చంటి గాడికి అప్పుడప్పుడే ఐదేళ్ళు వచ్చాయి. "ఇహ ఆటలు కట్టిపెట్టి బడికి పోవాలి" అన్నాడు నాన్న. "ఓఁ పోతా! నేనెందుకు పోను?!" అన్నాడు చంటి. "మా నాన్నే!" అని మురిసిపోయింది బామ్మ.
తర్వాత ఒక రోజున చంటిగాడు నిద్రలేచేసరికి ఇల్లంతా హడావిడిగా ఉంది. ఎవర్ని పిలిచినా పలికేలా లేరు. అమ్మ వంటగదిలో ఉంది. అప్పుడే ఏవేవో వంటలు చేసేస్తోంది. నాన్న పనివాళ్ళకు పనులు పురమాయిస్తున్నాడు. చంటిగాడు పూజగదిలో ఉన్న బామ్మ దగ్గర- కెళ్ళాడు- "బామ్మా! గడపలకు పచ్చగా పసుపు పూసి, ఎఱ్ఱగా కుంకుమ బొట్లు పెట్టారేంటి? గుమ్మాలకు ఆకుపచ్చ మామిడి ఆకులేంటి? స్తంభాలకు ఆ అరటి చెట్లేంటి? రంగురంగుల ఆ పూలేంటి? నల్లని ఆ పలక ఎవరికి? ఆ తెల్ల చొక్కాయి, నీలం నిక్కరు ఎవరికి? ఈ రోజు ఏం పండగ?" అంటూ సందేహాలవర్షం కురి పించాడు.
బామ్మ నవ్వింది- "అబ్బో! ఫరవాలేదే, చంటీ ! నీకు రంగులన్నీ తెలిసి పోయాయి, బళ్ళో చేరటానికి అర్హత వచ్చినట్లే! ఈ రోజు నువ్వు బళ్ళో చేరే పండగరా, చంటీ !" అంది .
ఆరోజు చంటి వెళ్ళి తల స్నానంచేసి, అమ్మ ఇచ్చిన కొత్త చొక్కాయి వేసుకుని అమ్మ-నాన్నలతోపాటు పీటలమీద కూర్చుని పూజ చేశాడు. అందరూ కలిసి వాడికి అక్షరాభ్యాసం చేశారు.
అదే రోజున వాడు బడిలో చేరాడు. ఆ రోజున ఒకటోతరగతి పంతులుగారు పలకపైన 'ఓ న మః ' రాసి ఇచ్చారు వాడికి. చంటిగాడు అన్నాడు "మానాన్న ఇంట్లో బియ్యంలో రాసేసారుగా వీటిని?!" అని. పంతులు గారు నవ్వి "ఇక మీదట వీటిని రోజూ తరగతిలో నీ అంతట నువ్వే రాయాలి, తెలుసా?" అని అడిగారు. బుధ్ధిగా తల ఊపాడు చంటి. "నువ్వు చక్కగా మా బళ్ళో చేరావు కదా, అందుకని ఇవాళ్ళ నీకు మేం ఏవో బహుమతులు ఇస్తాం. ఏమిటో‌ కనుక్కో!" అన్నారు పంతులుగారు. చంటి ఏవేవో వస్తువుల పేర్లు చెప్పాడు గానీ‌, అవేవీ కావన్నారు పిల్లలు, నవ్వుతూ. 
ఆరోజు సాయంకాలం బడి వదలగానే పంతులుగారు వచ్చి, ఐదు పండ్ల మొక్కలు తెచ్చి ఇచ్చాడు చంటికి. స్కూల్లో పిల్లల వయసును బట్టి, ఎవరిది ఎన్నో పుట్టిన- రోజైతే, అయ్యవార్లు వాళ్ళకి ఆ రోజున అన్ని మొక్కలు బహుమతిగా ఇస్తారట- ఒకటో‌ తరగతిలో ఐదు; రెండో తరగతిలో ఆరు, మూడో తరగతిలో ఏడు; ఇలాగ! వాళ్ళు వాటిని ఎక్కడో ఒక చోట నాటి, శ్రద్ధగా పెంచాలట!
చంటిగాడు బామ్మని, అమ్మని ఊపిరి తిప్పుకోనివ్వక, ఆ మొక్కల్ని నాటేవరకూ గొడవ చేస్తూనే ఉన్నాడు. ఇంటికి నాలుగు మూలల్లోనూ నాలుగు మొక్కలు నాటారు- ఇక మరో బాదం మొక్క మాత్రం మిగిలింది. "దాన్ని పెరట్లో వంట గది బయట పెట్టండర్రా ! చక్కగా ఆకులు కోసుకుని విస్తరి కుట్టుకుని భోజనం చేయచ్చు" అన్నది బామ్మ. 
