Thursday 10 April 2014

రామాయణమూ.. పారాయణమూ..


హోం >> ఆధ్యాత్మికం

రామాయణమూ.. పారాయణమూ..

రచన: ఆదూరి హైమవతి

ఆంధ్రదేశంలోనే కాదు భారత దేశంలో కూడా రామాలయము, ఆంజనేయ స్వామి గుడి లేని ఊరు లేదని చెప్పాలి. అంతగా రామాయణము దానిలోని ప్రధాన పాత్రలు దేశప్రజల్లో అల్లుకుని పోయాయి. అసలు రామాయణం లోని ప్రధాన పురుషులు ఏడుగురు. రాముడు, లక్ష్మణుడు, హనుమ, సుగ్రీవుడు, రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. ఈ సప్త వీరుల మధ్యే ప్రధానంగా రామాయణం సాగింది.

కూజంతమ్ రామరామేతి మధురమ్ మధురాక్షరమ్
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్.
కావ్యం రామాయణం సీతాయాశ్చచరితమ్ మహత్
పౌలస్త్య వధమిత్యేవ, చకార చరిత వ్రత-- 

రామాయణము ప్రధానముగా సీతా రాముల పుణ్యచరిత్ర , ఆంజనేయ భక్తి భరితం.                                                         
దక్షిణే లక్ష్మణో యస్య వామేచ జనకాత్మజా                                   
పురతో మారుతిర్యస్య తం వందే రఘు నందనమ్                   
గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసమ్       
రామాయణ మహా మాలా రత్నం వందే అనిలాత్మజమ్

రామ నామము సకల పాప హరమనీ, మోక్షప్రథమనీ పలువురి నమ్మకం. రామ నామములో పంచాక్షరీ మంత్రం ఓం నమశ్శివాయ నుండి 'మ' బీజాక్షరము, అష్టాక్షరీ మంత్రము ఓం నమోనారాయణాయ నుండి 'రా' బీజాక్షరం పొందుపరచబడివున్నవని ఆధ్యాత్మిక వేత్తల వివరణ. మూడు మార్లు రామ నామమును పలికి నంతనే శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము చేసిన ఫలము లభిస్తుందని శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము-ఉత్తర పీఠికలో చెప్పబడినది.

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తు ల్యమ్ రామనామ వరాననే

అసలు రామాయణం 24వేల శ్లోకములతో కూడిన ఉద్గ్రంథం. భారతదేశం యొక్క హిందూధర్మాల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకాలు, ఆచారాలపై అనితరమైన ప్రభావము కలిగియున్నది. రామాయణములో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర, తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు - వీరందరి మధ్య గల సత్సంబంధ, బాంధవ్యాలను, ప్రవర్తనా విధానములను వివరించడం జరిగింది. రామాయణములోని పాత్రలన్నీ ఆదర్శ జీవనానికి ప్రమాణంగా స్వీకరించాల్సి ఉంది.
వాల్మీకి రామాయణమే గాక, వేదవ్యాసుని ఆధ్యాత్మ రామాయణము, భవభూతి ఉత్తర రామచరితము కూడా పేరుగాంచినవే!. ఇంక రామాయణములోని పాత్రలు, సంఘటనలు, భావాలు, తత్వాలు, అంతర్గతంగావున్న పురాణాలు, కథలు, కావ్యాలు, పాటలు అన్నీ భారతదేశంలోని చాలా భాషల్లో ఉన్నాయి.  వాల్మీకి రామాయణమే ప్రధాన ప్రమాణంగా సర్వత్రా అంగీకరింపబడుతున్నది. ఆదికవి వాల్మీకి ప్రార్ధన సంప్రదాయముగా చాలామంది కవులు స్మరిస్తారు.
రామాయణమును చాలా మంది కవులు తెలిగించారు. వారిలో మొల్ల వ్రాసిన మొల్ల రామాయణము, కంకంటి పాపరాజు గారి ఉత్తర రామ చరితము; గోన బుధ్ధారెడ్డి గారి రంగనాథ రామాయణము; విశ్వనాధ సత్యనారాయణ గారి -- రామాయణ కల్పవృక్షము, వావిలికొలను సుబ్బారావు గారి ఆంధ్ర వాల్మీకి రామాయణము, ఉషశ్రీ గారి ప్రవచనమూ ప్రసిధ్ధాలు.

