Thursday 18 April 2019


                          తల్లివడి ప్రధమబడి '
                                
 మెదటి దైవం తల్లి , మాతృదేవోభవ ,పితృదేవోభవ --అనే మన భారతీ సంస్కృతీ సౌరభాలను పూర్వం నుంచీ మనపెద్దలు,ప్రవచిస్తూవచ్చారు. అడుగడుగునా మనశాస్త్రాల్లోనూ విషయాలను ఉదహరిస్తూ  తల్లిబాధ్యతను గుర్తుచేస్తూ --మొదటి దైవమే గాక తల్లిమొదటి గురువు కూడా అని చెప్పనేతల్లివడి ప్రధ మబడి'అన్నారు.
         ముందు తల్లి చూపులతో  ,నవ్వులతో సౌఙ్ఞలతో బిడ్డను వడిలో ఉంచుకుని పాలు పడుతూ , స్నానం చేయిస్తూ, బట్టలు తొడుగుతూ వంటికి మసాజ్సేస్తూ తన భావనలను మనస్సు ద్వారా, చూపుల ద్వా రా--తాబేలు తన పిల్లలను నదికి ఆవలి గట్టున ఉంచి ఈవలి గట్టు నుండీ వాటిని చూస్తూ ,తన చూపులతో పెంచుతుందిట !
   అలా తల్లి తన తలంపుల ద్వారా తన పిల్లల పెరుగుదలకు కృషి చేస్తూ బిడ్డల మనోభావాలను తెల్సు కుని ఆలన పాలన అంది స్తూ  వారి ప్రతిస్పందనలను తెల్సుకుని బిడ్డలకు అర్ధమ య్యేలాగా మౌనభాష నేర్పుతుంది . ఆపైన వారికి చిన్న చిన్నమాటలు చెప్తూ భాష నేర్పుతుంది. అమ్మ, నాన్న తాత , బామ్మ మొదలైన ఇంటి సభ్యుల పరిచయం చేస్తూ సంఘంతో సాంగత్యం ఏర్పరుస్తుంది. బిడ్డ పెరిగే కొద్దీ తినడం, తాగడం ,వంటి చిన్న చిన్న  పనులు చేసు కోడం నేర్పుతూ మొదటి గురువుగా నిలుస్తుంది.