అప్పుడు మొదలైంది ఆ అలవాటు- ప్రతిరోజూ చంటిగాడు నిద్రలేవగానే వెళ్ళి ముందుగా బాదం మొక్క దగ్గర కూర్చొని ముఖం కడుక్కునేవాడు. ఆపైన ఇంటిచుట్టూ తిరిగి అన్ని మొక్కల్నీ చూసుకునేవాడు. వాటన్నింటికీ నీళ్ళు పోసి, ఆ తర్వాతగానీ తను స్నానం చేసేవాడుకాదు! అట్లా వాడు రెండో తరగతికి వచ్చేసరికి అయ్యవార్లు మరో ఆరు మొక్కలిచ్చారు. మూడో తరగతికి వచ్చేసరికి ఏడు మొక్కలు. నాలుగో తరగతిలో ఎనిమిది. ఐదులో తొమ్మిది మొక్కలు. అటుపైన వాడు హైస్కూలుకు పోవలసి వచ్చింది!
హైస్కూల్లో పిల్లలకు మొక్కలు ఇచ్చేవాళ్ళు కాదు. అయినా చంటిగాడి బామ్మ ఊరుకుంటేగా? ప్రతి సంవత్సరం వాడి పుట్టిన రోజుకి ఆమె తనంత తానుగా వాడికి మొక్కల బహుమతి ఇవ్వటం మొదలు పెట్టింది. అలా అలా చంటిగాడు పదో తరగతికి వచ్చేసరికి 95మొక్కలు, అదనంగా వాడి స్నేహితులు తెచ్చి ఇచ్చినవి 13- మొత్తం 108 మొక్కలతో 'చంటిగాడి పండ్ల తోట' తయారయింది!
మామిడి , సపోటా , దానిమ్మ , నిమ్మ , జామ , పనస, నారింజ, బత్తాయి ఇంకా రకరకాల అరటి పండ్లూ, కాయలతో కళకళలాడి-పోతున్నది వాడి తోట. ఊళ్ళో ఎవ్వరికీ అంత మంచి తోట లేనే లేదు!
పదోతరగతి పరీక్షల తర్వాత, పాఠశాల వార్షికోత్సవ సభలో పెద్ద పంతులు గారు మాట్లాడుతూ "చంటి మా బళ్ళో చదవడం మాకెంతో గర్వకారణం. తనకు ఐదో ఏట లభించిన మొక్కనుండి, పదో తరగతిలో వాళ్ళ బామ్మ ఇచ్చిన మొక్క వరకూ అన్ని మొక్కలనూ బ్రతికించి, తన పండ్లతోటలో అందంగా, నిండుగా నిల్పుకుని, పరిసరాల పరిరక్షణ కావిస్తున్న చిన్న రైతు- చంటి. అతన్ని కొంత సేపు తన తోట గురించి చెప్పమని కోరుతున్నాను" అన్నారు ఆప్యాయంగా. 
జిల్లా అధికారులంతా చేరిన ఆసభలో చంటి లేచి నిలబడి ప్రసంగించాడు-
"ముందుగా మా చిన్నప్పటి బడిలోని అయ్యవార్లందరికీ, ఆ తర్వాత మా బామ్మ-గారికి, అమ్మ-నాన్నలకూ వందనాలు అర్పిస్తున్నాను. సభికులందరికీ నమస్కా-రాలు! అయ్యవార్లు, ఇంట్లో పెద్దలు కూడా పిల్లలకు సహకరిస్తే ఎవరైనా సాధించలేనిదేదీ ఉండదు. ప్రతి బడీ మా బడిలాగానూ, ప్రతి అయ్యవారూ మా అయ్యవార్లలాగాను ఉంటే దేశమే మారిపోతుంది. పరిసరాల కాలుష్యం పెరగదు. పర్యావరణ సమతౌల్యం దెబ్బతినదు. ఎవరికి కావలసిన ప్రాణవాయువు వాళ్ళ పరిసరాల లోనే తయారౌతుంది. అందరూ ఆరోగ్యంగా జీవించవచ్చు.
నిజానికి ఈ సన్మానం జరగవలసింది నాకు కాదు- నాకు మొట్టమొదటి బహుమతినిచ్చిన ఒకటో తరగతి అయ్యవారికి. స్కూల్లో చేరిన ప్రతి పిల్లవాని పుట్టినరోజు పండుగకూ మాపంతుళ్ళు ఐదేళ్ళైతే ఐదు , ఆరేళ్లైతే ఆరు మొక్కల చొప్పున ఇచ్చి ఇళ్ళలో పెంచమని కోరేవాళ్ళు. వాళ్ళు అలా నాకు ఇచ్చిన ఐదు మొక్కల్నీ ఆ రోజున నా బదులు మా బామ్మ, అమ్మ నాటారు. వాళ్లకి కృతజ్ఞుడిని. 
ఇప్పుడు మా బాదం చెట్టుకు పదేళ్ళు. మేం కావలసినన్ని బాదం పండ్లు తింటాం; బాదం ఆకుల విస్తళ్లలో ఫలహారాలు చేస్తాం. అరటి ఆకులు భోజనం చేయను వాడుకుంటాం. ఎంగిలి ఆకులను మా ఆవులు గేదెలు తింటాయి; మా దొడ్లో రాలిన ఆకులన్నీ చిమ్మి, గుంట త్రవ్వి, లోపల వేసి, మట్టికప్పితే గొప్ప 'పచ్చి రొట్ట ఎరువు ' తయారవుతుంది. మా పూలమొక్కలకూ, కూరపాదులకూ ఆ ఎరువునే వేస్తాం. మా తోటలో పండే కూరలు, ఆకుకూరలు, పండ్లు, పూలు- వేటికీ రసాయన ఎరువులు అవసరం కాలేదు. 