సూక్ష్మ రామాయణం                              
సూక్ష్మంగా రామాయణ కధను ఇలా చెప్పుకోవచ్చు. ఇక్ష్వాకువంశపు రాజైన దశరథుడు ఆయోధ్యా నగరం రాజధానిగా, కోసలదేశాన్ని పాలిస్తుంటాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే భార్యలున్నా పిల్లలు లేని కారణంగా దశ రధుడు పుత్రకామేష్ఠి యాగం చేస్తాడు. యఙ్ఞ పురుషుడు సతృప్తి చెంది దశరధునికి పాయసపాత్ర ప్రసాదిస్తాడు. దాన్ని దశరధుడు ముగ్గురురాణులకూ సమంగా పంచుతాడు. ముగ్గురూ అభ్యంగనం ఆచరించి పాయసాన్ని స్వీకరించమంటాడు. సుమిత్ర సహజ స్త్రీ చాంచల్యం చేత తన పాయసపాత్రను అంతః పురంపైన తల ఆర్చుకుంటూ ఆ పిట్టగోడమీద ఉంచుకుని ‘పెద్దరాణి గనుక కౌసల్య పుత్రుడు రాజవుతాడు, లేదా ముద్దులభార్య ఐన కైకేయీ తన యుడు రాజుకావచ్చు, ఏ ప్రత్యేకతా లేని నాకుమారుడు వారికి బంటుగానే ఉండవచ్చేమో’ అని తలంచుచూ ఉండగా ఒక గ్రద్ద మెరుస్తున్న ఆ బంగారు పాయసపాత్రను తనకు ఆహారంగా భావించి తీసుకెళుతుంది. సుమిత్ర భయ పడుతూ ఈవిషయం సవతులకు చెప్పగా, కల్లాకపట ఎరుగని ఆకాలం వారు గనుక ఇద్దరూ తమ పాయసంలో చెరో సగం సుమిత్రకు ఇస్తారు. ముగ్గురూ పాయసం సేవించిన అనతికాలంలోనే గర్భవతులౌతారు. వారికి ఆ రాజుకు నలుగురు కుమారులు జన్మిస్తారు. రెండుభాగాలు సేవించిన సుమిత్రకు లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మిస్తారు. వారికి రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని నామకరణం చేస్తారు.                                
సుమిత్ర భాగం తీసుకెళ్ళిన గ్రద్ద దాన్ని అడవిలో క్రింద జారవిడువగా అది ఈశ్వరుని అభిషేకిస్తున్న అంజనాదేవి సమీపంలో పడుతుంది. ఆమె దాన్ని ఈశ్వరప్రసాదంగా భావించి సేవించగా ఆమెకు 'హనుమ' జన్మిస్తాడు. ఇలా హనుమ రాముని సోదరుడై తర్వాతికాలంలో ఆయన్ని సేవించి తరిస్తాడు.
పులస్య బ్రహ్మ కుమారుడైన రావణుడు అనే రాక్షసుడు బ్రహ్మవద్ద వరాలుపొంది దేవతలను జయించి మునులను వేధిస్తుండు. వానికి దేవ గంధర్వ యక్ష రాక్షసుల వల్ల చావులేదు. దేవతల ప్రార్ధనలు మన్నించి శ్రీ మహా విష్ణువు వానిని హతమార్చనే నరుడై, రామునిగా, ఆదిశేషుడు లక్ష్మణునిగా, శంఖ చక్రములు భరత శత్రుఘ్నులుగా అవతరించారు. శ్రీమహాలక్ష్మి సీతగా అయోనిజయై విదర్భరాజైన జనక మహారాజు ఇంట పెరుగుతుంది. రాముని సవతి తల్లియైన కైకేయి ఆమె చెలికత్తె మంధర మాటలువిని పూర్వం దశరధుడు ఆమెకిచ్చిన రెండువరాలనూ ఇలా కోరుతుంది. మొదటిది భరతుని పట్టాభిషేకము, రెండవదిరామునకు 14 ఏండ్ల వనవాసము. దశరథుడు దుఃఖంతో కృంగి పోతాడు. రాముడు తండ్రి మాట నిలబెట్టను కృతనిశ్చయుడౌతాడు. సీతా, లక్ష్మణుడూ రామునితో వనవాసానికి బయల్దేరుతారు.   