  తల్లి తన కర్తవ్యాన్ని ఆదర్శవంతంగా ఎలా నిర్వహించాలో మనకు పురాణ గాధల ద్వారా తెలుస్తుంది. మన 'ఆదర్శమాతలను ' గురించి ఒకమారు చెప్పుకుందాం .
  కౌసల్య  తనకుమారుడైన శ్రీరామచంద్రునికి , కుంతి తనకుమారు లై న పంచ పాండవులకు, చారిత్రక యుగంలో శివాజీకి జిజియా బాయి ,  ఆధునిక యుగంలో రామకృష్ణపరమహంసకు చంద్రమణీ దేవి, ఈశ్వరచంద్ర విద్యాసాగరునికి అతని తల్లి భగవతీదేవి , గాంధీ జీకి పుతలీబాయి ,  తల్లులై భారతజాతి రత్నాలను  లోకానికి అందిం చి , ఆదర్శమూర్తులై నిలిచారు.           
           వీరంతా తమబిడ్డలకు చిన్నతనం నుండీ  సుద్దులు బుధ్ధు లూ  చెప్తూ ఎవరెవరిని ఎలా గౌరవించాలో నేర్పారు  ! . దైవభక్తి, దేశభక్తి నూరిపోశారు..
       తల్లైతే  ధర్మ మార్గాన్ని చిన్నతనం నుండీ ఇలా బోధిస్తుందో ఆమె ప్రపంచంలో సత్య ధర్మ శాంతి ప్రేమా హింసల  స్థాపనకు జ్యోతి ప్రజ్వలన చేసినట్లే!  అలాంటి తల్లులు ఉన్నప్పుడు ప్రపంచ మంతా ధర్మం తప్పని జనాలతో నిండి , ప్రశాంతత నెలకొంటుంది.అశాంతీ అరాచకాలూ ఉండనే ఉందవు.
 భారతీయ సంస్కృతిలో కన్నభూమికీ, కన్నతల్లికీ గొప్పస్థానం ఉంది.
                     పుడమికన్నతల్లి పూజనీయులుకదా
                    వారిమించువారు వసుధలేరు
                    కన్నతల్లికన్న ఘనతఏది?
                    కన్నభూమికన్న స్వర్గమేది?
జన్మభూమితోను  , జన్మనిచ్చినతల్లి తోను  స్వర్గం సైతం సరితూగదు.
    ముందుగా రామాయణం లోని తల్లులను చూద్దాం.----
       రామునికి తల్లి కౌసల్య అందరినీ ప్రేమించడం, పెద్దలను గౌరవించడం నేర్పిందిట  . కుమారు నిగా , అన్నగా , శిష్యునిగా , భర్తగా, రాజుగా , వీరునిగా, ప్రతి శూరునిగా, స్నేహితునిగా, న్యాయ పాల కునిగా ,తండ్రిగా , తన బాధ్యతలను ఆయన సక్రమంగా నిర్వర్తించను కౌసల్య పెంపకమే కారణం.
కౌసల్య బాల శ్రీరామునికి నేర్పిన మాట శ్లోకరూపంలో --
                         యంపాలయతి ధర్మం  -- తం వృత్తేన నియమేనచ
                        సవై రాఘవ శార్దూల  --   ధర్మత్వం అభిరక్షతు.
' రఘువంశ శార్దూలమా ! రామా! నీవు 'ధర్మాన్ని ' నియమంగా  నిరంతరం నీ వృత్తిగా భావించి పాలించు '
   విశ్వామిత్రుడు యాగసంరక్షణార్ధం శ్రీరాముని  పంపమని దశరధునికోరను కోసలకు వచ్చినపుడు , శ్రీరాముడు తండ్రి కబురందుకుని సభలో ప్రవేసించి ముందుగా తమ తల్లి కౌసల్యకు , తర్వాత తండ్రి దశరధునికి, ఆపైన గురువు వశిష్టునికి , చివరగా అతిధి ఐన విశ్వామిత్రునికి పాదాభివందనం చేస్తాడు .
     స్వామి వారు చెప్తుంటారు.---తల్లి తండ్రిని చూపితే , తండ్రి గురువును చూపుతాడు, గురువు దైవాన్ని చూపుతాడు. అంటే వరుస క్రమంలో ప్రాధాన్యతను అనుసరించి గుర్తించి గౌరవించి వర్తిస్తూ ఆయా వ్యక్తుల ద్వారా  మానవునికి ఆవస్యకమైన సులక్షణాలు నేర్చుకోవాలని అర్ధం.
    రామో విగ్రహవాన్ ధర్మః - అనేమాట వినగానే తల్లి కౌసల్య గుర్తురాక తప్పదు ఎవరికైనా.  అందుకే ' కౌసల్యా సుప్రజా రామ -పూర్వాసంధ్యా ప్రవర్తతే - 'అంటూ ఆ తల్లి కుమారునిగా శ్రీరాముని మనం సుప్రభాతం లో పాడుతున్నాం. 

      రావణసురుని మరణానంతరం లక్ష్మణుడు  రామునితో " అన్నా! ఈ బంగారులంకను మీరు పాలిస్తే , అయోధ్య భరతునికి వదిలేయవచ్చుకదా!ఈ లంక సిరిసంపదలతో స్వర్గంవలె ఉంది " అనగా , సత్యధర్మాలు మూర్తీభవించిన రామచంద్రుడు " లక్ష్మణా ! తల్లి కురూపిని మరొక అందమైనస్త్రీమూర్తిని తల్లిగా భావించ గలమా!' జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపిగరీయసీ!' అని తెల్సుకో !" అన్నాడు. తల్లి కౌసల్య పెంపకమే రాముని అంత ఆదర్శవంతునిగా చేసిందని చెప్పుకో వచ్చు .ఆయన అవతారపురుషుడైనా మానవజాతికి ఆదర్శం అందించే నిమిత్తం ఈ విధంగా తాను ఆమె మాటలు అనుసరించి ,తన తల్లిని  లోకం లోని తల్లులకు ఆదర్శమాతగా  నిలిపాడు.   