మా వంట ఇంటి గుమ్మం ముందు మా బామ్మ నాటిన బాదంచెట్టు పెద్ద పెద్ద ఆకులతో కొమ్మలతో విస్తరించి ఉంది. తన వెడల్పాటి ఆకులను అడ్డుగా ఉంచి వంటగదిలోకి దుమ్ము ధూళి రాకుండా అడ్డుకుంటుంది అది. నేను నాలుగో తరగతిలో ఉండగానే, మరిన్ని మొక్కలు నాటటంకోసం మా పెరటి పక్క స్థలాన్ని కొనేశారు మానాన్నగారు. 108 చెట్లతో ఈరోజున మాతోట ఇంత అందంగా ఉందంటే, దానికి పెద్దల ప్రోత్సాహం, వాళ్ల సహాయ సహకారాలే కారణం. మా ఇంట్లో వాడే నీరంతా కాలువలద్వారా అన్ని చెట్లకూ మళ్ళేలా సిమెంటుకాలువలు కట్టించారు మానాన్నగారు. మా నూతి వద్ద పడ్డ ప్రతి నీటి- బొట్టూ ఏదో ఒక మొక్కకు అందవలసిందే! అందుకే పెద్దల సహకారం పిల్లలకు అవసరమని చెప్పాను. 
ఇక, మా తోటలో కాసే పూలకోసం తుమ్మెదలు, పండ్లకోసం అనేక రకాల పక్షులు, వచ్చి చేరుతాయి. రోజూ మేం కోయిలల కుహూ రావాలతో నిద్రలేస్తాం, చిలుకల పాటలు వింటూ పనులు చేసుకుంటాం, కాకమ్మలు మేం పెట్టే అన్నపు మెతుకులకోసం కాచుకుంటాయి.
మేమంతా రోజూ‌ కనీసం ఒక్క గంట సేపైనా తోటపని చేస్తాం- అందువల్ల మా శరీరాలు గట్టిపడ్డాయి. ఆరోగ్యాలు బావున్నాయి. డెభ్భై ఏళ్ళ మా బామ్మ సైతం మాతో పాటు పనిచేస్తుంది. ఆ వయస్సులో సహజంగా వచ్చే వ్యాధులేవీ ఆవిడకు లేవు.
మేం తినటమే కాదు; మా చుట్టు పక్కలవాళ్ళకీ, మా బడి పంతుళ్ళకూ అందరికీ మా తోటలో పండిన కూరలు పంచి పెడతాం. చాలామంది మా నాన్నగారికి చెప్పారట- కూరగాయల్ని, పండ్లని పట్టణానికి పంపి అమ్మమని. అమ్మితే డబ్బు వస్తుంది- కాని, మేము కూరలు, పండ్లు, మొక్కలు బహుమతిగా ఇచ్చినపుడు మా స్నేహితుల ముఖాల్లో కనిపించే ఆనందం ఎన్ని వేలు పెట్టి కొంటే దొరుకుతుంది మాకు, చెప్పండి!?
మా ఇంటి చుట్టూ చెట్లు ఉండటం వల్ల వేసవిలో మాకు ఎండ వేడి లేనే లేదు. మా ఇంట్లోకి దుమ్మే రాదు. సాయంకాలాల్లో మా తోటను చూసేందుకు అనేక మంది వస్తుంటారు. వాళ్ళను మేము ఉత్తచేతులతో పంపనే పంపం. మా ఇంటి బొండు మల్లెలకోసం వీధి వీధంతా ఎదురు- చూస్తుంటుంది. ఊరి గుళ్ళల్లో దేవుళ్ళకు మా ఇంటి పూలతో కట్టిన మాలలు అలంకరిస్తారు- ఇంతకంటే గొప్ప ఆనందం ఏముంటుంది? ఇంటి తోటవల్ల నేను పొందిన ఈ అనుభవం నా జీవన ధ్యేయాన్ని నిర్దేశించింది. నేను వ్యవసాయశాస్త్రం చదవాలనుకుంటున్నాను.
అందరికీ మరోసారి వందనాలు. నా కోరిక కాదనక, అంతా మా తోటకు వచ్చి అక్కడ పండిన మామిడిపండ్లు , పనస తొనలు తిని వెళ్ళమని మనవి " అని ముగించాడు చంటి.
అంతా చప్పట్లు కొట్టారు. సభకు విచ్చేసిన కలెక్టరుగారు చంటిని అభినందిస్తూ అప్పటికప్పుడు వాడికి 'బాల రైతు' బిరుదు, బంగారు పతకమూ బహుమతిగా ఇచ్చారు!
అదండీ పిల్లలూ, 'చంటిగాడి పండ్లతోట' కధ! మరి మీరు కూడా మీ ఇళ్ళలో పండ్లచెట్లు పెంచుతారు కదూ!