సీతారామలక్ష్మణులు సకలసౌఖ్యాలూ వర్జించి, నారదుస్తులు ధరించి వనవాస దీక్షకు వెళ్తారు. గుహుడనే నిషాదరాజు వారిని గంగానది దాటించాడు. దశరధుడు రామునికై విలపిస్తూ స్వర్గస్తుడౌతాడు. వారు పంచవటితీరాన పర్ణశాలను నిర్మించుకొని నివసిస్తుండగా, కామరూపియైన శూర్పణఖ అనే రాక్షసి వచ్చి రామ లక్ష్మణులను మోహించి సీతను తినివేయడానికి రాగా, లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోస్తాడు. శూర్పణఖ రోదిస్తూ వెళ్లి తన అన్న ఐన రావణునితో సీత అందం గురించీ చెప్పి ఆమెను భార్యగా స్వీకరింపమని బోధిస్తుంది.. రావణుడు మారీచుడిని మాయలేడి రూపంలో పంపి రామ లక్ష్మణులు దానికీ దూరంగా వెళ్ళగానే, సీతను లంకకు ఎత్తుకుపోతాడు. 
అది రాక్షసమాయ అని తెల్సుకుని తిరిగివచ్చిన వారికి సీత కనిపించక హతాశులైన ఆమెను వెతుకుతుండగా వారికి హనుమ కనిపిస్తాడు, సుగ్రీవమైత్రి వాలీ వధ, సుగ్రీవునిపట్టాభిషేకం సీతాన్వేషణ ,కుంభ కర్ణ రావణ వధానంతరం విభీషణునికి లంకారాజ్య పట్టాభిషేకంరావణుడు మారీచుడిని మాయలేడి రూపంలో పంపి రామ లక్ష్మణులను దూరంగా వెళ్ళేలా చేసి, తాను సీతను ఎత్తుకుపోయాడు. అడ్డు వచ్చిన జటాయువు రెక్కలు తెగనరికాడు. సీత కనిపించక హతాశులైన రామలక్ష్మణులు ఆమెను వెతుకనారంభించారు. కొనవూపిరితోనున్న జటాయువు వారికి సీతాపహరణం గురించి తెలిపి రాముని చేతిలో కన్నుమూశాడు. అయోధ్యాగమనం, తదనంతరం రామ పట్టాభిషేకం...
రామాయణ కధను కట్టెకొట్టె తెచ్చె, ఇలా రామాయణాన్ని మూడు మాటల్లోనూ ఒకే శ్లోకంలోనూ చెప్పుకోవచ్చు.

పూర్వం రామ తపోవనాదిగమనం హర్వామృగంకాంచనం
వైదేహీహరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం
వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీదహనం
పశ్చాద్రావణ కుంభకర్ణ హనమ ఏతత్ హి రామాయణం

దీన్ని ఏకశ్లోకి రామాయణం అంటారు.

అసలు రామాయణం ఏడుకాండలు అంటే భాగాలన్నమాట. బాలకాండము, అయోధ్యా కాండము, అరణ్యకాండ, కిష్కింధకాండము, సుందరకాండము, యుద్ధకాండము, ఉత్తరకాండము అని ఏడుకాండల పేర్లు. ఐతే సీతారాములు సాక్షాత్ లక్ష్మీ విష్ణువులు.

No comments:

Post a Comment