   ఇహ లక్ష్మణుని  తల్లి ఐన సుమిత్రను తీసుకుంటే ఆమె సహనం ,ఓర్పు ,తన వివేకాన్ని అడుగ డుగు నా చూపిస్తుంది. మిత భాషి ,అవసరం మేరకే మాట్లాడు తుంది .కైక శ్రీరాముని వనవాసానికి పంపమని కోరింది కానీ లక్ష్మణుని కాదు.ఐతే రాముని వెంట మౌని వేషంలో కదలిన లక్ష్మణుని ఆతల్లి ఆగమని ' ఒక్కమాటైనా అనలేదు. ఇతర ఏతల్లి ఐనా అలా మౌనం వహించదు. అన్నవెంట వెళుతు న్న లక్ష్మణుని 'రాజును అనుసరిస్తున్న సేవకునిగా  భావించింది.ఒక కుమారుడు భరతుని వెంట తిరుగు తుండగా , మరొక కుమారుడైన లక్ష్మణుడు వనవసానికి వెళుతున్నా ,ఆమె ఏమాత్రం జంకక గొంకక బాధపడక తన బిడ్డలు ధర్మ మార్గాన్ని అనుసరిస్తున్నందుకు , భ్రాతృ బంధానికి కట్టుబడుతున్నందుకు సంతోషించింది.
సుమిత్ర ఆధ్యాత్మిక ఙ్ఞాన సపత్తు గల వనిత..శ్రీరాముని శీలమును చక్కగా గమనించి తన పుతృడైన లక్ష్మ ణుడు అతడిని అనుస రించి నట్లైతే ధర్మం తప్పనివాడుగా పేరు గాంచు తాడని నమ్మింది .వనవా సానికి అన్నతో వెళుతున్న తనయుడు లక్ష్మణు నితో
          " రామం దశరధం విధ్ధి   -  మాం విధ్ధి జనకాత్మజాం
           అయోధ్యాఒ అటవీం విధ్ధి   -  గఛ్చతాత  యధాసుఖం "
" నాయనా లక్ష్మణా! నీవు  శ్రీరాముని సేవించుటకే జన్మించావు.అరణ్యంలో శ్రీరాముడే నీ తండ్రిగా, సీతమ్మే నీతల్లిగా , అడవే అయోధ్యగా వారిరువురికీ సేవచేస్తూ ఉండు అదే నీధర్మం." అని  ఆ మాతృమూర్తి తన పిల్లలకు అన్నలను అనుసరించడం వారి ధర్మం అనీ , కష్ట మైనా సుఖమైనా అన్న మాటే అనుసరణీయమనీ చెప్పకే చెప్పింది .  భాతృ మార్గానుసరణ సుమిత్ర తన పిల్లలద్వారా ఈ లోకానికి తెలియపరచింది.  
      
             ఈహ సీతమ్మను  తీసుకుంటే  తాను భర్తకు దూరమైనా తనపై నీలాపనిందలు వచ్చినా ,కుమలక ,మనస్తాపాన్ని పైకి కనపడ నీయక తనకుమారులు రాజభవనంలో సర్వసుఖాలూ పొంద వలసినవారైనా ,ఆమె వారికే మాత్రం ఆవిషయాలు తెలియనీక ముని వాటికలో ముని పుత్రులవలె పెంచింది . విలు విద్యలూ ధైర్య సాహసాలూ స్వయంగా నేర్పింది.  మహావీరులుగా తయారుచేసింది. ఆశ్రమంలో కష్టాలూ అసౌకర్యాలూ అన్నీ భరిస్తూ ధైర్యంగా లవ కుశులను  తీర్చిదిద్దింది.తల్లి సీతమ్మ ఆశీస్సులతో,ఆమె పెంపకంలో వారు లోకోత్తమ వీరులైనారు .సీతమ్మతల్లి ఆదర్శ మాతైంది.   ఓర్పుకు సీతమ్మను చెప్తాం ,ఆమె ఓర్పే నేర్పై తన బిడ్డలను తీర్చిదిద్దిన ఆదర్శమాత ,ఒక మహా బలవంతునికి, ధర్మమూర్తికీ , సామ్రాఙ్ఞి ఐనా కష్టాలన్నీ భరించి ,స్త్రీలకు ఆదర్శమైంది .కొందరు ' సీత ' పేరు తమ బిడ్డలకు పెట్టనే భయపడతారు.అన్నీకష్టాలు ఆ తల్లి గనుక భరించింది మన వల్ల కాదంటారు.

