11 Aug 2013, IST


రాజుపాలెం అనే గ్రామంలో భూకామందు మాధవయ్య కొడుకు కుమార్‌, పేదవాడైన కొమరయ్య కొడుకు కిట్టయ్య ఒకే స్కూళ్లో చదువుకుంటున్నారు. కొమరయ్య అతడి భార్య కూలికి వెళ్లి వచ్చిన డబ్బులతో గంజి తాగి బతికేవాళ్లు. వాళ్లుండే గుడిసెలో ఏ లైట్లు లేవు. చమురు దీపపు వెలుగులో గడిపేవారు. చీకట్లో గంజి తాగుతూ
తమ బిడ్డకు ధనం కన్నా గుణం గొప్పదని, ధనం కోసం ఏ దుర్మార్గాలూ చేయరాదని, అంతా మన ప్రవర్తనను బట్టే జరుగుతుందని చెప్పేవారు.
తల్లిదండ్రులు చెప్పే మాటలతో కిట్టయ్య చిన్నప్పటినుంచి మంచి విద్యార్థిగా పేరుతెచ్చుకున్నాడు. తరగతిలో వాడే ఫస్ట్‌ మార్కులు తెచ్చుకునేవాడు. వాడి చేతిరాత ఎంతో బాగుంటుందని ఎన్నోసార్లు పంతులుగారు బోర్డుపై రాయించేవారు.
చిరిగిన పాతగుడ్డలతో వచ్చే కిష్టయ్యకు మంచిపేరు రావడం, పంతులుగారు ఎప్పుడూ వాడిని మెచ్చుకోవడాన్ని కుమార్‌ భరించలేకపోయేవాడు. ఆ ఏడాది ఆగస్టు 15 పండుగ నుద్దేశించి జరిపిన ఆటల పోటీలు, చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు ఇలా అన్నీ కలిపి ఓ పది బహుమతులు కిట్టయ్య సొంతం చేసుకున్నాడు. కిట్టయ్యకు అన్ని బహుమతులు రావడం చూసి అకారణంగా కోపం
పెంచుకున్నాడు కుమార్‌. ఎలాగైనా వాడిని బాధించి సంతోషించాలని ఆలోచించసాగేడు. ఒకరోజు చెరువు గట్టుమీద అమ్మ నేర్పిన

పద్యాలను వల్లె వేసుకుంటూ వస్తున్నాడు. కిట్టయ్యను చెరువులోకి తొయ్యాలని ఒక చెట్టుకింద కాపు కాస్తున్నాడు కుమార్‌. కిట్టయ్య తన దగ్గరకి రాగానే కుమార్‌ గభాలున నీళ్లలోకి తోసాడు. అయితే అదే ఊపుతో కుమార్‌ కూడా నీళ్లలో పడ్డాడు.
తండ్రివెంట చేపలవేటకు వెళ్లే అలవాటున్న కిట్టయ్య నీళ్లలోంచి ఈదుకుంటూ బయటకు వచ్చాడు. అయితే ఈత రాని కుమార్‌ రక్షించండి! రక్షించండి! అంటూ నీళ్లలో కేకలు వేయసాగాడు. మళ్లిd నీళ్లలోకి దూకి కుమార్‌ను ఒడ్డుకుతీసుకువచ్చాడు. అక్కడే కడుపులోంచి నీళ్లను బయటకు కక్కించి ఇంటికి తీసుకెళ్లాడు. తను చేసిన పనికి సిగ్గుతో తలదించుకున్న కుమార్‌ క్షమించమని కిట్టయ్యను వేడుకున్నాడు. కిట్టయ్య ఇద్దరం కలిసుందామని స్నేహహస్తాన్ని చాచాడు.
-- ఆదూరి హైమావతి, చికాగో
ఆదివారం ఆంధ్రప్రభ 11ఆగస్ట్ లో ప్రచురితం.

No comments:

Post a Comment