Wednesday 9 July 2014

మహాత్ముడెలా అయ్యాడు?







హోం >> చిన్నారి

మహాత్ముడెలా అయ్యాడు?

కథ: ఆదూరి హైమవతి

"తాతగారూ! త్వరగా రండి ఈరోజు మా తెలుగు టీచర్ గారు మనదేశంలో గొప్పవారి గురించీ చెప్తూ ‘గాంధీజీ‘ మహాత్ముడని చెప్పారు. ఆయనెలా మహాత్ముడయ్యాడో మీరు నాకు చెప్పరూ!” అంటూ తాతగారి వడి చేరాడు మనవడు మనోహర్.
“ఓ అదా! తాతా! మంచి ప్రశ్నే అడిగావు. విను మరి. గాంధీకి తల్లి తండ్రులు పెట్టిన పేరు మోహనదాస్ వాళ్ళ నాన్నగారి పేరు 'కరంచంద్' వారి ఇంటిపేరు 'గాంధీ.' మొత్తం కలిపి మోహనదాస్ కరంచంద్ గాంధీ అయింది. ఆయన చిన్నతనం నుండీ అమ్మా నాన్నగార్లతో పురాణ కాలక్షేపాలకు సత్సంగాలకు వెళ్తూ, దేవాలయానికి వెళ్తూ అమ్మా నాన్నల మాట వింటూ ఉండేవాడు. వాళ్ళ అమ్మ చాలా సాంప్రదాయాలు పాటించేది. ఆమె 'కోకిల వ్రతం' అనే వ్రతం చేసేది".
" అంటే ఏంటి తాతగారూ!"
" అంటే వసంత కాలం వచ్చిందంటే కోకిల కూత విన్నతర్వాతే భుజించేది. బాల గాంధీకి అమ్మంటే అమిత ప్రేమ. ఒకరోజున ఎంతకూ కోయిల కూయలేదు. సాయంకాలం మూడైంది. బాలగాంధీ పెరట్లోని మామిడి  చెట్టు వైపుచూస్తూ కూర్చున్నాడు, కోయిల ఎప్పుడు కూస్తుందా, అమ్మ ఎప్పుడు అన్నం తింటూందాని. ఎంతకూ కోయిల కూయక పోవడంతో, ఆమామిడి చెట్టు చాటుకెళ్ళి తానే కోయిల లాగా ' కూహూ కూహూ ' అని కూసి, లోపలికి వెళ్ళి" అమ్మా! అమ్మా! అదో కోయిల కూసింది, విన్నవా! ఇహ రా అన్నం తిను." అని పిలిచాడు.
వెంటనే పూజ గదిలో ఉన్న ఆమె బయటికి వచ్చి, బాలగాంధీ దగ్గరకు వచ్చి, అతడి చెంప పైన ఒక దెబ్బవేసింది. ఆదెబ్బకు బాల గాంధీ క్రిందపడ్డాడు. "ఛీ! నీవంటి అసత్యం చెప్పేవాడు నాకొడుకైనందుకు నేను చాలా దుఃఖిస్తున్నాను." అని లోపలికి వెళ్ళింది. బాలగాంధీకి తాను చేసినది తప్పని తెలిసింది, దానివల్లే తల్లికి కోపం వచ్చిందని అర్ధమై, దేవుని గదిలో ఉన్న తల్లి వద్దకెళ్ళి కాళ్ళుపట్టుకుని" ఇహ నా జీవితంలో ఎన్నడూ అసత్యం చెప్పను. నీమీది ఆన." అని ఏడ్చాడు. ఆమాట జీవితాంతం పాటించాడు.
ఆతర్వాత ఆయన 19 వఏట న్యాయశాస్త్రం చదవను ఇంగ్లాండు వెళ్ళేప్పుడు, అది చలిదేశం గనుక, అక్కడివారికి అలవాటైన మద్యం త్రాగననీ, మాంసాహారం తినననీ తల్లికి మాట ఇచ్చి ఆ ప్రకారము సత్ ప్రవర్తనతో నడుచుకున్నాడు. స్వాతంత్య్ర సమరంలో ఆయన ఆయుధాలు సహాయ నిరాకరణ, సత్యాగ్రహము. విదేశీ వస్తువులను బహిష్కరించడం, స్వయంగా నూలు వడికి దానితో నేసిన ఖద్దరు బట్టలు ధరించడం, సత్యము పాటించడం. అహింసతో వ్యవహరించడం. కొల్లాయి గుడ్డ కట్టుకుని, చొక్కలేకుండా చేత కర్రపట్టుకుని, మురికి వాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి చెప్పాడాయన.
నీలాంటి ఒక చిన్నకుర్రాడు ఒకసారి ఆయన ఒక ఊర్లో  ఉపన్యసించాక దగ్గరకు వెళ్ళి" తాతగారూ! మీరు చొక్కా లేకుండా ఉన్నారే? చలేయదా! మానాయన గారిని అడిగి మీకు ఒక చొక్క కుట్టించి తెస్తాను వేసుకుంటారా!" అని అడగ్గా ఆయన చెప్పిన మాటేంతో తెలుసా!
"బాబూ! మంచిమాట అడిగావు, ఐతే మనదేశంలో చాలా మంది పేదలకు చొక్కాలే లేవు, నీవు వారందరికీ చొక్కాలు కుట్టించి తెస్తే నేనూ చొక్కా వేసుకుంటాను." అని నవ్వుతూ చెప్పారుట! చూశావా అదీ గొప్పతనమంటే! తెల్సిందా! ఆయన నాయకత్వంలో ఎన్నో ఉద్యమాలు జరిగాక 1947 ఆగస్టు 15న దేశమంతా స్వాతం త్య్రం వచ్చిన శుభ సందర్భంగా సంబరాలు చేసుకొంటూ ఉండగా దేశ విభజన వల్ల బాధపడుతూ, గాంధీమాత్రం కలకత్తాలో ఒక హరిజనవాడను శుభ్రముచేస్తూ గడిపాడు. ఏనాయకుడైనా ఇంత నిరాడంబరంగా ఉండటం మనం ఈ రోజుల్లో చూడం.
అందుకే ఆయన’ మహాత్మగాంధీ‘ అనీ, పిల్లలకు’ గాంధీతాత ‘అనీ, అంతా  ‘జాతిపిత’ అనీ పిలుస్తాం. తెల్సిందా! ఇహ పద లోపలికి కాళ్ళు కడుక్కుని బామ్మపెట్టే టిఫిన్ తిని పాలుత్రాగు, పార్కుకు వాకింగ్ కెళదాం అంటూ ముగించాడు తాత.

--ఆదూరి హైమవతి, బెంగళూరు
 
 
 
 
 
 

No comments:

Post a Comment