   భాగవతంలో ని తల్లులను చూద్దాం :-శ్రీకృష్ణుని పెంపుడు తల్లయిన యశోద కృష్ణుడు  తన బిడ్డే అని నమ్మి ,తాను కన్నయ్యను ఎంత ప్రేమించినా తన కుమారుని చూడవచ్చిన వారికి ఎత్తుకోను ఇచ్చి వారి కోరిక తీర్చేది. ఎవరు వచ్చి చనుబాలు పడతా మన్నా అభ్యంతరం చెప్పేదికాదు , అందువల్లే రాక్షసస్త్రీ  ఐన  పూతన , సుందర మైన రూపంలో వచ్చి పాలుపడతానంటే కొత్త వనిత అనైనా భావించ క ఇస్తుంది.తమకు ప్రీతికరమైన దానిని ఇతరులకు ఇవ్వను మనం సాధారణంగా ఇష్ట పడం, కానీ యశోద అమ్మదనం ఎంత గొప్పదో చూడండి. తన బిడ్డను ఇతరులు ముద్దు చేస్తున్నా ఏమాత్రం అసూయ పడని స్వఛ్ఛమైన వెన్న వంటిమన స్సు ఆమెది, అందుకే కృష్ణయ్య వెన్నదొంగ అయ్యాడేమో! 
మనబిడ్దపై ఇతరులు నేరా రోపణచేస్తే మనం వెంటనే వారితో నైనా జగడ మాడుతాం, లేదా మనబిడ్డనీ పరువు తీస్తావా? '  అని కోపంతో  విచక్షణా రహితంగా కొడతాం.కానీ యశోద నిదానంగా ఆలోచించి వారితో
నాబిడ్డ అమాయకుడు ,మీరు నిదానంగా యోచించండి , అలాచేసే వాడు కాదు. ఐనా నేను మందలిస్తాను , వెళ్ళిరండి " అని మర్యాదగా చెప్తుంది.ఇరుగు పొరుగులతో ఎలా మెలగాలో ఆతల్లి మనకు  నేర్పింది .
 చెరసాలలో ఉన్న దేవకీదేవి  తనకన్న బిడ్డడు  ఎక్కడైనా కానీ సుఖంగా ,క్షేమంగా ఉంటే చాలని భావించింది.బిడ్డ పెరుగుదలను ఊహల్లో నింపుకుని దూరం నుండే ప్రేమను పంచి , బిడ్డను మనస్సులోనే చూచుకుంటూ  జీవించింది. అమ్మ మనస్సు బిడ్డ క్షేమాన్ని  నిరంతరం  ఎలాకోరుతుందో దేవకీ దేవి మనకు నేర్పింది. ఆమె ఆదర్శమాత కాదామరి!


      భారతంలోకి చూస్తే  కుంతీమాత భర్తలేని అసహాయ. ఐదుమంది పసిపిల్లలతో ఒక్కతే , తమపై మాత్రం ప్రేమాభిమానాలు లేని దాయాదుల ఇంట ఎంతో చాకచక్యంగా మెలుగుతూ వారితో సఖ్యంగా ఉంటూనే తన పిలల్లను ప్రఙ్ఞావంతులుగా ,విద్యావంతులుగా,గుణవంతులుగా  ,భక్తిపరులుగా, వినయ శీలురుగా పెంచింది. ఐకమత్యాన్ని ఉగ్గుపాలతో నేర్పింది.  సోదరప్రేమను లోకానికి పాండవుల ద్వారా చాటింది. కుంతి ఆదర్శమాత . బిడ్డమను కృష్ణభక్తులుగా చేసి వారికి కృష్ణుని కొండంత అండగా చేసింది. శతృవర్గఒతో ఎలా సఖ్యంగా మెలిగి తమ కార్యం  చక్కబెట్టు కోవాలో,బిడ్డలకోసం ఎన్ని కష్టాల నైనా ఎలా భరించాలో జగానికి చూపింది .బిడ్డలకు  అండగా దండగా ఉంటూ తండ్రిలేని తనయులను ఆదర్శ సోదరులుగా పెంచింది. 

   పురాణ గాధల్లోకివెళితే గంధర్వరాజు కుమార్తె మదాలస సైతం తన పుత్రులకు పసితనం నుండే ఙ్ఞాన బోధ చేసి,ఆత్మతత్వం తెలిపింది .ఙ్ఞాన రత్నాలుగా మలిచింది. పూర్వం తల్లులంతా తనపుత్రులు మంచి ముత్యాలుగా , ఙ్ఞాన రత్నాలుగా మారాలని కోరుకునేవారు.
    ఇహ చరిత్రలోకి తొంగి చూస్తే  శివాజీతల్లి జిజియాబాయ్  భర్త నిరాదరణకు గురైనా   చింతించక తన పుత్రుని వీరునిగా తీర్చి దిద్దింది.ప్రతి రోజూ స్నానం చేయిస్తూ ,బువ్వ తినిపిస్తూ వీరుల గాధలు రంగరించి పోసింది. రామాయణ మహా భారతకధలు కళ్ళకు కట్టినట్లు వివరించింది. వీర లక్షణాలు పసితనంలోనే శివాజీ సొత్తయ్యాయి. మంచి గురువు వద్ద చేర్చి యుధ్ధ విద్యలతో పాటుగా , యదార్ధ విద్యలైన ఆధ్యాత్మిక ఙ్ఞానాన్ని సైతం శివాజీకి అందించడంలో జిజియాబాయ్ ఏమారలేదు.ఆతల్లి కృషిఫలితమే   స్వతంత్ర మహారాష్ట్ర రాజ్యస్థాపన. ఆమె నేర్పిన దైవభక్తి, దేశభక్తి శివాజీని చక్రవర్తిగా, ఛత్రపతిగా మార్చింది.పంచ మాతలను, సాధు సత్పురుషులను సేవించడ, గౌరవించడం , భారతీయ సంస్కృతి, పరస్త్రీ లపట్ల మాతృభావం వీర శివాజీని మరాఠా రాజ్యానికి ఛత్రపతిని చేశాయి.అలాంటితల్లి జిజియాబాయి  పిల్లల పెంపకానికి కావలసిన పాఠాలను మనకు అందించిన చరితార్ధురాలు.

         సంఘసంస్కర్తలను తీర్చిదిద్ది సమాజసేవకై అంకితంచేసిన మాతృమూర్తులు -ఈశ్వరచంద్ర విద్యాసాగరుని తల్లి భగవతీ దేవి , వివేకానందుని తల్లి భువనేశ్వరీ దేవి ,రామకృష్ణ పరమహంస తల్లి చంద్రమణీ దేవి ,మోహనదాస్ కరంచంద్ గాంధీ తల్లి పుతలీ బాయి వీరంతా తమ బిడ్డలకు పసితనం నుండీ భారతీయ సంస్కృతిని, దైవభక్తిని ,దేశభక్తిని , సమాజ సేవ చేయడంలో మెళకువలను బోధించి తమబిడ్డలను లోక కళ్యాణం కోసం సమర్పించారు.
                    కౌసల్య సతి శుక్తి గర్భమౌటను గదా!
                         రాముడు దేవుడై రమణ గాంచె,
                     సీతామహాసాధ్వి  చెలగి  పెంచుట గదా!
                            కవలు కుశలవులు ఘనులు నగుట,
                    జిజియా లలామంబు చెలగి పెంచుట కగా !
                            గాంధీమహాత్ముడై  ఘనత  గాంచె,
                      ఈశ్వరాంబా సాధ్వి ఎత్తి పెంచుట  గదా!
                             సత్యనారాయణ ఖ్యాతి చెందె,

                        అహరహమ్మును బ్రోచెడి అమ్మ కంటె,
                        ఆదరంబగు  వ్యక్తులు  నవని  కలరె!
                        అమ్మ ప్రధమాక్షరంబె  ఆద్యక్షరంబు,
                        ప్రాణికోటికి  అమ్మయె  ప్రాణసమము.
 

   ఈ ఆధునిక యుగంలో తల్లుల మంతా బిడ్డలు పుట్టగానే' ఏంచదివించాలి? ఈ ఉద్యోగం వస్తుంది?ఎంత జీతం వస్తుంది?' అనే విషయాలను తప్ప , మన బిడ్డ దేశానికి ఏం చేస్తాడు,సమాజ సేవ ఎలా చేయగలడు?ఎంత మందికి సాయ పడగలడు? భారతీ యసంస్కృతిని ఏమాత్రం అనుసరించగలడు?' అనే విషయాలను ఎన్నడూ ఆలోచించడం లేదు.
  మాతృదేశానికి , మాతృమూర్తికీ కృతఙ్ఞత తెలిపే వారే తక్కువై పోతున్నారు.ఎంతో మంది తల్లులు ఉద్యోగాల కోసం వెళుతూ ,బిడ్డలను ఆయాలకు వదలిపోతున్నందున  బిడ్డలకు ఆయాపైనే ప్రేమ పెరుగు తున్నది, తల్లిని మమ్మీ అనిపిలుస్తున్నారు. వరు ఆయాతో ఉన్న అటాచ్మెంట్ వల్ల ఆయాకు జబ్బుచెసినా, రాకపోయినా,  ఆయచనిపోయినా ఏడుస్తారుకానీ అమ్మపోతే ఏడవరు . ఆయాతోనే ఏటాచ్ మెంట్ పెరుగుతున్నది వారికి.
                                ఆలుమగలిద్దరు ఆఫీసునకుబోవ
                          గృహ కృత్యములుదీర్చు గృహిణులెవారు ?.
అంటే ఉద్యోగాలు చేయడం తప్పనికాదు.  తమబిడ్డలకు మంచి సుధులు బుధ్ధులు నేర్పి ఆదర్శ మానవు లు గా తీర్చి దిద్దేవారెరు ? అని .
   
ఒక రైతుబిడ్డ ఐనతల్లి తనకుమారుని  ఉయ్యాల్లో ఊపుతూ ఇలా పాడిందిట!
           చేలోన నీమామ సెనగలెయ్యంగ
            భాగమిమ్మని అడుగు బాలశంకరుడా!  //జో జో //
       అది విని వినీ వాడు పెద్దయ్యాక వెళ్ళి మామను అడిగాట్ట ' భాగమిమ్మని.
               వేసే నాడూ లేవు--కోసే నాడూ లేవు
             భాగ మెట్లిత్తురా బాల శంకరుడా!//జో జో//-
అంటూ మామ మాత్రం తక్కువ వాడా?  అతడూ లా పాయింట్ లాగాడు.
             మా అమ్మ నీతోడ బుట్టినది కాదా?
            తగవునకు పోదాము ధర్మ చావడికీ
వాడు వదలడు , తల్లి మాటలు బాగా నాటుకున్నాయి మనసులో. అందుకే వాడు ధర్మచావడి కెళదామని మామను లాగాడు .
  రోజుల్లో ధర్మ చావడి ఉండేది, తగాదాలు తీర్చను.  ఊరి పెద్ద లంతా దాన్లో కూడి తగా దాలు తీర్చే వారు. మామను వాడు అక్కడికి లాగాడు. నేడు కోర్టులకు ఈడ్చినట్లే.
       
         ధర్మచావడిలో పెద్దలందరు చేరి 
         భాగమ్ము  నిమ్మ నిరి బిడ్డ నిమ్మనిరీ ///జోజో//
ఆ ధర్మచావిడి పెద్దలు 'ఎందుకయ్యా! తగాదాలు? ఐనవారికి తగా దాలు కూడదు. ‘నీ ఆడ బిడ్దని చ్చి పెళ్ళి చేయి వీనికి  .ఆస్థీ , అను బంధం , ఆదరణా ,అప్యాయతా అన్నీ వస్తాయిఅని తీర్పుచె ప్పా రుట,
ఇప్పటి లాయర్లు ఆనాడు లేరు గనుక , తగాదా సులువుగా సూక్ష్మంగ తేల్చేశారు.
ఇది పాడుకుని నవ్వుకునే పాట.  అంటే సాధారణ తల్లు లందరికీ పెళ్ళి, ఆస్థిలో భాగం అనే ఆలోచనలే ఉంటాయని అర్ధం.
     జనని జన్మభూమి యొక్క అర్ధాన్ని , కర్తవ్యాన్ని చిన్న పద్యం  ద్వారా భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు ఎలా చెప్పారో చూడండి.
          
           పుడమి కన్నతల్లి  పూజనీయులుకదా!
           వారిమించువారు వసుధలేరు
           కన్నతల్లికన్న ఘనతఏది?
           కన్నభూమికన్న స్వర్గమేది?
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు  ఆదర్శమాత ఐన ఈశ్వరమ్మ వడి లో పెరిగి కుగ్రామమైన పుట్టపర్తిని విశ్వానికే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చారు.తల్లి ఐన ఈశ్వరమ్మ తన గ్రామంలో ఒక చిన్న స్కూల్ అడిగితే విశ్వ విద్యాలయం వెలసింది.
 ఒక చిన్న హాస్పెటల్ తల్లి ఊరి జనం కోసం అడగ్గా , ముందు చిన్న హాస్పెటల్ పెట్టించి ,
  తర్వాత సూపర్ స్పెటాలిటీ హాస్పెటల్ ఏర్పరచారు ఆయన. దాన్లో అందరికీ ఉచిత వైద్యసౌకర్యం. తల్లి చిన్న బడి ఊరి పిలల్ల కోసం అడగ్గా దాన్ని ప్రారంభించిన ఆయన నేడు సత్యసాయి డీండ్ యూనివర్శిటీగా రూపొందించారు , బాబావారు . ఊరి జనం నీరులేక బాధపడుతున్నారని ఒక నూయి త్రవ్వించ మని తల్లి కోరగా బాబా వారు తల్లి కోరిక తీర్చారు.
 ఆతర్వాత నీరులేని గ్రామాలకూ జిల్లాలకూ  చివరకు తమిళనాడు కూ స్వామి వారు సత్యసాయి సుజల పధకాన్ని ఏర్పరచారు.  తన జన్మ భూమి ఐన పుట్టపర్తిలోనే నివసించడం వలన అది ప్రపంచం లోనే గుర్తింపు పొందిన ముఖ్య ప్రదేశంగా మారింది.
తల్లులు కోరే కోరికలు ఊరివారి కోసం  సర్వజనాళికీ ఉపయోగ కరం గా ఉండాలని మనం  ఇలా తెల్సుకోవాలి.
    ఆదర్శమాతలు తమకోసం ఏమీ కోరు కోరు, అంతా జనం కోసమే. నిస్వార్ధమైన కోరికలే వారు కోరు కుంటారు.అందుకే వారు ఆదర్శ మాత లయ్యారు.
  కనుక మనం మనబిడ్డలను ఎలా పెంచాలో ఆదర్శ మాతల ద్వారా తెల్సుకుని , మన బిడ్దలను రావణుని లా గొప్పవారుగా కాక రామునిలా మంచివారుగా దేశభక్తి ,దైవభక్తి ,  సంపన్నులుగా,ప్రజా సేవ కులుగా  భారతీయ సంస్కృతీ బధ్ధంగా జీవించేలా మానవతా విలువల మూర్తులుగా తీర్చి దిద్దుకుందాం. 
                            ఓం శ్రీ సాయిరాం .  .


No comments:

Post a Comment